అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది కష్టాల్లో ఉన్నవారిని చూసి తన చేతనైన సాయం చేసేది. అలాగే ఏదైనా ఆపదొస్తే ఉపాయంతో తప్పించుకునేది.
ఒకరోజు పక్క అడవిలో ఉన్న తన చెల్లెలింటికి వెళ్ళి తిరిగొస్తూండగా దారిలో దాని కాలికి ముల్లుకుచ్చుకుంది. దాంతో అది నడవలేకపోయింది. కుంటుకుంటూ కొంచెం దూరం నడిచేసరికి చీకటి పడింది. దాంతో అది చెరువు పక్కనే ఉన్న చింతచెట్టు ఎక్కి ఆ రాత్రికి అక్కడే నిద్ర పోయింది. ఉదయం నిద్ర లేవగానే కోతికి చింతచెట్టు కింద బద్ధకంగా నడుస్తూన్న ఒక నక్క కనిపించింది. దాని చేతిలో ఒక గుమ్మడిచిప్ప ఉంది.
నక్క మొదట ఎలుగుబంటి ఇంటి తలుపు కొడుతూ...
" ఎలుగు మామా ! ఎలుగు మామా ! నక్కనొచ్చాను. కాస్త తేనే, చేపలు ఉంటే పెట్టవా ! " అని అడుక్కుంది. తలుపు తియ్యకుండానే, " నేనింకా బైటకెళ్ళలేదు మళ్ళీ రాపో " అంది ఎలుగుబంటి.
నక్క ఆవులిస్తూ ముందుకు కదిలింది. అది ఏనుగు ఇంటి తలుపు తడుతూ..
" ఏనుగు మామా ఏనుగు మామా ! నక్కనొచ్చాను. కొన్ని పండ్లుంటే పెట్టవా ! " అని అడుక్కున్నది. తలుపు తియ్యకుండానే " నేనికా తోటకెళ్ళలేదు మళ్ళీ రాపో " అంది ఏనుగు.
నక్క ఒళ్ళు విరుచుకుంటూ ముందుకు కదిలింది.
అది పులి ఇంటి తలుపు తడుతూ..
" పులి రాజా! పులిరాజా! నక్కనొచ్చాను. కొంచెం మాంసం ఉంటే పెట్టవా! " అని అడుక్కుంది. తలుపు తియ్యకుండానే " నేనింకా వేటకెళ్ళలేదు మళ్ళీరాపో" అంది పులి.
ఇక చేసేది లేక నక్క పక్కనే ఉన్నచెరువులోకి దిగి కడుపునిండా నీళ్ళు తాగి చింతచెట్టు నీడలో చితికిలబడింది. పొద్దున్నే చేతిలో చిప్పతో అడుక్కుంటున్న నక్కను చూసి ఆశ్చర్యపోయింది కోతి చెట్టు మీదనుంచే చూస్తూ. దాని కాళ్ళూ, చేతులూ బాగానే ఉన్నాయి. అంతేకాదు, ఆరోగ్యం కూడా ఉంది. తన అడవిలో కష్టించి పనిచేసే జంతువులనే తప్ప ఇలాంటి సోమరి నక్కను ఇంతవరకు చూడనేలేదు అనుకుంది కోతి. దాని కాలినొప్పి ఇంకా తగ్గలేదు. అది చెట్టు మీంచి చెరువు ఆవల కనిపిస్తున్న తన అడవిని చూసుకుంది.
" బాబోయ్.. కాలి నొప్పితో కుంటుతూ పోవడం నావల్ల కాదు అంతదూరం ఈదడం ఎలా ! " ఆలోచించుకోసాగింది కోతి. దానికి ఒక ఉపాయం తట్టింది. కోతి కుంటుతూ చెట్టుదిగి నక్కను చేరింది. ఆహారం సొంతంగా సంపాదించుకోకుండా ఎందుకు అడుక్కుంటున్నావని అడిగింది."
మిత్రమా ! నాకు వేటాడడం చేతకాదు. ఇతర జంతువులు తిని వదిలేసిన ఆహారం సంపాదించడానికి శక్తిలేదు " అంటూ ఎక్కడలేని నీరసం ప్రదర్శించింది నక్క. " మిత్రమా ! నేను ఈ చెరువు ఆవలి ఒడ్డున ఉన్న అడవిలో ఉంటాను. అక్కడ నిన్న ఉదయం రెండు ఏనుగులు భీకరంగా పోట్లాడుకుని రెండూ చచ్చిపోయాయి. నెలరోజులకు సరిపడా మాంసం దొరుకుతుంది. " మాంసం పేరు చెప్పగానే నక్కకు నోట్లో నీళ్ళూరాయి. వెంటనే అక్కడకు వెడదామంది. కోతిని వీపుమీద ఎక్కించుకుని చెరువులోకి దిగింది. ఏనుగు మాంసం మీద ఆశతో కష్టపడి చెరువులో.." మిత్రమా ! నేల మీద నడుస్తూ వెడితే చీకటిపడుతుంది. ఇలా నువ్వు నన్ను నీవీపు మీద ఎక్కించుకుని చెరువులో ఈదుతూ వెళ్ళావంటే ఆట్టే సమయం కూడా పట్టదు. అంటూ దూరంగా కనిపిస్తున్న అడవిని చూపించింది కోతి. నక్క మాత్రం ఆలస్యం చేయకుండా కోతిని వీపుమీద ఎక్కించుకుని చెరువులో ఈది అవతలి ఒడ్డుకి చేరింది.
"మిత్రమా ! ఎక్కడ ఏనుగుల మాంసం ? " అనడిగింది.
కోతి తాను నివాసముండే మామిడి చెట్టు దగ్గరకు తీసుకుపోయింది. నక్కకు మామిడిపండ్లు పెట్టి అతిథి మర్యాదలు చేసింది. ఆకలి మీదున్న నక్క కడుపు నిండా తియ్యటి మామిడి పళ్ళు తింది. భుక్తాయాసం తీర్చుకున్న నక్కతో, " మిత్రమా ! సోమరితనం మహా శత్రువు. దాని దరిచేరనీయకూడదు. శ్రమతో సంపాదించుకున్న ఆహారం ఎంతో రుచిగా ఉంటుంది. అసలు కష్టపడి పని చేయనివారికి తినేహక్కు లేదు. నిజంగా నీకు ఆహారం సంపాదించుకునే శక్తే లేకుంటే, ఈ చెరువు ఎలా ఈదగలిగావు ?! ఆకలి మీద ఉన్న నీకు ఎన్ని చెప్పినా అప్పుడు అర్థం కావని ఆకలి తీరాక ఇప్పుడు చెపుతున్నాను. నా కాలికి ముల్లు కుచ్చుకుని నడవలేకపోవడంతో నీకు ఏనుగు మాంసం ఆశ చూపి చెరువులో ఈదించి నా ఇంటికి చేరుకున్నాను. నన్ను క్షమించు " అంది కోతి. నక్కకు కోతిమీద కోపం రాలేదు. తన తప్పు తెలుసుకుంది. తన శక్తి గుర్తించింది. వెంటనే వెందిరిగి తన అడవిని చేరుకుంది. గుమ్మడి చిప్పను చెరువులోకి గిరాటేసింది. అప్పటినుండి సోమరితనం విడిచి కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్నే తినసాగింది నక్క.