పుట్టినిల్లు - కె. శ్రీలత

puttinillu telugu story

ఎంత వద్దనుకున్నా ప్రక్కింటి పిన్ని గారి మాటలు పదే పదే గుర్తుకు వస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి వనజను. " ప్రతీ పండక్కి నీ ఆడపడుచు భర్తా, పిల్లల్లతో సహా వచ్చి పది రోజులకు పైగా వుండి వెళ్తూంటే నువ్వు పాపం అమాయకత్వంతో ఊర్కుంటున్నావు కానీ ఈ రోజుల్లో ఎవరూ నీలాగా భర్తింటి బంధువులను భరించట్లేదమ్మాయ్.. ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో " అని ఆవిడ చెప్పిన ప్పట్నుంచీ ఎలాగైనా ఈసారి పండుగ సెలవులకు కుటుంబంతో సహా వచ్చే ఆడపడుచు లావణ్యను రానీయకుండా కట్టడి చేయాలని ఆలోచిం చింది వనజ. తన ఆలోచనలో తనుండగానే సెల్ ఫోన్ రింగయ్యింది. చూస్తే, ఇంకెవరు..ఆడపడుచు లావణ్య దగ్గర్నుంచే... ఎప్పటి లానే పండుగ సెలవులకు అందరం వస్తున్నామని రిజర్వేషన్ కూడా చేయించేసుకున్నామని ఆ ఫోన్ సారాంశం.. అప్పటికప్పుడు ఏ సాకూ చెప్పటానికి వీలులేక సరే అని ఎలా వున్నారందరూ అంటూ ఏదో పొడిగా కుశల ప్రశ్నలు అడిగి ఫోన్ కట్ చేసింది వనజ.

ప్రతీసారీ ఆడపడుచు సెలవుల్లో భర్త, పిల్లలతో కల్సి రావటమూ ఇల్లు గుల్ల చేయటమూ పరిపాటైపోయింది ఇంటెడు చాకిరీ తోపాటు, పిండి వంటలు, అదనపు ఖర్చులు, ఇంటిల్లిపాదికి కొత్తబట్టలు, ఇవేమీ తప్పటం లేదు. ఈసారి తను ఎలాగైనా భర్తతో సంప్రతించి అర్థమొగుడ్ని ఇంటికి రానీయకుండా చేయాలని నిర్ణయించుకున్నాక కాస్త శాంతించిందామె మనసు.

వనజ తల్లిదండ్రులు చిన్నప్పుడే పోవడంతో మేనమామ సం రక్షణలో పెరిగిన ఆమెను వారి దూరపు బంధువు అయిన రామారావు గారి కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి కాణీ కట్నం లేకుండా వారి అబ్బాయి ఆనంద్ కిచ్చి పెళ్ళి జరిపించి చేతులు దులుపుకున్నాడు వనజ మేనమామ. వనజ తల్లి తండ్రుల తాలూకు కాస్త డబ్బూ కాజేసి పెళ్ళి చేసాక కనీసం సంవత్సరంలో ఒకసారి కూడా ఆమెను తీసుకెళ్ళే ప్రయత్నం చేయకుండా పాపం ఏ మాత్రం కూడా పుట్టింటి ఆశ లేకుండా చేశాడు. కానీ వనజ అత్తవారింట అడుగు పెట్టిన వేళా విశేషం వల్ల అప్పటిదాకా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న ఆనంద్ కు ప్రభుత్వ వుద్యోగం రావటమూ, ఆనంద్ చెల్లెలు లావణ్యకు అన్నివిధాలా అనుకూలమైన మంచి సంబంధం కుదిరి పెళ్ళి కావటంతో వనజ మామగారు అలాగే అత్తగారైన జానకమ్మ గారు ఎంతో సంతోషించి వనజను కోడలిలా కాక కూతురిలా చూసుకున్నారు..

పుట్టింటి ఆదరణకు నోచుకోని వనజ కూడా అత్తగారికీ, మామగారికీ సపర్యలు చేసుకుంటూ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంటూ వాళ్ళందరితో బాగా కలిసిపోయి మసులుకునేది. ఇద్దరు బిడ్డల తల్లయింది. రెండు పురుళ్ళూ అత్తగారే పోసి తల్లిలా ఆదరించింది. కానీ అనుకోకుండా మామగారికి హార్ట్ ఎటాక్ వచ్చి అకాల మరణం చెందటమూ, ఆ తర్వాత ఏడాది తిరక్కుండానే భర్త మీద బెంగతో అత్తగారు కూడా పోవడంతో అన్ని కార్యక్రమాలూ బాధ్యతగా ముగించి ఆ ఇంటికి యజమానురాలయింది వనజ. అప్పట్నుంచీ ఆడబిడ్డ లావణ్య మంచిచెడ్డలు చూడడం పండక్కి పిలిచి ఇంటిల్లిపాదికీ బట్టలు పెట్టి పంపించడమూ అలవాటయ్యింది. ఇదిగో ఇప్పుడు కొత్తగా నాటుకున్న విషబీజం ఆమె మనసులో కల్లోలం రేపింది.

ఆరోజు రాత్రి భోజనాలు అయ్యాక భర్తత్తో మాట్లాడుతూ మాటల సందర్భంలో ఈసారి సెలవులకి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా టూర్ కి వెళ్దామని అంది. ఎప్పుడూ శాంతవదనంతో ఉండే ఆనంద్ ముఖంలో కోపం చోటు చేస్కుంది. చెల్లాయి, బావగారు వస్తున్నామని నాకు ఫోన్ చేసి చెప్పారు. అయినా ఎన్నడూ లేనిది ఇలా కొత్తగా అడుగుతున్నావు.ఒకవేళ నిజంగానే టూర్ కి వెళ్ళటమంటూ జరిగితే ఈసారి సెలవులకి అదీ చెల్లీ, పిల్లలు అందరితో కలిసే.. గుర్తుంచుకో అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆనంద్. చేసేదేం లేక మిన్నకుండిపోయింది వనజ.
లావణ్య బయలుదేరానని ఫోన్ చేయగానే బాత్రూం లో జారి పడ్డట్టు నటించి మంచమెక్కి దుప్పటి ముసుగేసింది వనజ. ఇంటిపనీ వంటపనీ చేయలేక వచ్చిన దారినే ఆడబిడ్డ వెళ్ళిపోతుందని వనజ అభిప్రాయం. కానీ దానికి విరుద్ధంగా లావణ్య వచ్చీరావడంతోనే వదిన అలా వుండడం చూసి కన్నీళ్ళ పర్యంతమయింది. గబగబా వంటచేసి అన్నపిల్లలకు, తన పిల్లలకు వండి వడ్డించింది. ఆ మరుసటి రోజునుంచే ఇల్లంతా బూజులు దులిపి, కడిగి దుప్పట్లన్నీ వాషింగ్ మెషీన్ లో వేసి పిల్లలకి ఇష్టమయిన పిండివంటలన్నీ చేయడమే కాకుండా వదినను మంచం దిగనీయకుండా అన్ని సపర్యలూ చేసి కన్నతల్లిలా ఆదరించింది. ఇంటెడు చాకిరీ చేసినా ఏ మాత్రం అలసటా, విసుగు ప్రదర్శించలేదు. అంతేకాకుండా పిల్లలందరికీ తన డబ్బులతోనే కొత్తబట్టలు కొనిచ్చింది. వారం రోజులు గడిచిపోయాయి.

ఇక రెండురోజుల్లో లావణ్య తిరుగు ప్రయాణం. రాత్రి పదిదాటుతున్నా నిద్రపట్టక మంచం మీద దొర్లుతున్న వనజకు తన రూం పక్కనే వున్న బాల్కనీలో భర్త ఆనంద్, లావణ్య మాట్లాడుకునే మాటలు వింపించసాగాయ్. "అన్నయ్యా! మా అత్తగారింట్లో నిత్యం ఇంటి పనులతో అలసిపోయి నేను సెలవుల పేరు చెప్పి ఇలా ఈ కొద్ది రోజులు ఇక్కడికి వచ్చి అమ్మలాంటి వదిన చేతివంట తిని, మీ అందరితో కులాసాగా గడిపి విశ్రాంతి తీస్కున్నందువల్ల వచ్చిన ఆనందంతో తిరిగి మిగతా రోజులన్నీ అలుపు తెలీకుండా మా అత్తగారింట్లో గడపడానికి మీతో గడిపిన ఈ సంతోషం బూస్ట్ లాగా పని చేస్తుంది. కానీ ఇన్నిరోజులూ నేనొక విషయం విస్మరించాను. నేను ఎలా అయితే పుట్టినింటి హక్కునీ, ఆనందాన్నీ అనుభవిస్తున్నానో అలాగే వదిన కూడా విశ్రాంతి కోరుకుంటుంది కదా ! కానీ ' పుట్టినిల్లు ' అనే వరం నోచుకోని వదినను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. ఇంతకాలం నేను ఆ విషయం గమనించలేదు. కానీ ఇలా వదిన మంచం మీద నుంచి లేవకుండా వుంటే నాకు చాలా బాధగా వుంది. అందుకే నేను వదిననూ, పిల్లల్నీ నాతోబాటు మా అత్తగారింటికి తీసుకెళ్తాను. తను విశ్రాంతి తీసుకుని మామూలు మనిషయ్యే వరకూ నెలరోజులపాటు మాతో వుంచుకుని పంపిస్తాను. మా అత్తగారు నా మాట కాదనరన్న నమ్మకం నాకుంది. " అంటున్న లావణ్య ఔన్నత్యం ముందర లేకిగా ఆలోచించి నాటకమాడి మంచమెక్కిన తన వ్యక్తిత్వానికి తనకే సిగ్గేసింది వనజకు. కానీ ఈ విషయం వెల్లడి చేసి తన మర్యాద పోగొట్టుకోకూడదని భావించి కలత నిద్రతో రాత్రంతా గడిపింది.

తెల్లవారుఝామునే లేచి ఇంటిపని ముగించి ఆడపడుచుకి , పిల్లలకు ఇష్టమైన వంటకాలన్నీ చేసింది. ఆశ్చర్యంగా చూస్తున్న లావణ్యతో పది రోజులుగా విశ్రాంతి తీసుకున్నందువల్ల తను కోలుకున్నానని చెప్పటమే కాకుండా ఎప్పట్లాగే పిల్లలతో, లావణ్యతో సరదాగా గడిపి, షాపింగ్ కి తీసుకెళ్ళి ప్రతీ ఏడాది పెట్టే బట్టలకంటే ఖరీదైన బట్టలు తనే అందరికీ కొని ఇంట్లో పండగ వాతావరణం నెలకొనేలా చేసింది.

తనతోపాటు రమ్మని మరీ మరీ చెప్పిన లావణ్యతో తప్పకుండా ఈసారి సెలవులకి వచ్చి ఆడపడుచు ఇల్లునే 'పుట్టినిల్లు' గా భావించి విశ్రాంతి తీస్కుంటానని చెప్పి దగ్గరుండి మరీ ఆడపడుచునీ, ఆమె భర్తనీ, పిల్లనీ రైలెక్కించి నిండైన మనసుతో ఇంటికి వచ్చింది వనజ.
కన్నవారు, తోడబుట్టినవారు వుంటేనే, 'పుట్టినిల్లు' కాదనీ, ప్రేమతో ఆదరించి ఆపద సమయంలో మేమంతా వున్నామని భరోసా ఇచ్చే గొప్ప మనసుగల మనుష్యులు వున్న ఏ ఇల్లయినా ప్రతీ ఆడపిల్లకు 'పుట్టినింటి' తో సమానమని గ్రహించిన వనజ ఇకపై ఎప్పుడూ ప్రక్కింటివాళ్ళ మాటలూ, ఎదురింటి వాళ్ళ మాటలూ విని అయినవాళ్ళను బాధపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుంది.

చెల్లినీ, పిల్లలనూ సెలవులకి ఇంటికి రానీయకుండా చేసిన భార్య ప్రయత్నం, ఆమె చేసిన నటన ఆ తర్వాత పశ్చాత్తాపంతో చెల్లాయి లావణ్య పట్ల భార్య ప్రవర్తన అన్నీ మౌనంగా గమనిస్తున్న ఆనంద్ మనసులోనే నవ్వుకున్నాడు. ఆడవారి సున్నితమైన మనస్తత్వానికి మనసులోనే జోహార్లర్పించాడు. వాళ్ళిద్దరూ ఇలాగే జీవితాంతం తోబుట్టువులుగా వుండాలని మనస్పూర్తిగా ఆశించాడు.
చదువుకున్నవారయినా, విజ్ఞతతో ఆలోచించి స్వంత విషయాలలోనూ, కుటుంబ విషయాలలోనూ సంబంధం లేని వ్యక్తుల మాటలు చెవికెక్కించుకోకుండా కుటుంబంలోని సభ్యులందరి మధ్యా బంధుత్వం తెగకుండా చిన్న చిన్న విషయాలలో సర్దుబాటు ధోరణి అలవర్చుకుంటే క్రొత్తగా పెళ్ళయ్యి, అత్తవారింటికి వెళ్ళిన ఏ ఆడపిల్లకయినా అత్తవారిల్లు కూడా 'పుట్టినిల్లు' గానే వుంటుందనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు