ప్రేమ కథ సుఖాంతమైతే? - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Prema katha sukantamaite?

దేవదాసు పార్వతి..రోమియో జూలియెట్..లైల మజ్ను..జగ ద్విఖ్యాత ప్రేమికులు. వాళ్ళ ప్రేమ అజరామరం. ఎన్నో కథలకీ, కవితలకీ మార్గదర్శకం. ప్రేమికులకి నిత్య స్మరణీయం..ఆరాధనీయం.

వాళ్ళ కథ విషాదాంతం అయింది. అందరిచేత కంటతడి పెట్టించింది. ఒకవేళ..ఒకవేళ వాళ్ళప్రేమ సుఖాంతమైతే?

రైలు వేగంగా దూసుకెళుతోంది. ఇంకొద్ది గంటల్లో రాంబాబు దంపతులని చూడబోతున్నానన్న ఆనందం నన్ను నిలవనీయడం లేదు. కారణం...! గతం లోకి నా మనసు ఉరకలెత్తింది.

రాంబాబు ప్రేమలో పడ్డాడు. రాంబాబు నా ప్రాణ స్నేహితుడు. మాట మెతక. మనసువెన్న.

అసలు వాడు ప్రేమలో పడడమే వింత. నాకు తెలిసి, వాడు ఏ అమ్మాయివంకా ఆశగా..ఆబగా కాదు కదా కనీసం మర్యాదపూర్వకంగా కూడా చూడడు. అలాంటిది ప్రేమలో పడడం. అమ్మాయి ఎవరని పదే పదే వాడిని అడిగిన మీదట చెప్పాడు రమణి అని.

"రమణి అంటే బుల్లబ్బాయిగారి కూతురు కాదు కదా!" ఒకింత భయపడుతూ అడిగాను.

అవునన్నట్టుగా చిన్నగా తలూపాడు.

అయిపోయింది. వీడు ప్రేమలో పడడమంటే మృత్యు ముఖంలో నిలబడడమన్నమాట. బుల్లాబ్బాయి అంటే సినిమాల్లో విలన్ లాగానే బాగా ఆస్తిపరుడు. రౌడీ. వాడంటే అందరికీ భయమే! అలాంటి వాడి కూతురిని ప్రేమించాడా? ఇంకేవన్నావుందా?

"ఒరేయ్! నువ్వు ఏ అమ్మాయిని ప్రేమించావో తెలుసుకదా! నా మాటిని ప్రేమాలేదు..దోమాలేదు. హాయిగా గంతకుదగ్గ బొంతను చూసుకుని పెళ్ళిచేసుకుని తర్వాత ప్రేమించు. అంతేకాని ముందు నీ ప్రాణానికి ఆనక నీతో పాటు వుండే నాలాంటి వాళ్ళ ప్రాణాలకి ముప్పు తీసుకురాకు."అన్నాను.

"ప్రేమకు ఆస్తి, అంతస్తూ, హోదాలు అడ్డురావురా! ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. అది అసంకల్పితం! నా ప్రాణంపోయినా ఫర్వాలేదు. కానీ చచ్చేప్పుడు రమణి పేరే జపిస్తూ చనిపోతా"అని చెప్పాడు.

"ఏరా! ప్రేమ సినిమాలు కానీ ఎక్కువగా చూస్తున్నావా? నిజ జీవితంలో అవన్నీ సాధ్యం కావు. వాళ్ళ నాన్నకి తెలిసిందంటే ఎముకలోకి సున్నం లేకుండా చేస్తాడు. ఏమనుకుంటున్నావో!"అన్నాను ప్రేమగా కోప్పడుతూ.

"నువ్వెన్నన్నా అనరా తను లేని నేను లేను."అని వెళ్ళిపోయాడు.

చెట్లమ్మటా పుట్లమ్మటా తిరుగుతూ..ఒకరికొకరు బహుమతులిచ్చుకుంటూ..ఊరివాళ్ళ దృష్టిలోకి తద్వారా బుల్లబ్బాయి చెవుల్లోకీ వెళ్లారు.
బుల్లబ్బాయి అగ్నిహోత్రుడయిపోయాడు.

కూతుర్ని ఇల్లుదాటకుండా కట్టడి చేసి. రాంబాబుకి స్ట్రాంగ్‍గా వార్నింగ్ ఇచ్చాడు.

రమణి కనిపించక మా వాడు తిండి మానేశాడు. ఒంటి మీద శ్రద్ధ పెట్టట్లేదు. వాడిని చూస్తే జాలివేస్తోంది. వాడు ఏవైపోతాడోనన్న బెంగ పట్టుకుంది.

"ఒరేయ్..నువ్వు ఆమెని అంతగా ప్రేమిస్తున్నావు గాని తను నిన్ను ప్రేమిస్తుందంటావా?" కోపంగా అడిగాను.

"ప్రేమన్నది వ్యాపారం కాదురా నేనింతిస్తాను..నువ్వింతియ్యి అనడానికి"అన్నాడు నిర్లిప్తంగా.

"నీ కిదే చెబుతున్నాను. నువ్వు ఆమెని ఎంతగా ప్రేమిస్తున్నావో..ఆమె కూడా నిన్నంతగా ప్రేమిస్తేనే నేను మీ ఇద్దర్నీ ఒకటి చేసే బాధ్యత తీసుకుంటా. ఒకవేళ నీది వన్వే లవ్ అయితే మాత్రం నేనేం చేయలేను" అన్నాను.

నేను ఆర్మి సెలెక్షన్స్ లో సెలెక్ట్ అయ్యాను. నాకు మొదటినుండి సైనికులంటే చాలా గౌరవం..ఇష్టం. అందుకే అదే కోరికతో అహర్నీశలూ శ్రమించి నా బాడీని తీర్చుదిద్దుకున్నాను. నేనింకో వారంరోజుల్లో ట్రైనింగ్ కి వెళ్ళాలి. నేనెళ్ళేలోపులో వాడికేమన్నా చేయాలి. నేను లేకపోతే వాడు ఒంటరి వాడైపోతాడు.

ఆ మరుసటిరోజు తనని స్నేహితురాళ్ళతో ఒకసారి గుడికి రమ్మని చాకలి మంగమ్మతో కబురుపెట్టాను.

రమణిని చూశాను. దిగులూ విచారం ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆమె దగ్గరగా వెళ్ళి "మావాడంటే నీకిష్టమేనా?"అని అడిగాను.

తను "ఊ"అంది.

"చాలు..ఈ సమాధానం కోసమే నేనొచ్చాను. ఇహ మీ ఇద్దరి పెళ్ళీ సాక్షాత్తు ఆ దేవుడు దిగొచ్చినా ఆపలేడు"అన్నాను.

చెప్పకూడదు కాని.. నాకూ గొప్ప ఉద్వేగంగా వుంది. ఇద్దరు ప్రేమికులని దగ్గరుండి కలపబోతున్నాను.

రాత్రి పదకొండు గంటలు.

పల్లెటూరు కాబట్టి చీకటి వీరవిహారం చేస్తోంది.

వాళ్ళని కలిపేందుకు పకడ్బందిగా ప్లానేశాను.

వాళ్ళిద్దరి చేత గుడిలో దండలు మార్పించి రైల్ ఎక్కే ఏర్పాటు చేశాను.

విషయం బయటకి పొక్కి బుల్లబ్బాయి రౌడీల్ని పంపేదాకా వెళ్ళింది.

రైలు బయల్దేరుతోంది.

రౌడీలు మమ్మల్ని తరుముతున్నారు. నేను వాళ్ళని ఎదుర్కుంటూ ప్రేమికులిద్దరిని వేగమందుకోబోతున్న రైల్లో ఎక్కించేశాను.
హమ్మయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నేనూ హైవే మీదకెళ్ళి సిటీ వెళుతున్న లారీ ఎక్కేశాను.

చావుతప్పి కన్ను లొట్టబోవడమంటే ఏమిటో అర్ధమైంది. ఇప్పటికీ అంత రిస్క్ ఎలా తీసుకున్నానో తల్చుకుంటే ఒళ్ళు గగుర్పొడిచే ఆశ్చర్యం కలుగుతుంది.

నేను నా ట్రైనింగ్ హడావుడిలో బిజీ అయిపోయాను. ఆ తర్వాత నార్త్ ఇండియాలో పోష్టింగ్. ఊరికి వెళ్ల లేకపోయాను. దానికీ కారణం వుంది. ఆ ఊళ్ళో నా అన్న వాళ్ళెవరూ లేరు. మా అమ్మ రాంబాబు పెళ్ళికి ఆర్నెళ్ళ ముందే చనిపోయింది.

తర్వాత డిల్లీలో మా ఊరివాడొకడు కనిపించి..రాంబాబు రమణి మా ఊళ్ళోనే ఉంటున్నారని..వాళ్ళ నాన్న మాత్రం వీళ్ళని చేరదియ్య లేదని. వాళ్ళకి పుట్టిన పిల్లాడికి నా పేరే పెట్టారని. కనీసం మనవడిని చూసైనా తాత మారతాడని రమణి ఆశ పడుతోందని చెప్పి వాళ్ళ అడ్రస్ ఇచ్చాడు.

నేను ఒకట్రెండు ఉత్తరాలు రాస్తే జవాబు లేదు. అవునులే నాకంటే ఏ బాదర బందీ లేదు. వాళ్ళ సంసారం ఎన్ని ఒడిదుడుకులెదుర్కుంటోందో?

ఇన్నాళ్ళకి వాళ్ళని చూడ్డానికి వెళుతున్నాను.

నన్ను చూడగానే వాళ్ళెలా రియాక్ట్ అవుతారు?. నా మూలంగా కలిసిన వాళ్ళు నన్ను ఆకాశానికి ఎత్తేస్తారేమో. వాళ్ళబ్బాయికి నా పేరే పెట్టారంటే వాళ్ళ ప్రేమకి జీవం పోశానని..నేనంటే ఎంత అభిమానం?

నేను ఊరికి చేరి అడ్రస్ కనుక్కుంటూ వాళ్ళింటి దగ్గరకి చేరాను. బయట అరుగు మీద రాంబాబు కూర్చుని వున్నాడు. మనిషి నిస్తేజంగా..నిర్లిప్తంగా వున్నాడు. చూడంగానే గుర్తుపట్టడం కష్టం. ఎన్నో సమస్యల్లో..బాధల్లో కూరుకుపోయినట్టుగా వున్నాడు. నేనింకో పది అడుగులు వేశాను. లోపలినుండి రమణి సాధింపులు వినిపిస్తున్నాయి.

"..అనవసరంగా నిన్ను పెళ్ళి చేసుకున్నాను. మా అమ్మానాన్న చెవినిల్లు కట్టుకుని చెప్పారు. ప్రేమా లేదు దోమాలేదు అని. నేను విని చస్తేగా. నెత్తిమీద శని గాడు వున్నాడు. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన నేను నీ దగ్గర ఇలా ముష్టి జీవితం గడపాల్సొస్తోంది. గాడిద చాకిరి తప్ప సుఖ పడింది లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మా నాన్న నన్ను చేరదియ్యడం లేదు. నా ముందే నా తోడ బుట్టిన వాళ్ళు జల్సాగా కార్లలో తిరుగుతూ..డబ్బు కర్చు పెడుతూ హాయిగా వున్నారు. నా కడుపు కుత కుతలాడుతోంది. పైగా నీ స్నేహితుడొకడు. తగదునమ్మా అని మన ప్రేమ వ్యవహారంలో కలగజేసుకుని మనిద్దరిని ఒకటి చేశాడు. ఈసారెప్పుడైనా కనిపిస్తే ముఖాన పేడనీళ్ళు జల్లుతాను.అనుభవిస్తా డు ..అంతకంత అనుభవిస్తాడు. నిన్ను ఎన్నన్నా ఏం లాభం? అసలు నీలో చలనం వుంటేగా?.."ఆమె వాగ్ధోరణి సాగిపోతోంది.

"నాకూ అర్ధమయిందిలేవే! ప్రేమంటే సినిమాల్లో..నవలల్లో కనిపించినంత అందంగా వుండదని..జీవితాన్ని నరకం చేస్తుందనీ..ఛ..ఛ..ప్రేమ పెళ్లిచేసుకుని సరిదిద్దుకోలేని తప్పుచేశాను.."మావాడు గట్టిగానే గొణుగుతున్నాడు.

నేను భూమి లోకి కూరుకుపోతున్న అనుభూతి కలిగింది. ఇంకానయం వాళ్ళ ఎదురుపడ్డాను కాదు..అమ్మో ఎంత ప్రమాదం తప్పింది. అప్పుడు వీళ్ళని కలపడానికి ప్రాణాలకి తెగించి ఎంత రిస్క్ చేశాను? ప్రేమికులని ఒకటిచేయడం తప్పని అర్ధమైంది. ప్రేమ కథ సుఖాంతమైతే ఆ తర్వాతి జీవితం దుఖాంతమవుతుందని బాగా అర్ధమైంది. నేను వడి వడిగా స్టేషన్ వైపు అడుగులేశాను..శాశ్వతంగా ఆ ఊరి నుండీ బంధం తెంచుకుంటూ..

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి