“సూర్యం..” అంటూ పిలిచింది మూడవ తరగతి క్లాసు టీచర్ ఝాన్సీ.
“వేలిముద్ర..! వేలిముద్ర..!!’ అని ఒక్క సారిగా అరిచారు క్లాసులోని పిల్లలంతా.
తమ ఎడం చేతి బొటన వేళ్లను నృత్యసుందరిలా ఆడిస్తూ గేళి చేయ సాగారు.
“సైలెన్స్..! సైలెన్స్..!!” అంటూ డస్టర్‍ను టేబుల్‍పై కొట్టింది ఝాన్సీ.
క్లాసురూంలో కాస్తా నిశ్శబ్దం చోటుచేసుకుందే కాని పిల్లల ముసి ముసి నవ్వులతాలూకు ఆనవాళ్ళు కనబడుతూనే ఉన్నాయి. తన క్లాసులో ఇలా జరగటం ఇదే ప్రథమం. ఓపిక వహించింది.
సూర్యం లేచి తడబడుతూ టీచర్ వద్దకు వెళ్ళాడు. ఝాన్సీ టీచర్ ప్రోగ్రెస్ కార్డు అందించింది. దాన్ని తీసుకుంటూ ఉండగా సూర్యం కళ్ళలో నుండి రెండు కన్నీటి చుక్కలు జల, జలా కారుతూ ప్రోగ్రెస్ రిపోర్టు మీద పడ్డాయి.
ఝాన్సీ చలించిపోయింది. అనుకోకుండా తన కళ్ళూ చెమర్చాయి.
చటుక్కున వంగి సూర్యాన్ని తన గుండెలకు హత్తుకొంది.
ఈ హఠాత్పరిణామానికి క్లాసంతా సద్దుమణిగింది. పిల్లలంతా భయం భయంగా టీచర్ వంక చూడ సాగారు.
సూర్యాన్ని నెమ్మదిగా తీసుకు వెళ్ళి అతడి సీట్లో కూర్చోబెట్టింది ఝాన్సీ. తన చేతి రుమాలుతో కన్నీళ్ళు తుడ్చింది. ప్రోగ్రెస్ కార్డు తన బ్యాగులో పెట్టు కున్నాడు సూర్యం.
గొంతు పూడుకు పోయి వెంటనే ఏమీ మాడ్లాడలేక పోయింది ఝాన్సీ.
రెండు క్షణాలు క్లాసంతా కలియ జూసి గొంతు సవరించుకుంది.
ఒక్కొక్క పేరు పిలుచుకుంటూ మిగిలిన ప్రోగ్రెస్ కార్డ్స్ పంచటం పూర్తికాగానే పిల్లల మనసుల్లో పేరుకుపోయిన భయం పోగొట్టాలనే నెపంతో సూర్యం గమనించకుండా పెదవి దాటని చిరునవ్వు ప్రదర్శించింది.
“నేనూ మీలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను” అంటూ ఝాన్సీ మాట్లాడటం మొదలు పెట్టగానే పిల్లలంతా తృప్తిగా శ్వాసించడం ఆమెకు కాస్తా సాంత్వన చేకూరింది. సూర్యం కూడా కుతూహలంగా వింటున్నాడని గమనించింది.
“నేను పదవ తరగతి చదువుతుండగా నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. తొమ్మిదవ తరగతిలో నాకు మా పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు గాను సోషల్ వెల్ఫేర్ డిపార్ మెంట్ వాళ్లు నాకు నూటాఇరువై రూపాయలు పంపించారు. అంత మొత్తం డబ్బు ఆ కాలంలో నేనూహించనిది. అది మానాన్నగారి ఒక నెల జీతంతో సమానం. నా సంతోషానికి అవధులు లేవు. దానిని తీసుకోవాలంటే తల్లి గాని తండ్రిగాని ఎవరో ఒకరు వచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టాలి. డబ్బు పిల్లల చేతికి ఇవ్వరు.
మా నాన్నకు సంతకం పెట్టడం వచ్చు.. కాసింత అక్షర జ్ఞానం కూడా ఉంది. మా అమ్మకైతే చదువు రాదు. సంతకం అసలే రాదు.. వేలిముద్ర..” అంటూ ఒకసారి సూర్యం వంక చూసింది. సూర్యం మోములో ఎలాంటి స్పందనా కనపడలేదు. మళ్ళీ చెప్పటం ఆరంభించింది ఝాన్సీ.
“చైనా మన దేశం మీద దురాక్రమణ జరిపిన సమయమది. మా నాన్న సైనికుడు. యుద్ధభూమిలో ఉన్నాడు. నాన్న వచ్చే పరిస్థితి లేదు” అంటూ చైనా యుద్ధం గొరించి కాసేపు వివరించింది. పిల్లలు ఆసక్తిగా వినసాగారు.
“ఇక అమ్మ వచ్చి డబ్బు తీసుకోవాల్సిందే.. కాని అప్పుడు ఆడవారు ఆఫీసుకు రావడం అరుదు.. పైగా వచ్చి వేలిముద్ర వేస్తే నాక్లాస్‍మేట్స్ అంతా మీలాగే హేళన చేస్తారనే భయం. గడువు ఇంకా పది రోజులే వుంది. ఆ లోగా డబ్బు తీసుకోకుంటే అది తిరిగి వెళ్ళిపోతుందని మా హెడ్‍మాస్టర్ నన్ను హెచ్చరించారు” అంటూ క్లాసంతా మరో మారు కలియ జూసింది ఝాన్సీ. అందరిలో ఉత్కంఠ.. సూర్యం కూడా ఉత్సాహంగా వింటూ ఉండటం ఝాన్సీ తృప్తిపడింది.
“నేను మా అమ్మకు సంతకం నేర్పించాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మ వాకిట్లో చక్కని ముగ్గులు వేసేది. ఆ ముగ్గులు వేయటం నాకు కష్టమయ్యేది. అదే విషయం మా అమ్మతో అన్నాను. ముగ్గుల కంటే అక్షరాలు నేర్చుకోవటం చాలా తేలిక అని వివరించాను. ముగ్గుల మెలికలలో అంతర్గత అక్షరాల చూపిస్తూ మెళకువలు నేర్పాను. నాల్గు రోజుల్లో అమ్మ సంతకం చేయటం నేర్చుకుంది. నాకు చాలా సంతోషమేసింది. అమ్మను మా బడికి తీసుకు వెళ్ళాను. మా అమ్మ తన పేరుతో సంతకం పెట్టడం చూసి హెడ్‍మాస్టర్ నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు” అని చెబుతుండగా.. పాఠశాల ఆఫీసు అసిస్టెంట్ నోటీసు రిజిస్టర్ తీసుకొని వచ్చి అంతరాయం కలిగించాడు.
ఝాన్సీ చదివి వినిపించింది. మరుసటి రోజునుండి ‘దసరా’ పండుగ పది రోజుల సెలవుల ప్రకటన అది. తిరిగి పాఠశాల ప్రారంభం రోజున ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకురండని అంటూండగా బడి గంట మ్రోగింది.
సెలవుల అనంతరం పాఠశాల తిరిగి ఆరంభమయ్యింది.
ఝాన్సీ టీచర్ అంటే హెడ్మాస్టర్‍కు మిగతా స్టాఫ్ మెంబర్స్ కు ఎనలేని గౌరవం. ఆమె విద్యార్థులందరికీ మాతృమూర్తి. ఆమె వచ్చినప్పటి నుండి పాఠశాల తీరుతెన్నులే మారిపోయాయి. తాను విద్యాబోధనలోనే గాకుండా కళారాధనలో దిట్ట. తరగతి గదులన్నీ సూక్తులతో తీర్చి దిద్దింది. అదనపు సమయం వెచ్చించి విద్యార్థుల సహాయంతో పాఠశాలను పచ్చదనంగా మార్చింది. ఆట పాటలలో పిల్లలు అందె వేసిన చేయి.. అంటే దాని వెనకాల ఝాన్సీ శ్రమ దాగి ఉన్నట్లే. ఆమె బడిలో అడుగు పెట్టినప్పటి నుండి విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరగటం... ఒక ప్రభుత్వ పాఠశాల అలా క్రమశిక్షణగా నడవటం.. ఆ గ్రామ ప్రజలు గర్వంగా ఝాన్సీ పేరే చెప్పుకుంటూ వుంటారు. ఝాన్సీ టీచర్ సమయానుసారం యథావిధిగా మూడవ తరగతికి వెళ్లింది.
ఆమె క్లాసంటే పిల్లలు చెవి కోసుకుంటారు. ఝాన్సీ టీచర్ పాఠాలతో బాటుగా ప్రాపంచిక జ్ఞానం నేర్పిస్తుంది. ఏ రోజు ఏ కొత్త విషయం చెబుతుందో అని పిల్లలు ఆసక్తిగా తరగతులు హాజరవుతూ వుంటారు.
విద్యార్థులంతా తమ తమ ప్రోగ్రెస్ కార్డ్స్ తిరిగి ఇవ్వ సాగారు.
సూర్యం క్లాసులో ఫస్ట్ ర్యాంకు స్టూడెంట్. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. తల్లి వ్యవసాయ కూలి. ఆమెకు చదువుకోలేదు. కాని కొడుకును ఎంతో కష్టపడి చదివిస్తోంది.
సూర్యం చివరగా తన ప్రోగ్రెస్ కార్డ్ టీచర్ చేతికందించాడు..
విద్యార్థులంతా తమ తమ బొటన వేళ్ళను ఆడిస్తూ వుండటం గమనించింది..
తన ప్రయత్నం ఫలించిందా అనే కుతూహలంతో ఝాన్సీ కార్డ్ తెరచి చూసింది. అమితానందంతో కళ్ళు విచ్చుకున్నాయి.. ఇది నిజమేనా? అన్నట్లుగా అలాగే సూర్యం వంక చూసింది. సూర్యం కళ్ళళ్ళో వెలుగు.. మోములో ఆనందం వెల్లివిరియడంతో సూర్యాన్ని అభినందించ సాగింది .
పిల్లలకు ఏమీ అర్థం గాక బిక్క మొహాలు వేసి చూడసాగారు..
“వేలిముద్ర కాదు.. సూర్యం అమ్మగారి తొలి సంతకం..” అంటూ సూర్యం ప్రోగ్రెస్ కార్డ్ పిల్లలకు చూపించింది.
సూర్యం తల ఎత్తుకొని క్లాసు వంక గర్వంగా చూడసాగాడు.
సూర్యం ప్రోగ్రెస్ కార్డులో వేలిముద్ర బదులు సంతకం కనబడేసరికి కొందరు పిల్లలు ‘ఏం మాయ చేసాడో..!’ అన్నట్లుగా చూస్తూ వుండటం గమనించింది ఝాన్సీ.
ఝాన్సీకి ఆ అనుమానమే లేదు. కాని పిల్లలందరికి వాస్తవాలు తేటతెల్లం కావాలి అనుకుంది.
“సూర్యం.. నిజంగా నువ్వు మీ అమ్మ గారికి సంతకం చేయటం నేర్పావా? లేక నువ్వే మీ అమ్మగారి సంతకం పెట్టావా?” అంటూ నిలదీస్తున్నట్లుగా అదిగింది.
“ప్రామిస్ టీచర్.. మా అమ్మే సంతకం పెట్టింది..” అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
టీచర్ ఓదార్చింది..
“సూర్యం..! ఏడ్పు సమాధానం కాదు కన్నా... ఇన్నాళ్ళుగా మీ అమ్మగారు ప్రోగ్రెస్ కార్డు మీద వేలి ముద్ర వేసేది కదా.. ఇప్పుడు సంతకం ఎలా పెట్టింది?.. నిజం చెప్పు” అంటూ సూర్యం నుండి నిజం పిల్లలందరికి తెలియాలి అన్నట్లుగా అడిగింది.
“ఆవాళ నేను ఇంటికి ఎళ్ళాక మాయమ్మతో సంతకం చేయటం నేర్చుకొమ్మని అడిగా.. నాకు రాదురా అంది. నేను అన్నం తినకుండా అలిగి పడుకున్నా. అన్నం తినమని ఎంతగానో బతిమాలింది. సంతకం చేయటం నేర్చుకుంటేనే తింటానని మొండికేశా.. అమ్మ ఒప్పుకుంది” అంటూ సూర్యం కళ్ళు గుండ్రంగా తిప్పుకుంటూ చెప్ప సాగాడు. పిల్లలంతా ఊపిరి బిగబట్టి వినసాగారు.
“అమ్మ మూడు రోజుల్లో సంతకం నేర్చుకుంది. ఇప్పుడు తెలుగు అక్షరాలన్నీ గుర్తిస్తోంది..” అంటుంటే ఝాన్సీ టీచర్ కరతాళ ధ్వనులు చేయటం ప్రారంభించింది. పిల్లలంతా ఆమెను అనుకరించారు. సూర్యం పొంగి పోయాడు.
“మీ తల్లిదండ్రులందరికీ చదువు వస్తుందో లేదో నాకు తెలియదు. చూశారా..! సూర్యం పట్టుదల.. తాను చదువుకుంటూ తన తల్లి గారికీ చదువు నేర్పిస్తున్నాడు. మీరు ఇంకో విషయం తెలుసుకోవాలి..” అనగానే పిల్లల్లో ఉద్వేగం పెరిగింది.
“వేలిముద్ర అని మీరు ఎగతాళి చేయకూడదు. సంతకాన్ని ఫోర్జరీ చేయవచ్చునేమో గాని వేలిముద్రని ఫోర్జరీ చేయలేము.. ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు.. తెలుసా..” అంటూ వేలిముద్ర యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతనూ వివరించింది. పిల్లలంతా ఆశ్చర్యంగా వినసాగారు.
“ప్రతీ మనిషికి చదువు ఎనలేని సంపద. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’.. మన భారతమాత ఎంతగానో సంతోషిస్తుంది..” అంటూ వుండగా బడి గంట మ్రోగింది.
ఝాన్సీ టీచర్ క్లాసు నుండి బయటికి వెళ్తూ సూర్యాన్ని పిల్లలంతా అభినందిస్తుండటం గమనించింది. ఒక ఉపాధ్యాయురాలిగా తన బాధ్యత మరింత పెరిగిందని మనసు గుర్తు చేస్తోంది.