మాచవరం గ్రామంలో నివసించే లింగయ్యశెట్టిది చిల్లర కొట్టు కిరాణా వ్యాపారం.నిజాయితీపరుడైన వ్యాపారిగా ఊళ్ళో మంచిపేరుందతడికి. సొంత ఇంటిలోనే కొట్టు నడిపేవాడు కనుక అద్దె బాధ కూడా లేదతడికి. భుక్తికి లోటు లేకుండా అప్పుల్లేకుండా హాయిగా గడిచిపోతుండేదతడి జీవితం. ఉన్న ఇద్దరు కొడుకులనూ పటన్మ్ లోని మంచి విద్యాలయంలో చదివిస్తున్నాడు.
అయినా అతడినేదో బాధ పట్టి పీడిస్తుండేది. పెద్ద పెద్ద మేడలూ మిద్దెలూ సంపాదించలేకపోతున్నాననీ, ఊళ్ళో ఉన్న కోటీశ్వరులమధ్య తానూ ఒకడిగా వెలిగి పోలేక పోతున్నాననీ ఆత్మ న్యూనతా భావం అతణ్ణి పట్టి పీడిస్తూండేది.
అతడి భార్య రంగమ్మ మాత్రం మనకున్నదాంట్లో మనశ్శాంతిగానే ఉన్నాం కదాని అతడితో అంటూండేది. సొంతిల్లు, వ్యాపారం, చక్కగా చదువుకుంటున్న పిల్లలు అన్నీ సవ్యంగానే ఉన్నాయి, సంతోషంగానే గడిచిపోతోంది కదాని అంటూండేది.
ఇదిలా ఉండగా ఒకసారి దేశసంచారం చేస్తూన్న ముని ఒకాయన మాచవరం గ్రామ సరిహద్దుల్లోని నదీ తీరానికి వచ్చి ఉన్నాడని తెలిసుకొని ఊళ్ళోని జనమంతా తండోపతండాలుగా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని తమ కష్టాలు చెప్పుకోసాగారు.
ఇది తెలిసి లింగయ్యశెట్టి కూడా భార్యను తీసుకుని ఆ మునిని చూడబోయాడు.
" స్వామీ ! ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది జీవితం.బోలెడంత డబ్బూ, ఇంకా మంచి జీవితం, ఊళ్ళోని కోటీశ్వరుల మధ్య ఒకడిగా గుర్తింపూ నాకెందుకు సాధ్యం కావడం లేదు? " అని తన బాధను వ్యక్తం చేసాడు.
ముని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి, " నాయనా అక్కడున్న కడవతో ఎదురుగా పారుతున్న నదిలోంచి నీళ్ళు ముంచి తీసుకురా.." అని చెప్పాడు.అలాగేనని ముని చెప్పినట్టే చేశాడు లింగయ్యశెట్టి. ముని నది వేపు చూస్తూ, అదేమిటి నాయనా? నువ్వు ముంచుకొచ్చినా ఇంకా నదిలో నీళ్ళు పారుతూనే ఉన్నాయే? అనడిగాడు.
దానికి లింగయ్య ఆశ్చర్యంగా, " అదేమిటి స్వామీ, కడివెడు నీళ్ళు ముంచుకొచ్చినంత మాత్రాన, నదిలో నీళ్ళింకిపోతాయా? " అనడి గాడు.
ముని నవ్వి, " అదే నాయనా నేను నీకు చెప్పబోతున్నది. మనజీవితంలోని కోరికల్ పారే నది లాంటివి. అవి మారుతుంటాయే తప్ప తీరవు...ఒక కడివెడు కాదు కదా వంద..వేయి కడవలు ముంచుకొచ్చినా అంతే..ఇక ప్రాప్తం అనేదొకటుంటుంది. అది అచ్చు మన కడవ లాంటిదే... నదికెళ్ళినా, సముద్రానికెళ్ళినా మన ప్రాప్తమెంత ఉందో అన్నే మనకు చెందుతాయి... " అంటూ వివరించాడు..
లింగయ్యశెట్టి మునికి నమస్కరించి తేలికపడిన మనసుతో ఇంటికి బయల్దేరాడు.