"ఏమండీ బాత్రూంలో వేణ్నీళ్ళు పెట్టాను. నెమ్మదిగా లేచి మీరు స్నానం చేసి వస్తే మనం బయలుదేరవచ్చు" అప్పుడే తలస్నానం చేసిన శైలజ తడిజుట్టును టవల్ తో తుడుచుకుంటూ అంది భర్త సంతోష్ తో.
బెడ్ మీద దిండుకు జారగిలబడి వీక్లీ తిరగేస్తూ కూర్చున్న సంతోష్ ఆ మాటతో చివ్వున తలెత్తి చూసి, " ఎక్కడికి ? " అనడిగాడు.
"అదేమిటండీ? అలా అడుగుతారూ? మీరు నిమజ్జనం లోగా కోలుకుని ఇంటికొస్తే వినాయకుడికి సహస్రనామార్చన చేయిస్తానని మొక్కుకున్నానని చెప్పాగా? " ఆశ్చర్యంగా అంది శైలజ.
" నేను రాను, నువ్వెళ్ళు" కోపంగా అనేసి మళ్ళీ పుస్తకంలో మొహం పెట్టాడు సంతోష్.
" దేవుడి పూజకి రానంటారేమిటండీ? అపచారం, అదీ వినాయకుడు, ఆగ్రహిస్తే ఇంకేమైనా ఉందా? " లెంపలేసుకుంది శైలజ.
" ఇంకేమైనా ఉండడమేమిటి శైలూ....? జరగాల్సిందంతా జరిగాక?" కోపం, బాధ కలగలిపిన భావం వ్యక్తమయింది అతడి గొంతులో.అతడి ఉద్దేశం అర్థమై దగ్గరగా వచ్చి, మంచం పక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ " ఏవండీ అంత ప్రమాదం నుండి మీరు ప్రాణాలతో బయటపడి ఇంత త్వరగా కోలుకోవడం అదృష్టం, ఆ దేవుడి దయ కాదా, అలాంటిది దేవుడి మీద అలిగి పూజకి రానంటారేం ? " అంది అనునయంగా." ఏమిటి శైలూ దేవుడి దయ? ఎప్పుడూ నేను తిరిగే రోడ్డు, ఎంతో జాగ్రత్తగా చేసే నా డ్రైవింగ్. ఎన్నడూ లేంది సరిగ్గా ఆ వినాయక మంటపం ముందే నాకు ఈ యాక్సిడెంట్ కావాలా, ఏంటీ విచిత్రం..??"
వారం క్రితం జరిగిన బైక్ యాక్సిడెంట్ తలుచుకుంటూ అన్నాడు సంతోష్.
సరిగ్గా వారం క్రితం... తెల్లారితే వినాయక చవితి..రాత్రి పదకొండయింది. పనులు ముగించుకొని బైక్ మీద తిరిగొస్తున్నాడు సంతోష్. ఇంకో ఐదు నిముషాల్లో ఇల్లు చేరబోతున్నాడనగా హై వే మీద స్లో గా బైక్ నడుపుతున్న సంతోష్ ని వెనకనుండి ఏదో గుర్తు తెలియని వెహికిల్ ఢీ కొట్టడంతో పక్కకి ఎగిరి పడిపోయాడు. సమయానికి అటుగా వెళ్తున్న అతడి ఫ్రెండ్ రవి సంతోష్ ని చూసి వెంటనే అంబులెన్స్ కి ఫొన్ చేయడం, హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది...అయిదారు రోజులు ట్రీట్ మెంట్ చేసి డిశ్చార్జ్ చేసారు. ...
శైలజ ఏదో అంబోయేంతలో కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా సంతోష్ ఫ్రెండ్ రవి నిల్చుని ఉన్నాడు. " ఓ , మీరా అన్నయ్యా, రండి " అంటూ చిరునవ్వుతో లోపలికి దారి తీసింది, శైలజ.
" కారు తీసుకుని వచ్చానమ్మా, వాడు రెడీ అయ్యాడా? " లోపలికొస్తూ అడిగాడు రవి
" ఆయన పూజకి రారటన్నయ్యా, తనకి యాక్సిడెంట్ చేయించాడని వినాయకుడి మీద అలిగాఋఅట..." చెప్పింది శైలజ.
" వినాయకుడు యాక్సిడెంట్ చేయించాడా, అదేంటి కొత్తగా?? " ఆశ్చర్యపోయాడు,రవి.
" అవున్రా, కాకపోతే మరేమిటి? ఎప్పుడూ లేంది, రోజూ తిరిగే రోడ్డు మీద, అదీ, వినాయక మంటపం ముందు నాకంత ఘోరం జరిగితే ఏ దేవుడు అడ్డుకున్నాడు? ఎందుకు దేవుడి పూజలు చెయ్యాలి? " మెల్లిగా బెడ్రూంలో నుంచి బయటకి వస్తూ అన్నాడు సంతోష్." వార్నీ, అదేం లాజిక్ రా నాయనా చెరువు మీద అలిగి, మొహం కడుక్కోవడం మానేశాడట, వెనకటికి నీలాంటివాడెవడో... మంటపం ముందు యాక్సిడెంట్ అయిందని, దేవుడి మీద కోపమేంట్రా? " సోఫాలో పేపర్ చేతులోకి తీసుకున్నాడు రవి..
" ఓకేరా, నీ అలక అలాగే కంటిన్యూ చెయ్యి దేవుడి మీద....కానీ, కాసేపటికోసం నాతో రండి, మీకో సాన్ చూపించాలి. " అంటూ భార్యాభర్తలిద్దర్నీ బయల్దేరదీశాడు రవి.
ముగ్గురూ రవి కార్లోనే స్టార్ట్ అయ్యారు. కారుని నౄగా తీసుకొచ్చి, సంతోష్ కి యాక్సిడెంట్ అయిన చోట ఆపాడు. " సంతోష్, నిన్ను వెనక నుండి వెహికలేదో డాష్ కొట్టిన తర్వాత నువ్వు ఎక్కడ పడిపోయావో ఏమైనా గుర్తుందా? " అనడిగాడు సంతోష్ ని...
" లేదురా మళ్ళీ నాకు స్పృహ వచ్చింది హాస్పిటల్లోనే కదా? " గుర్తు చేసుకున్నాడు సంతోష్.
" కదా, నేను చెబుతా, విను, తెల్లారితే వినాయక చవితి. కాబట్టి, నేల కొంత చదును చేసి, మంటపం వేశారు ఇక్కడి బస్తీ కుర్రాళ్ళు. పైనుంచి కప్పడానికి తెచ్చిన టార్పాలిన్ షీట్ అందులో ఉంది. బహుశ అప్పటిదాకా పని చేసిన కుర్రాళ్ళు అవన్నీ ఎక్కడివక్కడ పెట్టేసి ఇళ్ళకు వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు ఎగిరి నేరుగా దుప్పటిలా ఉన్న టార్పాలిన్ మీద పడిపోయావ్. లైట్ వెలుతురులో స్పష్టంగా కనపడేలా. ఒక్కసారి ఊహించు, అక్కడ ఆ మంటపమే లేకపోతే, హై వే పక్కన ఎంత లోయ ఉందో చూడు, అందులోకి పడిపోతే కనిపించడం కాదు కదా, కనీసం అరిచినా ఆ రాత్రి రోడ్డు మీదపోయేవాళ్ళకు వినిపించదు. ఏమంటావ్? " అంటూ వివరంగా చెప్పాడు రవి. కారు దిగి పరిసరాలన్నీ గమనించిన సంతోష్ కి రవి చెప్పినట్టిగా జరిగి వుంటే, ఎలా ఉండేదన్న ఊహకే ఒళ్ళు జలదరించింది. లోయలోకి పడిపోవాల్సిన తనను బొజ్జ గణపయ్యే తన తొండంతో ఆపి టార్పాలిన్ లో మెల్లిగా జారవిడిచినట్లనిపించింది. అతడి చేతులు అప్రయత్నంగా ఒక్కటై వినాయకుడికి నమస్కరించాయి. అతడి భుజం మీద చేయి వేసి రవి, " చూడు సంతోష్, పాతదే అయినా ఒక సామెత చెబుతా విను. ఒక గ్లాసులో సగం నీళ్ళుంటే ఆశా, నిరాశావాదుల వెర్షన్స్ వేరువేరుగా ఎలా ఉంటాయో ఇదీ అంతే, పది దెబ్బలు తగిలిన వాడు పదకొండో దెబ్బ నుండి రక్షించావని దేవుడికి దండం పెట్టుకోవచ్చు, పది దెబ్బలతో బాధ అనేది తెలిసేలా చేసావని దేవిడుకి కృతజ్ఞుడై ఉండనూ వచ్చు. పది దెబ్బలు తగులుతూంటే, ఆపలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోనూవచ్చు. కానీ, ఏదైనా కర్మ ఫలాన్నీ, ప్రాప్తాన్నీ అనుసరించే జరుగుతాయని మర్చిపోవద్దు. పద, ఇంటికెళ్ళి, తమరు స్నానం కానిస్తే, తీసుకొచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేయిస్తాను...." అంటూ కారు స్టార్ట్ చేసాడు రవి.