"అమ్మా... అమ్మ్మా..." అంటూ హడావిడిగా వచ్చింది భవ్య." ఏంటమ్మా ఏమైంది ఎందుకంత తొందరా అంటూ వారించింది హేమ. అది కాదమ్మా రచనకు ఆక్సిడెంటు అయిందట నేను వెళుతున్నా ఇప్పుడే ఫోనొచ్చింది. అంటూ హడావిడిగా బయటకు పరుగు తీసింది భవ్య. అలా వెళ్ళడం, భార్య కొయ్యబారిపోవడం చూసి ఆనంద్ గారు పరుగున వచ్చారు. భార్యను సుతారంగా పైకి లేపి "ఏమయ్యింది హేమ? భవ్య అలా టెన్షన్ పడుతూ వెళుతుంది" అని అడిగాడు. షాక్ లోంచి బయటకు వచ్చిన హేమ రచనకు ఆక్సిడెంటూ అయిందటండీ అందుకే వెళ్ళింది" అని చెప్పి లోపలికి వెళ్ళింది. రచనకు ఆక్సిడెంటు కావడమేమిటీ? అలా వెళ్ళడమేమిటీ? అది చూసి భార్య హేమ షాక్ కు గురవ్వడమేంటోతెలియక మొహం వేళాడేసుకుని చూస్తూ వుండిపోయాడు ఆనంద్.
లోపలికి వెళ్ళిన హేమకి ఏమీ తోచడం లేదు, భర్త నుంచి తప్పించుకుంది కానీ మనసులో వున్న అనుమానాలను తెంచుకోలేక పోయింది. రచన మధ్య తరగతి అమ్మాయి వాళ్ళ కంటే కాస్త వున్నంతలో మంచి కుటుంబం హేమ వాళ్ళది., తాము మధ్య తరగతి నుండి పైకొచ్చిన వాళ్ళమే అయినా ఆ రోజు రచన అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వగలిగింది హేమ అదీ భర్తకీ, కూతురికీ తెలియకుండా... తను డబ్బులు ఇచ్చిన పది రోజులకు ఇప్పుడు ఈ ఆక్సిడెంటు అవ్వడమేమితి? ఏమిటో తనకేమిటీ అర్ధం కావడంలేదు. అసలు రచన తన దగ్గర డబ్బు తీసుకుంది అనడానికి తన దగ్గర ఏ ఆధారం లేదు ఏదో చే బదులుగా అడిగింది తను ఇచ్చింది అని గతాన్ని గుర్తుచేసుకుంటున్న హేమ ఏదో ఆలోచన వచ్చీన్ దానిలా టక్కున ఆగింది. అవును ఇప్పుడు రచన తనను మోసం చేయదు కదా? తను ఏదో ఆపదలో వుందని ఇచ్చింది కానీ ఇప్పుడు ఈ ఆక్సిడెంటు మూలంగా రచనకు జరగరానిది ఏమన్నా జరిగితే తన డబ్బు తనకు రాదు, భర్త అడిగితే ఏం జవాబు చెప్తుంది? అసలే అవి ఏమైన అత్యవసర పనులకు అవసరమవుతాయని భర్త దాచమని ఇచ్చిన డబ్బులు... అసలు రచనకు నిజంగానే ఆక్సిడెంటు అయ్యిందా? లేక కేవలం తన డబ్బులు ఎగవేయడానికి తనే ఇలా ఆక్సిడెంటు విషయం తనకు తెలిసేలా చేసిందా? ఒక వేళ తాను ఇప్పుడు వెళ్ళి డబ్బులు అడిగితే నకెప్పుడిచ్చావ్ అంటుందా? ఏమో కానీ... ఇప్పుడు ఆలోచిస్తుంటె తనకు అలా డబ్బులు ఇవ్వడం తప్పనిపిస్తోంది. భగవంతుడా రచనకు ఏమీ కాకూడదు. నా డబ్బులు నాకు ఎలాగైనా రావాలి అని వేయి దేవుళ్ళకు మొక్కుకుంది మనసులో. సాయంత్రం అయ్యింది భర్తకి కాఫీ ఇచ్చి తాను ఏదో అయ్యింది అనిపించింది.
భవ్య రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. అక్కడికి రెండు సార్లు ఫోన్ చేసింది కానీ స్విచ్చాఫ్ వస్తుంది. ఏమైందో తెలియక జుటు పీక్కోవాల్సింది కానీ ఆనంద్ వున్నాడని ఆగిపోయింది. అలా ఓరెండు గంటలు గడిచాక భవ్య వచ్చింది, హమ్మయ్య అనుకుంటూ ఏమైందమ్మా ఇప్పుడు నీ ఫ్రెండ్ రచనకి ఎలా వుంది అని అడిగింది ఆత్రం గా , ఎప్పుడు ఎవరి గురించి ఇంతగా అడగని తల్లిని చూసి ఆశ్చర్యపోయింది భవ్య మళ్ళీ తేరుకుని బాగానే వుందమ్మా, రెండు రోజుల తరువాత డిశ్చార్జ్ చేస్తారట అని చెప్పి ఫ్రెష్ అవడానికి తన గదిలోకి వెళ్ళింది. భగవాన్ నా మనసు అర్ధం చేసుకున్నావు అని మనసులోనే దేవునికి దండం పెట్టుకుంది హేమ. అయినా కానీ తన మనసు పీకుతోంది నిజం గా తను ఇచ్చిన డబ్బులు రచన తిరిగిస్తుందా? లేదా తనని మోసం చేస్తుందా? అని ఆలోచిస్తూ ఎటూ తేల్చుకోలేకపోయింది.
భవ్య, ఆనంద్ రావు ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళారు. వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి లోపలికి వెళ్ళబోతున్నదల్లా గేటు చప్పుడవడంతో ఎవరూ అని అటువైపు చూసింది హేమ. అలా చూస్తూనే ఆశ్చర్యపోయింది. కారణం రచన వస్తుంది... తలకి చేతులకి కట్లతో తను అలానే చూస్తూ వున్నా తనని చూస్తూ నవ్వుతూ దగ్గరికొచ్చి చాలా థ్యాక్స్ ఆంటీ అడగగానే సహాయం చేసారు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, ఆ రోజు మీకు డబ్బు ఇద్దామని వస్తుంటేనే నాకు ఆక్సిడెంట్ అయ్యింది, మీకు తెలుసో లేదో కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది అని గడ గడా చెప్తూ ఇంకా షాక్ లో వున్న హేమని చూస్తూ ఏమయ్యింది ఆంటీ అలా వున్నారు అని అడిగింది. హేమ ఏమీ మాట్లాడకుండా అలానే వుండిపోయేసరికి రచన ఆంటీ... ఆంటీ ఆ ని పిలిచేసరికి ఒక్కసారిగా ఈ లోకం లోకి వచ్చింది హేమ. రచన ఏమయ్యింది ఆంటీ అలా వున్నారు? అని అడిగింది హేమ ఏమీ లేదమ్మా చెప్పు ఇప్పుడెలా వుంది నీకు ? అని అడిగింది హేమ, డబ్బు విషయం ఎలా అడగాలో అర్ధం కాక కొంచెం మంచి నీళ్ళు ఇవ్వడాంటీ దాహం గా వుంది వుంది అని రచన అడిగేసరికి హేమ లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. రచన ఆ నీళ్ళు తాగి కొంచెం రిలాక్స్ అయ్యి మీకు తెలియదు ఆంటీ ఆ రోజు డబ్బు కట్టకుంటే నా జాబ్ పోయేది చాలా మందిని అడిగా కానీ ఎవరూ సహాయం చేయలేదు, మీరు చేసారు, మీరు చేసిన ఆ సహాయం తో నాకు ఆ జాబ్ రాగలిగింది. ఇదిగోండి ఆంటీ ఆ డబ్బులు తీసుకోండీ అంటూ ఓ కవర్ ని ఇచ్చింది. యధాలాపం గా వింటున్న హేమ ఉలిక్కిపడింది ఆ కవర్ ని తీసుకుంటూ తానెంత తప్పు చేసింది సాటి మనిషిని ఎంత తప్పుగా అర్ధం చేసుకుంటే కేవలం తన డబ్బులు తిరిగిరావాలని ఎలా దేవునికి మొక్కుకుంది. అసలు తన కూతురు వయసున్న రచనని ఎలా తను అనుమానించింది., రచన మోసం చేస్తుంది అని ఎలా అనుకుంది?? ఇవన్నీ ఆలోచిస్తుంటే హేమకి తను చాలా తప్పుగా ఆలోచించాను అనిపించింది.
రచన ముందు తాను ఎంతో చిన్నదానిలా కనిపించింది ఇంత వయసు అనుభవం వుండి కూడా ఇంకా ఒక మనిషిని నమ్మలేకపోయిన తన వ్యక్తిత్వాన్ని పిచ్చి మనసుని చూస్తుంటే తనకు తాను ఇంకా ఎలాంటి పరిస్థితిలో వుందో అర్ధం అవుతుంది. ఇలా ఆలోచనల్లో వున్న హేమ ఆంటీ...ఆంటీ.. అన్న భవ్య పిలుపుకు ఈ లోకం లోకి వచ్చింది. ఏమయ్యిందాంటీ అంతలా ఆలోచిస్తున్నారు? అని అడిగింది రచన ఏమీ లేదమ్మా నీ కెంత ప్రమాదం తప్పింది అని ఆలోచిస్తున్నాను అంది హేమ. రచన నవ్వి ఏదోలే ఆంటీ ముందు మీ డబ్బులు మీకు ఇచ్చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా వుంది అని నవ్వుతూ అంటున్న రచన ముందు తాను అల్పురాలిలా అనిపించినా అయినా... ఒకందుకు మంచే జరిగింది, ఈ సంఘటన వలన తనకు డబ్బు విలువ, ఇతరుల విలువ తెలిసొచ్చింది అని అన్నుకుంటూ తాను రచనతో జతగా నవ్వు కలిపింది హేమ.