జీవనజ్యోతి - హైమాశ్రీనివాస్

jeevana jyoti
" హలో డాక్టర్ హరీ! అమేరికా నుంచీ వచ్చావని విన్నాను. జట్ ల్యాక్ తగ్గిందా? ఐనా నీకేం జట్ ల్యాక్ లే! నీవు దాన్నిలాక్ చేసి, నిద్రపుస్తావ్! ఒక సహాయం అర్ధిస్తూ ఈఫోన్ చేస్తున్నానోయ్! అర్జెంట్ గా మా హాస్పెటల్ కు రాగలవా ! ఒక పేషెంట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది పాపం.అనాధ,ఎవ్వరూలేరు, ఏడాక్టరైనా ఉత్తినే పనిచేయడు కదా! నీవేమైనా సాయం చేసి, అతగాడి ప్రాణం కాపాడగలవేమోనీ..!" ఆదుర్దాగా ఐనా ఎంతో నిమ్మళంగా అంటున్న డా. ఆనంద్ మాటలు విని రిలాక్సింగ్ మూడ్ లోంచీ బయట పడి, " తప్పక వస్తాను. ఐదే ఐదునిముషాల్లో బయల్దేరుతున్నాను." అంటూ జవాబిచ్చి, గబగబా తయారై కారెక్కాడు. పావుగంటలో ‘ ఆనంద నిలయం ' హాస్పెటల్ చేరి ,డా. ఆనంద్ ను కలిశాడు.

"పేషెంట్ ఎక్కడ ఆనంద్!"

" రా !రా ! ఇదో ఆ తొమ్మిదో నెం. రూంలో ఉన్నాడు." అంటున్నఆనంద్ కంటే ముందే పరుగులాంటి నడకతో రూం లోకి ఎంటరై, ముందుగా కేస్ హిస్టరీ ప్యాడ్ తీసి చూశాడు . పేరు చదవగానే పేషెంట్ ముఖం చూశాడు, గడ్డం పెరిగి, ముసలితనంతో, వగ్గిపోయి ఉన్న ఆ వ్యక్తి ని గుర్తు పట్టలేనట్లున్నాడు. "డా.ఆనంద్ ! ఈయనకు అర్జెంట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉంది. ఎందుకు జాప్యం చేశారు ?!" ఆశ్చర్యం గా అడిగాడు డా .హరి . "హరీ! మరి ఇతనికి ఎవ్వరూ లేరు, వృధ్ధాశ్రమం నుంచీ ఫోన్ వస్తే వెళ్ళి ఆంబులెన్స్ లో తెచ్చాం .సంతకాలూ అవీ పెట్టనూ , కొంతైనా ఖర్చు భరించనూ ఎవ్వరూ లేకుండా కష్టం కదా! మాది ఉచిత హాస్పెటల్ కాదు కదా! నీ లాంటి స్పెషలిస్టుల కన్నా పే చేయాలి కదా !ఏ డాక్టరూ ఉచితంగా చేయడు తన ఫీజ్ వదులుకుని, ఆ విషయం ఇందాకే చెప్పానుకదా! అందువల్ల……" డా.ఆనంద్ చెప్తుండగానే , " ఆనంద్! ఇతడికయ్యే ఖర్చంతా నేను భరిస్తాను , త్వరగా ఆపరేషన్ ధియేటర్ కు తరలిం చి, కావల్సిన ఏర్పాట్లన్నీ చూడండి ."ఉద్వేగం గా అంటున్న హరిని ఆశ్చర్యంగా చూసి అడిగాడు ఆనంద్ .

" నీకు ఇతడు తెల్సా!" అని " ఆనంద్ ! అన్నీతర్వాత చెప్తాను .ముందు ఇతడ్ని ధియేటర్ కు తరలించే ఏర్పాటు చేయండి ప్లీజ్ !.త్వరగా.ఈయనకేమన్నాఐతే నేను భరించలేను.." ఆదుర్దాగా అంటున్న హరి మాటలను ఆచరణలో పెట్టాడు ఆనంద్. మిట్ట మధ్యాహ్నం ,మార్చి ఎండ మండి పోతున్నది. మధ్యాహ్నం పాఠశాలకు బయల్దేరారు మాధవయ్య పంతులు. గొడుగు వేసుకున్నా ఎండ భరించలేక కండువా ముక్కుకు ఆడ్డు పెట్టుకుని వడివడిగా నడుస్తూన్న ఆయన , ఎదుటి దృశ్యాన్నిచూసి స్థాణువులా నిల్చిపోయారు. చెత్త దిబ్బలో తిని పారేసిన ఎంగిలాకుల మధ్య కుక్కలతో కల్సి ఎంగిలి మెతుకులు ఏరుకు తింటున్న షుమారు ఐదేళ్ళ పిల్లవాడు. బంగారు బాల్యమిలా కుప్ప దిబ్బల్లో కరిగిపోడం ఆయన మనస్సుకు బాధ కలిగించింది . సాధారణంగా కుక్కలు ఏ కుక్కనూ పక్కన చేరి తమతో తిననివ్వవు, అలాంటిది, ఆ మూడు కుక్కలూ వాడిని తిననిస్తూ తామూ తినడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది . ఓ వైపు కుక్కలు మరోవైపు వాడూ! ఎంగిలి మెతుకులు ఏరుకుని అలాగే గబగబా నొట్లో వేసేసుకుంటున్నాడు. వాడి వంటి మీద ఆఛ్ఛాదన ఏమీ లేదు. కప్పవలసిన చోట కప్పని బాగా చిరిగిన లాగూ తప్ప. మాధవయ్య కడుపు దేవేసినట్లైంది ." ఒరేయ్ బాబూ! నిన్నే " అని పిలిచారాయన. జవాబులేదు. రెండు క్షణాలలాగేచూచి దగ్గరగా వెళ్ళి వాడి భుజం పట్టి లేపబోయాడు . పుల్లలా ఉన్న మరో చేత్తో ఒక్క తోపు తోశాడు వాడు ఆయన్ని. కడుపులో పడాల్సిన మెతుకులకు ఆటంకం కలిగించే వారెవరైనా కానీవాడు లెక్కపెట్టే స్థితిలో లేడు. అసలు తన నెవరు తాకారోకూడా తలత్రిప్పి చూసే స్థితిలో లేడువాడు.ఆయన వాడి బలానికి ఆశ్చర్య పడి, గొడుగు ముడిచి చంకలోఉంచుకుని దగ్గరగా వెళ్ళి రెండుచేతులతో వాడ్నిపట్టి లేపి కుప్ప దిబ్బమించీ పక్కకుతెచ్చాడు . తెల్లనినూలు బట్టలు ధరించి, నుదుట విభూది రేఖల మధ్యగా ఎర్రని కుంకుమ ధరించి అపర శివునిలా ఉన్న ఆ ముఖాన్నిచూడ గానే వాడిలాగు తడిసి పోయింది . భయంతో బిర్ర బిగిసిన వాడ్ని చేయి పట్టుకుని నడిపిస్తూ తన పాఠశాలకు తెచ్చాడాయన. "సుబ్బన్నా! ఎక్కడున్నావ్?" అనగానే ప్యూన్ సుబ్బన్న పరుగు పరుగున వచ్చాడు." చూడూ వీడికి కొళాయి వద్ద స్నానం చేయించి , ఇదో ఈ కండువాతో తుడిచి ఈ యూనిఫాం వేసి ఈ డబ్బు తో వీడ్ని పక్కనే ఉన్న హోటల్ కు తీసుకెళ్ళి కావల్సింది కడుపు నిండా పెట్టించి నా వద్దకు తీసుకురా!" అంటూ భుజమ్మీది కండువాతీసిచ్చి,తన బీరువాలోఉంచిన ఒక జత యూనిఫాం కూడా ఇచ్చి,సుబ్బన్నకు తన జేబులోంచీ కొంత డబ్బుతీసి ఇస్తున్న ఆయన్ని వింతగా చూస్తున్న సుబ్బన్న.ఒక్క అర్ధగంటలో శుభ్రంగా కడిగిన ముత్యంలా ఉన్న ఆ పిల్లాడ్ని తీసుకువచ్చాడు సుబ్బన్న. వాడు కృతఙ్ఞత నిండిన కళ్ళతో ఆయన్ని చూస్తూ రెండుచేతులూ కట్టుకుని వినయంగా ,కడుపు నిండటంతో నీఠారుగా ఆయన ఎదురుగా నిల్చున్నాడు. "ఇలాగా బాబూ ! నీ పేరేంటి?" అని అడిగారాయన.

" కిట్న " అన్నాడు వాడు మెల్లిగా.

సుబ్బన్న " కృష్ణ అయి ఉంటుంది సార్ !" అన్నాడు.

" కృష్ణా! మీ అమ్మానాన్నా ఎక్కడ?" అని అడిగిన ఆయన మాటలకు , తన చేయి పైకెత్తి కప్పువైపు చూపాడు. ఆయన కళ్ళలో నీరు నిలిచింది . వాడు అమాయకంగా తన వంటి మీదున్న బట్టల వైపు ఆయన వైపూ చూస్తున్నాడు,ఏనాడూ ఇంత శుభ్రమైన, అందమైన బట్టాలు ధరించని వాడి ముఖం చాలాసంబరంగాఉంది." సరే , నీకు రోజూ భోజనం కడుపు నిండా పెట్టిస్తాను , బళ్ళోచేరిచదువు కుంటావా!" అనిఅడిగారు. వాడు ఉత్సాహంగా" ఓ!" అనేశాడు .' కడుపు నిండా తిండి' 'అనేమాటే వాడిని మంత్రం లా కట్టేసింది.వెంటనే మధవయ్య వాడి పేరు పాఠశాలలో అడ్మిషన్ రికార్డులో నమోదు చేసి, గార్డియన్ గా తన పేరు వ్రాసేసు కున్నారు. అదో అలా కృష్ణ బళ్ళో చదువు లోనూ ,రోజూ అన్నం వాడి కడుపులోనూ పడసాగింది . తిండికే కానీ, తెలివికి పేద కాని వాడు చక చకా చదువు లోఎదుగుతూ హైస్కూల్ కూ ఆపైన సిటీ కాలేజ్ కీ పాకి పోయాడు, ఆలంబన దొరికిన లత పై పైకి పాకినట్లు. వాడు తన చదువు ధోరణిలో పడి ,మున్ముందుకు పయ ని స్తూ పోసా గాడు . "డా.హరీ! ఆ పెద్దాయనకు స్పృహ వచ్చింది . కళ్ళు తెరిచాడు." అనే కబురంద గానే గబుక్కిన లేచి పరుగులాంటి నడకతో ఆయన ఉన్న గది లోకి వెళ్ళాడు డా.హరి. " పెద్ద సార్ ! ఎలా ఉంది ప్పుడు?" అన్న డా.హరిమాటలకు ,చివుక్కున తలత్రిప్పిచూశాడా వృధ్ధుడు. " నా పేరు మీకెలా తెల్సు?"అని అడిగాడు." మీరు మీ హరికృష్ణను గుర్తుపట్ట లేదు గానీ ,మీరు నామకరణం చేసి,తిండిపెట్టి, విద్యాగంధం అంటించిన మీ హరి కృష్ణ మిమ్మల్ని మరువ లేదు సార్! ఐతే చదువు పోటీలో కొంత జాప్యం జరిగినమాట వాస్తవం. ఐతేగత ఐదేళ్ళుగా మీ కోసం వెతకని చోటులేదు. ఎవ్వరూ మీగురించిన సరైన సమాచారం ఇవ్వలేక పోయారు, చదువులు, పై చదువులతోకొంత వరకూ పూర్తిగా విచారించని దోషం నాదే! మీరి లా..వృధ్ధాశ్రమలో!?"" హరీ!నీకు నేనింకా గుర్తున్నాన్నా! కన్నబిడ్డలే నన్ను మరచిపోయార్రా! అర్ధాంగి పోయాక వంటరినై, ఎవ్వరికీ తెలీనిచోట ఇలా తల దాచుకుంటున్నానోయ్ నా పెన్షన్ సొమ్ముతో . నా ఆదాయమంతా అనాధలపాలు చేశానని కన్న బిడ్డలు వదిలేశారు . కాలంతీరి నా అర్ధాంగి వంటరి వాడ్నిచేసిపోయింది. " కళ్ళమ్మట నీరు కారుతుండగా గద్గదస్వరంతో అన్నారాయన.తన చేతులతో కన్నీరు తుడిచి ,ఆ రెండు చేతులనూ తన చేతు ల్లో ఉంచుకుని " మీరు వెలిగించిన ఈ జ్యోతి వెలుగు తూనే ఉంది పెద్ద సార్! ఆజ్యోతి వెలుగు మీరు చూడరా! ఆ జ్యోతికి సాయంగా ఉండరా!పెద్దసార్! మీరిక మీ జ్యోతి వద్దే ఉంటున్నారు." అంటూ ఆయన పాదాలకు నమస్కరించి తన చేతుల మధ్య ఆయన చేతులుంచుకుని గుండెలవద్ద పెట్టుకున్నాడు డా.హరికృష్ణ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు