కాలమే చెప్పాలి - పి బి రాజు

kalame cheppaali

'టు డు ఆర్ నాట్ టు డు" మీమాంస ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక రోజు ఎదురు పడక మానదు.

అదిగో అలాంటి సందిగ్ధం లోనే నేనిప్పుడు కొట్టు మిట్టాడుతున్నాను. అసలు ఫలానా పని చేద్దామా, వద్దా? చేస్తే ఏమౌతుందో, చేయకపోతే ఏమౌతుందో అనే సందిగ్ధం ఉంది చూశారూ ... అది మహా చెడ్డదండి. అందులోనూ మనకు మరీ సన్నిహితులు అనుకున్న వారి దగ్గర 'అటువంటి విషయం ' చెప్పాలా, వద్దా అనే డోలాయమాన పరిస్థితి అనుభవంలోకి వస్తే కాని ఆ నరకయాతన తెలియదు. చెబితే ఎలా రిసీవ్ చేసుకొంటారో అని ఒక ప్రక్క, చెప్పకపోతే 'ఏంటండీ! ఇంత సన్నిహితంగా ఉండీ, విషయం తెలిసి కూడా మీరు చెప్పలేదు. ముందుగా చెప్పిఉంటే మేము జాగ్రత్తపడి ఉంటాం కదా! ఇలాంటి పరిస్థితి వచ్చివుండేది కాదు కదా! " అని అంటారేమో అని అనుమానం.

మంచి విషయం అయితే ఫర్వాలేదు కానీ ... ఇలాంటి విషయం చెప్పడం భావ్యమా? అదీ ఒక ఆడ కూతురి విషయంలో ... పోనీ ఎవరి సలహా అయినా తీసుకొందామా అంటే ..? 'విషయం' అనవసరంగా పబ్లిసిటి అవుతుందేమో ... ఆడపిల్ల జీవితం అల్లరిపాలవుతుందేమో అని అనుమానాల మీద అనుమానాలు.

మనస్సు అల్లకల్లోలంగా ఉంది.

వీటి కంతా మూలకారణం మా ఆవిడ. ఇంతకీ ఏం జరిగిందంటే ...

"మన కావేరి లేదూ ...అదేనండీ! మన హౌస్ ఓనర్ కూతురు.. ఆ అమ్మాయి ఆ కుర్రాడితో లేచిపోతుందట" గొంతు తగ్గించి చెప్పింది.

"ఏమిటీ! లక్ష్మీ! నువ్వు చెప్పేది?" పక్కన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాను.

"అవునండీ! కావేరే స్వయంగా నాతో చెప్పింది. అప్పట్నుంచి మనసు మనసులో లేదు. ఏమి చేయాలో తోచలేదు. ఆ అమ్మాయి చెప్పడం చూస్తుంటే, వచ్చే వారం తిరుపతి లో పెళ్ళి చేసుకోవడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకొన్నట్లు తెలుస్తోంది. వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పలేదట. చెబితే ఒప్పుకోరట. అటు అబ్బాయి తలిదండ్రులకూ తెలియదట. వీరిద్దరే కొందరి ఫ్రెండ్స్ తో .....నాకేదో భయంగా ఉందండీ! " ఆమె పెదాలు అదురుతున్నాయి.

నేనింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు.

కావేరి ... ఇంకా ఇరవై ఏండ్లు కూడా నిండని అమాయకురాలు ... లెక్చరర్ తో లేచిపోవడమా? అదీ తలితండ్రులకు తెలియకుండా...అంత తెగింపా ... ఎక్కడినుంచి వచ్చింది. నమ్మశక్యం కావడం లేదు.

సంవత్సరం క్రితం ఈ వూరికి ట్రాన్స్ఫర్ అయి జాయినైనా రోజే రఘురామయ్య ఏదో పనిమీద మా బ్యాంకు కు వచ్చాడు. ఎవరో కొలీగ్ అతన్ని పరిచయం చేస్తూ, "ఇల్లేదైనా అద్దెకు చూడు సార్ కు! "అన్నాడు.

పేరు, వూరు, స్వస్థలం అడిగాడాయన. స్వస్థలం "చిత్తూరు" అనగానే, '’ మనూరే " అని గట్టిగా నవ్వుతూ , 'ఎక్కడో ఎందుకు మా ఇల్లే ఉంది. రండి సార్! చూద్దురు!’ అన్నాడు.

అలా పరిచయ మయింది రఘురామయ్యతో. వాళ్ళింట్లోనే అద్దెకు కింది పోర్షన్ లో దిగాను. పై పోర్షన్ లో వాళ్ళుంటారు. ఆయనది కూడా చిత్తూరే. కానీ, అత్తగారిళ్ళు నాయుడుపేట. వారికి ఒకే ఆడపిల్ల కావడంతో అక్కడే సెటెల్ అయిపోయాడు.

అతను ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్మాస్టర్ గా పనిచేస్తున్నాడు. వారానికి ఒకసారి వచ్చిపోతుంటాడు. ఆయన చాలా మృదుస్వభావి. నెమ్మదస్తుడు. చాలా మంచివాడు. అతనికి పూర్తి విరుద్దం అతని భార్య -అనసూయమ్మ. సినిమాల్లో సూర్యకాంతం టైప్. ఆమె గయ్యాళి. అతను నోరు వాయి లేనివాడు. ఎలాగో సర్దుకుపోతుంటాడు. ఆమె ఎప్పుడూ, పై ఫోర్షన్లోనే ఉంటుంది. పెద్దగా కిందికి దిగి రాదు. వచ్చిందంటే ఆ రోజు ఎవరికో మూడుతుంది. నోరు అంత మంచిది కాదు. మంచి ...చెడ్డా ఉండదు. ఎంత పడితే అంత... ఎంతడివాడినైనా సరే . ఒక్కోసారి ఈ పిల్లి పాలు తాగుతుందా ... అన్నంత అతి మంచిగా ఉంటుంది. చాలా చిత్రమైన మనిషి. చుట్టుపక్కల వా ళ్ళు ఆమెకు మెంటల్ అంటారు. పైకి కనిపించడు కానీ, అతన్ని చూస్తే నాకే జాలేసేది. ఎన్ని ఉన్నా సర్దుకు పోతున్నాడు కాబట్టి వారి సంసారం ఇంకా అలా సాగుతూ ఉంది.

కానీ, మాతో ఆమె ప్రవర్తన బాగానే ఉండేది. మర్యాదగానే ఉండేది. మా ఆవిడ కూడా కలుపుగోలు మనిషే...ఏమాత్రం తేడా వచ్చినా దూరంగా పేట్టే మనస్తత్వం. ఎవర్ని, ఎక్కడ, ఎలా పెట్టాలో మా ఆవిడ బాగానే మెనేజ్ చేసేస్తుంది. కాబట్టి ఇంతవరకు మాకెలాంటి ప్రాబ్లెంస్ లేవనే చెప్పాలి. నేను ఆఫిస్ కు ఉదయం పోతే రాత్రికి వచ్చేవాణ్ణి కాబట్టి నాకెలాంటి సమస్యా లేదు.

ఎపుడైనా ఎదురు పడినా, "బాగున్నారా సార్?" అని ముక్తసరి పలకరింపులు తప్ప...అంతకు మించి మా మధ్య పలకరింపులు , మాటలు ఉండేది కాదు.

వారికి ఏకైక కూతురు - కావేరి. ఇంటర్ కంప్లీట్ అయి ఇంట్లోనే ఉండేది. తండ్రి దగ్గర గారాబం ఎక్కువ. తల్లి సాధింపు లెక్కువ. మా ఆవిడ తో ఇట్టే కలిసిపోయింది. మాటల్తో పాటు కుట్లు, అల్లికలు నేర్చుకుంటూ మా ఇంట్లోనే ఎక్కువసేపు గడిపేది.

మరో ఆరు నెలల్లో వెంకటగిరి లో ఏదో కోర్స్ లో చేరింది. హాస్టల్లో ఉంటూ వారానికి ఒక సారి వచ్చిపోయేది. వచ్చినపుడు కాలేజ్ కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేదట. మెల్ల మెల్లగా వాళ్ళ కాలేజ్ లెక్చరర్ ఒకడు ప్రపోజ్ చేశాడని చెప్పుకొచ్చిందట. మా ఆవిడికి ఇదంతా ఇష్టముండేది కాదు. అదే విషయం ఆ అమ్మాయితో చెప్పి తల్లితండ్రులకు తలవంపులు తెచ్చే పని చేయొద్దని వార్నింగిచ్చిందట. వెళ్ళింది చదువు కోసమనీ ప్రేమ కోసం కాదని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, బుద్ధిగా చదువుకోమని చాల సార్లు చెప్పి చూసింది.

ప్రేమనేది పుట్టకూడదు కానీ పుట్టిందంటే అది ఎవరి మాటా వినదు. మంచి మాట, మంచి సలహా పట్టించుకోదు. అంతవరకు ఆప్తులుగా ఉన్నవారు ఒక్కసారిగా శత్రువులైపోతారు. అందుకే ప్రేమ గుడ్డిదంటారేమో!

మా ఆవిడ చెప్పి చూసి ఇక ఆ అమ్మాయిని దూరం పెట్టడం మొదలెట్టింది. వచ్చినా ఒకటి రెండు మాటలు చెప్పి పంపించేసేది. క్రమ క్రమంగా ఆ అమ్మాయి కూడా వారం వారం కాకుండా నెలకో, రెండు నెలలకో రావడం మొదలెట్టింది. పాఠాలు కాకుండా ప్రేమ పాఠాలలో చాలా వరకు ముందుకెళ్ళినట్లు అర్థమవుతోంది.

హఠాత్తుగా ఈరోజు మధ్యాహ్నం జరిగిన సంభాషణ మా ఆవిడ్ని ఒక కుదుపు కుదిపేసింది.

"మేమిద్దరం వచ్చే వారం తిరుపతిలో పెళ్ళి చేసుకోబోతున్నాం ఆంటీ! బహుశా మనం కలవడం ఇదే ఆఖరి సారి కావచ్చు ఎందుకంటే మా ఇంట్లో ఎవరికీ తెలియదు. తెలిస్తే వెళ్ళనివ్వరు."

"కావేరీ! ఆలోచించు. జీవితం నాశనం చేసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఈ వయసులో ఇది ప్రేమ కాదు. ఇంఫాచుయేషన్. ఆ రెండింటికి తేడా ఈ వయసులో నీ కర్థం కాదు. నీవిపుడు ప్రేమ మైకంలో ఉన్నావు. మైకం దిగగానే వాస్తవాలు కఠినంగా ఉంటాయి. జీవితం సినిమా కాదు. ప్రేమలు సినిమాల్లో సక్సెస్ ఐనట్లు జీవితాల్లో కాదు. జీవితం చేయి జారిన తర్వాత ఆడపిల్లకు భవిష్యత్ ఉండదు. ఒక్క తప్పటడుగు వెనక్కి తీసుకోలేనంత అగాధం అవుతుంది. రోజూ పేపర్లలో ఎన్ని చూడడం లేదు! మా ఫ్రెండ్ జీవితం ఇలా బలి అయింది కాబట్టే నీకింతగా చెబుతున్నాను. నీవు చిన్న పిల్లవు. బుద్ధిగా చదువుకో. నీ భవిష్యత్ నీ తల్లితండ్రులు ఆలోచిస్తారు.."

" ఆంటీ! మీరు కూడా అదే చెపుతున్నారు. నాకండగా నిలబడతారనుకున్నాను. కానీ అందరిలా మీరు కూడా ...ఇలా మాట్లాడు తారను కోలేదు. మీరంతా ఒకటే. మమ్మల్ని అర్థం చేసుకోరు. మీరు నా ఆప్తురాలనుకొన్నాను. అందుకే నా విషయాలన్నీ షేర్ చేసుకున్నా. కనీసం మోరల్ సపోర్ట్ ఇస్తారనుకున్నా."

సారీ కావేరీ! ఇలాంటి విషయాల్లో నేను సపోర్ట్ చేయలేను. నీవన్నట్లు మీ ప్రేమే నిజమైతే మీ మీ తల్లితండ్రులను ఒప్పించండీ. అంతేకానీ ఇలా దొంగచాటుగా, స్వంత నిర్ణయాలు తీసుకొని వారికి కడుపు కోత మిగల్చకు. అందులోను నీవు ఒక్కర్తివే అమ్మాయివి. ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. నీవేది అడిగినా కాదనకుండా ఇచ్చారు. కనుక ఈ విషయంలో కూడా కాదనక పోవచ్చు..."

'పిచ్చి ఆంటీ! ఎవరైనా ఒప్పుకుంటారా! ఎవ్వరూ ఒప్పుకోరు. మా అమ్మానాన్నలు అస్సలు ఒప్పుకోరు. అందుకే ఇలా చేయాల్సి వస్తుంది." "ఇరవై ఏండ్లు కని పెంచి పెద్ద చేసిన ప్రేమ కన్నా; ఏడాది వయస్సు కూడా లేని 'నీ ప్రేమ ' గొప్పదనుకుంటున్నావా? నీ మంచి చెడ్డలు వారి కంటే నీకే బాగా తెలుసనుకుంటున్నావా?"

"అవునాంటీ! సంవత్సరం క్రితం వరకు ప్రేమంటే ఏంటో నాకు నిజంగా తెలియదు. అతన్ని కలిసిన తర్వాతనే నేనింత వరకు ఏం మిస్సయ్యానో కూడా తెలిసింది. అతనితో నా జీవితం హాయిగా, ఆనందంగా ఉంటుందనుకుంటున్నాను. అనుకునేదేముంది... తప్పకుండా ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. ధట్సాల్ . " ఇక మాట్లాడడానికి ఏమీ లేనట్లు వడివడిగా వెళ్ళిపోయింది.

జరిగింది మననం చేసుకుంటూ, చెప్తూ "పాపం అమాయకపు పిల్లండీ!" ఏడుపు ఒక్కటే తక్కువ మా ఆవిడకు.

"మనం ఏమీ చేయలేమా?" రెట్టించింది మళ్ళీ.

"ఏం చేద్దాం! నీ ప్రయత్నాలన్నీ చేశావుగా! వినలేదంటే మనమేం చేయగలం?" అన్నాన్నేను.

"అదికాదండీ! మా ఫ్రెండ్ అనితది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఎవడో మాయ మాటలు చెప్పేసరికి అదీ ఇలాంటి నిర్ణయమే తీసుకొంది. ఇంట్లో చెప్పాపెట్టకుండా పారిపోయింది. మోజు తీర్చుకొని వాడు పారిపోయాడు. ఈ అమ్మాయి రెంటికి చెడ్డ రేవడయింది. ఇపుడు దాని పరిస్థితి ఏమిటో తెలుసుగా ...అక్కడ ఇక్కడ ఏదో పని చేసుకుంటూ బతుకీడుస్తోంది. పరువు తీసిందని పుట్టింటివాళ్ళు దూరమైనారు. నమ్మినవాడు నట్టేట్లో ముంచేశాడు. అది తల్చుకుంటేనే నాకు బాధేస్తుంది. కావేరి కి అలా జరగకూడదనే నా తాపత్రయం. అదేమో వినడం లేదు. పోనీ వాళ్ళమ్మకు చెబుదామంటే ... ఆమె అసలే మెంటల్. కోపిష్ఠి. పోనీ, వాళ్ళ నాన్నకు చెబితే….. "

"ఆయన మాత్రం ఏం చేస్తాడు?"

"నచ్చ చెబుతాడేమో... ఆయన మాటైనా వింటుందేమో ... లేకుంటే అబ్బాయి బాగోగులు విచారించి పెళ్ళైనా చేస్తాడేమో "నీవు చెప్పిందీ బాగుంది! ఆలోచిద్దాం."

ఆలోచనలు, తర్జనభర్జనల తర్వాత వాళ్ళ నాన్నకు చెప్పడానికే నిశ్చయించుకున్నాం. ఆయన మృదుస్వభావి. మాకు తెలిసిన విషయం ఆయన దృష్టికి తీసుకుపోవడం సబబనిపించింది. తగిన నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. దీన్లో మనకొచ్చిన నష్టమేమీ లేదు. ఇపుడు మనసు ఎంతో తేలిక పడింది.

కిందికి దిగి వచ్చాడు రఘురామయ్య.

"ఏం సార్! బాగున్నారా!" యధావిధిగా పలకరిస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు.

ఆ మాటా, ఈ మాటా అయిన తర్వాత అసలు విషయానికొచ్చాను.

"మీరేమీ అనుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలి." అన్నాను.

"చెప్పండి సార్! అనుకోవడానికేముంటుంది"

"ఏమీ లేదు. మీతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చెబితే మీరేమనుకుంటారో అని భయం కూడా ఉంది."

"భలే వారే ...చెప్పండి ... ఫర్వాలేదు. మీరు మా శ్రేయోభిలాషులు. ఏం చెప్పినా వింటాను."

"మాపైన ఆ నమ్మకం ఉంది కాబట్టే విషయం చెప్పాలా వద్దా అని కూడా తర్జనభర్జన పడాల్సిన పరిస్థితి ...తీరా విన్న తర్వాత మీరెలా ఫీలవుతారో నని..."

"ఏం ఫర్వాలేదు. ఆలోచించకుండా చెప్పండి."

"ఒక విషయం మా దృష్టికి వచ్చింది. కావేరి ..."

"కావేరి కేమయింది"

"ఆవేశపడకండి. కావేరి వాళ్ళ కాలేజ్ లో ఎవర్నో ప్రేమించిందట. పెళ్ళిదాకా వెళ్ళిందని మా చెవిలో పడింది."

"నిజమా?"

"తొందర పడకండి. మీరొక సారి కాలేజ్ కి వెళ్ళి విచారించండి. ఎంతవరకు నిజమో తెలుసుకోండి.ఆ తర్వాత తగు నిర్ణయం తీసుకోండి." "ఇది నిజమా? మీకెలా తెలిసింది."

"కావేరే స్వయంగా మా ఆవిడతో చెప్పిందట. మీరు ఆవేశపడకండి. తొందరపడకండి. ఇది చాలా సున్నితమైన విషయం. సున్నితంగా డీల్ చేయాల్సిన విషయం. ఇది మీకు చెప్పడం భావ్యమవునో కాదో తెలియదు. కానీ మీ శ్రేయోభిలాషులుగా మాకు తెలిసిన విషయం మీకు చెప్పడం సబబని పించింది. ఇందులో నా సహాయం ఏదైనా అవసరమైతే మొహమాట పడకండి. "

ఆయన షాక్ అయినట్లు ఫీల్ అయ్యాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. అనేక వేల ప్రశ్నలు ఆయన మెదడులో సుడులు తిరుగుతున్నాయని మాత్రం తెలుస్తోంది.

"మాష్టారూ! మిమ్మల్ని బాధ పెట్టామనిపిస్తోంది. ఏమనుకోకండి. అది విన్నప్పటి నుంచి మా పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు మంచివారు. మీకు చెప్పడం మంచో చెడ్డో కూడా తెలియదు. ఎందుకో ఆ విషయాన్ని మీ చెవిలో వేయాలనిపించింది. వేశాం. తప్పయితే క్షమించండి."

"నో...నో. చాలా మంచి పని చేశారు. చాలా థాంక్స్. మీరన్నట్లు కాలేజ్ కి వెళ్ళి విచారిస్తాను. తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం" అంటూ మెల్లగా లేచి వెళ్ళిపోయాడు.

ఉదయం మా ఇంటిముందు ఏదో అరుపులు వినిపించి తలుపు తీశాం. ఎదురుగా అపర కాళికావతారంలో - అనసూయమ్మ. అరుపులు;కేకలతో పెద్ద రణరంగమే అయింది. ఆమె మమ్మల్నే టార్గెట్ చేసిందని తెలియడానికి ఐదు నిమిషాలు పట్టింది. ఇది మేం ఏమాత్రం ఊహించనిది. వాళ్ళ అమ్మాయి చాలా మంచిదట. మేమే నడి వీధిలో పెట్టాలని అభాండాలు వేశామని, దాని బతుకు బజారు కీడ్చామని తూర్పార పట్టింది. మాకు తెలిసిన విషయాన్ని మూడో కంటికి తెలియకుండా రఘురామయ్యకు చెప్పాం. ఆమె బూతుపురాణంతో వీధి వాడా ఏకం చేసింది.

చుట్టుపక్కల వాళ్ళు అప్పుడే చెప్పారు కానీ; ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది.

చివరికి ఇంటిని వెంటనే ఖాళీ చేయమని అల్టిమేటం ఇచ్చింది.

తల కొట్టేసినట్లయింది. ఇంతవరకు ఇలాంటి అనుభవమే లేదు. మేమేదో ఉపకారం చేయబోయి మా నెత్తికే కుంపటి తెచ్చుకొన్నట్లయింది. ఎవరెలా పోతే మనకేమని ఉండవలసింది ...ఉండలేకపోయాం. ఇందుకే అంటారేమో తనకు మాలిన ధర్మం పనికిరాదని. ఇపుడు వగచి ప్రయోజనమేమిటి? ఈ బుద్ధి అప్పుడే ఉండవలసింది.

అవమానంగా ఉంది. ఈ విషయం అయనతో చెప్పి తప్పు చేశామేమో అన్న ఫీలింగ్.

"ఆమె మెంటాలిటే అలాంటిది సార్! అందుకే ఆ ఇంట్లో ఎవరూ ఆర్నెళ్ళకు మించి లేదు." - వీధిలో వాళ్ళూ; కొలీగ్స్ ఓదార్చారు.

ఇంతజరిగినా రఘురామయ్య జాడ లేదు. పాపం! ఆయన భార్య చాటు భర్త. ఆమె నోటి ముందు ఆయన మాత్రం ఏమి చేయగలడు. "ఇంత జరిగాక ఆ ఇల్లు వద్దనే వద్దు ... ఖాళీ చేసేద్దాం సార్!..." అని మావాళ్ళు ఆవేశపడ్డారు.

ఆవేశమే కాదు పట్టుపట్టి సాయంత్రాని కల్లా ఇల్లు ఖాళీ చేయించేశారు.

ఆ తర్వాతెప్పుడో "ఆ అమ్మాయి అన్నంత పనీ చేసిందనీ ...వాళ్ళ తిక్క కుదిరిందనీ " ఎవరో చెప్పారు.

ఐదారు నెలల్లోనే నాకు హైదరాబాద్ ట్రాన్స్పరై వెళ్ళిపోయాను.

నాలుగేళ్ళ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి వెంకటగిరికి బ్యాంక్ మేనేజర్ గా పోస్ట్ చేశారు.

"సార్ ఈరోజు 'రాజీవ్ యువ శక్తి ' ఇంటర్వ్యూస్ ఉన్నాయి మనం వెళ్ళాలి " గుర్తు చేశాడు మా ఫీల్డ్ ఆఫీసర్.

'రాజీవ్ యువ శక్తి" పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వంత వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సీడీతో పాటు బ్యాంక్ లోన్ ఇస్తారు. అందుకు అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేస్తారు.

ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

చివరి అభ్యర్థిని కావేరి ని పిలిచాడు ఫీవన్.

'నమస్కారం సార్ ' అంటూ కావేరి లోపలికొచ్చింది.

"నమస్తే సార్" ప్రత్యేకించి నాకు మరోసారి చెప్పింది.

"కావేరి అంటే...."

"అవును సార్! ఆ కావేరే … ఈ కావేరి. నాలుగేళ్ళ క్రితం మీరు మా ఇంట్లో అద్దెకు ఉండేవారు. గుర్తుందా?"

“గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది. జీవితంలో ఎదురైన ఘోర అవమానం అంత సులభంగా ఎలా మర్చిపోగలను.”

'మీ ఆవేశంలో అర్థం ఉంది. మేడం గారు ఎంత చెప్పినా నా చెవికెక్కలేదు. మంచి మాటలు రుచించలేదు. ప్రేమ ప్రేమ అని నమ్మి ఎవర్ని లెక్క చేయకుండా వచ్చేశాను. సంవత్సరం వరకు చాలా చాలా హ్యాఫీగా గడిచింది. స్వర్గం అంటే ఇదేనేమో అన్నంత హాయిగా క్షణాల్లా గడిచిపోయింది. ప్రపంచంలో మేమిద్దరమే ఉన్నట్లు, మరెవరితోనూ సంబంధం లేనట్లు గడిపాం. అందర్నీ ఎదిరించి నేనెంతో మంచి పని చేశానని పొంగిపోయాను. ఆ ఆనందం ఎగిరి పోవడానికి ఎంతో కాలం పట్టలేదు. పాప పుట్టాక అతని అసలు రంగు ఒకటొకటిగా బయట పడసాగింది. ముఖం చాటేశాడు. క్రమంగా ఇంటికి రావడం తగ్గించేశాడు. నిలదీశాను. అసలు విషయం తెలిసింది. మేనమామ కూతుర్ని పెళ్ళి చేసుకున్నాడట. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లితండ్రుల కోసం చేసుకోవలసి వచ్చిందట. నీకన్యాయం చేయనన్నాడు. నాకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించాను. వాళ్ళింటి ముందు మౌనపోరాటం చేశాను. మహిళా సంఘాలు, పత్రికలు, టీ వీ ఛానెల్స్ నాలుగు రోజులు అండగా నిలిచాయి. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాయి. వాళ్ళే కాదు నమ్ముకొని వచ్చిన వాడు కూడా నన్ను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. రాను రాను ఇల్లు గడవడం కష్టంగా మారింది. పసిపాపతో పుట్టింటికెళ్ళాను. అపుడు తెలిసింది నా మీద దిగులుతో మా నాన్న పోయి రెండేళ్ళయిందని. మా అమ్మ పిచ్చిదయింది. పిచ్చి ముదిరి ఏం చేస్తుందో ఆమెకే తెలియడం లేదు. మీద పడి రక్కినంత పని చేసింది. "నీ ముఖం మళ్ళీ చూపించకు వెళ్ళి ఫో" ముఖం పైన్నే తలుపేసుకుంది. ఎవర్నని ఏం లాభం ...నాకిది కావల్సిందే. చేతులారా చేసుకున్నందుకు అనుభవించక తప్పదు! ఇక గత్యంతరం లేక ఒక బట్టల షాప్ లో సేల్స్ వుమెన్ గా ఇలా బతుకీడు స్తున్నా ." "మేడం దయవల్ల కుట్లు అల్లికలు నేర్చుకున్నాను. నా కాళ్ళపై నేను నిలబడాలనుకుంటున్నాను. మీరు దయ తలచి లోన్ ఇప్పిస్తే నాకో దారి చూపినవారవుతారు. రెండేళ్ళుగా ఇంటర్వ్యూలకు వస్తున్నాను. కానీ ఇంతవరకు ఎవరూ కరుణించలేదు. నాకు రెకమేండేషన్స్ లేవు. డబ్బులు ఇచ్చుకోలేను. దయ చేసి మీరైనా కరుణించండి. " అంటూ కాళ్ళపై పడబోయింది.

"పాపం! ఎలాంటి అమ్మాయి...ఎలాంటి దుస్థితి కొచ్చింది." జాలేసింది. వాళ్ళ నాన్న గుర్తొచ్చి బాధేసింది. ఆ అమ్మాయిని ఈ స్థితిలొ చూడాల్సి వస్తుందనుకోలేదు. సహాయం చేయాలనిపిస్తోంది.

'యస్ కావేరి! యూ ఆర్ సెలెక్టెడ్. నీకీ లోన్ ఇస్తున్నాను. నీ కాళ్ళపై నిలబడి సొసైటీ లో తలెత్తుకొని బతకాలి. ఆల్ ద బెస్ట్" అన్నాను దృఢంగా ఆమె ఊహించలేదేమో ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ, "చాలా చాలా థాంక్స్ సార్! ఇంకా లోకంలో మంచితనం మిగిలే ఉంది సార్! మీలాంటి వారింకా ఉన్నారు. మీ మేలు జన్మలో మరిచిపోను సార్! " ఆనందబాష్పాలు రాలిపోగా రెండు చేతులు జోడించి నమస్క రించింది. "యస్ తలెత్తుకొని తిరుగుతాను సార్! అంతే కాదు ... ప్రేమ, పెళ్ళి, దగా, మోసం, దోపిడీలు, మానభంగాలు, మౌన పోరాటాలు --వీటివల్ల దగా పడి నాలాగా జీవితాల్ని నాశనం చేసుకుంటున్న ఆడపిల్లల్ని ఆప్రమత్తం చేయాలనుంది. పేపర్లలో రోజూ వస్తున్న ఇలాటి వార్తలను చూస్తూకూడా మళ్ళీ మళ్ళీ బలయిపోతున్న అభాగ్యుల్ని జాగృతం చేయాలనుంది. పేపర్లలో ఆ పదాలే రాని రోజు రావాలనుంది." పిడికిలి బిగించి కావేరి ముందుకు కదిలింది.

నిజంగా పేపర్లలో అలాంటి వార్తలు లేని రోజు వస్తుందా? ఏమో! కాలమే చెప్పాలి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు