మోడర్న్ వినాయకుడు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

modern vinaayakudu

వినాయకుడికి నిద్రపట్టక అటు ఇటు పొర్లుతున్నాడు.

"ఏమిటి నాయనా..నిద్రపట్టట్లేదా? వినాయక చవితి రాబోతోంది..పండగొచ్చిందటే నీకు అసలు విశ్రాంతి వుండదు. నిద్రపో నాయనా "
"లేదమ్మా..ఒక భక్తుడు అహర్నీశలూ..నన్ను స్తుతిస్తూ..ఒక విచిత్రమైన కోరిక కోరుతున్నాడు. అతని భక్తితో నన్ను తన వశం చేసుకుంటున్నాడు."

"కోరికా?..ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగింది.

"నేను చెప్పడమెందుకమ్మా? నువ్వే చూడు!" అని పైలోకం నుండి భూలోకం వైపు చూపుడు వేలు చూపించాడు.

"స్వామీ! నేను పుట్టి ఊహతెలిసినప్పటినుండీ నిన్ను పూజించడం తప్ప మరో దేవుడి గుడికి వెళ్ళడం కాని..పూజలు..వ్రతాలు చేయడంగాని చేయలేదు. నువ్వంటే అమితమైన భక్తి..ఇష్టం. కానీ గుజ్జు రూపంతో..పెద్ద పొట్టతో..ఇంతింత చెవులతో..దంతాలతో..మరీ ముఖ్యంగా తొండంతో ఎంత అంద వికారంగా వుంటావు? మీ అమ్మా..నాన్నా..అన్నయ్యలతో సహా మిగతా దేవుళ్ళంతా నల్లగా..ఎర్రగా ఎలా వున్నా ఎంత అందంగా వుంటారు?..ఈ విషయంలో నీ భక్తుడిగా నేను ఎంత ఆవేదన చెందుతున్నానో తెలుసా? విఘ్ననాయకుడిగా మళ్ళీ అందరి కష్టాలూ నువ్వే గట్టెంక్కించాలి. అందుకే..అందుకే నేను అకుంఠిత దీక్షతో ప్లాస్టిక్ సర్జరీ కోర్స్ చేసి అందులో నేను నిష్ణాతుడినయ్యాను. ప్రపంచం గర్వించే అతికొద్దిమంది ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్లలో నేనూ ఒకడిని..ఎంత పేరు తెచ్చుకున్నా..ఎంత పైకొచ్చినా మిమ్మల్ని చూసినప్పుడల్లా ఒకటే బాధ..నేను సదా కొలిచే నీకు ఏమీ చేయలేకపోయానని. అందుకే నాది ఒకే ఒక్క చిన్న విన్నపం. నీకు నేను ప్లాస్టిక్ సర్జరీ చేసి నీ తొండం తొలగించాలి..నీకు నా ప్రాణ స్నేహితుడైన డాక్టర్తో ఒబెసిటి ట్రీట్ మెంట్ ఇప్పించి నాజూగ్గా అందగాడిలా చేయాలి..మిగతా దేవుళ్ళంతా కుళ్ళుకోవాలి..దయచేసి నన్ను అనుగ్రహించు స్వామీ!" కళ్లనీళ్ళతో వినాయకుడి మందిరం ముందు కూర్చుని దీనాలాపన చేస్తున్నాడు డా||ఏకతొండం.

"అయ్యయ్యో..గణేశా..ఏమిటయ్యా నీ భక్తుడి ఆగడం..ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడా నీకు?..నేనొప్పుకోను..ఆ శస్త్రచికిత్స ఫలవంతం కాకపోతే ఇంకేమన్నా వుందా? అందుచేత ఈ భక్తుడు నీకు తగడు..నువ్వు అతని మాట వినకు.."అంది కోపంగా..

"అలాగంటే ఎలాగమ్మా?..నేను భక్తసులభుడిని అదీ నాన్నగారి జన్యువుల నుండీ సంప్రాప్తించింది. భక్తులని నిరాశకి గురిచెయ్యలేను..అతని కోరిక ఇప్పటిది కాదు..కానీ ఇప్పుడు మరీ తీవ్రతరం చేశాడు..అది నన్ను తెగ ఇబ్బంది పెడుతోంది అందుకే నిద్రపట్టట్లేదు.."అన్నాడు.
"అయ్యో..నీకెలా చెప్పనయ్యా..నువ్వంటే నాకు పంచప్రాణాలు. నీకేమన్నా అయితే ఈ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. అప్పుడొకసారి నీ చిన్నప్పుడు మీ నాన్న నీ తల నరికేస్తే, నేను ఏడ్చి పెడబొబ్బలు పెడితే ఏనుగు తలకాయ పెట్టి నిన్ను బ్రతికించి ఇచ్చాడు. అప్పుడొకసారి వినాయక చవితిరోజున చంద్రుడి దృష్టి సోకి నీ పొట్ట పగిలింది. అప్పుడూ నేనే మీ నాన్నని బ్రతిమాలి నిన్ను బ్రతికించుకున్నాను. ఆ చంద్రున్ని శపించాను. మీ నాన్న మహానుభావుడు అందరికీ భోళాశంకరుడే కానీ ఆయన మనకేం చెయ్యడు. అందుచేత నేను ఆ విపరీతానికి ఒప్పుకోనుగాక ఒప్పుకోను..ఆఁ!"అంది ఖరాఖండిగా.

భూలోకంలో..డా||ఏకతొండం ఇంట్లో-

"స్వామీ! ఈ భక్తపిపీలికాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వే నా మొర ఆలకించనప్పుడు ఇహ నేను బ్రతికేం ప్రయోజనం?..అందుకే అన్నం నీళ్ళు ముట్టక నువ్వు నా కోరిక తీర్చే వరకు ఇలాగే ఈ పూజా మందిరం వద్దనుండి కదలను.."అని కూర్చుండిపోయాడు.

"చూశావా అమ్మా..ఆ అలవిమాలిన భక్తి. భక్తులకే తలమాణికం ఇలాంటివాళ్ళు. తిండీ తిప్పలు మానేశాడు.. ఆసుపత్రికి వెళ్ళట్లేదు..అతని భక్తి ముందు నేను దాసోహం అనాల్సిందే!"

"ఈ భక్తులెక్కడ దొరికార్రా నాయనా నీకూ మీ నాన్నకి..ఆయన రాక్షసులకి వరాలిచ్చి ఇరుక్కుపోతే..నేను ఆ శ్రీహరిని శరణు కోరేదాన్ని..ఇప్పుడు నీ విషయంలో నేను ఎవరిని అడగాల్రో దేవుడో!"శోకాలు పెట్టింది గిరిపుత్రి.

"అవును విఘ్నేశా! అమ్మ భయంలో అర్ధం వుంది. రేపు ఆ మానవమాత్రుడి చేతిలో నీకేవన్నా జరగకూడనిది జరిగితే మీ అమ్మ నా మనశ్శాంతిని కరువుచేస్తుంది. నేను సృష్టి కార్యకలాపాలు వదిలి మన కుటుంబ సమస్యలో తలమునకలవ్వాలి. అందుచేత ఆ విపరీతాలన్నీ జరగకూడదనుకుంటే..నువ్వు అమ్మ మాట వినడమే శ్రేయస్కరం!"అనునయంగా చెప్పాడు శివుడు.

"నా తల్లిదండ్రులుగా మీ బాధని..భయాన్నీ అర్ధం చేసుకున్నాను. కానీ భగవంతుడికి భక్తుడేగా ప్రధానం! మనకి ఉనికినిచ్చేదే అతను..అలాంటప్పుడు వాళ్ళని అనుగ్రహించడంలోనే ఆనందం వుంటుంది. పైగా అతను తన స్వార్ధం కోసం వరమడగలేదు. ఈ వికృతుణ్ణి జగదేకమోహనుణ్ణి చేస్తానంటున్నాడు. నేను వెళ్ళాల్సిందే! నన్ను ఆశీర్వదించండి!"అని కొద్దిగా భారంగా వంగి వాళ్ళ కాళ్ళకి తన చేతుల్ని ఆనించే ప్రయత్నం చేశాడు.

ఆ ఆది దంపతులు చేసేదేంలేక దిగులుగా ఆశీర్వదించారు.

వినాయకుడు భూలోకంలోని డా||ఏకతొండం ఇంటికి బయల్దేరాడు.

"నాయనా ఏకతొండం"

వినాయకుడి విగ్రహంలోంచి మాటలు వినిపించే సరికి నీరసంగా కళ్ళు తెరిచాడు డా||ఏకతొండం.

మొదలు అది భ్రమేమో అనుకున్నాడు. కానీ విగ్రహం కళ్ళు కదలడంతో కన్ఫర్మ్ చేసుకుని ఒక్క ఉదుటున లేచాడు. అతనిలో కొత్త శక్తి చోటు చేసుకుంది. చిన్నప్పట్నుంచి చదివింది ఇంగ్లీష్ మీడియం అయినా..పాత పౌరాణిక సినిమాల్లో దేవుడు కనిపిస్తే భక్తుడు ఆగకుండా పద్యాలు..స్తోత్రాలు అనర్ఘళంగా పాడినట్టు పాడేశాడు. అంత పాండిత్యం తనకెలా ఆసువుగా వచ్చిందో అర్ధం కాలేదు.

"స్వామీ ఈ తమ భక్త పరమాణువుని అనుగ్రహించడానికి వేల యోజనాల దూరం నుండి వచ్చావా?" ఉద్వేగంగా అన్నాడు.

"తప్పదు కదా నాయనా..నీ భక్తితో నన్ను బంధించేశావు.. నన్ను శారీరకంగా అందంగా చేస్తానంటున్నావు.. నీ కోరిక తీర్చడానికే వచ్చాను. కానీ ఒక షరతు! త్వరలో వినాయక చవితి రాబోతోంది. అప్పటికి నన్ను పూర్తిగా ఆరోగ్యవంతుడ్ని చేయాలి. నేను భక్తుల పూజలు అందుకోవాలి కదా!"అన్నాడు.

"అలాగే స్వామీ! మీరు అనుగ్రహించారు అది చాలు. ఇప్పుడు వైద్యరంగం అనూహ్యమైన ప్రగతి సాధించింది. మందులు ఏ వ్యాధినైనా.. గాయాలనైనా త్వరితగతిన తగ్గించేస్తున్నాయి. మీకెందుకు నామీద భారం వేయండి. స్వామీ నాదో చిన్న కోరిక మీకు ఇలా ఆపరేషను చేస్తున్నానని పబ్లిసిటీ చేసుకుంటాను. అది మీ భక్తుడిగా నా వృద్ధికి సోపానమవుతుంది" అన్నాడు.

"తధాస్తు.."

వినాయకుడు భూలోకానికి ఆపరేషను కోసం వచ్చాడంటే ముందు ఎవరూ నమ్మలేదు. కానీ జీవం ఉట్టిపడే ఆ రూపం..ఆయన చూపించిన కొన్ని మహిమలూ చూసి జన సందోహం ఆయన నిజ వినాయకుడే అని నమ్మింది. అంతేకాదు ఆయన్ని తన భక్తితో లొంగదీసుకున్న డా||ఏకతొండంని ఆకాశానికెత్తింది.

హాస్పిటల్ ప్రాంగణమంతా మీడియాతో భక్తులతో కిట కిటలాడుతోంది. పైనుండి అమరులు..భూలోకవాసులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.ఆరోజు వినాయకుడు ఆపరేషన్ తర్వాత మొట్టమొదటిసారి బయటకి రాబోతున్నాడు. అందరిలో కుతూహలం.వినాయకుడు బయటకొచ్చాడు.

జీన్స్..టీ షర్ట్..లో గాగుల్స్ ధరించి మ్యాన్లీగా వున్నాడు. నిజంగా అద్భుతమే!కానీ ఎందుకనో ఎవ్వరూ ఆ రూపాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యుగ యుగాల్నుండి ‘వినాయకుడంటే ఇలా వుంటాడన్న’ రూపానికి ప్రతిరూపాన్ని తమ మనసులో ప్రతిష్టించుకోలేకపోతున్నారు. ఆ అందాన్ని తట్టుకోలేకపోతున్నారు. అది జెలసీతో మాత్రం కాదు.

దేవుళ్ళూ..మనుషులు నిరాశగా వెనుదిరిగాక వినాయకుడు"చూశావా భక్తా! నన్ను ఈ రూపంలో ఎవ్వరూ ఒప్పుకోవడంలేదు. తానొకటి తలిస్తే మరొకటి జరిగిందనడానికి ఇదే ఉదాహరణ. ఏం చేస్తాం. నేను వెళ్ళొస్తాను." అని అక్కడికి కొద్దిదూరంలో వున్న హనుమంతుడ్ని చూసి"ఏం హనుమా! కనీసం ఈ రూపాన్ని నువ్వన్నా ఒప్పుకున్నావన్నమాట"అన్నాడు ఆనందంగా.

"లేదు..మొదట నీ రూపాన్ని చూసి నా వాచిన మూతి సరిచేయించుకుని..వెనక తోక తీసేయించుకుందామనుకున్న మాట వస్తవం. కానీ నీ ఈ రూపం ఎందుకో నాకు నచ్చలేదు. అందం కాదు ప్రధానం..మనస్తత్వం. నీ మంచితనంతో నువ్వు భక్తులమనసుల్లో చోటుసంపాదించావు. అందుకే విఘ్నాలు లేకుండా చూస్తావని భక్తులు వినాయక చవితికి నవరాత్రుల పూజలు ఘనంగా చేస్తారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టుకున్నా ముందు నీకు పూజ చేస్తారు. ఇంకా నయం నేను కూడా శస్త్రచికిత్స చేయించుకున్నా కాదు."అని రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్ళిపోయాడు.

అంత అందంగా మారి కూడా విచారంగా కైలాశానికి వెళ్ళాడు.సంవత్సరం మొత్తం తయారుచేసిన వినాయకుడి విగ్రహాలు ఆ సంవత్సరం అమ్మూడవలేదు. వినాయకచవితి సరిగా జరగలేదు. ఉత్తరభారతంలో "గణపతి బప్పా మోరియా"వినిపించలేదు. దక్షిణంలో "ఓ బొజ్జ గణపయ్య.."చదవలేదు.

వినాయకుడికి బాధగా అనిపించింది. అతని బాధని చూడలేక ‘మళ్ళీ పూర్వరూపునొసగమని’ ప్రాణనాధుణ్ణి ప్రాధేయపడింది పార్వతి."చూడు పార్వతీ..అప్పుడంటే మనకేది కావాలంటే అలా చేసేసుకునేవాళ్ళం..కానీ ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. నేను మన కుటుంబం కోసం వరాల దుర్వినియోగం చేస్తే అదో స్కాం అవుతుంది. తర్వాత విచారణలూ..శిక్షలు. మనం ఎంతో నచ్చ చెప్పాం విన్నాడా? లేదు. వినాయకుడి మోడర్న్ రూపం ఇహ అంతే!"అని మాయమైపోయాడు.

"నాయనా..వినాయకా..లే వినాయక చవితి వచ్చేసింది..భక్తుల కోలాహలం ప్రారంభమైంది..నువ్వెళ్ళి అనుగ్రహించాలి.."తల్లి నిద్రలేపడంతో ఈ లోకానికి వచ్చి "ఓహ్! ఇదంతా కలా!"అని నిట్టూర్చి ‘డా||ఏకతొండం ఆలోచనని ఎలా ఏమార్చాలా?’ అన్న ఆలోచనలో పడిపోయాడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి