సెల్ ఫోన్ లో మ్రోగిన అలారం తో నిద్రలేచిన నీహారిక తన దినచర్య ప్రారంభించింది. పది నిముషాల్లో కాలకృత్యాలు ముగించుకుని ఆపై ఇరవై నిముషాలు ప్రశాంత వాతావరణంలో మెడిటేషన్... ఆ తరువాత గంటపాటు యోగా చేసింది. స్నానం కానిచ్చి మొక్కుబడిగా దేవుడికి ఓ దణ్డం పెట్టుకుని వెంటనే తన కిష్టమైన లాప్ టాప్ తెరచి తన లోకమైన ఫేస్ బుక్ లోదూరి రాత్రి పడుకునే ముందే లాగ్ అవుట్ చేసిన అకౌంట్ ఓపెన్ చేసి స్టేటస్ అప్డేట్ చేసే కార్యక్రమంలో మునిగిపోయింది. ఈ మధ్య అంటే గత రెండు మూడేళ్ళుగా ఇదే ఆమె నిత్య కృత్యం, కొండంత ఆస్థి, ప్రేమించే భర్తా, ఇంట్లో పనంతా పూర్తిచేసే నమ్మకమయిన పనివాళ్ళు... అంతే కాకుండా ఇద్దరు పిల్లలు అరుణ్, భవ్య... సెకండ్ క్లాస్ నుంచే హాస్టల్ లో వుండి చదువుకుంటున్నందున సెలవుల్లో తప్ప ఇంటికి రారు... తల్లిని ఆమె ఫేస్ బుక్ ప్రపంచం లోంచి బయటకు వచ్చేలా చేయరు.
ఏ విషయాల్నీ ఆమె భాద్యతగా... సీరియస్ గా తీసుకోదు... అలాగే బాధపడే విషయాలు... భాద్యతలు ఆమె దరిచేరవు. ఇంటి పనులన్నీ భాద్యతగా చేసే దూరపు బంధువైన శాంతమ్మ ఇచ్చిన టిఫిన్ ప్లేట్ అందుకుని... అవినాష్ బయటకు ఎప్పుడు వెళ్ళాడు అని అడిగింది నీహారిక. అదేమిటమ్మా.. రాత్రి కూడా బాబు ఇంటికే రాలేదుగా అన్న శాంతమ్మతో... యస్...యస్... మర్చిపోయాను అనుకుంటూ అక్కడి నుంచి తన రూం కి వెళ్ళిపోయింది, చేసేదేం లేక ఫ్చ్ ..అని నిట్టూర్చి తన పని తను చేసుకోసాగింది శాంతమ్మ.
భర్తనలా పేరు పెట్టి పిలవకూడదనీ... భర్తతో అన్యోన్యం గా వుండటం ఇల్లు చక్కబెట్టుకోవడం తన కర్తవ్యమనీ చెప్పాలని వున్నా పెదవి విప్పి చెప్పలేదు శాంతమ్మ... ఎందుకంటే నీహారిక నోటి దురుసు సంగతి ఆమెకు తెలుసు. తన పరిస్థితి బాగోలేక వాళ్ళింట్లో వుండి రోజులు వెళ్ళదీస్తున్న తను.. నీహారిక కోపానికి గురై వున్న ఈ కాస్త నీడ పోగొట్టుకోవటం తనకిష్టం లేదు.
తన రూం లోకి వెళ్ళి టిఫిన్ పూర్తి చేసిన నీహారిక యధావిధిగా మళ్ళీ మధ్యాహ్నం భోజనం సమయం వరకూ నెట్ ఓపెన్ చేసి దేశం లోని ఇతర రాష్ట్రాల్లోని స్నేహితులతోనూ అలాగే వేరే దేశాల్లో వున్న తన బంధుమిత్రులందరితోనూ చాటింగ్ చేస్తూ రోజులు గడిపేస్తుంది. అది తన హాబీ..
టీవీ చూడటం.. భర్తతో కల్సి సినిమాకి కానీ... పార్క్ కి కానీ.. వెళ్ళటం అంటే ఆమెకు ఎలర్జీ.. పిల్లలతో.. భర్తతో కలిసి టూర్ కి వెళ్ళాలన్న ఆమె దృష్తీలో టైం వేస్ట్ ఎవరితోనూ పరిచయాలు చేసుకోదు... ఎవర్నీ ఇంటికి రానీయ్యదు... ఎంతసేపూ ఆ ఫేస్ బుక్ లో ఎవరెవరో పంపే మెసేజ్ లకు లైకులు కొట్టుంటూ క్రొత్త క్రొత్త స్నేహాలు పెంచుకుంటూ.... వాళ్ళు పంపే ప్రతీ ఫోటొలను షేర్ చేసుకుని అద్భుతం గా వున్నాయంటూ కామెంట్లు పెట్టడమూ తప్ప తనకంటూ చేయడానికి కానీ... ఆలోచించడానికి కానీ ఏ పనీ పెట్టుకోదు.
దూర ప్రాంతాల్లోని స్నేహితులతో అమెరికా, లండన్ లో వుంటున్న బంధువులతో రోజూ చాటింగ్ చేస్తున్నా... రోజుకి ఇరవై నాలుగంటలు కాకుండా ముప్ఫై గంటలయితే బాగుండు అని.. అనుకుంటూ వుంటుంది.
సిటీలోని, వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రాంతాల్లో రెండు ఖరీదయిన భగవంతులున్నా పోష్ ఏరియాలోని స్వర్ణ అపార్ట్ మెంట్ లో వుంటున్నారు. నీహారిక భర్త అందగాడు. తెలివైన వాడు. అన్ని విషయాల్లో భాధ్యత కలవాడు. అతడికి భార్య అంటే ప్రాణం. అవినాష్ తన తల్లితండ్రులకు ఒక్కటే సంతానం కావడంతో అమ్మానాన్నలను తనతో పాటు వుంచుకోవాలనీ... అలాగే హాస్టల్ లో వుంటున్న పిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి వారి ఆలనా పాలనా చూసుకుంటూ చక్కగా చదివించి, పెంచి పెద్ద చేయాలని అతనికెంతో ఇష్టం. కానీ దానికి ససేమిరా ఒప్పుకోదు నీహారిక.... ఎందుకంటే... వీళ్ళంతా ఇంట్లోనే వుంటే తను ఎంతో కొంత బ్ధ్యతగా వుండాల్సివస్తుంది.. అది తన వల్ల కాని పని, అందుకే తననెంతో ఆరాధించే భర్తని ఎన్నడూ తన మాట జవదాటనీయకుండా అదుపులో వుంచుకుంది. ఆమెకు ఎట్టి పరిస్థితి లోనూ ఎదురు చెప్పడు. ఆమెకు ఇష్టం లేని పని చేయడు.
ఎం. బి. ఏ చేసిన నీహారికను పెళ్ళయిన కొత్తలోనే కంపెనీ పనుల్లో భాగస్వామిగా సాయమందించమని మురిపెం గా అడిగినా తోసిపుచ్చిన భార్య మారదని ఆమెను పట్టించుకోవడం మానివేసి కంపెనీ వ్యవహారాల్లో బిజీ అయిపోయాడు.
ఇద్దరు పిల్లలు పుట్టాక వారిద్దరిమధ్య మానసికం గా చాలా దూరం పెరిగింది, భార్య ఎంతసేపూ... స్నేహాలూ... చాటింగ్ అంటూ లోకంలో తనుండటంతో, అవినాష్ కూడా తన సమయాన్నంతా కంపెనీ విస్తరించడానికి వెచ్చించి వేరే దేశాల్లో కూడా బ్రాంచిలు ఏర్పరిరిచి బిజీ బిజినెస్ మాన్ అయిపోయాడు.
కోట్లకు వారసుడైన కొడుకు మనశ్శాంతి కరువై దేశాలు పట్టుకు తిరగడం చూసి బాధపడటం మినహా ఏం చేయలేని దుస్థితి అవినాష్ తల్లితండ్రులది.
రాత్రి ఆలస్యం గా ఇంటికి చేరిన అవినాష్ భార్యని పిలిచి అమెరికాలో కంపెనీ వ్యవహారాలకు సంబంధించి ఫారిన్ డెరిగేట్స్ తో ముఖ్యమయిన మీటింగ్ వుందనీ.. వారం రోజుల దాకా ఇండియా రాననీ అంతే కాక ఈ వారం రోజులూ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసే వుంటుందనీ చెప్పి వెంటనే నిద్రకుపక్రమించాడు. అది ఆమెకు బాధ కల్గించే విషయమైతే కాదు.. ఎవరున్నా లేకున్నా తన ప్రపంచం తనది.
అవినాష్ అమెరికా వెళ్ళి నాలుగు రోజులు గడిచాయి. ఆ తరువాత రోజు చెన్నై లో వుంటున్న ఆమె ఫ్రెండ్ ఊటి ఫ్యామిలీ తో సహా వెళ్ళి అక్కడి ఫోతోస్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది... నిజం గా ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. అవి చూసి తను కూడా ఎక్కడికైనా వెళ్ళి ఫోటోస్ పంపాలని నిర్ణయించుకుని సాయంత్రం నాలుగు గంటలకు డ్రైవర్ లేకుండా ఒంటరిగా కారులో వాటర్ ఫాల్స్ వుండే పిక్నిక్ స్పాట్ కి బయల్దేరింది. ఊరికి చాలా దూరం గా వుండటం తో అక్కడికి చేరుకోవాడానికి గంటన్నర పట్టింది. ఆ రోజు వీకెండ్ కావటంతో జనాలు ఎక్కువగా వున్నారు. అక్కడ వున్న వాళ్ళంతా ఆనందం తో సంతోషం తో కేరింతలు కొడుతూ ప్రతీవాళ్ళూ చిన్న పిల్లల్లా సంబరపడుతున్నారు.
అక్కడ నీహారిక ఒక విషయం గమనించి తనలాగా ఒంటరిగా మాత్రం అక్కడేవరూ లేరు.. ఎందుకో చాలా నిస్పృహగా అనిపించింది. నీళ్ళల్లో ఈతలు కొడ్తున్న పిల్లల్ని చూస్తూ గట్టున వున్న తల్లితండ్రులు వాళ్ళనలా చూస్తూ ఆనందిస్తున్నారు. ఎటు చూసినా .. ఎవర్నీ చూసినా ప్రతీ ఒక్కరి లో ఆనందం తాండవం చేస్తుంది. అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నరు. ఆ ప్రదేశం లో వున్న వాటర్ ఫాల్స్.. అక్కడి లోకేషన్స్ అన్నీ చూసి తను కూడా ఆనందం గానే వుంది. కానీ ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి ప్రక్కన అవినాష్ ..పిల్లలూ లేరు... ఒక్క క్షణం చాలా గిల్టీ గా ఫీలయ్యింది, యిన్నాళ్ళు భర్తనీ.. పిల్లల్నీ తనెంతో మిస్ అవ్వటమే కాకుండా... పిల్లల చిన్న చిన్న సరదాలను కూడా తీర్చుకోనివ్వకుండా వాళ్ళ సంతోషాన్ని మిస్ చేసానని గ్రహించింది.
వెంట ఎవరూ లేని కారణం గా అక్కడ లొకేషన్ లో ఫోతో దిగడానికి కూడా వేరే వాళ్ళను డిస్టేబ్ చేసి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిమ్నందుకు చాలా బాధపడింది.ఇక ఎక్కూవ్ సేపు అక్కడ వుండబుద్ధికాక పార్క్ చేసిన కారు తీసి ఇంటికి బయల్దేరింది. అరగంట గడిచిందో లేదో వున్నట్టుండి కారు కీచుమంటూ పెద్ద శబ్ధం చేసి ఆగిపోయింది. కారు దిగి ఫ్రంట్ డోర్ తీసి చూస్తే ఇంజన్ లోంచి పొగ వస్తుంది. కంగారులో కారులో పెట్రోలు వున్నదీ లేనిదీ చూస్కుంది కానీ కారు కండీషన్ గమనించలేదు.. అప్పుడు సమయం ఏడు దాటింది. హైవే కావడం తో నిర్మానుష్యం గా వున్న రోడ్డు.. చిక్కబడుతున్న చీకటి ఆమెలో భయం రేకెత్తించాయి.
వెంటనే మొబైల్ తీసి డ్రైవర్ రంగయ్యకు ఫోన్ చేసింది. రింగవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యటంలేదు. ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడంలేదు. ఆమెకు టెన్షన్ ఎక్కువయిపోతుంది. ఈ తాగుబోతు వెధవ ఫోన్ ఎక్కడ పడేశాడో... ఏంటో అనుకుంటూ అవినాష్ కి రింగ్ చేసింది. స్విచ్చాఫ్... ఓ గాడ్.. అవినాష్ చెప్పిన విషయం గుర్తువచ్చి తల కొట్టుకుంది. ఏం చెయ్యాలో తోచట్లేదు. తనకు కొన్ని వందల మంది స్నేహితులు ఆదుకునే స్నేహితులు ఫేస్బుక్ నిండా వున్నారు... కానీ ఫ్చ్ పాపం లోకల్ లో వుండి అవసరం లో ఆదుకునే స్నేహితులు మాత్రం లేరు. శాంతమ్మ లాంటి గతిలేని వారి ఫోన్ నెంబర్స్ తన దగ్గరుండవు. తన మొబైల్ లో వున్న ఫ్రెండ్స్ అందరూ హై పొజీషన్ లోని వారు... దూర ప్రాంతాల వారు... మొదటిసారి తన పరిస్థితి తనకే షేం గా అనిపించింది.
ఒకటీ అరా కార్లు తనను దాటుకుంటూ స్పీడుగా వెళుతున్నాయి. ఆ టైం లో ఎవ్వర్నో నమ్మి లిఫ్ట్ అడక్కూడదనీ ఆమె భావన. ఎందుకైనా మంచిదని మళ్ళీ రంగయ్యకు ఫోన్ చేసింది. ఈ సారి కూడా తీయలేదు. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించిందామెకు. ఒళ్ళం తా భయం తో చెమటలు పడుతున్నాయి. ఈ లోగా తళుకున ఓ ఐడియా వచ్చిందామెకు. బెంగుళూరు లోని సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్న మానస బంధువులు ఈ ఊర్లోనే వున్న విషయం ఎప్పుడో చాటింగ్ ద్వారా తెల్సింది. వెంటనే మానసకు ఫోన్ చేసింది. వెంటనే లిఫ్ట్ చేసిన మానస హాఇ... హరీ... ఏంటే ఎప్పుడూ లేంది ఈ టైం లో ఫోన్ చేశావు. ఇప్పుడే ఇంటికి బయల్దేరాను... బైక్ మీదున్నాను అంటున్న మానసతో కంగారుగా ...తన పరిస్థితి వివరించింది నీహారిక అలాగే మానస బంధువుల తాలూకూ ఫోన్ నెంబరివ్వమని రిక్వెస్టు చేసింది.
విషయమంతా విన్న మానస ప్రాణస్నేహితురాలు కావడంతో ఫోన్ లోనే దులిపివేసింది నీహారికను. ఇంటిపనీ...పిల్లల చదువులు.. జాబ్ తో క్షణం తీరిక లేని నేను రోజులో ఏదో టైములో ఉదయం కానీ... లంచ్ అవర్లో కానీ నైట్ పడుకునే ముందు కానీ కనీసం ఒక పది నిముషాలు ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పి రిఫ్రెష్ అవ్వచ్చని ఉద్దేష్యం తో ఫేస్ బుక్ ఓపెన్ చేసిన ప్రతీసారీ నువ్వు ఆన్ లైన్ లో దర్శనమిస్తున్నావు.. నీకు ఎలా కుదురుతుంది ఎప్పుడూ ఆన్ లైన్ లో వుండడం అని ఎన్నోసార్లు అడుగుదామనుకున్నా సంధర్భం రాక ఊరుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అంతా అర్ధమయ్యింది. ఎంతసేపు ఏ.సి రూములో కూర్చుని చాటింగ్ చెయ్యటం తప్ప నీకు ఏంతసేపూ ఏ.సీ రూములో కూర్చుని చాటింగ్ చెయ్యటం తప్ప నీకు ఏ బాధ్యతా లేదని తెల్సుకున్నాను.
చుట్టుపక్కల వారితో.... సమాజం లోని మిగతా వారి పట్ల నీకు చాలా బలహీనమైన సంబంధాలున్నాయని ఈ ఒక్క ఫోన్ తో నాకు అవగతమైంది. ఒక్క విషయం గుర్తుంచుకో నీహారికా! ఈ నెట్ పరిచయాలు స్నేహాలు.. సోషల్ వెబ్ సైట్స్... అందులో కనిపించే సుందర దృశ్యాలు అన్నీ ఆర్టిఫీషియల్ వీ...... తాత్కాలికమైనవి. భర్తా...పిల్లలు...కుటుంబసభ్యులు..మన చుట్టు ప్రక్కవాళ్ళు వారానికి ఒక సారైనా మన ఇంటికి వచ్చి పలకరించే ఆత్మీయులు..శ్రేయోభిలాషులు వెళ్ళంతా సమాజం లో మనతో పాటు శాస్వతం గా సంబంధాలు కల్గినవారు.మనం ఏదైనా పని మొదలుపెడుతున్నప్పుడు భుజం తట్టి ప్రోత్సాహం అందించే ఆత్మీయులు ..అలాగే విజయం సాధించినపుడు షేఖ్యాండ్ యిచ్చి కంగ్రాట్స్ తెలిపే నిజమైన స్నేహితులు లేనప్పుడు మనం ఎంత సంపాదించినా ఎంత హై పొజీషన్ లో వున్నా.. మానవ సంబంధాలు సరిగ్గా లేనప్పుడు అదంతా వృధా ప్రయాస అవుతుంది. మన చుట్టు పక్కల వారి ఆనందం లో... భాధలో పాలు పంచుకుంటూ...
మనం చేయగలిగిన సాయం అందిస్తూ మనకు అవసరమైనప్పుడు వారి సహాయం అందుకుంటూ సమాజం లో మన పాత్ర గుర్తెరిగి ముందుకెళ్ళాలి... ఇకనైనా నువ్వు ఇది తెల్సుకుని ఇంతకాలంగా నువ్వు ఏది మిస్ అయ్యావో గ్రహించి అది ఆస్వాదించే ప్రయత్నం చేయి. ఎం.బీ.ఏ లో గోల్డ్ మెడల్ సాధించిన నువ్వు తుప్పుపట్టిన యంత్రం లా ఇంట్లోనే వుండడం నాకు చాలా బాధగా వుంది... అని క్లాసు పీకి అధైర్యపడకు... అరగంటలో నువ్వున్న చోటికి వచ్చి కారులో తీసుకెళ్ళమని మా కజిన్ సిస్టర్ లతకు ఫోన్ చేస్తాను... అని ఫోన్ కట్ చేసింది మానస.
అసలే ఇన్నాళ్ళుగా తను చేస్తున్న పొరపాటుకి ప్రాక్టికల్ గా శిక్షను అనుభవిస్తున్న స్నేహితురాలి థియరీ క్లాసులో పూర్తిగా పశ్చాతాప పడింది. అంత చీకట్లో కూడా ఒంటరిగా బయట వెయిట్ చేయడం మంచిదికాదని కారు లోపల డోర్లన్నీ లాక్ చేసుకుని కూర్చింది. వెయిటింగ్ చేస్తూ క్షణమొక యుగం లా గడిపింది. ఇంతలో తన కారును దాటి స్పీడుగా ముందుకెళ్ళిన కారు సడన్ గా స్లో అయ్యి వెనక్కు వచ్చి తన కారు పక్కనే ఆగటం తో భయం వేసింది నీహారికను... హాయ్! మేడం నా పేరు ప్రభ..మా హస్బెండ్ శ్రీకాంత్... మేము కూడా స్వర్ణ అపార్టుమెంట్ లో మీతో పాటే అదే ఫ్లోర్ లో వుంటున్నాము. మీ హౌస్ నెంబరు పదిహేను... మాది పద్దెనిమిది అని చెప్పింది.
హలో ! నా పేరు నీహారిక... సారీ... మిమంల్ని నేను ఎప్పుడూ చూడలేదు అన్న నీహారికతో... నేను ఎన్నోసార్లు మీతో పరిచయం చేసుకోవాలని మీ ఇంటికి వచ్చినా మీరు ఎప్పుడూ సిస్టం ముందే ఉన్నారని శాంతమ్మ గారు చెప్పటం తో మీరు ఆన్లైన్ లో జాబ్ చేస్తుంటారేమో ... డిస్ట్రబ్ చేయకూడదని నేను రావటం మానేసాను.. అయితే ఇందాక మిమ్మల్ని పిక్నిక్ స్పాట్ లో చూసాను. కానీ దూరం గా వుండ్డంతో కలవలేకపోయాను. కానీ రోజూ సెల్లార్ లో చూసే మీ కారు చూసి గుర్తుపట్టి ...ఆగి వుండడంతో వెనక్కు వచ్చామని గడగడా మాట్లాడుతోన్న ప్రభని చూసి ఆశ్చర్యపోయింది. తను స్పీడు గా టైప్ చేస్తూ చాటింగ్ చేయగలదు కానీ మాట్లాడలేదు.
ఈ లోగా మానస పంపిన లత, అర్జున్ లు కార్లోంచి దిగారు. నీహారికను గుర్తుపట్టి హాయ్! మేడం..మానస ఫోన్ చేసి చెప్పింది... మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక బయల్దేరడంతో లేట్ అయ్యింది. ..సారీ...మేడం అని హాయ్! ప్రభా మీరేంటీ ఇక్కడ అని ప్రభని ప్రశ్నిస్తున్న లత వైపు ఆశ్చర్యం గా చూస్తున్న నీహారికతో మేడం మీకొక విషయం చెప్పాలి. మేము కూడా మీ అపార్టుమెంటులోనే థర్డ్ ఫ్లోర్ లో వుంటున్నాము, మానస మిమ్మల్ని గుర్తుపట్టతానికి నా ఫోన్ కి మీ ఫోటొ పంపినప్పుడే చెప్పాను తనకి మీరు తెలుసనీ.. ఎనీవే రండి వెళ్దాం అనటం తో రెండేళ్ళుగా అదే అపార్టుమెంట్ లో నివసిస్తూ కూడా పొరుగువారిని...తోటివారిని ఇలాంటి పరిస్థితిలో పరిచయం చేసుకోవాలసి వస్తుందని చాలా అవమానంగా తోచింది నీహారికకు.
ఇంటికి చేరుకోగానే వాళ్ళందరికీ థాంక్స్ చెప్పి తన గదిలోకి వెళ్ళి నెట్ కనెక్షన్ పీకేసి ఇకపై తను అందరితో కల్సి వుంటూ అందరిలా వుండాలని నిర్ణయించుకుని ...హాయిగా నిద్రపోయింది... గుడ్ నైట్...