పునరపి - ఆకెళ్ళ శివప్రసాద్

Punarapi

పిరి ఆడటంలేదు.

గాలి కోసం ఊపిరితిత్తులు ఎగిరెగిరి పడుతున్నాయి.

కిటికీ తలుపు తీసాను ...

గాలి తెమ్మెర అలలా వచ్చినట్టు .... అర క్షణమే .. ఆ అనుభూతి ...
మరుక్షణం గాలికి శిక్ష వేసినట్టు ...
భరించలేని దుర్గంధం ...

ఆ కారణం వల్లే ఫ్యాన్ వేసుకున్నా, ఇబ్బంది పడుతున్నా కిటికీలు తీయం !

ఎవరో పరిశ్రమ వాడు గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి విష వాయువులు వదిలేస్తున్నాడు .

ఎవరికి ఫిర్యాదు చెయ్యాలి ?...

ప్రకృతి పట్ల మర్యాద లేకపోయినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేసి ఏమి లాభం ?

ఇల్లు విడిచి బయటకి నడిచాను..

పొగ వదుల్తూ వేగంగా కార్లు వెళ్తున్నాయి - పెట్రోల్ , డీజిల్ వాసన విరజిమ్ముతూ ...

గాలి ..... గాలి కోసం గాలింపు ...

హాలాహలం మింగేసినట్టుంది గాలి ...

పరిశ్రమ వాసనలు ...

నాలుగు రోజుల క్రితం - కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. పరీక్ష చేసి ఫుడ్ పాయిజన్ అన్నాడు.

ఐదు నక్షత్రాల హోటల్లో భోజనం చేస్తే - ఫుడ్ పాయిజనా ?

'ఇందు గలడందు లేడని సందేహం వలదు' కాంతి వెళ్ళని చోటుకి సైతం కాలుష్యం వెళ్ళిపోయింది. అని దగ్గాడు. డాక్టర్ గారికి గిరాకీ కోసం సెంటర్లో పెడితే దుమ్ము, ధూళి వల్ల దగ్గు చుట్టుకుంది.

'కానీ .... ' ఏదో చెప్పబోతుంటే -

'నీళ్ళు తాగారా ? ' డాక్టర్ అడిగాడు అదో తప్పయినట్టు ...

'మినరల్ వాటర్ ... '

అనుభవజ్ఞుడైన రోగిలా నవ్వాడు డాక్టర్ .

మినరల్ వాటర్ ఇంకోటని లేదు ... నీళ్ళు తాగితే క్రిములను పంపినట్లే ... గట్టిగా నవ్వి, నవ్వు లోంచి దగ్గులోకి జారుకుని విమర్శించిన నీళ్ళనే తాగాడు.

వెంటనే, ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఓ పెద్దాయిన ఇంట్లో మినరల్ వాటర్ తాగి అనారోగ్యం పాలైన సంగతి గుర్తొచ్చింది.

'ప్రాణాయామం ... ' నేను అడిగే లోపే -

సిటీ లో వున్న వాయువుని పీలిస్తే ప్రాణాయామం కాదు ... ప్రాణాపాయం అవుతుంది. అని చర్మ రోగానికి మందు రాసుకుంటూ - మేము మీలాంటి వాళ్ళమే ... అని సర్దిచెప్పి - మందులు రాసి - 'హాయిగా పడుకోండి' అన్నాడు.

ఇదిగో ... నిద్ర పట్టక ఇలా రోడ్డున పడ్డాను !!

మర్నాడు ...

నిరంతర వార్తా వాహినిలా ప్రవహిస్తున్న ముక్కుని తుడుచుకుంటున్న డాక్టర్ దగ్గరికి వెళ్లి -

మందులు పనిచెయ్యలేదు .... నిద్ర రాలేదు ....

మందులు కూడా కాలుష్యం బారిన పడి కల్తీ అయ్యాయేమో.... హచ్చ్ మంటూ పెద్దగా తుమ్మేస్తూ అనేసాడు.

'మరెలా?'

'మీదేవూరు ....?'

మా పల్లె పేరు చెప్పాను.

'వెరీ గుడ్ ... ' అని ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అందుకుని - 'పల్లెకు వెళ్లి ... స్వచ్చమైన గాలి పీల్చి, నీటిని తాగి ఆరోగ్య వంతులు కండి... ' అని రాసి 'ఇంతకుముందు ఎలా వున్నా ... ఇప్పుడు సగం రోగాలకి కారణం కాలుష్యమే ... ' ఖండితంగా చెప్పేసాడు ప్రిస్క్రిప్షన్ అందిస్తూ !! నాకు ఆనందం, ఆశ్చర్యం కలిగాయి !

ఎప్పట్నుంచో మావూరు తీసుకెళ్ళమని పిల్లలు అడుగుతున్నారు.
ఎప్పుడూ ఏదో హడావుడి.
ఈసారి డాక్టర్ సలహా మేరకు వెళ్ళాల్సి వస్తోంది కనుక సకుటుంబంగా బయలుదేరాము.
మా పల్లె-
అందమైనది. పచ్చదనం..పెద్ద చెరువు, పూలచెట్లు, మా ముత్తాత ఆ వూరు రావడానికి కారణం.
ఇప్పటికీ మావాళ్ళు ఆ విషయం గొప్పగా చెప్పుకుంటారు.
"సాంబయ్య తాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా బీడునేల...వ్యవసాయం చేయడానికి వచ్చారు. అన్నీ రాళ్ళు,రప్పలు...అంతా బీడు. చాలారోజులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరకి విరక్తి కలిగి విసిగి అక్కడినించి వెళ్ళిపోదామనుకున్నారు. కానీ ఏదో చిన్న ఆశ. నీరు పడితే, నీటి ప్రయత్నాలు ఫలించలేదు రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు "మనసారా ఏడిస్తే దేవుడే కనబడతాడు."అని ఓ పెద్దాయన సాంబయ్య తాతకి చెప్తే ఆయన ఆ నేల మీదకి ఒదిగిపోయి ఏం చేయలేని స్థితిలో కన్నీళ్ళు కార్చాడట. అలా ఎన్ని పగళ్ళు,ఎన్ని రాత్రుల్లో గడిచాక అక్కడ ఓ మొక్క చాలా చిన్నది మూడు ఆకులతో సన్నగా తీగలా భూమిలోంచి పైకి వచ్చిందట. అంటే, ఆ చిన్ని మొక్క యిచ్చిన మొక్కవోని ధైర్యం అక్కడ వూరు రావడానికి కారణం అయినాది. ఒక యిల్లు..రెండు యిళ్ళు..అలా...అలా పంటలు..పక్షులు...పచ్చదనం...సాంబయ్య గట్టు యిప్పటికీ వుంది మా వూరు చెరువు గట్టున..."ఉత్సాహంగా చెప్తుంటే మా ఆవిడ , పిల్లలు వుత్సాహంగా విన్నారు. ఆ మర్నాడే మా ప్రయాణం.
"చెరువు దగ్గరికి వెళ్దాం" వూళ్ళోకి దిగిన వెంటనే మా కార్తీక్ అడిగాడు.
"...వెళ్ళాల్సిందే...." అమ్మాయి కౌశిక హుకుం జారీ చేసింది.
యిద్దరికీ దారిలో చిన్నప్పుడు చెరువులో ఈదులాడిన విషయం చెప్పాను. ఆ రోజుల్లో, చెరువులో ఈదులాటల్లో తేలిపోయేవాళ్ళం.
"స్నానం చేశాక చెరువుకి వెళ్దాం..." మా బాబాయ్ కొడుకు సూరిబాబు అన్నాడు.
"చెరువులోనే స్నానం.." ఇద్దరు పిల్లలు ఒకేసారి అన్నారు.
"...వద్దురా..." బ్రతిమాలుతున్నట్టు అన్నాడు సూరిబాబు.
ససేమిరా అన్నారు పిల్లలు.
తప్పక కదిలాము.
చెరువు అంత దూరం లో ఉండగానే ముక్కుపుటాలు బద్ధలయ్యే పరిస్థితి. అపరిశుభ్రంగా వుందక్కడ.
పిల్లలు నిరాశగా చూశారు. స్నానానికి బయలుదేరినవాళ్ళు భయపడ్తూ ఆగిపోయారు.
"సాంబయ్య గట్టు అదిగో..."ఉద్వేగం ఆపుకోలేక వాళ్ళ దృష్టి మరల్చే ప్రయత్నంలో అరిచాను.
సాంబయ్య గట్టు పగిలి శిధిలావస్థలో ఉంది. చుట్టు ఎండుటాకులు..పిచ్చిమొక్కలు.
గట్టుని చూసినా పిల్లల్లో ఉత్సాహం కలగలేదు. కానీ తప్పక కాసేపు అక్కడ వున్నారు.
సాయంత్రం ఆరు గంటలప్పుడు మావాడు అడిగాడు.
"పోనీ పక్షులనేనా చూద్దామా?"అని.
మావూరు దగ్గరున్న కొల్లేరుకి పక్షులు వలసకి రావడం వాటితో మేం గడిపిన విషయం గొప్పగా చెప్పాను. అది గుర్తుకు వచ్చి అడిగారు.
నేను మాట్లాడే లోపు సూరిబాబు యింటి లోపలికి వెళ్ళి "సలీం ఆరీ" పుస్తకం తీసుకొచ్చి

"ఇందులో బోలెడు పక్షులు వున్నాయి..." అన్నాడు..
"ఇందులోనా" పుస్తకం అనాసక్తిగా తీసుకున్నారు.
"వాతావరణం లో మార్పుల వల్ల, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం వల్ల వలస పక్షులు రావడం లేదు."
"వాతావరణం లో మార్పా?..అయినా ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం జరుగుతుంటే, పక్షుల్ని చంపేస్తున్నారా?"
"ఆ...సైనికులు చక్కగా లాగించేస్తున్నారు."
కర్ణుడి చావుకి కారణాలు సవాలక్ష వున్నట్టు..పక్షులు అంతరించి పోవడానికి చాలా కారణాలు వున్నాయిలే..."
ఆ సాయంత్రం పక్షుల పుస్తకం తోనే పిల్లలు గడిపారు.!!
పిల్లలకి చక్కటి నీళ్ళున్న చెరువుని-
కువకువలు వినిపించే పక్షులని-
కాలుష్య ఛాయలు కనిపించని వూళ్ళని చూపెట్టలేక పోయాను.
ఈ వూరిలా మారిపోయింది-
ఉదయం అయితే చాలా వాహనాల మోతతో మారుమోగిపోతోంది.-
చెరువు దగ్గరికెళ్తేనే జబ్బులు వచ్చే పరిస్థితి. -
పక్షుల జాడే లేదు.-!
పల్లె, పట్నం తేడా లేకుండా నరకప్రాయమైపోయాయి.
***************
నిద్రపట్టక లేచాను.
యధాలాపంగా పక్కనే పడుకున్న పిల్లల కోసం చూశాను.
యిద్దరూ కనిపించలేదు.
ఈ వూళ్ళో ఎక్కడికి వెళ్ళివుంటారు?
సూరిబాబు,నేను టార్చిలైటు వేసుకుని పిల్లల్ని వెతుక్కుంతూ వెళ్ళాము.
ఆ వీధిలో కనిపించలేదు.
పక్క వీధికి వెళ్ళాము.
అక్కడా లేరు.
చెరువుగట్టుకి చేరాము. ఊహూ...
ఎక్కడికి వెళ్ళినట్టు?
కాసేపు అక్కడే ఆగాము.
మెల్లగా ఆ నిశిలో ఎవరో ఏడుస్తున్న శబ్దం...
అటుగా చూశాము. కాస్త దూరంగా సాంబయ్య గట్టు దగ్గర మా యిద్దరు పిల్లలు వినయంగా నిలబడి, కనిపించని దేవుళ్ళకి దండం పెడ్తూ "మనసారా"ఏడుస్తున్నారు.మురికి కాలువగా మారిన చెరువు కోసం, ఋతువులని గుర్తు చేస్తూ వచ్చే వలస పక్షుల కోసం.....

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి