మాణిక్యరావు—మేనకోడలుపెళ్ళి. - ఆదూరి హైమవతి

manikyarao-menakodali pelli telugu story
ఆదివారం విశ్రాంతి గా పడక్కుర్చీలో శ్రీమతి అందించిన మూడోకప్పు కాఫీ తాగి టీపాయ్ మీద కాళ్ళు బారచాపుక్కూర్చుని తెలుగు పేపర్లన్నీ పరీక్షకెళ్ళే కుర్రడిలా చదివినవే చదివినవే చదువుతూఆనందిస్తున్నాడు మాణిక్యరావు. ఆదివారం అలా రిలాక్స్ కావటమంటే అతడికెంతో ఇష్టం. పనిదినాల్లో పడ్డ శ్రమనంతా అలామర్చి పోతుంటాడతగాడు. ఆరోజు అస్సలు మొబైల్ ఫోన్ ఎత్తడుగాక ఎత్తడు. దాన్ని స్విచ్ ఆఫ్ చేసి స్టోర్రూంలో బియ్య బ్బస్తాచాటున పెడతాడు . అతడి ఆనందాన్ని భంగపరుస్తూ ల్యాండ్ లైన్ మోగింది .సంతోష సముద్రంలో ఈదు లాడు తున్న అతగాడికి ఎదురుగా మొసలి వచ్చి వికటాట్టహాసం చేసినట్లు అదిరిపడి తలెత్తి చూశాడే కానీ లేచి ఫోన్ ఎత్తలేదు. అతగాడు తాగి ఖాళీ చేసిన మూడో కాఫీకప్పు తీసుకెళ్ళేందు కొచ్చిన అతడి సతీమణి సుందర మణి , "ఏమండీ ! ఫోన్ అలా కుక్కపిల్లలా అరుస్తుంటే లేచి చూడరేం? మొబైల్ ఎటూ ఆపేస్తారు ,ల్యాండ్ఫోనూ తీయరా ! మీ తపస్సు కూలా! " అంటూ వెళ్ళి తీసుకుని, " హల్లో ! నేను సుందరమణీ ని మాట్లాడుతున్నాను, ఎవరుకావాలండీ!" అని అడిగింది.

అవతలి కంఠం విని " ఓ మీరా వదినగారూ! ఉండండి పిలుస్తాను ,మీతమ్ముడు ఆదివారం ఆనందాభ్ధిలో ఉన్నారు లెండి" అంటూ మౌత్ పీస్ మూసి," వదినగారండీ! అదే మీ అలివేలు అక్కగారండీ!" అంటూ తెచ్చి అందించింది.

" హలో అక్కా! ఏంటే పొద్దుటే ఫోన్ చేశావు?" అన్నాడు , సదా సీదాగా మాణిక్యరావ్, సోఫాలో ముందుకు వంగి.

"పొద్దుటే ఏంటిరా! నీకు ఆదివారం పదైతేకానీ తెల్లారదు.మొబైల్ ఆదివారం ఆపేస్తావాయె ! తెల్లారు ఝాము నుంచీ ఎప్పుడు పదవుతుందాని ఎదురుచూస్తున్నానురా!.." నిష్ఠూరంగా అంది అక్క అలివేలు.

" సర్లే వే చెప్పు విషయమేంటో , అర్జెంటా? " తనవిసుగునంతా కంఠంలో కనిపించకుండా దాచుకుంటూ అన్నాడు.

" అయ్యో అర్జెంటేంటిరా! అతిజరూరు విషయం,మీరెండో మేనకోడలు మేనక పెళ్ళి నిశ్చయమైందిరా!..."

" ఆ .." అంటూ సోఫాలో వెనక్కు పడిపోయిన భర్తను చూసి సుందరమణి దగ్గరకొచ్చి,"ఏమైందండీ!అక్కడ అంతా క్షేమమేగా! ఎందుకండీ అలా కంగారుగా పడిపోయారు? చెప్పండీ!.." అంటూ అడిగి ,అతగాడేమీ మాట్లాడక పోడం తో , క్రింద పడ్డఫోన్ అందుకుని " వదినా చెప్పండీ! ఏంటి విషయం? అంతా కులాసేగా! " అంది .

“ఏంటే మరదలుపిల్లా ! వాడలా ఫోన్ కట్ చేశాడూ!”

" ఏంలేదులెండి వదినా !రాత్రి పొద్దుపోయివచ్చారు,ఆఫీస్లో పనివత్తిడి, నడుంపట్టుకున్నట్లుంది వెనక్కువాలా రంతే. అసలు విషయం చెప్పండి వదినా!" అంది సుందరమణి, భర్త అభినయాన్ని కప్పిపుచ్చుతూ, అర్ధాంగి కదామరి!

"ఏం ! మాతమ్ముడు మేమమామై ఉండీ అన్నీపట్టించుకుని వెతికి మేనకోడలిపెళ్ళి చేయాల్సిందిపోయి ,’నీ రెండో మేనకోడలి పెళ్ళికుదిరిందిరా ! ‘అనగానే ,'ఆ ' అంటూ అరుస్తాడా!” అంటూ మరదలుపై కారాలూ మిరియాలూ నూరుతున్న వదినగారిని, చల్లబరుస్తూ “వదినా! ఆయన సరిగా విని ఉండరులే గానీ పాపం నడుంపట్టి కూర్చు న్నట్లున్నారు , ఇస్తానుండండి.." అంది, సహధర్మచారిణి కనుక సమయానుకూలంగా సందర్భసహితంగా ఇబ్బందిలేని అబధ్ధం చెప్తూ.

“సరేలే విను విషయం ,అసలీ సంబంధ కుదురుతుందని అనుకోనేలేదు. అబ్బాయి బావుంటాడు, మన మేనకని చూడగానే ఇష్ట పడ్డారు. పిల్లా పిల్లాడూ ఈడూ జోడూ బాగా కుదిరింది. ఇంటి కెళ్ళి చెప్తామని రాత్రి పదకొండింటికే పెళ్ళి మూహూర్తంతో సహా ఫోన్ చేశారు.నా గుండెల మీద కుంపటి దిగిపోతున్నందుకు హాయిగా ఉంది సుందరీ!

సరేలేవాడినడుం నొప్పిసర్దుకున్నాక , తీరుబాటుగా ఫోన్ చేయమను. ముందుగా వచ్చి అన్నీ చేయాలి. పై నెల్లో నే ఐదో తేదీ ఆదివారం పెళ్ళి. చెప్పువాడికి, ముందుగా సెలవు పెట్టుకురమ్మను. ఇంకా అందరికీ చెప్పాలి “ అంటూ ఫోన్ కట్ చేసింది.

ఫోన్ పెట్టేసి," అదేంటండీ! మీ రెండో మేనకోడలు పెళ్ళని చెప్తే సంతోషించడంపోయి, అలా వెర్రి అరుపు అరిచి వెన క్కు పడి పోయా రేంటండీ ! అవతల మీ అక్కగారే మనుకుంటారోని అతికినట్లు అబధ్ధం చెప్పాల్సివచ్చింది!" అంది ఆశ్చర్యం గా సుందరమణి.

" సరేలే ఉధ్ధరించావు.దానిపెళ్ళి కుదిరిందంటే బాధ నాకా నీకా! పెద్ద మేనకోడలిపెళ్ళినిర్వహించిన బాధ ఇంకా తగ్గనే లేదు. " అరిచినంత పని చేశాడు మాణిక్యరావు.

" ఇది మరీ బావుందండీ! ఉరు మిరిమి మంగలం మీదపడ్డమంటే ఇదేమరి!మీ అక్క కూతురిపెళ్ళి , మాట్లా డింది మీ అక్కా! మధ్యలో నాకెంటిట! ,కొపందీసి దాన్నిగానీ చేసుకోవాలనుకున్నారేంటీ? మా అన్నలిచ్చే కట్న కానుకలకు లోబడి నన్నుచేసుకుని దాన్ని మనస్సులో పూజిస్తున్నారా!" గొంతు గాద్గదికంకాగా అంది సుందర మణి.

ఉలిక్కిపడి భార్యవైపుచూస్తూ " ఛ నోర్ముయ్ ! దాన్ని నేను చేసుకోడమేంటే! పిచ్చిగానీ ఎక్కలేదు కదా!"" అదేంటో మీకే ఎక్కి ఉండాలి.నాక్కాదు. అసలు మీరెందుకు మీ రెండో మేనకోడలి పెళ్ళికుదిరిందంటే బాధపడు తున్నారో తేల్చండి." అంటూ ఎదురుగ్గా నేలమీదే మఠం వేసుకు కూర్చుంది సుందరమణి.

" చూడూ సుందరీ! నీవెప్పుడైనా నా మేనకోడళ్ళని చూశావా? రెండో మేనకోడలు మేనకని చూశావా!"
చూడకేం! ఫోటోలో చూశాన్లే!"ముఖంత్రిప్పుకుంటూ అంది సుందరి, లోలోపల ' మేనక నిజంగా నే మేనకంత అందగత్తె! . మరి ఈయనెందుకు దాన్ని చేసుకోకుండా నన్ను చేసుకున్నట్లూ!'అని కూడా అనుకుంది

"చూడూ ! సుందరీ నీమీద ఒట్టు.దాన్ని నేను చేసుకోవాలని అనుకోలేదు కలనైనా గానీ.నీకెట్లాచెప్పాలో తెలీట్లే దులే! మనపెళ్ళికి అది రాలేదులే. కాలేజ్ విహారయాత్రలకెళ్ళింది. పెద్దదాని పెళ్ళై అమేరికావెళ్లిపోయింది. మొన్న ఆఫీస్ పనిమీద వెళ్ళినపుడు ఓగంట ఖాళీ ఉంటే వెళ్ళాను . నామీద లేనిపోని అనుమానాలు పెట్టుకుని మన సంసా రంలో చిచ్చుపెట్టకు. ఈ విషయం ఇంతటితో వదిలెయ్! నిజం నిలకడమీద తెలుస్తుందిలే!...సరి లేలే నా బుజ్జివి కదూ!"అంటూ లేపి తానూ తోడుగా వంట గదిలోకి వెళ్ళాడు మాణిక్యరావు..

రోజులు క్షణాల్లా గడచిపోతున్నాయి.రోజురోజుకూ మాణిక్యరావు చింత పెరిగిపోతూ , పలవరింతలు, భయాలూ ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగి, తిండి, నిద్రలకు దూరమైపోసాగాడు.మనిషి చిక్కిపోతున్నాడు. సుందరమణి భర్త బాధ అర్ధంకాక , అనుమానించను కారణం సరిగా తోచక ,ఆంజనేయస్వామి ఆలయానికెళ్ళి అర్చన చేయించి సింధూరం తెచ్చి నుదుటపెట్టింది. సాయిబాబా గుడి కెళ్ళి విభూది తెచ్చి నుదుట నుంచసాగింది.రాత్రుళ్ళు తనని అంటి పెట్టుకుని పసి పిల్లాడిలా పడుకుంటున్న భర్తను అనుమానించడం పాపమని లెంపలేసుకో సాగింది సుందరమణి.

ఇహ పెళ్ళి వారముందనగా ఆరోజుమళ్ళా అలివేలుఫోను.సుందరి ఫోన్ తీసుకుని " చెప్పండి వదినా! మీతమ్ము లుంగారు బాగా బిజీ గానే ఉన్నారు పాపం.మీరేం కంగారు పడకండి వచ్చేస్తాంగా! సెలవుపెడతారు లెండి. మేన కోడలి పెళ్ళికి ఆమాత్రం చేయకపోతే ఎలాగా!" అంది ." నీవేమేలమ్మా! వీడికి బొత్తిగా బాధ్యత తేలీనే లేదు.సరే తల్లీ పనులన్నీ అవుతున్నైకానీ , మీ ఊర్లో గంపలవీ బాగా నేస్తారుటగా!పెళ్ళికూతురి గంప తెస్తారేంటే మరదలా?"

" ఉండండిమీతమ్ముడ్ని అడుగుతాను....స్నానం చేసినట్లున్నారు వస్తున్నారు...అంటూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది.అతగాడి సైగలు సరిగానే అర్ధం చేసుకుని ," వదినా ! ఇప్పుడంత బాగా నేసేవారులేరుట! పాపం చేతి పనులవాళ్ళు తిండిగడవక కూలీనాలీ పనులకు పోతున్నారుట. మీరు అక్కడే ప్రయత్నించండి.కావలిస్తే మా అన్నా వదినల్ని అడగనేంటి? వారుమాపెళ్ళికి తెచ్చిన గంప చాలా బావుందని అంతా మెచ్చుకున్నారుగా!!" అంది సుందరమణీ.

" సర్లే నేనే ఏదో తంటాలు పడతాన్లే!" అంటూ ఫోన్ పెట్టేసింది అలివేలు.

" చూడండీ ఇలా మాటిమాటికీ నేను మీతరఫున అసత్యాలు చెప్పలేనండీ!మీ అసలు బాధేంటో చెప్పకూడదు టండీ!ఏదైనా నివారణోపాయం ఆలోచిద్దాం." అంది సుందరి భర్త క్రాఫులోకి వేళ్ళుపోనిచ్చి అనునయిస్తూనూ.

" సుందరీ! తినబోతూ రుచి అడగటమెందుకూ ! వెళుతున్నాంగా చూద్దువుగాని.నాబాధ ఎవ్వరూ తీర్చలేనిదే సుందరీ!" అంటూ దిగులుగా ఉన్న భర్తను ఏమీ అనలేక పోయింది సుందరి.

ఇద్దరూ బట్టలు సర్దుకుని పెళ్ళికి బయల్దేరు తుండగా సుందరి తల్లికి సుస్తీగా ఉందని ఫోన్." సుందరీ నీవు నేరుగా మీ అమ్మదగ్గర కెళ్ళి పెళ్ళిరోజుకురా! నేను అక్క ఇంటి కెళతాను." అని భార్యను బుజ్జగించి ప్రయాణమయ్యాడు మాణిక్యరావు.

ఊరికి సగం దూరంలో ఉండగా “ మీరూ నాతోరండి, మా అన్నాతమ్ముడూ మీకు మంచి దోస్తులుకదా! నాతో చెప్ప కుండా దాచిన బాధేంటో వారితో చెప్పండి,మీకు నివారణోపాయం చెప్తారు. ఇంటల్లుడు కదా మీరు! మీబాధ వారిబాధ కాకపోదు" అంది సుందరమణి. 'సరి ఇదీబాగానే ఉందనుకున్నాడు.మాణిక్యరావు.అతడికి తన బావ మరదుల మీద అమోఘమైన నమ్మిక. పెళ్ళి వారిల్లుకోలాహలంగా ఉంది.మగపెళ్ళివారు వచ్చేశారు.అంతా ఎదురెళ్ళి పెళ్ళికొడుక్కు కాళ్ళుకడిగి పూల మాలలు వేసి , కొబ్బరికాయ, పసుపునీళ్ళ దిష్టి తీసి లోపలికి , విడిది గృహంలోకి ఆహ్వానించారు. సుందరమణి కూడా వచ్చి ముత్తై దువుల్లోకలిసి పోయింది. మగపెళ్ళివారు ప్రయాణ బడలికతీరాక ,పెళ్ళి తతంగాలు మొదల య్యాయి. వరపూజ తర్వాత ,స్నాతకం పూర్తైంది.పెళ్ళికుమార్తె గౌరీపూజ అవుతుండగా, పెళ్ళికొడుకు కాళీ యాత్ర కు బయల్దేరాడు. కాశీయాత్రకు తర్వాతి జీవితంలో ఒక్కమారైనా వెళ్ళేదిలేకపోయినా, మామ నుంచీ మంచి ఖరీదై న చెప్పులూ గొడుగూ ,బట్టలూ కొట్టేయనిదో దరువు.

అటునుంచీ పెళ్ళిపీటల మీదకు చేరారు."పెళ్ళికూతుర్నీ తీసుకురండి" అన్నాడు పురోహితుడు.

"మేనమామ ఎక్కడ? గంపలో కూర్చోబెట్టుకుని పెళ్ళికూతుర్ని మోసుకురావాలి " అంటున్నారు. "

మేనమామ ఎక్కడా ?పిలవండి ముహూర్తం దాటిపోతుంది.వేగం వేగం." అని పురోహితుడి అరుపులు. ఎక్కడ వెతికినా మాణిక్యరావు కానరాలేదు. అంతా సుందరమణిని అడగసాగారు " ఏమమ్మాయ్! మీ ఆయనెక్కడ! ఎక్కడ దాచావు?" అంటూ సరసాలుకూడా సాగించారు. సుందరమణి వెళ్ళి అంతాచూసింది. మాణిక్యరావు మొబైల్ స్విఛ్ఛాఫ్ చేసుంది.

అన్నలకూ ఫోన్ చేసింది. అన్నలు "వస్తాళ్ళేవే ఎక్కడి కెళతాడూ! అంతాకంగారెందుకే! ఉండుండు వచ్చేస్తాళ్ళే!" అని చివాట్లేశారు కూడా! సుందరమణికి ఏడుపొక్కటే తక్కువైంది. 'ఈపెళ్ళికుదిరిందని తెల్సినప్పట్లుంచీ భర్త పడ్డ పాట్లు, భయాలూ, పలవ రింతలూ గుర్తుకువచ్చి చాటుగా వెళ్ళికళ్ళనీళ్ళు తుడుచుకుంది. పెళ్ళింట ఏడ్వటం ఎవరై నాచూస్తే బావుండదని భయం.

" పోనీ మేనమామ రాకపోతే వరసైన వారుంటే చూడండి ఫరవాలేదు." అన్నారెవరో " రాకపోడమేంటీ వచ్చాడు , ఎవరైనా అర్జంటు పనీ మీదగానీ పంపారేమో! " అని ఎవరో అంటుండగా, " అతగాడుండగా మరొకరు పిల్లను బుట్ట లో పెట్టుకు తేవడ మేంటీ!" అంటూ అమ్మలక్కలు బుగ్గలునొక్కుకోసాగారు.వారు వచ్చేదిఇలాంటివాటికేకదామరి! అంతా కంగారుగా ఎదురు చూస్తుండగా మాణిక్యరావు వచ్చాడు.వెంట ఒక మనిషిచేత ఏదో మోయించు కొచ్చాడు. పక్కనే చిద్విలాసంగా నవ్వుతూ బావమరదులు! అంతా అదేంటని చూడసాగారు, చక్రాల బండి!. చాలా పెద్దది. లాగేందుకో కొత్త కొబ్బరితాడు. " ఇదెందు కండీ ఇప్పుడు !అంతా మీకోసం ఎదురు చూస్తుంటేనూ ,ఎక్కడి కెళ్ళారు చెప్పాపెట్టకుండానూ!" అంది సుందరమణి..

" సరి సరి రావోయ్ మరిదీ! మీ మెనకోడల్ని బుట్టలో పెట్టి ఎత్తుకు తెచ్చి పీటల మీదకు చేర్చు. ఇది నీపని." అన్నాడు అక్క మొగుడు బావ." అందుకేగా బావగారూ వెళ్ళింది.ఏదీ గంప తెండి" అంటూ , పెళ్ళికూతురు గౌరీపూజ చేస్తున్న గదిలోకి ఆబండి తీసుకెళ్ళి ,దానిమీద గంప పెట్టి దాన్లో మేనకను కూర్చోమని , ఎవ్వరి మాటలూ లెక్కచేయక , బండిలాక్కుంటూ తెచ్చి పెళ్ళి మంటపం ముందుంచాడు. మేనకను చేయి పట్టి లేపి పీటల మీద కోర్చోమన్నాడు.అంతా వింతగా నవ్వటం, బుగ్గలు నొక్కుకోడం, గూసగుసలూ పకపకలూ, వికవికలూనూ. ఎవరో పెద్దావిడ పెద్దగానే తన వయస్సుకున్న హోదా చాటు కుంటూనూ అంది " ఔనర్రా! పూర్వం ’ అష్ట వర్షాత్ భవేత్ కన్యా ..' అని ఎనిమిదేళ్ళ లోపు పిల్లల్ని గంపలో ఎత్తుకు తెచ్చి కూర్చోబెట్టేవారు. ఏడు మల్లె పూలంత బరువు కూడా వుండే వారుకారు ఆచిన్నపిల్లలు. అదో సరదా ఆనాడు. ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిదేళ్ళ పిల్లల్ని ఎంత మేన మామైతేనేం ఎలా ఎత్తుకువస్తాడు చెప్పండీ.ఈబండి విధానం బావుంది.దీన్ని అన్ని పెళ్ళిమంట పాల కూ పరిచయం చేద్దాం. పాపం మేనమామ చూస్తే బక్కపల్చనా, పెళ్ళికుమార్తె ఆడవస్తాదూ ! బావుందోయ్ నీ ఆలోచన." అంది . ఎవ్వరూ నోరెత్తలేదు.

“ అంతేకాదు ఈ కాశీయాత్ర నిజమా! పెళ్లిలోవధూవరులను ఆకాశం కేసి చూడమంటూ, పెళ్ళి హాల్లో పైకప్పుకేసి చూపుతూ అరుంధతీ నక్షత్రాన్ని చూపటం ధర్మమా!ఎందుకొచ్చిన మానుకోలేని ఆచారాలు చెప్పండీ! ఆమంత్రాల అర్ధాలు వివరించి చెప్పి వధూవరులు ఎలా తమ నూతన జీవితంలో ప్రవర్తించా లో చెప్తే చాలదూ! కాడిమాను ఆట బొమ్మైంది.మరి ఇలా బండీలో తెస్తే తప్పేంటీ! కొత్త ఒరవడి తెచ్చావయ్యా! బావుంది. " అంటూ మెచ్చుకుని మేక తోలు కప్పిందావిడ మాణిక్యరావుకు.

“ వెనుక పిల్లా పిల్లాడూ ఒకర్నొకరు చూసుకునే వారు కూడా కాదు ముహూర్తం వరకూనూ. తలపై జీలకర్రా బెల్లం పెట్టాక మంచి సమయంలో తొలిచూపులు చూసుకుని జీవితాంతం అలా ఒకర్నొకరు ఇష్టపడుతూ జీవించేవారు. అసలు కార్యక్రమాల అర్ధం, పరమార్ధం , అంతరార్ధం అటకెక్కి ఊరికే సరదాలకోసం మాత్రం తతంగాలు సాగిస్తున్నా రు.ఈతెర భాగోతమూ అదేకదా! ఇవన్నీ ఇలా జరుగు తుండగా బుట్టలోనేగా మేనమామతెస్తా! అది బండిపై నైతే నేమీ భుజంపై నైతేనేమీ?మీలో ఎవరైనా వధువును కూర్చోబెట్టుకుని ఆబుట్టేత్తుకురండి, పదివేలు ఇస్తాను బహు మతి."అంటూ తన చేతిసంచీతీసి నోట్లకట్టలు సైతం చూపారావిడ! ఒక్కరైతేనేమి నోరెత్తితే ఒట్టు. గుండెనిండా గాలి పీల్చుకుంటూ, హాయిగా ఉన్న భర్త బాధ అర్ధమై ,ఇంత కాలంగా మేనకోడలి పెళ్ళని విన్నప్ప ట్లుంచీ అతగాడు పడుతున్నబాధ అర్ధమై చిద్విలాసంగ హాసం చేసింది సుందరమణి. పెద్ద మేనకోడలు వధువు పక్కనే ఉండగా తలెత్తి చూసి భర్తబాధ అర్ధమై’ పాపం ‘ అనుకుంది కూడానూ. ఆ ఉపాయంచెప్పిన తన స్వంత బావ మరదుల వైపు ఆరాధనగా చూడసాగాడు మాణిక్యరావు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి