రమణి ఆ ఆఫీసులో వారం క్రితం చేరింది. చాలా అందమైనది. అలాంటి అందం అరుదుగా కనిపిస్తుంటుంది. అందుకే నిత్యం ఈసురోమంటూ నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడే స్టాఫ్ ఇప్పుడు హాండ్ సమ్ గా తయారై ఠంచన్ గా ఆఫీసుకి సమయానికి వచ్చేసి బుద్ధిగా సీట్లలో కూర్చుని పనిచేసుకుంటున్నారు.
ఆమె ఏ ఒక్కర్ని సహాయం అడిగినా అందరూ ఉపకారానికి సిద్ధమై పోతున్నారు. ఎప్పుడూ ముట ముట లాడే ముఖంతో తన క్యాబిన్లో బంధీ గా వుండే బాస్ కూడా క్యాబిన్ నుండి బయటకొచ్చి అహర్నీశలూ స్టాఫ్ మధ్య ఆహ్లాదంగా గడుపుతున్నాడు. ఆ ఆఫీసులో చాలా ఏళ్ళ క్రితం నుండి లేడీ స్టాఫ్ లేరు. కారణం అక్కడి మేల్ స్టాఫ్ అంతా చిత్తకార్తె కుక్కలు. ఆడది కనిపిస్తే చాలు చొంగ కారుస్తూ లైంగిక వేదింపులు మొద లెడతారు. వాళ్ళ బాధ పడలేక అక్కడికి ఎవరూరారు..వచ్చినా ఎక్కువ కాలం వుండరు. అలాంటిది ఎడారిలో ఒయాసిస్సులా..రాక్షసుల పాలిట అమృతభాండంలా రమణి ఆ ఆఫీసుకి వచ్చేసరికి శ్మశానానికి వసంత కళ వచ్చినట్టుగా బావిస్తున్నారు.
"రమణీ..నిన్న నిన్నొక ఫైల్ క్లియర్ చేయమని చెప్పాను..చేశావా?" అడిగాడు బాస్.
"మూర్తిగారు నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ కదండీ..ఆయన ఫాస్ట్ గా చేస్తానంటే ఇచ్చాను"
"అలాగా..నో ప్రాబ్లం..ఏయ్ మూర్తీ ఇంకో గంటలో ఆ ఫైల్ క్లియర్ చేసి నా టేబుల్ మీద పెట్టాలి..రమణీ పద నీకో లెటర్ డిక్టేట్ చేయాలి.."అని ఆమెని క్యాబిన్లోకి తీసుకెళ్ళాడు.
"మన బాస్ గొప్ప అదృష్టవంతుడ్రా! మనందరం కలిసి ఆమె అందాన్ని ఆత్రంగా కళ్ళతో నంజుకుంటుంటే..బాస్ ఆమెని క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఒక్కడూ ఆ అందాన్ని జుర్రుకుంటాడు.."
"అవున్రా..ఏవన్నా ఎడ్వాన్స్ అవుతాడంటావా?"ఆయన అదృష్టానికి కృంగిపోతూ అనుమానం వ్యక్తంచేశాడు శ్రీహర్ష.
"అబ్బే..గురుడి దగ్గర అంత సీన్ లేదు.."అసూయతో అన్నాడు వీరేశ్.
"ఆమె జాయినయి వారమైంది. బందరు లడ్డులా మనమధ్య నోరూరిస్తూ తిరుగుతుంటే కళ్ళప్పగించి చూడ్డం తప్ప ఏం చేయలేక పోతున్నాము. మనం కాస్త చొరవచేసి ముందుకెళ్ళాలి."
"సర్లేరా..రాక రాక ఒకామె మన ఆఫీసుకి వచ్చింది..తొందరపడితే అసలుకే మోసం రావచ్చు. నిదానమే ప్రధానం బ్రదరూ..ఆనక మనకంతా ఆనందమే!" అన్నాడు రాజు.
"అదీ నిజమే..అయినా మన బాస్ పులిరాజు వరసలో ముందు వున్నాడు కదా.." మాట కలిపాడు మూర్తి.బాస్ క్యాబిన్లో-
"రమణీ నువ్వు వర్క్ చాలా బాగా చేస్తున్నావు..వచ్చి వారం రోజులే అయినా ఎక్స్ ట్రార్డినరి పెర్ఫార్మెన్స్ తో ముందుకు దూసుకెళ్ళి పోతున్నావు. నీ మీద హెడ్ ఆఫీసుకి ఇవాళే నిన్ను అప్రిషియేట్ చేస్తూ లెటర్ రాస్తాను. నీ కరీర్ కి ప్లస్ అవుతుంది. కానీ నువ్వు జస్ట్ నాతో కాఫీకి రావాలి."
ఓహ్! ష్యూర్ సార్! నా వర్క్ ఇంత తొందర్లో మీ అప్ప్రీసీయేషన్ పొందిందంటే..నా అదృష్టం..ఒక్క కాఫీ ఏం కర్మ..మీకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఏం చేయమన్నా చేస్తాను" కళ్ళు సంతోషంతో పెద్దవి చేసి ఎగ్జయిట్ అవుతూ అంది.
"అయితే ఇవాళ రాత్రి డిన్నరే!..నువ్వు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ దగ్గర షార్ప్ గ సెవెనో క్లాక్ కి వుండు. నేనొచ్చి పికప్ చేసుకుంటా"అనుకున్న పని అంత తొందరగా పూర్తయినందుకు మానసికానందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ అన్నాడు.మరుసటిరోజు-బాస్ ఆఫీసుకొచ్చి తన క్యాబిన్లోకెళ్ళి కూర్చున్నాడు. రమణిని పిలవడం కాని మాట్లాడడం కాని చెయ్యడంలేదు. స్టాఫ్ కి విషయం అర్ధం కాలేదు. అయినా తమకి హెవీ కాంపిటిషన్ తప్పినందుకు మనసులో ఆనందించారు.
"ఏంటి శ్రీహర్షగారూ..ఫైల్లూ అవీ అందిస్తూ వేళ్ళు టచ్ చేయడమేనా ఏవన్నా ప్రొసీడయేది వుందా?.."చిన్నగా అంది రమణి.అది కలా..నిజమా అనుకుని గిల్లుకున్నాడు. నిజమే! "మేడమ్..మీరు ‘ఊ’అనాలే గాని తాజ్ మహల్ కట్టించలేకపోయినా..నా లెవెల్లో ఇవ్వడానికి రెడీ!"అన్నాడు మిల మిల మెరిసే కళ్ళతో!
"అయితే ఆలస్యమెందుకు ఇవాళ రాత్రికే..మనం కలుద్దాం! ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ దగ్గర వెయిట్ చెయ్యండి. ఎయిటో క్లాక్ కి నేనక్కడ వుంటాను"అని చెప్పి వెళ్ళిపోయింది.
తనకి బాగా క్లోజయిన ఇద్దరి ఫ్రెండ్స్ తో తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. వాళ్ళు పైకి నవ్వినా లోపల కుళ్ళిపోయారు. అఫ్కోర్స్ శ్రీ కి కావలసిందదే!
మరుసటిరోజు-
శ్రీహర్ష ఆఫీసుకొచ్చి తన సీట్లో కూర్చుని పనిచేసుకుంటున్నాడు. ఎవరితో మాటాలేదూ..మంచీ లేదు.
ఆ తర్వాత "మూర్తిగారూ..ఆడాళ్ళ గురించి ఆఫీసు ఖాలీ సమయాల్లో..బస్టాపుల్లో..హోటల్లలో చీప్ గా మాట్లాడడమేనా? వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడమేనా? నాలాంటి దానికి దగ్గరవడానికి ట్రై చెయ్యరేం?" ‘తన విషయాలు ఎలా తెలిసాయా’ అని ఓ మూల ఆశ్చర్యపోయినా..తనకి ఆఫర్ ఇచ్చినందుకు మనసులో మన్మదానందం పొందుతూ "మీరు నాపై కరుణ చూపాలే కాని.. మీకేం కావాలంటే అదిస్తా..ఏం కావాలంటే అది చేస్తా!." అన్నాడు."అయితే ఇవాళ రాత్రికే..పద్మారావ్ నగర్ బస్టాప్ దగ్గర షార్ప్ గా ఎయిటో క్లాక్"అని గుస గుసగా చెప్పి వెళ్ళిపోయింది.
మరుసటిరోజు-
మూర్తి మౌనంగా ఆఫీసుకొచ్చి తనసీట్లో కూర్చుని బుద్ధిగా పనిచేసుకుంటున్నాడు.
అలాగే ఆ తర్వాత మిగతా స్టాఫ్ విషయంలోనూ జరిగింది.
ఒకరోజు-
"నన్ను ఎలా వేదించాలనుకున్నారో మీకు తెలుసు. ఆడవాళ్ళు తమ కాళ్ళమీద తాము నిలబడాలని..పొట్టపోసుకోవాలని ఉద్యోగంలో చేరుతారు. మీలాంటి కామాంధులు ఆమెని చిత్తకార్తె కుక్కల్లా వెంటాడుతూ వాళ్ళ భవిష్యత్తుని అంధకారం చేస్తున్నారు. లైంగిక వేధింపులని అరికట్టడానికి ఎన్ని చట్టాలు చేసినా ఏం ఉపయోగం? మీ చాపకింద నీరులాంటి దౌష్ట్యానికి గురై ఎవరికీ చెప్పుకోలేక..అలాఅని దిన దిన గండంగా నెట్టుకురాలేక మనసులో ఏడుస్తూ బ్రతుకీడుస్తున్నారు. అందుకే మీకా ట్రీట్మెంట్! దుష్టశిక్షణ శిష్టరక్షణ చేయడానికి దేవుడే కాదు..అబలలని రక్షించడానికి దేవతా పూనుకుంటుంది.కనకదుర్గావతరమెత్తుతుంది. మదోన్మత్తుల మదమణస్తుంది. ఇవాళ్టితో దసరా నవరాత్రులు ముగిశాయి. నా అవతార పరిసమాప్తి అయింది. మగాళ్ళందరికీ ఇదే నా హెచ్చరికగా చెప్పండి..మీలో మార్పు రాకపోతే వచ్చే సంవత్సరం మళ్ళీవస్తా..తాటతీస్తా"అని అంతర్ధానమయింది.
విచిత్రమేమిటంటేలైంగిక వేధింపులు జరిగే ప్రతిచోట అలాగే జరిగింది. ఒక్కోచోట ఒక్కో రమణిఅవతారం. ఏంచేసిందో..ఎలా చేసిందో కాని..అది బయటకు పొక్కలేదు కాబట్టి మీడియాలో చోటుచేసుకోలేదు. అసలు జరిగిందేమిటంటే..ఏ మగతనాన్ని చూసుకుని వాళ్ళు రెచ్చిపోయారో..అదే లేకుండా చేసిందని వాళ్ళకి మాత్రమే తెలుసు. సంసార సుఖానికి.. దూరమై జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. కుత్తుకలు తెగ్గోయడం కన్నా అదే మగాళ్ళకి కఠినమైన శిక్ష!
ఇప్పుడు ఆడవాళ్ళు స్వేఛ్ఛగా సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మగాళ్ళతో సమానంగా పరుగులుపెడుతున్నారు.