బిక్కు బిక్కు మంటూ హాల్లోకి అడుగు పెట్టాడు చైతన్య.
మెల్లిగా వంటింట్లోకి తొంగి చూశాడు. తన తల్లి వంట పనిలో నిమగ్నమైనట్లు నిర్థారించు కున్నాడు. నెమ్మదిగా తన పుస్తకాల బ్యాగులో నుండి ప్రోగ్రెస్ కార్డు తీసి టీ పాయ్ పైన పెట్టాడు. పిల్లిలా నడుచుకుంటూ వెళ్ళి తన గదిలో దూరాడు.
స్కూల్ యూని ఫాం మార్చుకొని ఒక పుస్తకం ముందు వేసుకొన్నాడు. చదువుతున్నట్లు నటిస్తూ.. ఆలోచనలో పడ్డాడు..
‘నాన్న ఆఫీసు నుండి రాగానే ప్రోగ్రెస్ కార్డు చూస్తాడు. కోపంతో అరుస్తూ నా గదిలోకి వస్తాడు. ఆ అరుపులకు భయపడి నాన్న వెనకాలే అమ్మ కూడా వస్తుంది. ఈ పూటకి నాకు తిట్లే టిఫిను.. దేహశుద్ధే భోజనం’ అని మనసులో అనుకుంటూ తేప తేపకు గోడ గడియారం వంక చూడ సాగాడు.
ఇంతలో తల్లి అరుణ “బాబూ!.. టిఫిన్ చేసి పాలు తాగుదువు రా రా.. నీకు ఇష్టమని పకోడి చేసాను” అంటూ తన గదిలోకి రావటం చైతన్యకు కొంత ఊరట లభించినట్లయ్యింది.
“నాకు ఆకలిగా లేదమ్మా.. నాన్న వచ్చాక తింటాలే” అన్నాడు చైతన్య.
“కనీసం పాలైనా తాగరా..” అంది అరుణ బతిమాలుతూ..
“వద్దమ్మా ప్లీజ్.. హోం వర్క్ చాలా ఉంది.. నాన్న వచ్చే లోగా పూర్తి చేసి అందరం కలిసే భోంచేద్దాం..” అంటూ చైతన్య తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో తెలివిగా తప్పించుకున్నాడు. కాని కడుపులో భయం ఆందోళన మరింత పెరిగింది.
అరుణ, సత్యం దంపతులకు ఒక్కగానొక్క సంతానం చైతన్య. చైతన్య తరువాత మళ్ళీ మాతృమూర్తి అయ్యే అవకాశం కోల్పోయింది అరుణ. ఆక్సిడెంట్ వల్ల ఆమె గర్భ సంచి తొలగించుకోవాల్సి వచ్చింది. చైతన్య అంటే వారికి పంచ ప్రాణాలు. ఉన్న ఒక్క నలుసును చక్కటి క్రమశిక్షణతో పెంచి ఉన్నత చదువులు చదివించాలని కలలు కంటున్నారు. అయినా ఒక్కోసారి అరుణ చూపించే మమకారంతో చైతన్య విహంగమై పోతాడు. దాని పర్యవసానమే నేటి చైతన్య ఆరవ తరగతి ప్రోగ్రెస్ కార్డు లోని రిపోర్ట్.
సత్యం ఆఫీసు నుండి రాగానే ప్రెషపై హాల్లో అడుగు పెట్టగానే అరుణ ఆ పూట నివేదిక ఇచ్చింది. ‘చైతన్య టిఫిన్ చేయలేదు.. పాలు తాగలేదు.. ’ అని. ఇదంతా చెవులు నిక్కించి వింటున్నాడు చైతన్య తన గదిలో నుండి.
‘ఇక నాన్న వస్తాడు. బెత్తెం తెస్తాడో!.. బెల్టు తెస్తాడో!.. ’ అనుకుంటూ గజ గజా వణుక సాగాడు.
చైతన్య గది తలుపు తెరుచుకుంది...
భయంతో కంపించి పోతూ “ నాన్నా నన్ను కొట్టొద్దు..” అంటూ అరిచాడు.
“అదేంటి చైతన్యా.. నేనెందుకు కొడతాను?.. ఎప్పుడైనా కొట్టానా?” అంటూ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు.
చైతన్యకి నమ్మశక్యం కాలేదు. వెనకాలే తన తల్లిని చూసి బావురు మన్నాడు. చివాలున లేచి అరుణ మెడను వాటేసుకున్నాడు. అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చైతన్యను హృదయానికి గట్టిగా హత్తుకుంది.
“చూడు బాబూ!.. శ్రద్ధగా చదవడం చదవక పోవడం నీ ఇష్టం నాన్నా.. చదవటం అంటే పుస్తకం ముందు ఉండటం కాదు. మన మనసు పుస్తకంలో లీనమై పోవాలి. బాహ్య ప్రపంచపు అలజడులు అంతర్థానమై పోవాలి. అలా చదివే వారు ఒక గంట లేదా రెండు గంటలకంటే ఎక్కువగా చదువలేరు. అప్పటికే బుర్ర వేడెక్కి పోతుంది. ఆ తరువాత కాస్తా మానసిక ప్రశాంత కోసం బయటికి వచ్చి తనకు ఇష్టమైన కార్యక్రమాల్లో కాసేపు దృష్టి సారించి ఆ తరువాత మళ్ళీ గదిలోకి వెళ్ళి ఒక ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి” అంటూ చైతన్యను తన బాహు బంధాల్లోకి తీసుకున్నాడు సత్యం. చైతన్య మౌనంగా ఏడుస్తూ ఉండటం అరుణ బుజ్జగించ సాగింది.
“ చూడు చైతన్యా.. నేను చదువే కాలంలో కిరోసిన్ దీపాలే మా పరమావధి. చదువు కోసం మూడు మైళ్ళు కాలి నడకన వెళ్ళే వాణ్ణి. మా నాన్న ‘చిన్న సైకిలు కొనిస్తాను బాగా చదువుకోవాలి’ అంటూ ప్రతీ సంవత్సరం నన్ను ప్రోత్సహించే వాడు. కాని ఏనాడూ కొన్నది లేదు. కాస్తా పెద్దయ్యాక సైకిలు గూర్చి అడిగితే ‘ఇంకా చిన్న సైకిలు ఎందుకురా? నా సైకిలు ఉందిగా వాడుకో’ అన్నాడు. నేను చిన్న సైకిలుపై కూర్చొని సవారి చేయాలనే కోరిక అలాగే ఉండి పోయింది. నేను బాగా చదువుకోవాలని అలా నాన్న అన్నాడే తప్ప సైకిలు కొనే స్థోమత లేదు.
నా కంటే అధ్వాన్న పరిస్థితుల్లో చదువుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాను భావులు ఎందరో ఉన్నారు. అబ్రహం లింకన్ వీధి దీపాల క్రింద చదువుకునే వాడు. అబ్దుల్‍కలాం బాల్యంలో ఎదుర్కొన్న అష్ట కష్టాలు చెప్పనలవి కాదు. పేదరికం చదువుకు అడ్డంకి కాదని మనం వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి.
నీకు ఈనాడు అలాంటి ఆర్థిక ఇబ్బందులేవీ లేవు. సకల సౌకర్యాలూ కల్పిస్తున్నాం. బాగా చదువు కోవటం.. చదువుకోక పోవటం నీ చేతుల్లో ఉంది. ఒక సారి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినంత మాత్రాన అలా దిగాలు పడిపోవద్దు. అపజయాన్ని ఒక గుణ పాఠంగా తీసుకొని దానికి కారణాలేవో బేరీజు వేసుకొని వానిని అధిగమిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి.. ఇదీ అబ్దుల్‍కలాం గారి మాటే..” అంటూ చైతన్య వీపు నిమురసాగాడు సత్యం.
కళ్ళు తుడ్చుకుంటున్న చైతన్య ముఖంలో పరివర్తన కనపడే సరికి సత్యం కాస్తా ఊపిరి పీల్చుకున్నాడు.
“పద భోంచేద్దాం.. నేను వచ్చాక అందరం కలిసి భోంచేద్దాం.. అన్నావట కదా అమ్మతో..” అంటూ నెమ్మదిగా చైతన్యను నడిపించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు.
చైతన్య చేతులు శుబ్రంగా కడిగించింది అరుణ.
చైతన్య భోంచేయ సాగాడు. సత్యం అరుణ తృప్తిగా చైతన్యను చూడసాగారు. వాళ్ళు వడ్డించుకోక పోవట గమనించాడు చైతన్య. మనసులో ఏదో శంక..
“అమ్మా.. మీరు భోచేయటం లేదేంటి..” అంటూ తడబడుతూ అడుగుతూ తన నాన్న వంక చూసాడు చైతన్య.
“నువ్వు ఫెయిల్ కావటానికి మా తప్పిదం కూడా ఉంది బాబూ.. మాకృషిలో ఏదో లోపం ఉంది. అందుకే దానికి శిక్షగా ఈ పూట మేము భోజనం చేయకూడదని నిర్ణయించుకున్నాం.. నువు భోంచెయ్యి.. ” అంటూ జగ్‍లోని మంచినీళ్లు గ్లాసులో వంచ సాగాడు సత్యం.
ఒక్క సారిగా బావురుమన్నాడు చైతన్య. బిగ్గరగా ఏడ్చేసాడు. కన్నీటి ధారలు నోట్లోకి వెళ్ల సాగాయి.
“ఇంకెప్పుడూ ఇలా జరగదు నాన్నా.. నేను శ్రద్ధగా చదువుకుంటాను.. అమ్మా మీరు భోంచెయ్యకుంటే నేనూ చెయ్యను..” అంటూ గ్లాసు లోని నీటితో చెయ్యి కడుక్కో బోయాడు. అరుణ అడ్డుకుంది. తనూ కన్నీళ్ళ పర్యంతమైంది. రెండు చేతులతో చైతన్య తలను తన గుండెలకు హత్తుకుంది.
‘మీరు భోంచెయ్యకుంటే నేనూ చెయ్యను’ అనే మాట సత్యం హృదయాన్ని ద్రవింప చేసింది. తాను అనుకున్న ఫలితం చైతన్యలో కనిపించినందుకు అతడి కళ్ళళ్ళో ఆనంద భాష్పాలు దొర్లాయి.*