చీకటి - గంటి రమాదేవి .

cheekati

ముందు మెల్లగా మొదలైంది. .....

'టక్. టక్.. తేజా! తేజా!'

నిశ్శబ్దం!..

'ఠాక్.. . ఠాక్.. ఈ సారి గట్టిగా!

' తేజా! తలుపు తెరు..'

నిశ్శబ్దం...

'తేజా!తలుపు తెరువు నాయనా!..' ఇప్పుడు గొంతు మారింది. తలుపు మీది శబ్దం దరువు మారింది. 'ధబ్..ధబ్.. ధబ్..'

'తమ్ముడూ! తలుపు తెరవరా! అన్నం నీళ్ళు లేకుండా ఎన్నాళ్ళురా!'

ఆ గదిలో...చీకటిలో.. వెలుగు ప్రసరించదు. శబ్ద౦ వినపడదు.

చీకటి అనిర్వచనీయమైన సుఖం. శాశ్వత శాంతి. వెలుతురు అక్కడ నిషిద్దం!

కళ్ళు తెరిచాడు తేజ. చీకటి నల్లని కన్ను .. కళ్ళ ముందు.... కను రెప్పలు భారంగా మూత పడ్డాయి. కన్ను తెరిచినా, కన్ను మూసినా ఒకటే! తేజ శ్వాస భారంగా ఆడుతోంది. , నెమ్మదిగా కొట్టుకునే గడియారంలా. అది ఒకప్పుడు కమ్మరి కొలిమిలో ఊదిన నిప్పు రవ్వ. దాని మీద చీకటి సుత్తి. అదే జీవ శక్తి. .....ఇప్పుడు... క్రమంగా బలహీన మవుతోంది.

తేజ బయటి శబ్దాలు లీలగా వినపడుతున్నాయి. తల తిప్పి చూసాడు.

ఒక వెలుగు రేఖ కత్తిలా, తళ తళ మెరుస్తూ!!

ఛీ.ఛీ. వెలుతురు చీకటిని హత్య చెయ్యాలని చూస్తున్నది.. .

తలలో జోరీగల గుంపులు తిరుగుతున్నాయి.

'తేజ టెన్త్ లో రాంక్ హోల్డర్. ఇంటర్ లో మంచి మార్కులు సంపాదించాడు. ఎంసెట్ లో రాంక్ వంద లోపే! అక్కడే ఏదో మాయదారి రోగం పట్టుకుంది. అంతా మా ఖర్మ.!' తల్లి తల్లడిల్లుతూ అన్న మాటలు. ఈ గదిలోకి వచ్చిన తర్వాత, ఈ చీకటితో మమేకం అయిన తర్వాత, తల్లి మాటలు తేజను ఏ మాత్రం కదిలి0చలేదు. తల్లి ప్రేమ ఉందా? ఉంటె! నిజంగా వుంటే, వీణ గురించి హేళనగా, వ్యంగంగా మాట్లాడుతుందా? తల్లి ప్రేమ లేదు. చిన్నప్పటి నుంచి పెంచినది కాబట్టి 'అనుబంధం' మాత్రమే వుంది. పిల్లల మీద పెద్దలకు, 'వాత్సల్యం' అనే ఒక మెరుపు దారం మాత్రమే వుంటుంది. అది అభేధ్యమైన లోహ నిగళ౦ కాదు..

అనుబంధం ప్రేమ కాదు!.

వాత్స్యలం ప్రేమ కాదు!.

వీణ ను కాలేజీ లో చేరే వరకు చూడలేదు. చూడగానే.. విద్యుత్ ప్రవాహపు చరుపు చెళ్ళు మంది. షాక్ ఆఫ్ ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్! అంతలోనే.. షాక్ పోయి నిర్మల నిర్వాణ ప్రశాంతత. పూర్ణ చంద్రుని కాంతిలో వికసించిన కలువను చూసినట్టు అనిపించింది. మలయ పర్వతాల మీదనుంచి వచ్చిన తుషార శీతల పవనంలా అనిపించింది. కాంతి నిండిన మనోహరమైన కన్నులలో మనసుని శాసించే చల్ల దానాలు ఎన్నో!

'ప్రేమ, దోమా కాదు. అది కామ. ఈ వయసులో అందరికీ వచ్చే రోగం వీడికి వచ్చింది. పట్టాభి రామ్ దగ్గరికి తీసుకు వెళితే, ఆయన వీడి కళ్ళు తెరిపిస్తాడు.' తండ్రి కర్ణ కఠోరమైన స్వరం...

'ఆ. ఇదంతా ఈ వయసులో వచ్చే జబ్బు. దీనికి మందు లేదు. అన్నీ వైరస్ లాగానే అది కూడా 'స్వయం నాశనం' చెందుతుంది. ఈ వైరస్ కొన్ని వారాలో, నెలలో, మరీ ఉధృతమైన రోగమైతే కొన్ని సంవత్సరాలు వుంటుంది. అంతే.. . జీవన క్రమంలో ఇదో దశ.. ఫేజ్ .. 'నువ్వు లేక నేను జీవించ లేను' అన్న వాళ్ళలో దాదాపు వంద శాతం మంది ఇంకా బతికే వున్నారు ఆ 'నువ్వు' లేక పోయినా!

తలుపు బయట మాటలు. ఎవరో ఆ మహానుభావుడు. ఇంత టేలెంట్ ఇక్కడే వుంటే ఇంకా పట్టాభి రామ్ ఎందుకు?

క్రమంగా తలుపు బయట ఇతర గొంతుకుల శబ్దం బలహీన మైంది. కొత్త 'వింత' అయి పోయింది. గొంతులు, ఆ తాలూకు మనుషులు రావడం తగ్గాయి.

ఇంటి వాళ్లే! రోజుకు కనీసం మూడు సార్లు తలుపు కొడతారు. ఇవాళ అక్క వచ్చింది. ఆమెకు విసుగు వచ్చే వరకు ఇలా 'ద్వార బంధ రోదన' వు౦టుంది. తర్వాత, అదీ ఆగి పోతుంది...ఏదీ శాశ్వతం కాదు.

నిత్యమైన, స్వచ్ఛమైన చీకటి ఒక్కటే మిగిలి వుంటుంది.

వెలుతురు మోసం! దగా!. ఇదే నిజమని నమ్మిస్తుంది! స్వల్ప కాలానికి సంతోషాన్ని ఇస్తుంది.

వీణ ను చూస్తానని అమ్మ చెప్పింది. తేజ కళ్ళల్లో వెలుతురు! మోసకారి వెలుతురు!

నమ్మాడు. వీణ ఇంటికి తీసుకు వెళ్ళాడు. ఆ సందుల్లో కారు వెళ్ళ లేక పోయింది. పెద్ద రోడ్డు దగ్గర దిగి సందులోకి వెళ్ళారు.

చిన్న పెంకుటిల్లు. ఒకటే తలుపు. ఇంటినీ, వీధినీ విడ దీస్తూ చిన్న అరుగు. వీణ తలుపు దగ్గరే వుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తోందో? వీణ చూడగానే రక్తంలో, నరాలలో, మెదడులో, గుండెలో, మనసులో అనిర్వచనీయమైన ఆనందం! నల్లటి వత్తైన జుట్టు మెరుపు చుక్క లాటి ఆమె మోహం పై కప్పు కుంది. అప్పుడు తెలియలేదు అది విషాదపు తొలి మెట్టు అని.

లోపలికి ఆహ్వానించింది...

లోపల రెండు కర్ర కుర్చీలు, ఒక ప్లాస్టిక్ కుర్చీ. పాత కాలపు టీ పాయ్... శబ్దం చేస్తూ ఫేన్ తిరుగుతూ వుంది.

స్టీల్ గ్లాస్ లో మంచి నీళ్ళు తీసుకు వచ్చి ఇచ్చింది వీణ. అమ్మ నీళ్ళు తాగ లేదు. నడుము వంగిన ఒక ముసలాయన వచ్చాడు. 'మా నాన్న.' అంది వీణ. లోపలనుంచి అంత కన్న వంగిన ఒక ముసిలావిడ వచ్చింది... ఆవిడ చేతిలో టీ కప్పులు. 'మా అమ్మ' అంది ఆవిడను చూపిస్తూ. తీక్షణమైన కాంతి వేడిలో పచ్చటి మొక్కలు ఎండి పోతాయి. అలాగే, లేమి అనే వేడికి వయసు, అందం, లాలిత్యం ఇగిరి పోయాయి. వయసు కన్న ముందే ముదిమి వచ్చింది.

అసహనంగా కూచుని వుంది అమ్మ...టీ తాగలేదు. ఎలాగో చిరాకు బయటకు కనపడకుండా నిగ్రహంతో నిర్వహించ గలిగింది. కారులో కూర్చున్న తర్వాత అంది. 'బాగుంది.. బాబూ.. చాలా బాగుంది.' అంది. ఆ మాటల్లో వ్యంగం స్పష్టంగా అర్థమైంది తేజ కు.ఆ రాత్రి నిద్ర పట్ట లేదు. బోలెడంత సిలబస్... చదవాల్సింది చాలా వుంది... రాత్రి హాలులో మాటలు వినపడ్డాయి.

'చూసావా పిల్లని.''ఆఁ.. అయ్యిందీ ఆ భోగం.'పిల్ల బాగుందా?''బాగుంటే చాలా? అదొక్కటేనా? పాత బొళ్ళ కొంప.. అలాగా జనం వుండే బస్తీ. పిల్ల పేరే చిత్రం గా వుంది. వీణ ట. వీణ. మరీ జాణ లా వుంది. మన వెంగళప్ప ని బుట్టలో పడేసింది. గొప్ప ఇంటి కోడలవాలని పేరాశ..'శూలాల్లాటి వెటకారపు మాటలు...'మర్యాదలు?'

'ఆఁ.. ముందు పంపు నీళ్ళు...తర్వాత టీ చూరు నీళ్ళు.''అయితే మన వాడికి జీవితాంత నిరీక్షణ.. వీణ కోసం.'పెద్ద పెట్టున నవ్వులు. 'అంతు లేని నిరీక్షణ. ఇక వీణ, ముసలి, గూని తండ్రీ, చిరుగు చీర తల్లీ, పొగ మంచు లాటి జ్ఞాపకాలే!'

మరొక్క సారి నవ్వులు. జంతువును చంపేటప్పుడు హైనా మృగాలు నవ్వే నవ్వులు. మర్నాడు వీణ కాలేజీ కి రాలేదు. మరో రెండో రోజులూ అదే పరిస్థితి.

నాలుగు రోజుల తర్వాత తేజ వెళ్ళాడు .......రాత్రికి రాత్రి ఎక్కడకో వెళ్లి పోయారుట.మరునాడు కాలీజీ కి ఉత్తరం రాసింది వీణ.'చీకటికి వెలుతురుతో స్నేహం కుదరదు. మన స్నేహం నాకు, మా తల్లి తండ్రులకు, అంధకారం మిగిల్చింది. లేడి పిల్ల, తన తోటిదే కదా అని పులి పిల్ల తో స్నేహం చెయ్య కూడదు. అది ప్రకృతి విరుద్ధం. అందరినీ కలిపేది చీకటి. మళ్ళీ మన కలయిక వుంటే..... అక్కడే.' తేజ కి అర్థం అయ్యింది ఏమై వుంటుందో! దుర్మార్గులు తల్లి తండ్రులు...వీణను బతక నిస్తారా! ఎప్పటికైనా వీణ బ్రతుకు ప్రశ్నార్థకమే !చీకటి అంటే తిరోగ మనమనీ, తిరోగామ వైఖరి అని, వాదించే వాడు తేజ. ' చీకటి అంటే తిమిరం, ఈ 'తి' అనే అక్షరం తో మొదలయ్యే పదాలన్నీ ఈ వైఖరినే సూచిస్తాయని నేను అనుకుంటాను. తిరిపెం (భిక్షాటన), తిట్టు (దుర్భాష), తిక్క (మూర్ఖత్వం), తీట (దురద ), తీపు (సన్నని నొప్పి) ఇలా ఎన్నో.' ఇప్పుడు.. అది మారి పోయింది. చీకట్లు లోకానికి అందానిస్తాయి. చీకటి తన నల్లని చుక్కని నిండు జాబిల్లి మీద కూడా పెట్టింది. చందమామ అందం దానితో ద్విగుణీకృత చీకటిలో సౌందర్యం వుంది. చిరు నవ్వుల పాపాయి పాల బుగ్గల మీద చుక్క బొట్టు, కంటి
పాప, కను బొమ్మలు, మబ్బులు, కాళీయ మర్దనుడూ, కలువలు, చీకటీ అన్నీ నలుపే! నల్లని రంగు బొల్లి రోగాన్ని దరి చేరనీయదు. తీయని గొంతుల కోకిలలు, తళ తళ మెరుపులా నెమలి ఈకలు, తుమ్మెదలు నల్లనివే. నలుపు, చీకటి లేక పొతే మనుషులే లేరు.
మనిషి లేని భూమి కరిగించిన సీసం పొంగే ఎడారే! మిణుగురు పురుగులూ, నల్లటి మేఘాల్లో తటిల్లతలూ, నక్షత్రాల కాంతి, చంద్ర కాంతి అందాలు, చీకటి లేక పొతే ఉండగలవా? ఈ గదిలో, ఈ నిబీడాంధకారంలో నల్లటి మబ్బులు కవోష్ణ జలరాసులను కురుపించాయి.
ఉప్పు సముద్రం చేరని వాన నీరు. ఇంకెందుకు.. ఇదీ 'ఉప్ప'నేగా.. 'చీకట్లు నల్లని కాంతులతో భూమి మీద అడుగు పెట్టాయి. నిశ అనే స్త్రీ భుజాల మీద ఎక్కి, శిరస్సు మీద నిలబడి, నక్షత్రాలనే స్త్రీల చెక్కిళ్ళను స్పృశించి, ఆకాశం లోకి పాకి, చంద్రుని తాకి, కొండలలో దూకి, మెల్లగా భూమి మీద ప్రవేశించింది చీకటి. చీకట్లు లోకానికి అందాన్ని చేకూరుస్తాయి.

చంద్రముఖి ముఖం మీద కస్తూరి బొట్టు పెట్టాయి. నల్లని వంకీల జుట్టు కలిగిన స్త్రీ కనుబోమ్మలనే విల్లు బాణాన్ని తొడిగాయి. కలువ వంటి కను రెప్పల మీద వాలాయి. లేడి కన్నుల వంటి కన్నులు కలిగిన స్త్రీ బంగారు చెక్కిలి మీద అగరు చుక్కని పెట్టాయి. వెండికొండ మీద మన్నులాగా కనిపించాయి. చంద్రుడనే పొలంలో జింక లా తిరిగాయి...' ఏవో పద్యాలు, అర్థాలు, తెరలు తెరలు గా, పీచులు గా పీచులుగా, చెట్ల ఆకుల నీడలో నాట్యం చేసే చీకటి రేఖల్లా సుళ్ళు తిరుగుతూ తన లో కలుసుకుంటున్నాయి. చివరిలో ..'కానుగు చెట్ల నీడల్లో ఒక స్వప్త్న శయ్య మీద ఈ మహాంధకారంలో హాయిగా శాశ్వతంగా నిద్ర పోవడంలో మనస్సు శాంతి పొందింది.' 'ఎన్నో నాళ్ళ క్రితం నా కోసమే రాసావా .. నాకు చల్లని కానుగ చెట్ల నీడల్లో సేద తీరాలని వుంది. ఇక నిరీక్షించే ఓపిక లేదు. వీణ లేని బతుకు నాకొద్దు. నేను పిచ్చి వాడిననీ, లోక శత్రువుననీ అననీ! ఈ వస్తు మాయ ప్రపంచంలో నాకు చోటు లేదు. .. ఇప్పుడు హాయి గా వుంది. ప్రశాంతంగా వుంది. చుట్టూ చీకటి దట్టంగా అలుముకుంటూ వుంది. భూమ్యాకర్షణ శక్తి అనే అవరోధం లేదు. శరీరం, మనసు తేలిక పడుతూ వుంది. లోకమా.. నన్ను క్షమించు. నన్ను అనుసరించకు. నా లా చీకటిని ప్రేమించకు.. చీకటిలో కలవాలని అనుకోకు.' భళ్ళున తలుపులు బద్దలయ్యాయి.


'బాబూ! ఇలా అయి పోయావేమిట్రా?.. ఇలా అవుతుందని అనుకోలేదే?' తేజ శరీరాన్ని ఒడి లో తీసుకుని ఏడుస్తూ వుంది తల్లి. 'తమ్ముడూ ? ఎవత్తిరా ఆ రాక్షసి? నీ ప్రాణాలు తీస్తోంది.' అక్క అక్కసుతో తిడుతూ వుంది. ఆ తిట్లు తేజకి కోపం తెప్పించ లేదు. 'తేజా! డబ్బు తో అన్నీ కొన గలననుకున్నాను. అది తప్పని తెలిసింది.' మనసులో అనుకుంటూ తేజ దగ్గరగా వచ్చాడు తండ్రి. ఆయన కాలు తగిలి సీసా దొర్లుకుంటూ దూరంగా వెళ్లి పోయింది. దూరంగా వెళ్లి పోయింది. వెళ్లి...పోయింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు