సింహపురి లో రామయ్య అనే వ్యాపారి వుండే వాడు. అతను కష్ట పడి వ్యాపారాన్ని వృద్ది చేసాడు.రామయ్య కి శేఖరుడు అనే కుమారుడు ఉండేవాడు.అతను రామయ్యకి పూర్తి వ్యతిరేకం. కష్ట పడకుండా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేసేవాడు.జూదం ఆడి డబ్బులు సంపందించాలని చూసి అందులో డబ్బు పోగొట్టాడు.అయిన శేఖరుడు సులభంగా డబ్బు సంపాదించాలనే తన ప్రయత్నాలను మాన లేదు.ఇదిలా వుండగా ఒక రోజు రామయ్య కొడుకు దగ్గరికి వచ్చి “నాయనా! ఊరి చివర కొండలు ,గుట్టలతో నిండి వున్న పది ఎకరాల భూమిని కొన్నాను.దానిని నీ పేరు మీద రాసాను.”అని చెప్పాడు.”అంటే కష్ట పడి ఆ పొలం నేను దుక్కి దున్నాలా?నా వల్ల కాదు”సమాధానం ఇచ్చాడు శేఖరుడు
కొడుకు మాటలకి రామయ్య పెద్దగా నవ్వి “ ఆ పొలం లో గుప్త నిధులు వున్నాయని ,నాకు తెలిసిన ఒక స్వామిజీ చెప్పాడు.అందుకే ఈ విషయము ఎవరికీ తెలియక ముందే,ఆ పొలాన్ని నీ పేర కొన్నాను.”చెప్పాడు.తండ్రి మాటలకు సంతోషించిన శేఖరుడు ఆ పొలం లోని కొండలు, గుట్టలు చదును చేయించి ,నిధులు కోసం త్రవ్వించాడు.కాని అతని శ్రమ ఫలించలేదు.”ఎలాగు భూమి చదును చేసాము కాబట్టి అందులో “వరి పంట” పెడదాము. “పంట” అయిపోగానే “నిధులు”కోసం ప్రయత్నిద్దాము”అన్న తండ్రి మాటలకు శేఖరుడు ఒప్పుకుని “వరి పంట”పెట్టాడు.ఆ ఏడు వరి విరగ పండింది.కాని శేఖరుడు “నిధి”దొరక లేదని దిగులుతో వున్నాడు.రామయ్య కొడుకు దగ్గరికి వచ్చి " పది వేల వరహాలు పెట్టుబడి పెట్టి “వరి”వేస్తె లక్ష వరహాలు వచ్చింది.అంటే తోంబై వరహాల “నిధి”దొరికినట్టేగా "అన్నాడు. శేఖరుడి కి అర్థం కాక అయోమయం గా తండ్రి వైపు చూసాడు.”ఆయాచితం గా లభించే ధనం నిలవదు.
అందుకే పొలం లో నిధులు వున్నాయని,స్వామిజి చెప్పాడని అబద్దం చెప్పి నీ చేత వ్యవసాయం చేయించాను.”అసలు విషయం చెప్పాడు రామయ్య. "నాన్న గారు,నన్ను క్షమించండి.ఇక నుండి కష్ట పడి పని చేసి సంపాదిస్తాను.” చెప్పాడు శేఖరుడు.
కొడుకులో వచ్చిన పరివర్తన కి రామయ్య సంతోషించాడు.