"ఏరా ఈ మధ్య కథలేమన్నా రాసావా?"
"ఆఁ"
"దేనికి పంపుతున్నావు? కొత్తపత్రిక "తీయ తేనియ తెలుగు"కి పంపించకపోయావా? వాళ్ళు కథలో..రాయడంలో కొత్తదనం వుంటే బాగా ప్రోత్సహిస్తున్నారు."
"దానికా? అది పారీతోషికం ఇవ్వదు. నేనూ అప్పట్లో ఒక కథ పంపాను..కథ ప్రచురించారే కానీ పారీతోషికం ఇవ్వలేదు. అసలు మన తెలుగు పత్రికల్లో రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రోత్సహించేవి ఎన్ని వున్నాయి(వ్యంగ్యంగా)? నిజం చెప్పాలంటే అసలు మన కథ ప్రచురణకు స్వీకరించిన విషయం గాని..అచ్చయిన విషయం తెలుపుతూ కాంప్లిమెంటరీ కాపీ పంపడంగాని చేస్తారా? ఒకవేళ పంపినా అదీ మొక్కుబడిగానే! అది మనకి అందిందా? లేదా? అన్నది వాళ్ళకి అనవసరం. అదీ రచయితల పట్ల వాళ్ళు వ్యక్తపరిచే గౌరవం(మళ్ళీ వ్యంగ్యంగా). అవునులే కవులనీ..రచయితల్నీ తగు రీతిన సత్కరించి ఆదరించడానికి ఇదేమైనా శ్రీకృష్ణదేవరాయల రాజ్యమా? ఏదో రాయాలని రాయడమే కానీ నిజంగా పారితోషికాల ఆధారపడితే మనగతి అధోగతే!"అని నిట్టూర్చాడు.
"ఒరే నేనో మాట చెప్పనా! రాయడమన్నది మనకి ఆ చదువులతల్లి పెట్టిన భిక్ష. ‘కళ కళకోసమే కాని కాసు కోసం కాదు’ అన్నది నీకు తెలిసే వుంటుంది. మనసులో చోటుచేసుకునే ఊహల్ని అక్షరాల్లో పేర్చడమన్నది అందరికీ సాధ్యం కాదు. మనం రాసేది కొన్ని జీవితాల్లో మార్పుతేవచ్చు..కొంతమందికి వెలుగు దారి చూపించవచ్చు. సమాజ హితం కోరేవాడే కవి.. రచయిత! అందుకే వాళ్ళకీ వాళ్ళ రచనలకీ అభిమానులుంటారు. అక్షరం అంటే నాశనం లేనిది. వాటితో మన ఆలోచనలకి రూపమిస్తాం కాబట్టే అవీ నశించవు. మనం రచయితల మవ్వడమన్నది పూర్వజన్మ సుకృతం.
ఇహ పారితోషికం విషయం! వేదిక మీద నృత్యం చేయబోయే కళాకారుడి దృష్టి చప్పట్లమీద వుంటే..అది అతడి మానసిక అపరిపక్వతని తెలియజేస్తుంది. సృజనాత్మకతకి ఎల్లలుండకూడదు. కాసులకీ..కానుకలకీ లోబడకూడదు. నా వరకూ నాకు పత్రికలన్నీ నా లోని రచయిత కి వేదికలే. నా సాహితీ విశ్వరూపానికి ప్రత్యక్షసాక్షులే! అందులో ఎటువంటి తారతమ్యాలుండవు. నా కథకి పారితోషికం వస్తే ఆనంది స్తాను..రాకపోయినా సంతోషిస్తాను. నాక్కావలసింది నా రచన ప్రచురించబడడానికి ఇంత చోటు. అది కల్పించే ఏ పత్రికయినా నాకు సాక్షాత్తూ ఆ చదువులతల్లితో సమానం." నా మనసులో వున్నది వెళ్ళగక్కేసాక మనసుకి ఎంతో తృప్తిగా వుంది.
"సార్! మీరిక్కడున్నారా? మీ కోసం వచ్చిన ఉత్తరాల బరువుతో ఇందాకణ్ణుంచీ మిమ్మల్ని వెతకలేక ఛస్తున్నాననుకోండీ.. మీకు స్వయం గా నా చేతులతో ఉత్తరాలిస్తే తప్ప మనశ్శాంతి వుండదు. ఇదిగోండి"అంటూ నా చేతిలో ఉత్తరాల కట్ట పెట్టాడు పోస్ట్ మెన్."చూడరా! ఇవన్నీ "తీయ తేనియ తెలుగు" లో పడిన నా కథకి వచ్చిన స్పందన. డబ్బుతో దీనికి విలువ కట్టగలమా చెప్పు? ఆఁ.. అన్నట్టు ఇదిగో చూడు..నా కథ ఎంతగానో నచ్చి వచ్చే నెల్లో ఒంగోల్లో నాకు సన్మానం చేస్తారట. అంగీకారం తెలియజేయమని ఉత్తరం రాసారు. చూశావా! నీ దృష్టిలో పారితోషికం పంపని ఆ పత్రికకి విలువలేదు..కానీ అదే నా విలువని ఎంత పెంచిందో? పత్రికని నడపడం అంత సులువుకాదు..దాని వెనక అభిరుచితో పాటు చాలా ఒడిదుడుకులుంటాయి. మనలాంటి వాళ్ళు పత్రికల్ని బ్రతికిస్తే అవి ఊపిరిపోసుకుని మనలాంటి అనేకమంది రచయితలకి..కవులకి..చిత్రకారులకీ.. జీవంపోస్తాయి. అయినా రచయితలుగా మనం పత్రికలని అర్ధం చేసుకోకపోతే, ఎవరు అర్ధం చేసుకుంటారు? నీకు వీలైతే పత్రికల్ని ప్రోత్సహించు..అంతేకాని మన పత్రికల మీద అందరి ముందూ అవాకులూ చెవాకులూ మాట్లాడకు" అన్నాను బాధగా!
వాడు ఉన్నట్టుండి అక్కడ్నుంచి గబ గబా వెళ్ళిపోసాగాడు.
"ఒరే ఎక్కడికిరా? కోపమొచ్చిందా?" అన్నాను అరుస్తూ. "కాదురా! ఇన్నాళ్ళూ తప్పుడు ఆలోచనతో చీకట్లో వున్నాను..ఇప్పుడే సాటి రచయితగా నా కళ్ళు తెరిపించావు. నేనిప్పుడే నా కథ "తీయ తేనియ తెలుగు"కి పోస్ట్ చే॑స్తాను. అంతే కాదు ప్రతి పత్రికనీ ప్రోత్సహిస్తాను." మాటల్లో పశ్చాత్తాపాన్ని మిళితంచేస్తూ అన్నాడు.