సాంత్వన - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Saamtvana Telugu Story

ఆదివారం ఉదయం ఏడు గంటలు.

బద్ధకంగా నిద్రలేచాను. ఆర్రోజులూ కాలపు ముల్లుకి బంధించబడి ఒక యంత్రంలా గడిపే నాకు నిజంగా ఆదివారం ఆటవిడుపే! దాన్ని ఏ ఫంక్షన్లకో వెళ్లడం..ఎవరెవరిళ్ళకో వెళ్ళి..లేదా వాళ్ళని ఇంటికి పిలిచి వ్యర్ధపరచుకోవడం ఇష్టముండదు. దాన్ని నాకిష్టమైన సాహిత్యం చదవడంలోనూ..కథలు రాయడంలోనూ..మంచి మంచి సినిమాలు చూడడంలోనూ గడపాలనిపిస్తుంది. అలా ఆదివారాన్ని నా కోసమే.. కేవలం నా కోసమే ఉపయోగించుకోవాలనిపిస్తుంది. ప్రతి క్షణం పొదుపుగా వాడుకోవాలనిపిస్తుంది. పైగా మాపిల్లలకి వేసవి సెలవులు ఇవ్వడంతో శ్రీమతి పుట్టింటికి వెళ్ళింది. ఫుల్ ఎంజాయ్ చేద్దామనుకున్నాను కాని ఈ ఆదివారంలో కొంతసమయం త్యాగం చెయ్యల్సొస్తోంది. అందుకే చిరాగ్గా వుంది. నిజానికి ఆదివారం నేను తొమ్మిదీ పదింటికి కాని లేవను. కాని ఇవాళ ఆఫీసున్నట్టే ఏడింటికి లేవాల్సొచ్చింది. ఛ..కొంతప్పుడు ఇష్టం లేకపోయినా ఫార్మాలిటీస్ కి కొంత సమయం కేటాయించాల్సొస్తుంది. తప్పదు.

మా ఆఫీసులో పనిచేసే వేణుకి నెల క్రితం యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో వున్నాడు. అసలు ఆ యాక్సిడెంట్ తీవ్రతకి వాడు బ్రతక డనుకున్నారు. కాని గట్టిపిండం మేజర్ సర్జరీ జరిగాక కోలుకుంటున్నాడు. వేణు వయస్సు యాభై..యాభై అయిదు మధ్య వుంటుంది. అందరితో నమ్రతగా వుంటాడు. తన పనేదో తనేంటో. ఆఫీసులో అందరూ మిస్టర్ కూల్ అని పిలుస్తుంటారు. ఆఫీసులోని దాదాపు అందరూ చూసొచ్చారు. ఒక్క నేను తప్ప. ఆర్రోజులూ ఆఫీసు పనితో చాలా చాలా బిజీగా వుంటాను. ఆదివారం వెళదామనుకున్నా..బద్ధకంతో మరో ఆదివారానికి పోస్ట్ పోన్ చేసి నాకోసం నేనుగా జీవిస్తాను. ఈవారం తప్పనిసరిగా వెళ్ళి రావాలి. ఎందుకంటే చుట్టుపక్కలవున్న ఆఫీసుల వాళ్లు కూడా చూసొచ్చార్ట..ఒక్క నేను తప్ప. ఆఫీసులో అందరూ వెటకారం చేస్తున్నారు. నిజానికి నాకు హాస్పిటల్ వాతావరణమంటే తెగ చిరాకు. మా వాళ్ళెవరన్నా వుంటేనే ముళ్ళమీద కూర్చున్నట్టు పదినిముషాలుండి వచ్చేస్తాను. కాని తప్పదు కదా ఒక్క పదినిముషాలు ఎలాగోలా గడిపి వచ్చేయడమే!

అరగంటలో తయారై బైక్ మీద గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లాను. కాంపౌండ్ లోపలికడుగెట్టగానే యుద్ధభూమిలోకి ప్రవేశం చేసి నట్టని పించింది. పేషెంట్లు క్షతగాత్రుల్లా కాళ్లకి.. చేతులకి..కట్లతో..మూలుగులతో.. నీర్సంగా అడుగులేస్తున్నారు. వాళ్ళతో పెద్ద యాతనగా వుందని ముఖంలో విసుగుని కనిపింపచేస్తూ ‘కావలసిన’ వాళ్ళు. లోపలికెళితే ఫినాయిల్ వాసనతో కూడిన ఒక రకమైన ముక్క వాసన. డాక్టర్ల నుండి కిందిస్థాయి దాకా మాటల్లో చేతల్లో చూపించే నిర్లక్ష్యం. మానవాధముల మధ్య మహోన్నతములమన్న ఫీలింగ్.

నేను ముక్కుకి కర్చీఫ్ అడ్డం పెట్టుకుని కావాలసిన వార్డ్ దాకా వచ్చి లోపలికెళ్ళాను.

ఒక్కో మంచంమీద వున్న పేషేంట్ ని చూస్తూ నడుస్తున్నాను. ఆ వార్డ్ యమలోకంలా, ఒక్కో బెడ్ మీద పేషెంట్ ఒక్కోశిక్ష అనుభవిస్తున్నట్టు అనిపిస్తోంది. వేణు బెడ్ దగ్గరకి వచ్చాను. తలకి పెద్ద కట్టు వుంది. అతని దగ్గర ఎవరూ లేరు. బెడ్ పక్కగా వున్న మెటల్ స్టూల్ ని కొద్దిగా జరుపుకుని కూర్చున్నాను.

ఆ శబ్దానికి వేణు లేచి నన్ను చూసి పేలవంగా నవ్వాడు. నాకెందుకో అతడిని చూస్తే జాలేసింది.

"ఎలావుంది?"అడిగాను.

"ఫర్వాలేదు" అని లేవబోయాడు.

"వొద్దొద్దు..రెస్ట్ తీసుకో"

"నీ దగ్గర ఎవరూ లేరేంటి? ఏవన్నా అవసరం వస్తే?"మాటల్లో కొద్దిగా చిరాకుని కనబరుస్తూ మందలిస్తున్నట్టుగా అన్నాను.

"మా ఆవిడ పదేళ్ళ క్రితమే కాలం చేసింది. ఇద్దరు కొడుకులు. వాళ్ళవీ రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు. నాకోసం ఎంతకాలం పక్కన ఉత్తగా కూర్చుంటారు?"అన్నాడు.

తెచ్చిన రెండాపిల్ పళ్ళు అతని చేతిలో పెట్టి లేచాను ఇహ వెళతానన్నట్టుగా.

వెంటనే నా చెయ్యి పట్టుకుని "కొద్ది సేపుండచ్చు కదా..ఇవాళ ఆదివారమే! ఎప్పుడు పనితో బిజీగా వుండే నేను ఇలా మంచానికి అంటిపెట్టుకుని వుండడం నరకప్రాయంగా వుంది. ఏమీ తోచక పిచ్చిగా వుంటోంది. పలకరించే నాధుడు లేడు.

చుట్టాలు..తెలిసున్న వాళ్ళు..ఆఫీసు స్టాఫ్..మర్యాద కోసం పరామర్శించి వెళ్ళిపోతారు తప్ప ‘సాటి మనిషి మంచాన పడి వున్నాడే’ అన్న భావం వాళ్ల కళ్లలో వెదకి చూసినా కన్పించదు. నిజం చెప్పు నాకు కావలసింది రెండు పళ్ళు..‘తగ్గిపోతుందిలే’ అనే ఓదార్పు మాటలూనా?"

"ఇద్దరు కొడుకులంటున్నావు..వంతుల వారీగా ఒక్కొక్కరూ వుండొచ్చుగా..వాళ్ళ తండ్రివే కదా!"

"ఈ హాస్పిటల్లో చేరేదే నాలాంటి వాళ్ళు. డబ్బుతో అద్భుతమైన ట్రీట్ మెంట్ ఇప్పించుకోలేని దౌర్భాగ్యులం. అడ్మిట్ అవడం తప్ప ఎప్పుడు డిస్చార్జ్ అవుతామో తెలీదు. అడుగడుగునా ఛీత్కారాలు. అవమనాలు. ఈ వార్డ్ లో ఏ మంచం దగ్గరన్నా పేషేంట్ తప్ప మరొకర్ని చూశావా? ఒకవేళ వున్నా ‘ఈ తద్దినం ఇంకెన్నాళ్ళో’ అన్నట్టు వుంటారు తప్ప ప్రేమాభిమానాలతో కాదు. మా వాళ్ళ దృష్టిలో నేనే కావాలని యాక్సిడేంట్ చేయించుకున్నాను. ‘పెద్దవాడివయ్యావు..చూసుకుని వెళ్ళక్కర్లేదూ’ అంటాడు పెద్దాడు. ‘నాన్నకి రిటైర్మెంట్ కి ముందే రెస్ట్ తీసుకోలన్పించిందేమో అందుకే రిస్క్ చేశాడు’అంటాడు చిన్నాడు ఎకసక్కెంగా.

పలకరిద్దామని వచ్చేవాళ్ళు పేషెంట్లని ‘నువ్వు మాలోంచి వెలివేయబడ్డావు’ అన్నట్టు కాకుండా ‘నువ్వు కోలుకుని మాలో ఎప్పుడు కలుస్తావు?’ అన్న ఆదరణ చూపించాలి.

ఈ హాస్పిటల్ కాంపౌండ్ కి అవతల ఎంతో మంది ఎవరిపనుల్లో వాళ్ళు ఎంతో బిజీగా వుంటారు. కనీసం ఈ హాస్పిటల్ ముందు నుండి వెళుతున్నప్పుడైనా ‘లోపల ఎంతమంది ఆఖరి శ్వాస తీసుకుంటున్నారు?..మృత్యువుతో పోరాడుతున్నారు? అని ఆలోచిస్తారా? లేదు ఎవరి సుఖం వాళ్లది. సాటి మనిషి ఏమైపోతే వాళ్ళకేం."

కాస్త ఊపిరి తీసుకోడానికి ఆగి కాసిన్ని మంచినీళ్ళు తాగి..మళ్లీ ప్రారంభించాడు."ఆ పక్క బెడ్డు పెద్దాయన్ని చూడు ఆయనకి హార్టేటాక్ వచ్చింది. చాలా సీరియస్ ట. డాక్టర్లు ఏ విషయం చెప్పలేమంటున్నారు. వాళ్లవాళ్ళ దృష్టిలో ఆయన చచ్చిపోయినట్టే! ఎప్పుడోసారి వస్తున్నారు.. ఉన్నాడో! పోయాడో చూడ్డానికి. ఆయన మంచివాడో..చెడ్దవాడో తెలియదు. తన వాళ్లకోసం ఎంతో కొంత శ్రమించే వుంటాడు! మన మనుష్యలోకంలోకొచ్చాడు. మనకీ కాస్త కనికరం వుండాలి కదా! ఇవన్ని నీకెందుకు చెబుతున్నానంటే..నువ్వు కథలు చదువుతావని..రాస్తావని నాకు తెలుసు..మీ మనసులు కాస్త మార్ధవంగా వుంటాయి. ఓల్డ్ ఏజ్డ్ హోం జీవితాలే కాదు హాస్పిటల్లోని పేషెంట్ల జీవితాలూ హృదయ విదారకంగా వుంటాయి. పట్టించుకునే నాధుడు లేక. దయచేసి ఈ విషయం మీద కథ రాసి పేషేంట్లకీ కాస్త సాంత్వన చేకూరేలా చేయి..ప్లీజ్. మేమూ మనుషులమే మళ్ళీ కోలుకునొచ్చి మీలో కలుస్తాం."అని ముగించాడు.

కలం కాగితం మీద పెట్టడం తప్ప ఇప్పటిదాకా నేను చేసిందేంలేదు. రోడ్డు మీద బిజీగా వెళుతున్నప్పుడు హారన్ తో ఆంబులెన్స్ వస్తుంటే వాహనాన్ని పక్కకి తీసుకోవడానికి విసుగు. మృత్యువుతో పోరాడుతున్న వ్యక్తికి సహకరిస్తే మృత్యువు ఓడిపోదూ! కానీ మనం అలా చేయం. మనిషి ఆలోచనలు ఉత్తమంగా..అమలు అధమంగా వుంటే సరిపోదు. అందరినీ కలుపుకుపోవాలి..అందరికోసం బ్రతకాలి. ఈ ఆదివారం నాకు ప్రత్యేకమైనది. దిశానిర్దేశం చేసింది.

మరుసటిరోజు ఆఫీసుకి గంట ముందు బయల్దేరాను. దారిలో పేపర్ ..టిఫిన్లు కొనుక్కుని హాస్పిటల్ లోకడుగుపెట్టాను. నిన్నటిలాగా చిరాగ్గా లేదు ఆ వాతావరణం. బయటవున్న పేషెంట్ల మొదలు డాక్టర్లు..సిస్టర్లు..ఉద్యోగులకి విష్ చేస్తూ వేణూ దగ్గరకి వెళ్ళాను. అతడి పక్కన స్టూల్ మీద కూర్చుని ఇడ్లీ పొట్లాం అతడికి..చుట్టుపక్కల బెడ్ల వాళ్లకిచ్చి తినమని..వాళ్ళు తింటుండగా పేపర్ చదివి వినిపించాను. నా ఫోన్ నంబరు అతడి కేస్ షీట్ మీద రాయించి ఏ అవసరమొచ్చినా నాకు ఫోన్ చేయమని చెప్పాను. ఆ కాస్తకే అక్కడున్న వాళ్ళకి ఆత్మీయుడన యిపోయాను. తిరిగి సాయత్రం ఆఫీసయ్యక వస్తానని చెప్పి బయల్దేరాను. ఎందుకో చాలా రిలీఫ్ గా అనిపించింది. నేను నాకోసం బ్రతికినప్పుడు అలా అనిపించలేదు.

ఇప్పుడు ఆదివారం సెలవుదినాల్లో..షాపింగ్ మాల్స్..చార్మినార్..ఎన్ టి ఆర్ గార్డెన్స్..కే కాదు వివిధ హాస్పిటల్స్ కి..వృద్ధ శరణాలయాలకి వెళుతున్నాను. వాళ్ళలో ఆత్మ స్థయిర్యాన్ని నింపి బ్రతికి తీరాలన్న కాంక్షని పెంచుతున్నాను.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి