వివేకుడి తెలివి - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

vivekudi telivi

ఉద్దానం గ్రామoలో ఉండే వివేకుడు ఒక రైతు. తనకున్న పొలంలో పంటలు పండించేవాడు. అతడికి అక్షరాస్యుడు అవడం వల్ల మంచి గ్రంధాలు చదివేవాడు. పొలం పని అయిన తర్వాత ఏదో ఒక గ్రంధo చదువుతూ గడిపేవాడు. అతడికి ఇరుగుపొరుగుల్లో ఉండేవారు రంగడు, సోముడు. వాళ్ళు వేరే వృత్తుల్లో స్థిరపడ్డారు. కాని వాళ్ళిద్దరూ వివేకుడుకి మంచి మిత్రులు. వారికి చదువు రానందున ఖాళీ సమయాల్లో వూరు బయటున్న మర్రిచెట్టు కింద కూర్చుని జూదమాడేవారు. అది తప్పని చాలాసార్లు చెప్పాడు వివేకుడు. కానీ వాళ్ళు వినిపించు కోలేదు.

వాళ్ళిద్దరూ వివేకుడిని చూసినప్పుడల్లా ‘నువ్వెప్పుడు చూసినా పుస్తకం చదువుతూ కనిపిస్తావు. అలాగని నువ్వేమైనా రాజకొలువులో నౌకరీ చెయ్యడానికి వెళ్తావా? ఇక్కడే పొలం దున్నుకుని బ్రతికేదానికి చదువెందుకు?’ అనేవారు.

దానికి వివేకుడు బాధపడకుండా “పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. తెలియని విషయాలు తెలుస్తాయి. మెదడు చురుకుగా ఆలోచిస్తుంది. అందుకే ఖాళీ సమయాన్ని వృధా చెయ్యకుండా గ్రంథపఠనo చేస్తాను. కానీ మీరు చేస్తున్న పనివల్ల చెడు తలపులు వస్తాయి. ధనం వృధా అవుతుంది” అనేవాడు. వివేకుడి మాటలకి చుట్టూ ఉండే జూదగాళ్ళందరూ ఎగతాళిగా నవ్వి “మన వూరికి వచ్చాడు కొత్త పండితుడు. చెబుతున్నాడు శాస్త్ర విషయాలు” అనేవారు.

ఒకసారి వివేకుడి ఇంటికి పొరుగూరు నుండి చిన్ననాటి మిత్రుడు సురభయ్య వచ్చాడు. తనకి చాలా కాలం తర్వాత కలిగిన కుమారుడి పుట్టిన రోజు వేడుక జరుపుతున్నానని ఆహ్వానం పలికాడు. రంగడికీ, సోముడుకీ కూడా పాతమిత్రుడే కావడంతో వారినీ ఆహ్వానిoచాడు. ఆ రోజు రానే వచ్చింది. మిత్రులు ముగ్గురూ ఉదయాన్నే బయల్దేరారు.

సురభయ్య కొడుకు కోసం మిఠాయిలు కొన్నాడు వివేకుడు. మిగతా ఇద్దరూ ఖాళీ చేతులతో వెళ్ళారు. అక్కడకి వచ్చిన వాళ్ళు కూడా నూతన వస్త్రాలు, ఆటబొమ్మలు, తీపి పదార్ధాలు తెచ్చారు. రంగడు, సోముడు ఏమీ తీసుకెళ్లనందుకు మనసులో బాధ పడ్డారు. సురభయ్య కుమారుడిని ఆశీర్వదించి భోజనం చేసి బయల్దేరారు ముగ్గురూ.

వారు తిరిగి వస్తున్నప్పుడు దారిలో కాళికాదేవి ఆలయం కనబడింది. దర్శనం చేసుకుందామనుకున్నారు ముగ్గురూ. గుడి ముందరే ఉన్న దుకాణంలో పువ్వులదండ కొన్నాడు వివేకుడు. పూజారి చేతికి దండ ఇచ్చి కాళికాదేవి మెడలో వెయ్యమన్నాడు. అతనితో వచ్చిన మిత్రులిద్దరూ మనసులోనే దేవికి నమస్కారం పెట్టుకున్నారు. తాము కూడా దేవికి ఏదైనా కొనాల్సిందని అనుకున్నారు.

గుడి నుండి బయటకు రాగానే ఎదురుగా పెంచలయ్య అనే వ్యక్తి ఎదురయ్యాడు. అతడిదీ వివేకుడి ఊరే. వివేకుడుని చూడగానే “నీ కోసం మీ ఇంటికి వెళ్లాను. నువ్వు ఈ వూరు వచ్చావని చెప్పారు. ఈ ఊరులో ఉన్న మీ దూరపు చుట్టం విలోచనుడుకి పనివాడు కావాలని తెలిసింది. అతడు వయసులోనే కాక హోదాలోనూ పెద్దవాడు. అలాంటివాడు నీ మాట వింటాడని నమ్మకంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను.

ఒక్కసారి ఆయనతో మాట్లాడి ఒప్పించేవంటే అక్కడ పని దొరుకుతుంది. చాల ఇబ్బందుల్లో ఉన్నాను. పుణ్యం కట్టుకో” అని బ్రతిమలాడాడు.
వివేకుడు కాసేపు ఆలోచించి “సరే. ఇప్పుడే వెళదాము” అని మాట ఇచ్చాడు. వెంటనే దగ్గరిలోని పండ్ల దుకాణానికి వెళ్లి డజను అరటి పండ్లు, అరడజను బత్తాయి పండ్లు కొన్నాడు. వాటిని గావంచాలో మూట గట్టాడు.

అక్కడ నుండి విలోచనుడి ఇంటికి అందరూ వెళ్ళారు. విలోచనుడికి నమస్కరించి పండ్ల మూట విప్పి అతని ముందు పెట్టాడు వివేకుడు. వారి రాకకు సంతోషించి కుశలము లడిగాడు విలోచనుడు.వారికి తినడానికి అల్పాహారం తెప్పించాడు. తరువాత వచ్చిన పని చెప్పమన్నాడు విలోచనుడు.అప్పుడు తనతో వచ్చిన పెంచలయ్యని చూపించి అసలు విషయం చెప్పాడు వివేకుడు.వివేకుడు గురించి బాగా తెలిసిన విలోచనుడు అతడు చెప్పినట్టుగానే పెంచాలయ్యను పనిలో పెట్టుకున్నాడు. పెంచలయ్యని అక్కడ వదిలేసి ముగ్గురూ ఇంటికి బయల్దేరారు.
దారిలో నడుస్తున్నప్పుడు అలసట తెలియకుండా మంచి కథలు చెప్పాడు వివేకుడు. ఎంతకీ దూరం తరగడం లేదని అనుకున్నారు ముగ్గురూ. అలా నడుస్తుండగా దారి ప్రక్కన మర్రిచెట్టు, దాని పక్కనే ఒక కొలను కనిపించాయి. అది చూసి దాహంగా ఉందని, నీరు తాగాలని చెప్పాడు రంగడు. ముగ్గురూ వెళ్లి దాహం తీర్చుకుని , చెట్టు నీడలో విశ్రాంతి కోసం కూర్చున్నారు.

ఏవో మాటలు చెబుతూ రంగడు “మనం ఈ రోజు మూడు చోట్లకి వెళ్ళాము. మొదటిది సురభయ్య కొడుకు పుట్టినరోజు వేడుక. అక్కడకి మిఠాయిలు తెచ్చావు. తరువాత గుడికి వెళ్ళాము. అమ్మవారికి పువ్వులమాల ఇచ్చావు. చివరగా విలోచనుడనే పెద్దమనిషిని కలిసాము. అక్కడ పండ్లు ఇచ్చావు. ఎ సందర్భంలో ఏమి ఇవ్వాలో నీకు ఎలా తెలిసింది? మాకు అలాంటి విషయాలు తెలియవు. అందుకే ఏమీ కొనకుండా ఒట్టి చేతులతో వచ్చాము” అని బాధ పడ్డాడు.

సోముడు కూడా ఆ మాటలు వినగానే ‘రంగడికి వచ్చిన సందేహం నాకూ వచ్చింది. ఇవన్నీ నీకెవరు నేర్పారు? నువ్వు చెబుతుంటే తెలుసుకోవాలని ఉంది” అని బ్రతిమలాడాడు.

దానికి వివేకుడు “ఇదేమీ గొప్ప విషయం కాదు. నేను నిత్యమూ ఎన్నో గ్రంథాలు చదువుతుంటాను. ఇలాంటి విషయాలు పుస్తకాల్లో ఉంటాయి. అవి గుర్తు పెట్టుకుని అవసరమైనప్పుడు పాటిస్తాను. అగ్ని హోత్రం, స్వగృహం , పుణ్యక్షేత్రం, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవం, గురువుల దగ్గరకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. వారికి ఇచ్చేందుకు పండో, పువ్వో, మిఠాయిలో తీసుకుపోవాలని చదివాను. అందుకే ఒక్కో చోట సందర్భానికి సరిపడే ఒక్కో కానుక ఇచ్చాను. మీరు కూడా ఖాళీ సమయoలో చదువు నేర్చుకుని పుస్తకాలు చదవండి. జూదం లాంటి వ్యసనo వదిలేయండి. మీకు కూడా తెలివి పెరుగుతుంది. బాగుపడతారు.” అన్నాడు. అప్పటి నుండి వివేకుడు చెప్పినట్టు చదువు నేర్చుకుని నెమ్మది నెమ్మదిగా పుస్తకాలు చదవడానికి అలవాటు పడ్డారు రంగడు, సోముడు. కొద్ది కాలంలోనే తమ తెలివిని పది మందీ మెచ్చుకునేలా ఎదిగారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు