మరణ మృదంగం - చెన్నూరి సుదర్శన్

marana mrudamgam

భీమారం అనే ఒక గ్రామానికి ఆనుకొని ఒక చిట్టి అడవి ఉంది. ఒకప్పుడు ఇది మహారణ్యమే కాని కాలక్రమేణా మానవుల వంట చెరకుగా చెట్లు బలి అయిపోతూ ప్రస్తుతం చిట్టడివిగా మిగిలి పోయింది.

ఈ అడవిలో ఒక ఎలుగుబంటి ఉంది. దానికి ఆహారం పెద్ద సమస్యగా మారింది. పండ్లు, కందమూలాలు చిట్టడవిలో సమృద్ధిగా లభించేవి కావు. ‘ఆహార సమస్యను పరిష్కరించుకోవడం ఎలాగా..?’ అని మనసులో మదనపడ సాగింది..

ఒక రోజు మృదంగం వాయిస్తూ నృత్యం చేస్తూ ఊరూరా అడుక్కుతినే ఒక బిచ్చగాడు ఆ అడవిగుండా వెళ్తుంటే వానిపై పడింది. తనకు కావాల్సిన ఆహారమేదైనా దొరుకుతుందేమోనని ఆశగా వెదికింది. వాని బొచ్చెలో అన్నం, వివిధ రకాల కూరలు, పచ్చళ్ళూ, పప్పు, పులుసు కనిపించే సరికి రుచి చూసింది. ఆవురావురు అంటూ మొత్తం తినే సింది. వాడి సంచిలో ఉన్న సొరకాయ బుర్రలోని నీళ్లన్నీ తాగింది.

వాని దగ్గర ఉన్న మృదంగం లాక్కొని అందులో ఇంకా ఏమైనా తిను భండారాలు ఉన్నాయేమోనని కొట్టి చూసింది. మృదంగం నుండి వచ్చిన శబ్దం దానికి విచిత్రంగా వినపడింది. ఆ శబ్దం వినపడగానే అలవాటు ప్రకారం ఆ బిచ్చగాని కాళ్ళు నృత్యభంగిమలోకి మారాయి. ఎలుగుబంటికి నవ్వు వచ్చింది. అది అలాగే వాయిస్తూ పోయింది. వాడు భయం భయంగా నృత్యం చేయసాగాడు. మధ్య మధ్యలో ఎలుగుబంటి వాని మీద పడబోతున్నట్లు నటిస్తూ మరింత భయపెట్టసాగింది. వాని ముఖంలోని భయం చూసి సంబర పడసాగింది. వాడు రెండు చేతులా దండం పెడ్తూ కన్నీరు కార్చ సాగాడు. ఎలుగుబంటికి జాలి వేసింది.. ఇంతలో తన బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. ఆ గ్రామ ప్రజలు పట్టణానికి వెళ్ళాలంటే ఈ అడవిగుండా ప్రయాణించక తప్పదని ఎలుగుబంటికి తెలుసు. ఒకవేళ అది ఊళ్ళోకి వెళ్ళితే అంతా కలిసి కట్టుగా చంపేస్తారననే భయం కూడా లేక పోలేదు అందుకే అది ఒక ఉపాయం పన్నింది.

బిచ్చగానితో “ఇక వెళ్ళు.. వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్పు. ఈ అడవి గుండా వెళ్ళే వారెవరైనా క్షేమంగా ప్రయాణించాలనుకుంటే నాకోసం ఇలాంటి ఆహారం తీసుకు రావాలి. లేదా వారి రక్తం తాగుతాను..” అంటూ ఉరిమి చూసింది. బిచ్చగాడు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలికి బుద్ధి చెప్పాడు.

ఈ విషయం భీమారం ఊళ్ళోని పెద్ద మనుషులకు చెప్పి రోదించాడు బిచ్చగాడు. ఆ గ్రామ పెద్ద ఎలుగుబంటికి ఆహారం తీసుకు వెళ్ళే నియమాన్ని ఊళ్ళో దండోరా వేయించాడు.

భీమారం ప్రజలు ఎలుగుబంటి కోసం అన్నపానీయాలు సమర్పించుకోవటం పరిపాటి అయిపోయింది. అలా ఎలుగుబంటికి అన్న పానీయాలకు అలవాటు పడి కడుపు నింపుకోసాగింది. ఒకవేళ ఎవరైనా ఒట్ఠి చేతులతో వెళ్ళితే మరణమృదంగం వాయిస్తూ నృత్యం చేయించేది. వారు ప్రాణ భీతితో మారిన ముఖ కవళికలను చూస్తూ సంబరపడేది. వారి నృత్యంతో పైశాచిక ఆనందం పొందేది. ఒక్కొక్క సారి నృత్యం చేస్తూ అలిసి పోయి చనిపోయిన వారూ ఉన్నారు. అప్పటి నుండి జనమంతా దాని చేతిలోని మృదంగాన్ని ‘మరణ మృదంగం’ అనే వారు.

ఆ చిట్టి అడవిలో మరే ఇతర క్రూర జంతువులు లేనందున దాని ఆగడాలు మితిమీరిపోయాయి. తనే ఆ అడవికి మహారాజుననే గర్వం దాని ముఖంలో తొణికిసలాడేది.

ఎలుగుబంటికి క్రమేణా ఇదొకరకమైన సరదాగా మారింది. అది మృదంగం వాయిస్తూ.. ఒక పెద్ద బావిలోకి తొంగి చూస్తూ జనం పడే మరణ వేదన హావ భావాలను అనుకరిస్తూ సంబర పడేది. ప్రాణం పోతుందంటే అంత భయ పడాలా? అని నిర్లక్ష్యంగా నవ్వుకునేది. మనుషులకు ప్రాణం మీద ఎందుకో అంత తీపి?.. అని పరిహసించేది. తను ప్రజల్లో కలిగించిన భయాన్ని తలుచుకుంటూ గర్వపడేది.

అదే గ్రామంలో ఆండాళు అనే వృద్ధురాలు నివసించేది. ఆమెకు తోడూ నీడా సర్వస్వం ఆమె మనుమడే.. పేరు కరుణాకరుడు.

ఆండాళు అరిసెలు, గారెలు మొదలగు తిను భండారాలు చేయడంలో దిట్ట.

కరుణాకరుడికి అమ్మమ్మ అంటే పంచప్రాణాలు. ఆమె పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే వాడు. ప్రతీ రోజూ తెల్లవారు ఝామున్నే లేచి అడవికి వెళ్లి కట్టెలు తెచ్చేవాడు. అవి రాగానే అరిసెలు చేయడం మొదలు పెట్టేది ఆండాళు. సాయంత్రానికల్లా అరిసెలు చేయడం.. అమ్మడం పూర్తయ్యేది. ఆతరువాత అరిసెలకు కావాల్సిన ముడి సరకులు కొనుక్కొని వచ్చే వాడు కరుణాకరుడు. ఇదీ వారి నిత్యకృత్యం.

ఒక రోజు యథావిధిగా కరుణాకరుడు అడవికి వెళ్లాడు. ఎలుగుబంటి కోసం సద్ది మూట తేవడం మర్చి పోయాడు. ఎలుగుబంటికి విపరీతమైన కోపం వచ్చింది. జూలు విదిల్చి బిగ్గరగా అరిచింది. దాని కోపం చూడగానే కరుణాకరుడు ‘ఇక నాకు చావు తప్పదు’ అని గజ గజ వణుకసాగాడు. అది గమనించిన ఎలుగుబంటికి పాపమనిపించింది. అయితే తన మనసులోని సందేహాన్ని నివృతి చేసుకోవాలని “మనుషులకు ప్రాణాల మీద అంత తీపి ఎందుకు?” అంటూ అడిగింది. ఎలుగుబంటి మాటల్లో పడేసరికి కరుణాకరుడికి కాస్తా ధైర్యం వచ్చింది. దాని ప్రశ్నకు సమాధానం చెప్పడం కాదు.. స్వయంగా అది అనుభవించేలా చేయాలని మనసులో అనుకున్నాడు. మాట మార్చాడు..

“మా అమ్మమ్మ ఆండాళు అరిసెలు చేయడంలో అందె వేసిన చేయి. ఆమె అరిసెల వాసన ఆమడ దూరం అదరగొడ్తుంది. కమ్మని తియ్యని ఆ వాసన ఆస్వాదించాలే గాని చెప్పనలవి కాదు. కట్టెలు తీసుకొని వెళ్లి అరిసెలు చేయించుకొని నీకోసం సాయంత్రం తిరిగి వద్దామని అనుకున్నాను. అందుకే ఈ పూట ఏమీ తేలేదు” అన్నాడు.

కొత్తరకం వంటకం పేరు వినరావడంతో భోజన ప్రియమైన ఎలుగుబంటి తన ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడకుండా “అయితే తొందరగా వెళ్ళు.. సాయంత్రం తప్పకుండా రావాలి సుమా..! నాకు నోరు ఊరిపోతోంది..” అంటూ లొట్టలు వేయసాగింది.

కరుణాకరుడు కట్టెలు కొట్టుకొని ఇంటికి వచ్చాడు..

ఆండాళు అరిసెలు చేస్తుండగా మెల్లిగా అడవిలో జరిగిన విషయం చెప్పాడు. ఆండాళు ఒక చక్కని ఉపాయం చెప్పింది. అందుకే అంటారు..‘ముసలి వాళ్లు ఇంట్లో ఉంటే వారి అనుభవాలతో ఎంతటి అపాయాన్ని అయినా ఉపాయంతో తప్పించుకోవచ్చు’ అని. ఎలుగుబంటి సాయంత్రం ఎప్పుడు అవుతుందా, కరుణాకరుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు అరిసెలు తింటానా... అని ఎదురు చూడసాగింది...

సాయంత్రం అయ్యింది.. సూర్యుడు అస్తమించాడు. క్రమేణా చీకట్లు కమ్ముకో సాగాయి.. రాత్రి కావస్తోంది.. కరుణాకరుని జాడ లేదు. ఎలుగుబంటికి ఒక పక్క కడుపులో ఎలుకలు పరుగెత్తుతుంటే కోపం విజృంబించ సాగింది. ‘ఇక లాభం లేదు కరుణాకరుడు మోసం చేశాడు. మరునాడు కూడా వస్తాడన్న ఆశ లేదు.. కనుక నేనే వెళ్లి వాని అంతు చూస్తాను..’ అని మనసులో అనుకుంటూ గ్రామంలో ప్రవేశించింది. ఊళ్లో ఆడుగు పెట్టగానే ఎన్నడూ ఆస్వాదించని కమ్మని తియ్యని వాసనలు తన ముక్కుపుటాలను తాకే సరికి ఒళ్లు పులకిరించి పోయింది. ‘కరుణాకరుడి ఇల్లు దొరకడం చాలా తేలిక..’ అని మనసులో సంబరపడుతూ వాసన వెంట పరుగులు తీసింది.

ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఎలుగుబంటి నెమ్మదిగా ఆండాళు ఇంట్లోకి ప్రవేశించింది. కరుణాకరుడు నులక మంచంలో పడుకొని ఉన్నాడు. అరిసెలు ఎలా ఉంటాయో తెలియక తిక మక పడింది. ఎంత వెతికినా ఆ వాసన కల్గిన పాత్రలన్నీ ఖాళీగా కనిపించాయి. అలికిడి అయితే అంతా లేచి తన పని పడతారని అనుమానం వేసింది. ఎటూ పాలుపోని పరిస్థితి.. కోపంతో కరుణాకరుడు పడుకున్న మంచాన్ని అమాంతం తన వీపు మీదకు ఎత్తుకొని అడవిలోకి పరుగు తీసింది. ఇది గమనించి వసారాలో పడుకున్న ఆండాళు మనుమనికి తాము పన్నిన ఉపాయాన్ని సైగలతో గుర్తు చేసింది.

కరుణాకరుడు నెమ్మదిగా ఎలుగుబంటి వెండ్రుకలను నులకకు ముళ్లు వేస్తూ పోయాడు. ఎలుగుబంటి నేరుగా అడవిలో రోజూ తన ముఖాన్ని నీళ్ళల్లో చూస్తూ సంబరపడే బావి వద్దకు వచ్చింది. బలాన్నంతా పుంజుకొని మంచాన్ని బావిలోకి విసిరేసింది. అప్పటికే బావి గోడలపై వేళ్ళాడే మర్రి చెట్టు ఊడలను పట్టుకొని కరుణాకరుడు తప్పించుకున్నాడు. ఎలుగుబంటి మంచంతో సహా బావిలో పడిపోయింది. ఈ హఠాత్పరిణామానికి ఎలుగుబంటి భయంతో కంపించి పోయింది. నీళ్లలో మునుగుతూ ఇక చావు తప్పదు అనే ఆలోచన మదిలో రాగానే.. చావు అంటే ఎంత భయంకరమో! దానికి తెలిసి వచ్చింది. వెన్నెల వెలుగులో బావి నీళ్లలో తన మరణ భీతి ముఖాన్ని చూసి కన్నీరు కార్చసాగింది. తన చెవులలో మరణ మృదంగం అవహేళనగా మ్రోగుతున్నట్లు అనుభూతికి లోనయ్యింది.

‘మనుషులకయినా జంతువులకయినా ప్రాణము ఒకటే.. దానిని కాపాడుకోవాలే గాని ఒకరి ప్రాణాలు తీయవద్దు.. భగవంతుడా నన్ను క్షమించు..’ అంటూ భగవన్నామస్మరణ చేయసాగింది.

కరుణాకరునికి పాపమనిపించింది. వన్య మృగాలను సంరక్షించుకోవాలే కాని సంహరించడం మహా నేరం అనుకున్నాడు..

సాహసించి మర్రి ఊడల సహాయంతో బావి అంచుల గుండా వెళ్లి మంచానికి కొన్ని లేత ఊడలను ఒడిసి కట్టాడు. మళ్ళీ పైకి వచ్చి తన ప్రాణాలకు తెగించి అత్యంత నైపుణ్యంతో ఎలుగుబంటిని కాపాడాడు.

ఎలుగుబంటి వెనుక కాళ్లపై నిలబడి ముందు కాళ్లతో దండం పెట్టింది. ఇక ముందు ఎవరి జోలికీ వెళ్లనని దట్టమైన అడవిలోనికి వెళ్ళి దొరికిన కందమూలాలు తింటూ జీవనం గడుపుతానని ప్రమాణం చేసింది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి