ఊరి చివరి ఇల్లు - కొండగుంట వెంకటేశ్

The Last House

హోరున వర్షం కురుస్తుంది. పట్టపగలే విజుబిలిటి తక్కువగా ఉంది. నేలంతా వాన నీరుతో చిత్తడిగా ఉంది. కాళ్ళకు పంచెకు బురద కూడా అంటుకుంది. ఎలాగో అపసోపాలు పడుతూ ఆ ఇంటికి చేరుకున్నాడు. భారంగా ఊపిరి పీలుస్తూ తలుపు మీద కొట్టాడు. ఒక్క క్షణం తరువాత తలుపులు తెరుచుకున్నాయి. గుమ్మం దగ్గర అందమైన అమ్మాయి కనిపించింది. సన్నగా పొడుగ్గా నాజుకుగా ఉంది. కాని వేసుకున్న బట్టలు మాత్రం ఆమె బీదరికాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

“ఎవరండి మీరు ఏం కావాలి” అంటు మర్యాదగా అడిగింది.

ఆ మనిషి కోపంతో ఏదో మాట్లాడబోయాడు. కాని కారణం తెలియదు కాని గొంతులోంచి మాట పెగిలి రాలేదు. గొంతుకు ఏదో అడ్డం పడినట్టు ఉక్కిరిబిక్కిరిఅయ్యాడు.

ఆ అమ్మాయి విసుగ్గా చూసి ఏదో చెప్పబోయింది. వేళ కాని వేళ రావటమే కాకుండ ఏం మాట్లాడకుండ మౌనంగా ఉండటం ఆమెకు చిరాకు తెప్పించింది. అయినా కోపం తెచ్చుకోకుండా “ఎవరండి మీరు. ఏంపని మీద వచ్చారు “అని శాంతంగా అడిగింది.

ఈ సారి కూడా ఆయన మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాడు. కాని గొంతు ఎందుకో సహకరించలేదు. ఆదే సమయంలో ఆయన శరీరం ఒక్కసారిగా ముందుకు తూలింది. చప్పున గుమ్మం తలుపులు పట్టుకుని నిలదొక్కుకున్నాడు కాని మనిషి మాత్రం గజగజ వణికిపోతున్నాడు. శరీరం చిగురుటాకులా కంపిస్తుంది. ఊహించని ఈ నాటకీయం చూసి ఆ అమ్మాయి బిత్తరపోయింది. ఏదో చెప్పాలనుకుంది. ఇంతలో ఆ మనిషి మెల్లగా నేలమీదకు జారిపోయాడు. మనిషి సృహలోనే ఉన్నాడు కాని ఒళ్ళు మాత్రం చలిజ్వరం వచ్చినవాడిలా అల్లాడిపోతుంది.

ఆ అమ్మాయి వెంటనే తేరుకుని గట్టిగా భర్తను పిలిచింది.

ఆమె భర్త శ్రీధర్ కంగారుగా వచ్చాడు. గుమ్మం ముందు పడిపోయిన వ్యక్తిని చూసి “లలిత ఎవరీయన. ఏమైంది. ఎందుకు ఇలా వణికిపోతున్నాడు”అని అడిగాడు.

“నాకు తెలీదండి. తలుపు కొడితే తీశాను. గుమ్మం దగ్గర ఈ పెద్ద మనిషి కనిపించాడు. ఎవరు మీరు అని అడిగితే జవాబు చెప్పకుండ ఇలా పడిపోయాడు” అంది లలిత.

“వర్షంలో తడవటం వల్ల చలిజ్వరం వచ్చిందని నా అనుమానం. ఇంతరాత్రివేళ మనింటికి ఎందుకు వచ్చాడు.”

“నాకేం తెలుసు.”

“ఇంతకుముందు ఈ మనిషిని ఎప్పుడైనా చూశావా.”

“లేదండి. ఖచ్చితంగా ఈ ఊరివాడు మాత్రం కాదు.”

“నాకు అలాగే అనిపిస్తుంది. ఇతనెవరో మనకు తెలియదు. మనం ఎవరో ఇతనికి తెలియదు. కాని పనిగట్టుకుని ఇంత రాత్రివేళ అది ఈ వర్షంలో మన ఇంటికి ఎందుకు వచ్చాడు. చూస్తుంటే చాల పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. ఇతను ఎవరైన మన ఇంటి ముందు పడిపోయాడు. పైగా చలిజ్వరంతో బాధపడుతున్నాడు. ఈ పరిస్ధితిలో ఇతన్ని ఇలాగే వదిలేయ్యటం మానవత్వం అనిపించుకోదు. వెంటనే లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడదాం. మిగతా విషయాలు తరువాత చూసుకోవచ్చు”అన్నాడు శ్రీధర్.

ఇద్దరు కలిసి అతన్ని లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోపెట్టారు. శ్రీధర్ ఆయన లాల్చీ జేబులు వెతికాడు. పర్స్ కనిపించింది. అందులో చాల డబ్బు కొన్ని రశీదులు ఉన్నాయి. కాని ఆ మనిషి విజిటింగ్ కార్డు కాని అతని ఐడింటి తెలిపే వివరాలు కాని లేవు. శ్రీధర్ పర్స్ తిరిగి జేబులో పెట్టేశాడు.

మంచం పక్కన నేలమీద ఉన్న చిన్న సీసా తీసి భర్తకు చూపించింది లలిత. అది విషపు సీసా.

“మన ఆత్మహత్య కార్యక్రమం ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. ముందు ఈ అపరిచితుడు ఎవరో, ఎందుకు వచ్చాడో తెలుసుకుందాం.”అన్నాడు శ్రీధర్.

“చావు తప్ప మనకు ఇంకో మార్గం లేదా”బేలగా అడిగింది లలిత.

“నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న పాపానికి నీకు ఈ శిక్ష తప్పదు. అయిన వాళ్ళందరికి దూరమయ్యాం. సహయం చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. మాయదారి జబ్బువల్ల ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. బ్యాంకులో డబ్బు అయిపోయింది. చేతిలో ఒక్క పైసా లేదు. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఈ పరిస్దితిలో మనం ఎలా బ్రతకగలం. మన పెళ్ళి అయి రెండు సంవత్సరాలు అయినా,నా తల్లితండ్రికి మీ వాళ్ళకు మనమీద కోపం పోలేదు. వాళ్ళ దృష్టిలో మనం ఎప్పుడో చనిపోయాం. అందినంతవరకు స్నేహితుల దగ్గర అప్పు చేశాం. ఇంకా ఎంతకాలం వాళ్ళు మాత్రం సహయం చేస్తారు. తిరిగి ఇచ్చే పరిస్థితిలో ఉంటే అది వేరే సంగతి. కాని మనకు చిల్లి గవ్వ ఆదాయం లేదు. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నా ప్రాణాలు తీసుకునే హక్కు నాకుంది. కాని నిన్ను బలవంతం చేసే అధికారం నాకు లేదు. నేను పోయిన తరువాత మీ ఇంటికి వెళ్ళిపో. భర్త పోయిన అమ్మాయిని ఎవరైన చేరదీస్తారు.”

“మీరు పోయిన తరువాత నేను మాత్రం బతికి ఉంటానని ఎలా అనుకున్నారు. మీరు లేకుండ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏదో బలహీన క్షణంలో అలా అన్నాను. మీరు చెప్పినట్టు చేద్దాం”అంది లలిత.

శ్రీధర్ ఏదో మాట్లాడబోయాడు. ఇంతలో పెద్దగా మూలుగు వినిపించింది. ఇద్దరు కంగారుగా మంచం దగ్గరికి వెళ్ళారు. ఆ మనిషి పూనకం వచ్చినట్టు ఒణికిపోతున్నాడు. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు. లలిత ఇంట్లో ఉన్న బట్టలన్ని తీసి అతని మీద కప్పింది. తన చీరలు కూడా విడిచిపెట్టలేదు. కాని ఆ మనిషిలో కొంచెం కూడా మార్పు లేదు. శ్రీధర్ కంగారుగా కిటికి లోంచి బయటకు చూశాడు. వర్షం మరింత పెద్దదయింది. ఉరుములు మెరుపులతో జడివానగా మారిపోయింది. పైగా గాలి వేగంగా వీస్తోంది. ఇంట్లో గొడుగు కూడా లేదు. ఈ పరిస్దితిలో డాక్టర్ ను పిలుచుకువచ్చే అవకాశం కూడా లేదు.

ఏం చెయ్యాలో తోచక శ్రీధర్ తిరిగి గదిలోకి వచ్చాడు. ఆ మనిషి పరిస్దితి మరింత అధ్వాన్నంగా మారింది. లలిత బిక్కమొహం వేసుకుని భయంగా చూస్తుంది. శ్రీధర్ కి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలా అని ఆలోచించాడు. అతని మనస్సులో ఫ్లాష్ వెలిగింది. అలా చేస్తే ఆ మనిషి తప్పకుండ బతుకుతాడు. కాని దానికి లలిత ఒప్పుకోవాలి. ఆమె ఒప్పుకుంటుందా. ఏ భార్య అలాంటి ప్రపోజల్ కు ఒప్పుకోదు. పైగా భర్తను చీదరించుకుంటుంది. అయిన ఫర్వాలేదు. లలిత గురించి అతనికి బాగా తెలుసు. అతని మాట ఎప్పుడు కాదనదు. ఈ ఆలోచన రాగానే లలితను హాలులోకి తీసుకువెళ్ళాడు.

లలిత భర్తవంక ప్రశ్నార్ధకంగా చూసింది.

శ్రీధర్ చెప్పాడు. అతను చెప్పింది పూర్తిగా విన్న లలిత తలమీద పిడుగుపడినట్టు అదిరిపడింది. బిత్తరపోయి భర్త వంక చూసింది.

“ప్రస్తుత పరిస్ధితిలో ఆ మనిషిని కాపాడటానికి ఇంతకంటే ఇంకో మార్గం లేదు. ఎలాగు మనం చచ్చిపోబోతున్నాం. వెళ్ళేముందు కనీసం ఒక మంచి పని చేసి వెళదాం. నీ వల్ల నాకు నా వల్ల నీకు తప్ప మనం ఎవరికి సహయం చెయ్యలేదు. ఉపయోగపడలేదు. తుచ్ఛమైన ఈ శరీరం ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతున్నప్పుడు అంతకంటే గొప్ప అదృష్టం ఇంకేం ఉంటుంది. ఈ అవకాశం అందరికి రాదు. పుణ్యం చేసుకున్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. నీ భర్తగా ఆజ్ఞాపించటంలేదు. వాస్తవాన్ని తెలుసుకోమంటున్నాను. నేను చెప్పాలనుకుంది ఇంతే. తరువాత నీ ఇష్టం.”అన్నాడు శ్రీధర్.

లలిత పిచ్చిదానిలా భర్త వంకచూసింది. తరువాత ఏదో నిర్ణయించుకున్నట్టు మౌనంగా గదిలోకి వెళ్ళింది. ఆ మనిషి పరిస్ధితిలో కొంచెం కూడా మార్పు లేదు. మనిషి భయంకరంగా వణుకుతున్నాడు. లలిత ఆయన వైపు నిర్లిప్తంగా చూసి యాంత్రికంగా తన ఒంటి మీద బట్టలు విప్పేసింది. నగ్నంగా మంచం మీద అతని పక్కన పడుకుంది. శ్రీధర్ గదితలుపులు దగ్గరగా వేశాడు.

మరుసటి ఉదయం కళ్ళు తెరిచిన ఆ మనిషి నగ్నంగా తన పక్కన పడుకున్న అమ్మాయిని చూసి చప్పున లేచి కూర్చున్నాడు. ఎవరు నువ్వు అంటు గట్టిగా అరిచాడు.

అతని అరుపులు విని శ్రీధర్ కంగారుగా లోపలికి వచ్చాడు. ఈలోగా లలిత కూడా లేచి బట్టలు వేసుకుంది.

శ్రీధర్ జరిగినదంతా చెప్పాడు. ఆ మనిషి వర్షంలో తన ఇంటికి రావటం చలిజ్వరంతో తన ఇంటి గుమ్మం ముందు పడిపోవటం అంతా వివరంగా చెప్పాడు. అతన్ని ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ఏం చేశాడో కూడా వివరంగా చెప్పాడు.

“అమ్మా మహాతల్లి నన్ను క్షమించమ్మా. నువ్వు మాములు స్త్రీవి కాదు. నా ధైవం త్రిపురసుందరివి. ఈ పాపిష్టి వాడిని మన్నించమ్మా”అంటు అమాంతం లలిత కాళ్ళ మీద పడిపోయాడు. అతడి కళ్ళు దారాపాతంగా వర్షిస్తున్నాయి. ఆమె కాళ్ళను అభిషేకిస్తున్నాయి.

“ఏమిటండి ఇదంతా. మీరు పెద్దవారు. నా కాళ్ళమీద పడటం ఏం బాగాలేదు” కాళ్ళు వెనక్కి తీసుకుంటు అంది లలిత.

“వయస్సులో నేను పెద్దవాడిని. కాని మానవత్వం లో మీకంటే చాల చిన్నవాడిని. మేరుపర్వతంలా మహోన్నతంగా ఎదిగిపోయిన మీ వ్యక్తిత్వం ముందు నేను చాలా అల్పుడిని. నేనేవరో తెలియకపోయినా, నా ప్రాణాలు కాపాడారు. ప్రపంచంలో ఇంతవరకు ఏ స్త్రీ చెయ్యని త్యాగం చేశావు. నిజానికి నేనేవరో తెలిస్తే మీరు నన్ను అసహ్యించుకుంటారు. ఇలాంటి మనిషినా మనం కాపాడింది అని బాధపడతారు” లేచి కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.

“ఇంతకి ఎవరు మీరు”అడిగాడు శ్రీధర్ ఆసక్తిగా.

“ నేను ఈ ఇంటి యజమాని బాపీనీడుని. ఆరునెలలనుంచి మీరు అద్దె ఇవ్వటంలేదని గుమాస్తా చెప్పాడు. నాకు చాల కోపం వచ్చింది. మీ విషయం అటో ఇటో తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాను. మిమ్మల్ని ఖాళీ చేయించి ఈ ఇల్లు పడగొట్టించి పెద్ద భవనం కట్టుకుందామని అనుకున్నాను. అనుకోకుండా వర్షం రావటం నాకు చలిజ్వరం సోకటం అంతా దైవనిర్ణయం. అది రావటం ఒకందుకు మంచిదే అయింది. లేకపోతే మీ లాంటి మానవత్వం ఉన్న వాళ్ళను కలుసుకునే అవకాశం ఉండేది కాదు. వయస్సులో మీరు చిన్న వాళ్ళయినా మీ ముందు మాత్రం నేను అల్పుడిని.

“నాతో రండి. ఈ రోజుతో మీ కష్టాలు తీరిపోయాయి. నా కళ్ళు కూడా తెరుచుకున్నాయి.

నా కంపెనిలో మీకు మంచి ఉద్యోగం ఇస్తాను. మంచి కార్పోరేట్ హాస్పటల్ లో చేర్పించి నీ జబ్బుని నయం చేస్తాను” అన్నాడు బాపీనీడు.

బయట వర్షం వెలిసింది. ఆకాశంలో కారుమబ్బులు తొలగిపోయి స్వచ్ఛంగా ఉంది. బాపీనీడు మనస్సు కూడా అలాగే ఉంది.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు