అమెరికా అబ్బాయి - సుశీలారాం

america abbaayi  Telugu Story

"ఒరేరాఘవా! ఇంట్లోఏడ్చావా?"

"నీవెక్కడ్నుంచీ ఏడుస్తున్నావో ముందు చెప్పి అఘోరించు"

"మీ ఇంటికే బయల్దేరా! ఇంట్లో అఘోరిస్తే వచ్చి మాట్లాడుతా! లేకపోతే ఇంకోచోటి కెళ్ళి నా శ్రార్ధం పెట్టుకుంటా"

"ఇక్కడే పెట్టుకుందువుగానిరా!" ఫోన్ల సంభాషణంతా వింటున్నరాఘవరాం శ్రీమతి సుగుణ ," ఐనా ఎప్పుడూ అలా తప్ప మాట్లాడుకోలేరా మీ ఇద్దరూనూ?!చిత్రమైన స్నేహితులు. "అంటూలోనికెళ్ళింది .

మరో పదేపదినిముషాల్లో ఊడిపడ్డాడు ఫోన్ చేసిన పెద్దమనిషి మాధవయ్య. ఆయన్ని చూడగానే ముందుగా తయారుచేసి ఉంచిన చల్లని చల్లగ్లాసు అందిస్తూ ,"తీసుకోండి అన్నయ్యగారూ! ఎండనపడివచ్చారు" అంది సుగుణ.

"పడిరాక ఏం చేస్తానమ్మా! మేనకోడలిపెళ్ళి నానెత్తినుంది కదా! తండ్రిలా ఎలా నిమ్మకునీరెత్తినట్లు హాయిగా కూర్చోగలనూ!" అంటూ ఖాళీగ్లాసు అందించారు.

"మహావిరగబడుతున్నావ్ లేవోయ్! ఇంతకూఎందుకఘోరించినట్లూ!" " ముందీమాటచెప్పి అఘోరించు ,ఆ అమలాపుర సంబంధం కుదర్లేదుగా?" "లేదురా! వాళ్ళ గొంతెమ్మ కోరికలతో తూగలేక మానేశాం."

"హమ్మయ్య శుభవార్త చెప్పావు. .సంబంధం చెడిందని" "ఏంట్రా ఏదో ఉధ్ధరించే మేనమావలా మాట్లాడి ,పెళ్ళిసంబంధం కుదర్లేదని సంతోషిస్తున్నావా? కనీసం, కూతురి కంటే పెద్దకొడుకును ఒక్కడ్ని కనలేని వెధవ్వి కబుర్లు చెప్తావురా! పైగా సంబంధం కుదర్లేదని చిరునవ్వొకటి! కాళ్ళిరగొట్టేవాళ్ళు లేక" "అన్నయ్యా! ఇద్దరూ ఇలా మాటాల కర్రల్తో కొట్టుకోడమేనా విషయం చెప్పేదేమైనా ఉందా ! నా కవతల పొయ్యిమీద నూనె కాగిపోతున్నాది. పకోడీలు చేసేందుకు.." అంటూ సంభాషణ మధ్యలో కొచ్చింది సుగుణ.

" మీ అన్నాచెల్లెళ్ళకే నాడైనా నేరుగా మాట్లాడటముందీ! ఇలా పక్కదార్లు తప్పించీ? పళ్ళూడగొట్టే వారులేక" "విరగ్గొట్టుకుందూగాని లేకానీ, అసలు అమ్మాయికి ఏమేం వచ్చో చెప్పుముందు.." "అదేంటన్నయ్యగారూ తెలీనట్లు అడుగుతున్నారూ !" ఆశ్చర్యంగా అంది సుగుణ" ముందుగా వీడి నోట ఆ పకోడీలు లు కొట్టవే సుగుణా !" "అమ్మాయ్! అనంతా !పిండి కలిపి ఉంచాను, నూనె కాగిపోతున్నట్లుంది ఆ పకోడీలు వేయించమ్మా! సరే అన్నయ్య గారూ! అడిగారు గనుక చెప్తున్నా. అమ్మాయ్ పేరు అనంత, అనంతపద్మనాభ వ్రతం నాడు పుట్టిందని ఆ పేరు పెట్టారు మీ స్నేహితులు. ఇహ వయస్సు 21, కాలేజీల్లో చదివించే శక్తి లేక ఉన్న ఊర్లో ఇంటర్ తో ముగించాం. కుట్టువచ్చు, సరదాకు కరాటే నేర్చుకుంది, యోగాలో అభ్యాసముంది. ఆంగ్లం చక్కగా మాట్లాడుతుంది. భరతనాట్యం వచ్చును, సంగీతం నేనే నేర్పించాను .వంట చేతనవును. ఏదో మాత్రం అందం, రంగు..." సుగుణ మాటలకు అడ్డువస్తూ" బుధ్ధి తక్కువై అడిగానమ్మా చెల్లెమ్మా! ఇవన్నీ నాకు తెలీవాయేం? అదేదో మీ నోటవిని, నా నోట ఈ నోకియా నోట, వారికీ మాట వినిపిద్దామనీ , అమేరికా సంబంధంరా" ఐనా అమేరికా సబంధం అంటే మాటలు టోయ్! నీ మాటలతో మమ్మల్ని కోటలు దాటించి కమ్మని పకోడీలు నోట కొట్టుకోనేనా వచ్చావ్! అనంతా పకోడీ ఆపేయమ్మా!, వేసినా వీడికి తేకు, నాకేపట్టుకరా!" అంటూ ఉరిమాడు స్నేహితుడ్ని .

నవ్వుతూ రెండు పళ్ళేల్లో వేడివేడి ఘుమఘుమలాడే పకోడీలతో వచ్చిన అనంత "కులాసానా మామయ్యా!" అంది. "నీకున్న మాత్రం ప్రేమ ఈ స్నేహితుడి మీద మీ నాన్నకు లేకపోయె!" "మామయ్యా! ఈ ఇద్దరి జగడాలు ఈనాటి వా ఒకటో క్లాస్ నుంచీ చదువు, వయస్సులతో పాటు పెరిగిపెరిగీ ఈ నాటికి యాభైవస తరాలాయె! ఎవరెరుగరు మీ తగవుల తరంగాల తమాయింపులు.. "అంటూ మంచి నీళ్ళగ్లాసు అందించి లోనికెళ్ళింది. సుగుణ కూడా తానూ గుమ్మం పక్కనున్న అరుగుమీద కూర్చుంటూ" అన్నయ్యా! అసలు విషయం చెప్పండీ!" అంది." అందుకే గదమ్మా! ఎండనపడి మూడుఫర్లాంగులు నడుచుకుంటూ వచ్చిందీ! బాగావినమ్మా సుగుణమ్మా!.." అంటూ నీళ్ళు తాగేందుకు ఆగాడు " మహారుచిగా ఉన్నాయమ్మా పకోడీలు." "మరికాసిన్ని తెమ్మటారా మామయ్యా! అంటూ వచ్చింది అనంత. "వద్దు కానీ నీవూ వినమ్మా! వారిది ఆమంచర్ల. ఆయుర్వేద వైద్యులు ఆనంతయ్యగారి కుమారుడు, అమేరికాలో అదేదో ఎమ్మెస్సుట చేసి ,అక్కడే మంచి ఉద్యోగంలో చేరాడుట! మన దేశపు సాంప్రదాయ కుటుంబంలోని పిల్లను చేయాలని వారి ఆరాటం." "మనం తూగగలమా! అన్నయ్యగారూ! ఆ అమలాపురం సంబంధమూ అంతేగా ఇంజనీరనీ, అంతే చదువుకున్న పిల్లన్నా కావాలిట లేదా పాతిక లక్షలు కావాలిట! మన వద్ద పెళ్ళి చేయనే డబ్బులేదు.." "వాళ్ళ ఆశకూలా! అమ్మాయ్ సుగుణా! అన్నీ కనుక్కునే వచ్చాను కానీ ! ఎప్పుడు రమ్మటారో చెప్పండీ ! ఇప్పుడే ఫోన్ చేసేస్తున్నాను." అని మాధవయ్య అంటూండగానే, చూర్లో దోపిన పంచాంగం అందుకున్నాడు రాఘవరాం.

శుక్రవారం దివ్యంగా ఉందిరా!" అంటూ భార్యకేసి చూశాడు అదోలా." సుగుణ అర్ధం చేసుకుని అంగీకారంగా తలూపింది. ఆడవాళ్ళ ఇబ్బందులేవీ లేవని ఆ చూపుల అర్ధం." అన్నయ్యా! పిల్ల నచ్చినా.." "పిల్ల నచ్చకపోటానికి వాళ్ళు గ్రుడ్డివాళ్ళై ఉండాల్సిందే! బంగారపుఛాయ, బంగారానికి శోభా, సుగంధం ఇచ్చే సుగుణం ,మర్యాద ఇంకేం కావాలమ్మా!" "అవన్నీ కావు అన్నయ్యా! అమేరికా సంబంధమంటే పెళ్ళికే లక్షలవుతాయేమోని నా అనుమానం. పై పిల్లలకిద్దరికీ పెళ్ళిళ్ళు చేసి అంతా ఐపోయింది. ఇహ ఆ పిల్లాడికి డిగ్రీ ఐనా చెప్పించాలా. .ముగ్గురి తర్వాత పుట్టుకొచ్చాడు కదా! " "అమ్మాయ్! నీవవన్నీ మర్చిపో! శుక్రవారమంటే ఎల్లుండే! వాళ్ళు వచ్చాక నీవే చూస్తావుగా! అంటూ రొంటినున్న చరవాణీని అందుకుని కొన్ని నెంబర్లు నొక్కి " అయ్యా! నేనండీ ! మాధవయ్యనీ! మీ అబ్బాయికి అమోఘమైన సంబంధం ఉంది, మా స్నేహితుని కుమార్తె చూపులకు చక్కనిచుక్క ్వభావానికి సుగుణాలరాసి, మొన్న మిమ్ము కలిసినపుడు వారూ ఒక సంబంధం చూస్తున్నారు, అందుకే చెప్పలేదు, మన అదృష్టం కొద్దీ ఆ సంబంధం చెడింది ,అంతా మీ అబ్బాయి అదృష్టమండీ! మీ మింటికి లక్ష్మి లక్ష్మండీ వస్తున్నది! ఎల్లుండి శుక్రవారం వస్తారా! మీరే చూస్తారుగా! సాంప్రదాయకమైన సంబంధం, సరి సరి, సాయంకాలం నాల్గింటికి, రాహుకాలం ఉదయం 10/30--12 కదండీ! ఔను అంతా బాగే,సరే నండీ! ఎదురు చూస్తాం" అంటూ ఇంటి టెంకి చెప్పి, చరవాణిని రొంటిన దోపి " ఇహ వస్తానోయ్! నడిచి అఘోరించు అందాకా నాతో. నేను ఆ లొల్లాయ్ లక్షీపతిని కలిసి ఇంటికి చస్తాను, ఎన్నాళ్ళకూ వాడి కొడుకు సంబంధం తేల్చడు, కనిపించినప్పుడల్లా గొణిగిచస్తాడు, "అంటూ బయల్దేరబోతున్న మాధవయ్యను దగ్గరగా వచ్చి, గుచ్చి కౌగలించుకుని" ఒరే! నీ ఋణమెలా తీర్చుకోనురా!" అంటూ కండువాతో కళ్ళు వత్తుకుంటున్న రాఘవరాంను "ఓరి నీ! నీదంతా మేకపోతు గాభీర్యమని నాకు తెలీదుట్రా! వెధవాయ్! మన మధ్య ఋణాలూ, వడ్డీలూ ఏంటిరా! అమ్మాయ్! వీడికో గ్లాసెడు చల్లని నీ రివ్వూ!" అంటూ జోళ్ళు తొడుక్కుని బయల్దేరాడు, అటు తిరిగి కళ్ళు కండువాతో అద్దుకోడం సుగుణ గమనించక పోలేదు. పేరు అరుణ్ !మీకు అంట్లు తోమటం వచ్చా!" కనీసం తన పేరైనా అడక్కుండ ఇలా అడిగిన వాని వైపు చిత్రంగా చూసింది అనంత. ‘వచ్చ’న్నట్లు తలూపింది. వంటవచ్చా!"," ఇల్లు చిమ్మటం వచ్చా?" ,"బట్టలు విస్త్రీ చేయటం వచ్చా?" ,అన్నింటికీ వచ్చన్నట్లు తలూపింది.’ ఖర్మకాలి పెళ్ళిచేసుకుని అక్కడ పని మనిషిగా పెట్టను తీసుకెళ్ళడు గదా!' అనుకుంది అనంత." ఇవన్నీ అడుగుతుంటే మీకు అనుమానం రావచ్చు, అక్కడ పని మనిషిగా పెడతానేమోని.. "మనస్సు చదివినట్లే అంటున్న అతడి వేపు చిత్రంగా చూసింది అనంత. "తప్పుగా అనుకోకండి అనంతగారూ! అక్కడ పని చేయను ఇక్కడలా సర్వెంట్స్ ఉండరు. అన్నీ మనమే చేసుకోవాలి. మీకు డ్రైవింగ్ నేను నేర్పుతాను. అన్నీ కార్లలో వెళ్ళి తెచ్చుకోవాలి .ఆ దేశంలో కారు లేకపోతే కాళ్ళు లేనట్లే, మన దేశానికి మూడున్నర రెట్లు దేశం, మూడోవతు జనాభా ఉండే దేశమది .పనిలో ఎక్కువ తక్కువ లెవ్వరూ పట్టించుకోరు. నాకు మీరు నచ్చారు. మీకు నేను నచ్చితే మన వివాహం’ అన్నవరం’ కొండ మీద జరిపించి, వీసా రాగానే నాతోనే తీసుకెళతాను." అంటూ తన వేపు చూస్తున్న అరుణ్ ను చూసింది పరిశీలనగా అనంత.

ఆరడుగుల ఎత్తు .ఆడవారికుండే గులాబీ రంగు శరీరఛాయ. మంచి మర్యాద, అన్నీ ముందే చెప్పే స్వఛ్ఛమైన మనస్తత్వం. మరి కట్నం ఎంత డుగుతారో! 'అనుకుంది అనంత. అప్పుడు పెదవి విప్పారు వారి తండ్రి "అయ్యా! ముందుగా పిల్లవాడు పిల్ల మాట్లాడుకుని వారు పరస్పరం నచ్చితేనే, మేము మాట్లాడాలని మా నియమం .మాకేమీ కట్న కానుకలు అవసరం లేదు. మావాడు చెప్పేడుగా అన్నవరం కొండమీద పెళ్ళి సింపుల్ గా జరిపించడి.అంతే మీరు, మేము పిల్లాపిల్లాడు కూడా వస్తార్లెండి. "అనగానే అంతా నవ్వారు హాయిగా.ఏంటో! మహారాణి గారు నవ్వుకుంటున్నారుతనలోతాను, ఈభృత్యుడికీకాస్తంతచెప్పవచ్చా!"అంటున్నఅరుణ్నినవ్వుతూచూసి, "మన పెళ్ళిచూపుల రోజు గుర్తుకు వచ్చీ.." అంది మరో మారు నవ్వుతూనూ "ఏమ చేయనూ అమేరికాలో ఉద్యోగం చేసే పిల్లవాడంటే అంతా తాగుతాడా! సిగరెట్లూ, మత్తు మందులూ అలవాటులేవని నమ్మకం ఎలా! ఇంతకు ముందే అక్కడ తెల్లదానితో పెళ్ళి కాలేదని గ్యారంటీ ఏంటీ? పెళ్ళి చేసుకుని పని మనిషి కోసం అంటూ రకరకాల సందేహాలతో నా దుంపతెంపారు ఆడ పిల్ల తల్లిదండ్రులు. వారి భయాలు వారివనుకో. అందుకే నేనే అలా మొదలెట్టాను పెళ్ళి చూపుల తతంగం." అన్నాడు అరుణ్." నిజమే నండీ నిజానికి నా కిప్పుడు తీరుబాటుగా, మీతో మాట్లాడ నే సమయం లేకుండా ఉంది. ఏదో మా తమ్ముడు ఉన్నాడు గనుక కొంత వెసులుబాటుగా ఇలా శుక్రవారం రాత్రన్నా మీతో మాట్లాడను అవుతోంది." "ఔను సుమా నీవో పెద్ద నృత్య కళాశాలకు డైరెక్టర్ వు, కరాటే స్కూల్ ఓనర్వు, ఒక పెద్ద ఆడవారి వస్త్ర తయారీ సంస్థ యజమానురాలివి, సంగీత సరస్వతివి, నీ ఆదాయంతో పోల్చితే నా జీతం ఎంత అనంతా!" అంటున్న అరుణ్ నోటిని మూసింది చేత్తో కాదు సుమండీ.. మీకూ తెల్సులెండి చెప్పక్కర్లేదు మరి.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి