నింగి నుండి చినుకు ఏదో వర్తమానం తీసుకువస్తున్నట్లు రాంబాబు మీద పడింది.
చినుకుని చంపేద్దామన్న కోపం వచ్చింది. ఏ ఆయుధంతో ఎలా చంపాలో అర్ధం కాలేదు.
మనసుతో చంపాలనుకున్నాడు - ఎలా?
పట్టించుకోకపోతే చంపినట్టేగా -
వేగంగా బైట నుంచి ఇంట్లోకి నడిచాడు - తలుపు వేసేశాడు - కిటికీలు మూసేశాడు
బైట పెరుగుతున్న వాన శబ్దం వినిపించకుండా దేవుడి పటం దగ్గరున్న పత్తి తీసి చెవుల్లో పెట్టుకున్నాడు.
తల్లి, భార్య, పిల్లలు రాంబాబు ప్రవర్తనకి ఆశ్చర్యపోయినా, కాస్త భయపడి దగ్గరికి వచ్చే ధైర్యం చెయ్యలేకపోయారు.
రాంబాబు మెల్లగా వణుకుతున్నాడు - ఊహించని పరిణామానికి భయపడ్డ పసివాడిలా!!
తనకిప్పుడు ఏమీ వినిపించడం లేదు !
కళ్ళుమూసుకున్నాడు - చినుకుని చిత్ర వధ చెయ్యాలనుకున్న కక్ష మనసులో మరీ పెరిగిపోతోంది!
అప్పటికీ శత్రువు వచ్చినట్టు తలుపేసేశాడు.వినిపించుకోనట్టు పత్తి కుక్కాడు. చినుకు ఆచూకీ తెలీడానికి వీల్లేదు. దొంగ దెబ్బ తీసింది. జీవితాన్ని మార్చేసింది. ఈ చినుకు కోసమే తండ్రి ఎంతో తపన పడ్డాడు. తండ్రి గుర్తుకు వచ్చేసరికి మరీ పసివాడు అయిపోయాడు.
పచ్చటి పైరు లాగా ఉండేవాడు ... చినుకు కోసం బెంగ పెట్టుకుని ఎండిన చీడ లా అయిపోయాడు.
ఓ రోజు అడిగాడు , ఎలా అడగాలో తెలీక 'ఏంటి నాన్నా ఇది .....?' అని -
భూమిని, మనని విడదీసుకుని బ్రతకలేమురా ..... అది పచ్చగా వుంటే పచ్చగా ఉంటాము... ఎండిపోతే ... తండ్రి గొంతు మూగబోయింది. ఊర్లో తండ్రే పెద్ద రైతు. పెద్ద మనిషి. అక్కడే పుట్టి అక్కడే పెరిగాడు. పట్టుదల మనిషి. అంతా భూమిని వదిలి వ్యాపారాల్లోకి వెళ్ళిపోతే, తను అక్కడే వున్నాడు. 'వానని కూడా శాసిస్తాడు' అని పేరు గడించాడు.
'పంట వేసుకోండి ... వాన అదే వస్తుంది .. ' ఖండితంగా చెప్పేస్తాడు.
ఈ సారి వాన రాలేదు. రాని సమాచారం కోసం ఎదురుచూస్తున్న వాడిలా ఆకాశం వైపు చూడటం - మేఘాల ఆచూకి కనపడక దిగాలు పడి, అంతలోనే ఏదో ధైర్యంతో 'వస్తుంది లే' అనడం - ప్రతీసారీ రావడం జరిగేది. ఈ సారి నమ్మక ద్రోహం చేస్తున్నట్టుంది. పక్కూరి సిద్దాంతి గారిని అడిగాడు.
'వరుణ యాగం చెయ్యండి ..... వశీకరణం వేసినట్టు వాన పరిగెత్తుకు వస్తుంది .... ' అన్నారాయన.
యాగమంటే మాటలా?
ఆ సాయంత్రం ఎండ గాలి వంటిని తాకి ఎక్కిరిస్తున్నట్టు అనిపించింది. - ఆ వెక్కిరింపు తగ్గాలంటే యాగం చేయవలసిందే ....
డబ్బెలా ??
తన వంతుగా భార్య మెడలో ఉన్న వంటిపేట గొలుసుని 'సమిధ' గా ఇచ్చాడు. ఊరంతా తండ్రిని అనుసరించారు. యాగం జరిగింది. జరిగిన వెంటనే మేఘాలు నగలు దాచుకున్న దొంగల్లా చినికులని బైట పెడతారనుకున్నారు -
'రాలేదు - '
తెల్లటి ఆకాశం వెక్కిరిస్తోంది.
సిద్దాంతి గారిని అడిగితే -
'రావాలే ... ' నమ్మకంగానే చెప్పారు. వారం గడిచింది .... చినుకు లేదు. తప్పు చేసిన వాడిలా తండ్రి భాధ పడుతున్నాడు. అసలే ఆర్ధిక పరిస్థితి బాగోకపోతే , ఈ ఖర్ఛు ఒకటి - ఊరి పెద్ద. తప్పు తను చేస్తే సరిపోయేది ... అందరినీ నమ్మించాడు .
వాళ్ళెవరూ తనని అడగకపోయినా, తనలో తానే కుంగిపొయాడు. నిరాశ లో మునిగిపోయాడు. బెంగగా ఊరంతా తిరిగాడు. పొలంలోనే పడుకున్నాడు. మొక్కలని పలుకరించాడు. చెట్లని తడిమి తడిమి చూసుకున్నాడు.
ప్రొద్దుటే తండ్రి కోసం పొలం వచ్చిన రాంబాబుకి ఆకాశం వైపు ఆశగా చూస్తూ కనిపించాడు. దగ్గరకెళ్ళి "నాన్నా ..... " గట్టిగా అరిచాడు.
వానలో తడిసినంత చల్లబడిపోయింది తండ్రి శరీరం. ఊరంతా శోక సంద్రంలో మునిగిపోయింది.! ఋతువు మరో సంహారం చేసింది. కర్మ కాండకి డబ్బుల్లేవు. మళ్ళీ ఊరంతా ఏకమైనది.
".... మీ నాన్నకి ఈ ఊరంటే మమకారం ... ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరి మీదే ధ్యాస వుంటుంది ... " ఊరంతా అదే మాట. పలకరింపులూ ... ఓదార్పులూ.
సాయంత్రమయ్యింది ... అలసట ని జ్ఞాపకాల తాకిడి జయించింది.
తండ్రి కళ్ళముందు !!
ప్రతీసారీ మాట నిలబెట్టిన చినుకు ఈసారి నమ్మక ద్రోహం చేసింది.
తండ్రి కూర్చునే గట్టు మీదే కూర్చున్నాడు. అప్పుడే పలకరించింది చినుకు - ఈ చినుకే 24 గంటల ముందు వచ్చి వుంటే తండ్రి దూరమయ్యేవాడు కాడు.... తల్లి పసుపు కుంకుమలు కొట్టుకుపోయేవి కావు ... తను ఒంటరి వాడు అయ్యేవాడు కాడు ...
బంధాలని, అనుబంధాలనీ దారుణంగా హత్య చేసి - ఇప్పుడు తేనె పూసిన కత్తిలా పలకరిస్తోంది చినుకు ... అందుకే దాన్ని చూడలేదు. వినలేదు. అలానే వెలివేస్తున్నట్టు ఉండిపోయాడు.!
అప్పుడే రెండు పసి చేతులు రాంబాబు మొహం తాకాయి. కళ్ళు తెరిచాడు ...
మూడేళ్ళ పాప ___
"వానొస్తోంది" .....
చూరు లోంచి కారుతున్న వాన వైపు చూపెట్టింది.
రాంబాబుకి విపరీతమయిన కోపం వచ్చింది. బందిపోటులా ఇంట్లోకి చొరబడుతున్న చినుకుని ఆపే ప్రయత్నం చేసాడు ....
కర్రలు, గుడ్డలు, గడ్డి పెట్టి ఆపాడు.
అతి కష్టం మీద ఆపాడు ... తను జయించాడు. !!
'నాన్నా .... అక్కడ .... పాప మరో వైపు చూపెట్టింది ... ' గోడ అంచు మీదనుంచి వాన కురుస్తోంది.
తండ్రి పంచె, చొక్కా కనిపించాయి .. తడిసిపోయాయి !
ఈ వానలోనే తడవాలని తండ్రి భగీరధ ప్రయత్నం చేసాడు. ఇప్పుడు ఆయన బట్టలు తడుస్తున్నాయి!
ఏడుస్తూ తండ్రి ఫోటో దగ్గరికి వెళ్ళాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా పొలం నమ్ముకున్న తండ్రి గుర్తొచ్చాడు. ఆయన పట్టుదల గుర్తొచ్చింది.
'ఎక్కడున్నా ఊరిమీదే ధ్యాస .... ' ఊరోళ్ల మాటలు గుర్తొచ్చాయి.
" తాత అడిగిందే వస్తోందిగా .... మరెందుకు ఏడుస్తున్నావ్ " పాప అమాయకంగా అడిగింది. అవును ... తండ్రి కోరుకున్నదీ అదే.. అందుకే యాగం చేసాడు. యాగఫలం అందకపోతే స్వయంగా తనే వెళ్లి ఆ ఊరికి వరుణ యోగం పట్టించాడు. !!
ఋతువు తన తండ్రిని సంహరించలేదు ... తన తండ్రే రుతువుని దారిలో పెట్టి జయించాడు ... వాన కురిపించాడు.
ఆ ఊహ కలిగిన వెంటనే అప్పటిదాకా విషాదంలో కూరుకుని పోయున్న రాంబాబు వానలో గెంతుతూ ఆకాశంలో తండ్రిని పలకరిస్తున్నట్లుగా చేతులు ఊపుతూ చిందులు వేస్తున్నాడు.
అతనిని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ వున్న ఊళ్ళో వాళ్ళు, కుటుంబ సభ్యులు, - పైన వున్న తండ్రి !!!