ఎండమావులు - ఎన్. గోపీకృష్ణ

Endamaavulu Telugu Story

ఆరోజు ఆదివారం. ఉదయం తొమ్మిదవుతోంది. అప్పుడే తలస్నానం చేసి బాత్రూం లో నుండి బయటికొచ్చిన చైతన్య టవలు తీసుకుని ఈలవేస్తూ బాల్కనీలోకి నడిచాడు.

ముందుగదిలో కూర్చుని బట్టల మిషను మీద కూర్చుని పనిచేసుకుంటున్న కృష్ణమూర్తి " ఏమిటో ఇవాళ సారు పొద్దున్నే లేచి రెడీ అవుతున్నారు ! " అన్నాడు కొడుక్కేసి చూస్తూ వ్యంగ్యంగా..

" మళ్ళీ తెల్లారిందా వాణ్ణి ఏదో ఒకటి అనడానికి ? " అంది వంటింట్లో నుండి సరస్వతి.

" నేనేమన్నా సపోర్ట్ చేయడానికి తమరున్నారుగా..."

భర్త మాటలకి ఎమీ అనలేక తనపనిలో తాను నిమగ్నమైపోయింది సరస్వతి.

ఇదేమీ పట్టించుకోకుండా చైతన్య బెడ్రూం లోకెళ్ళి జీన్స్ ప్యాంటూ, టీ షర్టూ వేసుకుని తల దువ్వుకున్నాడు. చేతికి వాచీ పెట్టుకుని గాగుల్స్ తీసుకుని బయటికొచ్చాడు.

" డాడీ ఓ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ ఇవ్వు " అని అడిగాడు తండ్రిని.

" ఎందుకూ ? " మొహం చిట్లించాడు కృష్ణమూర్తి.

" ఖర్చు చేయడానికి "

" నీ పంచ్ డైలాగులు విని ఎంజాయ్ చేయడానికి ఓపిక లేదు నాకు "

" కాకపోతే ఏంటి డాడీ? ఇవాళ సండే కదా, అలా సరదాగా బయటికెళ్ళొస్తాను, పెట్రోలుకీ, సినిమాకీ కావాలి. " చిరాగ్గా మొహం చిత్లించి అన్నాడు చైతన్య.

" సోమవారం నుండి శనివారం వరకు ఉద్యోగాలు చేసేవాళ్ళకు ఆదివారం కావాలి తమరికి ప్రతిరోజూ ఆదివారమేగా? "

" ఏమిటండీ? కొడుకుతోఅ మాట్లాడే తీరేనా అది..? ముందు గదిలోకి వస్తూ అంది సరస్వతి.

" వాడు కొడుకులా ప్రవర్తిస్తున్నాడా ? ముప్పై ఏళ్ళొచ్చాయి. నాలుగు రోజులు ఇదనీ, నాలుగు రోజులు అదనీ ఏదీ పూర్తిగా చదవక కాలేజీకి తిలోదకాలిచ్చాడు. గవర్నరు గిరీ తప్ప ఉద్యోగం చేయనని గాలికి తిరుగుతున్నాడు...." అని ఇంకా ఏదో కోపంగా అనబోతున్న కృష్ణమూర్తి మాటలకు అడ్డొచ్చాడి చైతన్య.

" అర్థం లేకుండా మాట్లాడకు డాడీ ! నచ్చిన చదువు, నచ్చిన ఉద్యోగం కాకుండా కాంప్రమైజ్ అవలేను లేదంటే అత్తెసరు జీతంతో అద్దెగదుల జీవితాన్ని గడపాలి...."

" అవున్రా, ఆ అత్తెసరు జీతంతోనే రోజూ ఐదువేళ్ళూ నీ నోట్లోకెళుతున్నాయి....ఈ అద్దె గదిలోనే తలదాచుకుంటున్నావు...."

" అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనిలాగే ఉంటాననా? అయినా నా వయసెంతనీ....నాకు నచ్చిన ఉద్యోగం, లంకంత ఇల్లు సంపాదించి చూపిస్తాను..."

" ఎప్పుడు? నేను చచ్చాకనా? " కోపంగా అరిచాడు కృష్ణమూర్తి.

" హబ్బబ్బ...ఏమిటండీ ఆ మాటలూ? " చూస్తూ ఊరుకోలేక అంది సరస్వతి.

" కాకపోతే ఏమిటే? యాభైతొమ్మిదేళ్ళు వచ్చినా నా కష్టం నాకు తప్పడం లేదు. అప్పటికీ జీతం రాళ్ళు చాలక కళ్ళు సరిగా కనబడకపోయినా, ఇంట్లో ఉన్నంతసేపూ బట్టలు కుడుతూ కాలం వెళ్ళదీస్తున్నాను...."

ఏడుపు గొంతుతో అన్నాడు కృష్ణమూర్తి.

" నీ సెంటిమెంట్ సబ్జెక్ట్ వినడానికి నేనేమీ ప్రొడ్యూసర్ ని కాదు డాడీ. నేనడిగిన అముంట్ ఇస్తావా, ఇవ్వవా, చెప్పు..." లేచి నిలబడి ఖచ్చితంగా అన్నాడు చైతన్య.

కృష్ణమూర్తి విసురుగా లేచెళ్ళి తన షర్టు జేబులో నుండి రెండొందలు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ " నా దగ్గర ఇంతే ఉన్నాయి. నీ ఇష్టమొచ్చినట్టు తగలడు ! " అన్నాడు.

చైతన్య ఆ డబ్బులు తీసుకుని బయటికొచ్చి బైక్ స్టార్ట్ చేసాడు...

చైతన్య కృష్ణమూర్తికి ఒక్కగానొక్క కొడుకు. అతడితర్వాత ఒక అమ్మాయి. చిన్నతనంలో పరిస్థితులు అనుకూలించక, పెద్దగా చదువుకోని కృష్ణమూర్తికి చైతన్య తనలాగా జీవితాన్ని వెళ్ళదీసే స్థాయిలో కాకుండా పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగం చేస్తాడనీ, తననేదో ఉద్దరిస్తాడనీ అందరు తండ్రులలాగే కలలు కన్నాడు. ఉన్నంతలో కృష్ణమూర్తి కూతురి పెళ్ళి బాగానే చేసాడు. కానీ ఆ అప్పూ, కొడుకు చదువులకని చేసిన అప్పులు, వాటి వడ్డీలూ వెంటాడుతూ అతనికి విశ్రాంతినివ్వడం లేదు... ఏనాటికైనా కొడుకు చేతికంది వచ్చి తనను ఆదుకోకపోతాడాని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న కృష్ణమూర్తికి నిరాశే మిగులుతోంది...చదువుల విషయం లో పెద్దగా నాలెడ్జ్ లేని కృష్ణమూర్తి, చైతన్య చదువేమిటో, అదేనాటికి పూర్తవుతుందో అర్థం కాక సతమతమవుతున్నాడు. అది అలుసుగా తీసుకుని, స్థిర చిత్తం లేని చైతన్య ఆ కోర్సులనీ, ఈ కోర్సులనీ ఏదీ పూర్తిచేయక, దేనిమీదా కాన్సంట్రేట్ చేయక కాలం వెళ్ళదీస్తున్నాడు...

బైక్ మీద చాలా దూరం వెళ్ళిన చైతన్య ఒకచోట మలుపు తిరగగానే సడెన్ గా బైక్ ఇంజన్ ఆఫ్ కావడంతో దిగి పక్కన స్టాండ్ వేశాడు. పక్కనే ఉన్న మెకానిక్ కుర్రాణ్ణి బైక్ చూడమని, కూల్ డ్రింక్ తాగడానికేమైనా బేకరీ కనిపిస్తుందేమోనని చుట్టూ చూసాడు. బేకరీ కనిపించలేదు కానె, ఓ చిన్న చెప్పుల దుకాణం లో ఓ అమ్మాయి చెప్పులుకుడుతూ కనిపించి చైతన్య దృష్టిని ఆకర్షించింది. అనాలోచితంగానే తేరిపారా చూశాడు... ఆ అమ్మాయినెక్కడో చూసినట్టనిపించింది. ...

ఎవరై వుంటారబ్బా... రెండు క్షణాలు ఆలోచించాక గుర్తొచ్చింది. తన క్లాస్మెట్ అభిరాం చెల్లెలు నిహారిక... వళ్ళ నన్నకు చెప్పుల దుకాణం వుందని తెలుసుగానీ, షాపులో ఈ అమ్మాయి వుందేంటీ?..

బైకు ఏమైందో చూడమని పురమాయించి షాపులోకి నడిచాడు చైతన్య.

అతడిని చూస్తూనే లేచి నిలబడి "రండి సార్! ఏం కావాలి? చెప్పులా, షూనా? కూర్చోండి!" అంది చిరునవుతో నీహారిక.

"నీ పేరు నీహారిక కదూ!" నిలబడే అడిగాడు చైతన్య.

"అవును. మీరు...!?

"మీ అన్నయ్య అభిరాం క్లాస్మెట్ చైతయని. గుర్తొచ్చానా?!"

నీహారిక ఒక్క క్షణం ఆలోచించి గుర్తుపట్టి "ఓహ్... అన్నయ్యా...నువ్వా! బావున్నావా? కూర్చో.... ఆంటీ, అంకుల్ బావునారా? ఒరే చింటూ కాసిని మంచి నీళ్ళు పట్రా!" అంటూ హడావిడి చేసింది.

చతన్య అక్కడే వున్న స్టూల్ లాక్కుని కూర్చుంటూ" అందరూ బావున్నారమ్మా! నువ్వేంటే, షాపులో పని చేస్తున్నావ్? డాడీ, అభి ఎలా వున్నారు?" అని అడిగాడు.

నీహారిక కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.

"చదువుకుంటున్నప్పటి నుంచే అన్నయ్య నాన్నకి చేదోడు వదోడుగా వుండేవాడు నీకు తెలుసు కదా! చదువయ్యాక పూర్తిగా షాపు చూసుకుంటూటే నాన్న సంతోషించాడు. కానీ, ఓ రోజు ఇంటికొస్తూ యాక్సిడెంట్ లో పోయాడు. దీన్ని తట్టుకోలేక నాన్నకి పక్షవాతం వచ్చింది. అమ్మ మా చిన్నప్పుడే పోయింది. ఒంటరి పక్షిలా మిగిలిన నాన్నని చూసుకోవడం నా బాధ్యత కదన్నయ్యా.."

షాపులో పైన పూలదండతో వున్న అభి ఫోటో పై అప్పుడు చైతన్య దృష్టి పడింది.మనసు చివుక్కుమంది. అభి తనతో ఎంతో క్లోజ్ గా వుండే వాడు.

"మరి, నువు ఇంకా పెళ్ళి.."

అయిందన్నయ్యా! మా వారు ప్రైవేటు ఉద్Yఓగం చేస్తూనే ఇక్కడ నాకు మెటీరియల్ తీసుకురావడంలాంటి సాయం చేస్తుంటారు. ఇంట్లో పిల్లలిద్దరినీ, చంటి పిల్లాడిలాంటి నాన్ననీ చూసుకుంటూ ఇదిగో... ఈ షాపుని నడుపుతున్నాను. .. డిగ్నిటీ ఆఫ్ లేబర్ కదన్నయ్యా... పనిని మనం గౌరవిస్తే అది మనల్ని సమాజం లో అందరూ గౌరవించేలా నిలబెడుతుంది...

ఇంతలో కుర్రాడు మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాడు.

"ఆంటీ, అంకుల్ బావ్న్నారా అన్నయ్యా? నీకు పెళ్ళైదా, పిల్లలు ఎంతమంది? ఎం చేస్తున్నావ్?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది నీహారిక...

"అ.. అదీ.. యాక్చువల్ చి.ఎ చేద్దామనుకున్నాను. బట్ దానికి మార్కెట్ లేదు. ఒక్క టూ ఇయర్స్ లో ఏదైనా కోర్స్ చేసి మంచి జాబ్ చేద్దామనుకుంటున్నా అని తడబడుతూ చెప్పాడు చైతన్య.

"అవునా? నువ్వీపాటికీ లైఫ్ లో సెటిలైపోయుంటావనుకున్నా అన్నయ్యా! పాపం అంకుల్ మాత్రం ఎంత కాలం కష్టపడతారు.... నువు ఏదో ఒక ఉద్యోగం చేసి సంపాదిస్తూంటే ఆయన ఇప్పటికైనా విశ్రాంతి తీసుకుంటారు. పైగా, కోడలు రావాలని ఆంటీకి కూడా వుంటుంది కదా! కాలం ఎంతో వికువైంది. గడిచిపోయిన కాలం తిరిగిరాదు...

ఫోన్ మోగినట్టుగా నటించి తీసి మాట్లాడ్డం ప్రారంభించాడు చైతన్య.

"చెప్పరా! అక్కడే వున్నావా? బైక్ ప్రాబ్లం వల్ల లేటయింది. వచ్చేస్తున్నా! ఓ.కే... నేనొస్తానమ్మా! మళ్ళీ కలుస్తా!" అంటూ బయటికొచ్చాడు.
ఇంట్లో డాడీ నస భరించలేక బయటికొస్తే, తన పనేదో తను చేసుకోక శ్రీరంగ నీతులు చెప్తోంది."... అనుకున్నాడు చైతన్య.

నీహారిక మాటలేవీ చైతన్య తలకెక్కలేదు. అదే జరిగితే ఎంతో మంది తల్లిదండ్రులకు ఈ బాధ తప్పేది.

తమ బాధలను కష్టాలను పట్టించుకోని ఇలాంటి బిడ్డలున్న తల్లిదండ్రుల ఆశలెప్పటికీ ఎండమావులే....

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు