ప్రక్షాళన - రాజేష్ యాళ్ళ

prakshalana

న్యూయార్క్ నగరంలో ఓ ఆకాశహర్మ్యంలో... ముప్ఫై ఎనిమిదో అంతస్థులోని ఒక ఫ్లాట్ కాలింగ్ బెల్ మ్రోగింది. క్లోజ్డ్ సర్క్యూట్ టీవీల్ లో కనిపిస్తున్న ఆమె భర్తను చూడగానే విషణ్ణవదనంతో ఒంటరిగా లోపల కూర్చున్న మహతికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఉత్సాహంగా వెళ్ళి తలుపు తీసింది.

"వచ్చావా శశీ... గంట సేపటినుండి నీ కోసం చూస్తున్నా!" చిరునవ్వుతో దర్శనమిచ్చిన ఆమె ముఖం మరుక్షణంలోనే వాడిపోవడంతొ గాభారాగా చూసాడు శశాంక్.

"ఏమైంది మహతీ, ఎందుకంత విచారంగా ఉన్నావ్? ఎందుకంత పరుగు పెట్టి రావడం? చూడు ఎలా ఆయాస పడుతున్నావో! వట్టి మనిషివి కూడా కాదు కదా నువ్వు, నిదానంగా వచ్చి తలుపు తీయొచ్చు కదా?!" అనునయంగా చెప్పాడు శశాంక్.

"సర్లే కానీ ముందు నన్నీ విషయం చెప్పనీ శశీ! మధ్యాహ్నం నుండీ నీకు చెప్దామంటే మీ ఆఫీసులో ఫోన్ మాట్లాడనివ్వరు..."

"సరే, అంత అర్జెంటుగా చెప్పాల్సిన విషయమేంటో చెప్పేసెయ్ ముందు?"

"మధ్యాహ్నం మా అమ్మ ఫోన్ చేసింది శశీ..." అలా చెప్తూండగానే గుండ్రని మహతి కన్నుల్లో గిర్రు గిర్రుమంటూ నీళ్ళు తిరిగిపోయాయి.
"ఏమయిందిరా? ముందు ఏడుపాపు!" వరద గోదారిలా పొంగుతున్న కన్నీటిని తుడుస్తూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ పొదివి పట్టుకున్నాడు శశాంక్.

"అమ్మకు రావడం కుదరదట! ఇప్పుడు కుదరదంటే అసలేమైనా అర్థముందంటావా?" రుద్ధకంఠంతో ఆక్రోశించింది మహతి.

"తనకు వీలు కాలేదేమోలే."

"వీలు కాదా?! ఎలాగోలా వీలు చేసుకోకపోతే ఎలా చెప్పు? కూతురు కానుపుకు కూడా సాయపడకపోతే 'అమ్మ ' పదానికి అర్థం ఉందంటావా ?" ఆవేశంగా అడిగింది మహతి.

"అసలు నీకు నేను ముందే చెప్పాను. ఇక్కడ అన్ని అధునాతన సౌకర్యాలూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఇండియానుండి మన కోసం శ్రమ పడి ఎవరూ రావక్కరలేదని. వాళ్ళకు కూడా ఈ వయసులో ఇంత కష్టపడి అంత దూరాన్నుండి రావాలంటే కష్టమే కదా మహతీ?" సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు శశాంక్.

"కూతురు ఏడోనెల కడుపుతో ఉందని, ఆ కడుపులో ఇద్దరు కవలలు పెరుగుతున్నారని తెలిసి కూడా రాలేనని చెప్పిన తల్లిని నువ్వేం సమర్థించనవసరం లేదు!" పౌరుషంగా చెప్పింది మహతి.

"బాధపడకు మహతీ, నేను ఫోన్ చేసి విషయం కనుక్కుంటానులే!"

"ఏమీ అక్కరలేదు. నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ మనకన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనమే మన తంటాలు పడదాం. అంతగా అవసరమైతే ఇక్కడ మన స్నేహితుల సాయం తీసుకుందాం. అంత దూరాన్నుండి వచ్చి ఎవరూ మనల్ని ఉద్ధరించాల్సిన పని లేదు!" రోషంగా చెప్పింది మహతి.

"సరే, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు నువ్వు కాసేపు పడుకో." మహతి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాడు శశాంక్. మౌనంగా అతనితో పాటు నడిచింది మహతి.

రెండురోజుల తర్వాత ఓ రాత్రి భోజనం చేస్తూండగా భార్యతో చెప్పాడు శశాంక్, " వచ్చే ఆదివారం మా అమ్మ ఇక్కడికి వస్తోంది."

నోట్లో పెట్టుకోబోతున్న ముద్దను చేత్తో పట్టుకుని అలానే ఉండిపోయింది మహతి. కొద్ది క్షణాల తర్వాత చెప్పింది- "నిజమా శశాంక్?! కానీ నువ్ ఫోన్ చేసి ఆవిడను పిలిచినట్టున్నావ్ కదూ? ఎందుకు శశాంక్, ఆవిడకు మాత్రం శ్రమ కాదా? అయినా ఇంకెవర్నీ ఇండియానుండి ఇక్కడకు పిలవొద్దనీ, మన బాధలేవో మనమే పడదామని మొన్నేగా అనుకున్నాం?"

"అనుకున్నాం కానీ ఈ దేశం కాని దేశంలో నీకు ఇలాంటి పరిస్థితిలో ఓ పెద్ద దిక్కు సాయంగా ఉంటేనే మంచిదని నాకు అనిపించింది. అమ్మను రమ్మని నేనే ఫోన్ చేసి చెప్దామనుకున్నాను కానీ ఈలోగా నాన్నే అమ్మను పంపిస్తున్నట్టుగా ఫోన్ చేసి చెప్పారు. కాగల కార్యాన్ని గంధర్వులే నెరవేర్చినట్టుగా అలా మన పని తేలికయింది." సంతోషంగా చెప్పాడు శశాంక్.

"ఏమో శశాంక్! అంత దూరం నుండి అత్తయ్యను రప్పించడం, ఆవిడ చేత పనులు చేయించుకోవడం ఊహించుకోవడానికే నాకు ఇబ్బందిగా ఉంది." బెదురు చూపులతో చెప్పింది మహతి.

"మనం పూర్తిగా అమ్మ పైనే అన్నిటికీ ఆధారపడిపోము కదా. నేనూ సాయముంటానులే. కంగారు పడిపోకు మహతీ." ధైర్యం చెప్పాదు శశాంక్.

ఆదివారం రానే వచ్చింది. శశాంక్ ఎయిర్ పోర్టుకు వెళ్ళి తల్లి కౌసల్యను తీసుకువచ్చాడు.

"నమస్తే అత్తయ్యా! బావున్నారా?" రెండు చేతులూ జోడించింది మహతి.

"నమస్తే మహతీ, ఎలా ఉన్నావురా?! అక్కడికి రమ్మంటే వచ్చావు కాదు. డాక్టర్ చెప్పినట్టుగా మందులన్నీ వేసుకుంటున్నావ్ కదా?! అయినా ఇక భయం లేదులే, నేను దగ్గరుండి నీ చేత మింగిస్తాను కదా!" అని చెప్పి నవ్వింది కౌసల్య.

"కొంచెం కాఫీ తాగి స్నానం చేద్దురుగాని అత్తయ్యా, కూర్చోండి." అని చెప్పి వంటగది వైపు నడవబోయింది మహతి.

ఆమె దారికి అడ్డంగా వెళ్ళి వెనక్కి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెడుతూ చెప్పింది కౌసల్య, "కాఫీ నేను కలుపుకోగలను. నువ్వు నాకు సేవలేమీ చెయ్యనక్కరలేదు. సాయపడాల్సింది నేను! నేను వచ్చిన పని కూడా అదే."

బదులేమీ చెప్పకుండా అత్తగారి వైపు కృతజ్ఞతగా చూసింది మహతి.

"ఇదేం పెద్ద కష్టం కాదు కానీ తీసుకోండి!" అంటూ ట్రేలో మూడు కాఫీ కప్పులతో శశాంక్ రావడంతో ముగ్గురూ హాయిగా నవ్వుకున్నారు.మరో రెండు నెలల కాలం చకచకా గడిచిపోయింది. అత్తగారు రావడంతో, భర్త చేదోడువాదోడుగా ఉండడంతో చక్కని విశ్రాంతి దొరికిన మహతికి ఒకరోజు చూడముచ్చటగా ఉన్న బాబు, పాప పుట్టారు.

పొత్తిళ్ళలోని పిల్లలిద్దరినీ చూసి ఎంతగానో మురిసిపోయింది కౌసల్య. "ఒకేసారి కవలల్ని కనేసి ఒక పనయిపోయింది అనిపించావ్ మహతీ! ఎంత ముద్దుగా ఉన్నారో నా మనవడూ, మనవరాలూ!" మహతి జుత్తును ప్రేమగా సవరిస్తూ సంతోషంగా చెప్పింది కౌసల్య.పిల్లద్దరినీ దగ్గరగా వాళ్ళ ముఖాల్లో తన ముఖం పెట్టి చూస్తూ సంతోషంలో మునిగిపోయాడు శశాంక్.

అంతా అమితానందంగా ఉన్న ఆ క్షణాల్లో అకస్మాత్తుగా కౌసల్య ఫోన్ మ్రోగింది. మొబైల్ తీసుకుని, "ఇప్పుడే వస్తాను" అని వాళ్ళిద్దరికీ చెప్పి అవతలకు వెళ్ళింది కౌసల్య.

"ఆ వదినా! కాసేపటి క్రితమే డెలివరీ అయింది. ముందుగా తెలిసిన విధంగానే కవలపిల్లలు - బాబు, పాప! చాలా ముద్దొస్తున్నారు వదినా! మహతికేం, భేషుగ్గా ఉంది, గాభరా ఏమీ లేదు! అదేం మాట, నేనొచ్చానుగా, మీరు రాలేకపోయానని బాధ పడకండి. అన్నట్టు మీ కోడలెలా ఉంది? పాపం తను పగవాళ్ళకు కూడా రాకూడనంత దు:ఖంలో ఉంది. పైగా అయిదో నెల! జాగ్రత్తగా చూసుకోండి. మహతి గురించి భయం లేదు, నేను తర్వాత ఫోన్ చేయిస్తాలెండి. ముందు మీరు కోడలిని జాగ్రత్తగా చూసుకోండి. ఏక్సిడెంట్లో కన్నవాళ్ళిద్దరినీ ఒకేసారి పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు ఆ అమ్మాయి..." ఫోన్లో కౌసల్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి.

గది బైటకు వెళ్ళినా బిగ్గరగా మాట్లాడుతున్న అత్తగారి మాటలు వింటున్న మహతి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. పశ్చాత్తాపంతొ ఆమె మనసు, పక్కనే ఉన్న పసిపాపలంత స్వఛ్ఛంగా ప్రక్షాళన అవుతోంది!!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు