వెలుగు నింపిన దీపావళి - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

velugu nimpina deepaavali

అమావాస్య చీకట్లు క్రమ క్రమంగా చుట్టూముడుతున్నాయి.

ప్రమిదల్లో నూనె పోసి వత్తులు పెట్టి చుట్టూవున్న ప్రహరీగీడమీద, గుమ్మానికి ఆవైపూ ఈ వైపూ, వీధి వాకిట్లోనూ అందంగా పేర్చి ఓపిగ్గా వాటిని వెలిగించింది. అప్పటిదాకా చీకటి ఆవరించి వున్న ఆ ప్రాంతం వెలుగుతో కళా కాంతి సంతరించుకుంది. అలా దేదిప్యమైన కాంతితో ఆహ్వానిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వుంటుందా? ఒక్కొక్క గోరంత దీపం ప్రసరింపజేస్తున్న కొండంత వెలుగుని చూస్తూ కాస్సేపు తాదాత్న్యతకు లోనయింది. నిజమే కళ్ళున్న వాళ్ళకే వెలుగులూ..సప్తవర్ణ శోభితరంగులు.. మరి కళ్ళులేనివారి పరిస్థితి? ఆమె కళ్ళు వర్షిత మేఘాలయ్యాయి..అప్పుడే అటుగా వచ్చిన శర్మగారు విచలితమనస్కురాలైన లక్ష్మి తల ఆప్యాయంగా నిమిరాడు. ఆయన మనసు కాస్త వెనక్కి వెళ్ళింది.

రెడ్డిరాఘవులు గారి పదహారేళ్ళ మనవడు దసరా సెలవులకని నెలరోజుల ముందుగా ఊరొచ్చి, మిత్రులతో గోదావరి నదిలో ‘మునుగు ఈతతో ఎంతదూరం వెళ్ళగలమనే’ పందెంవేసి ప్రాణాలు కోల్పోయాడు.

ఊరు ఊరంతా ఆయన బంగళాముందే వుంది. ఆ ఇంటి సభ్యులతో సహా అందరు శోకతప్తులై వున్నారు. రెడ్డి రాఘవులుగారంటే ఊరంతటికీ పెద్దదిక్కు. ఎవరికే అవసరం వచ్చినా ముందు నిల్చునేది ఆయన గడపముందే!

అక్కడే ఆయనకి కాస్త పక్కగా నిల్చున్నారు జగన్నాధ శర్మగారు. ఆ ఊరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పూజారి. శర్మగారంటే కూడా ఆ ఊరంతటికి ఎంతో గౌరవం. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా మనఃపూర్వకంగా దైవాన్ని కొలిచి వాళ్ళని ఆ కష్టం నుండి బయటపడేసేదాకా ఊరుకోరు. చాలా మంది అనుకుంటుంటారు ‘ఆర్ధికంగా ఆయన..ఆధ్యాత్మికంగా ఈయన చూడబట్టే..ఊరు పచ్చగా వుందని.’

"రెడ్డిగారూ..మనం ఎంత బాధపడినా విధికి దయా దాక్షిణ్యం వుండదు. ఊరికి తండ్రిలాంటివారు మీరే ఇలా కృంగిపోతే ఇంట్లోని కుటుంబసభ్యుల సంగతి ఎవరు చూస్తారు? వాళ్ళనెవరు ఓదారుస్తారు? మీరు కాస్త గుండే దిటవు చేసుకుని తర్వాత చెయ్యవలసిన కార్యక్రమాలు చూసుకోవాలి" ఆన్నాడు ఆ ఊరి పెద్దరైతు విభూషణరావు.

మనసులో ఒక విషయం గురించి ఎంతో మదనపడి చివరికి ’రెడ్డిగారూ..మీతో మాట్లాడాలి కాస్త అలా వస్తారా?" అన్నాడు శర్మగారు.అందరి ముఖాల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు ద్యోతకమయింది.

శర్మగారు ముందు నడిస్తే వెనక చిన్నగా రెడ్డిగారు అనుసరించారు. పెద్ద మామిడి చెట్టుక్రిందికి చేరాక "పుట్టెడు దుఃఖంలో వున్న మీతో ఇప్పుడు ఈ మాట మాట్లాడడం సరికాదు..కానీ పదిమంది మంచికోరే మనం కొన్ని నిర్ణయాలు ఎలాంటి పరిస్థితుల్లోనయినా తీసుకోవాలి తప్పదు. పైగా ఇదే సరయిన సమయం..మీరంగికరిస్తేనే అది జరుగుతుంది." అన్నాడు.

రెడ్డిగారూ అంత విషాదంలోనూ ‘ఏమిటన్నట్లుగా’ చూశాడు.

"మా లక్ష్మి తెలుసుగా! ఆమె చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో కంటిచూపు కోల్పోయిందని మీకు తెలుసు. ఒక్క చూపులేని లోపంతప్ప..సాక్షాత్తు శ్రీ మహలక్ష్మియే! అందుచేత.."కాస్తాగి రెడ్డిగారి ముఖంలోకి సాలోచనగా చూసి "మీ మనవడి కళ్ళు లక్ష్మికిస్తే..మీ దయతో తను ప్రపంచం చూడగలుగుతుంది. రేపు పెళ్ళైతే కుటుంబానికి బరువవకుండా భర్తకి తనవంతు సహకారాన్ని అందిస్తుంది..మీరేమంటారు?"అన్నాడు.

"మీరుచేస్తున్న మహోపకారం లక్ష్మికి కాదు, మాకు. ఈ ఆలోచన నాకెందుకు రాలేదో? ఒక్క కళ్ళే కాదు, అన్ని అవయవాలు దానం చేస్తాను. వాడు చిరంజీవిగా ఎంతోమంది రూపంతో మా ముందు తిరిగితే మాకంతకన్నా ఏం కావాలి? భగవంతుడు మీనోటివెంట పలికించి మాకు మంచి ఉపకారం చేశాడు. నేను మా కుటుంబసభ్యులతో ఒకసారి మాట్లాడి ఒప్పిస్తాను. మిగతా ఏర్పాట్లు కూడా చేస్తాను. విధివాడిని దూరం చేసినా, ఈ విధంగా మళ్ళీ దగ్గర చేసినందుకు మనసుకి శాంతిగా.. తృప్తిగా వుంది"అన్నాడు.

ఆయన అంత త్వరగా ఒప్పుకున్నందుకు మనసులోనే ఆ శ్రీవేంకటేశ్వరుడికి నమోవాకాలు అర్పించారు శర్మగారు.

యిదేళ్ళక్రితం శర్మగారు వీధివాకిట్లో పడక్కుర్చీలో కూర్చుని రామాయణం చదువుకుంటున్నాడు."అమ్మా నాలుగు ముద్దలు అన్నంపెట్టండీ..ఆకలేస్తోంది" అని వినిపించి గేటువైపు చూశాడు.

తిండిలేక నీర్సించిపోయి..ముఖాన కళా కాంతిలేక..అక్కడక్కడ వున్న చిరుగులను సిగ్గుపడుతూ చేత్తో కప్పుకుంటూ అవస్తపడుతున్న ఆ పిల్లని చూడగానే ఆ దయాసముద్రుడి కళ్ళు చెమ్మగిల్లాయి.

"గేటు తీసుకుని ఇలా రా తల్లీ" అని పిలిచి.."నీదే పేరు?..ఏ ఊరు?" అడిగారు."నాపేరు లక్ష్మి అండి..మొన్నొచ్చిన వరదలకి అమ్మానాన్నలతో సహా అన్నీ కొట్టుకుపోయి నేను మాత్రమే మిగిలాను..చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో కళ్ళు పోయాయి. అడుక్కుంటూ బయల్దేరి ఇలా ఇక్కడికొచ్చాను. శివాలయ మంటపంలో రాత్రికి నిద్రపోతున్నాను." అంది మనసులోని బాధని కన్నీళ్ళుగా స్రవిస్తూ."అయ్యో చిట్టితల్లీ! చిన్న వయసులోనే నీకెన్ని కష్టాల్రా?..కళ్ళులేని నిన్ను కనికరించాల్సింది పోయి..కబలించేస్తుందీ ప్రపంచం..నువ్వు మాతోపాటే వుందువు గాని" అని "దేవీ..ఈ పిల్లకి స్నానం చేయించి కట్టుకోడానికి సవ్యమైన బట్టలిచ్చి, కడుపు నిండా అన్నం పెట్టు..ఇవాళ్టినుండి ఈ లక్ష్మి మనకి దేవుడిచ్చిన కూతురు లక్ష్మి"అన్నాడు. అలా ఆ పిల్ల ఆ ఇంట్లో పిల్లయింది.

గుడ్డిపిల్లయినా చక్కటి తెలివితేటలిచ్చి భగవంతుడు తన లోపాన్ని సరిచేసుకున్నాడు. ఇంట్లోనూ..గుళ్ళోనూ..రామాయణ భాగవతాలు శ్రావ్యంగా గానం చేస్తూ..శర్మగారి..ఊరివారి మనసులకి ఊరట కలిగిస్తోంది.

ఆ పిల్ల అంటే ఊళ్ళో అందరికీ అభిమానమే! ఏ శుభకార్యం అనుకున్నా ముందు ఆ పిల్లకి చెప్పాల్సిందే! ఆమె పాల్గొనాల్సిందే!‘పిల్లల్లేని తమకి భగవంతుడు తన అంశతో పిల్లని కానుకగా అందించాడేమో?’ అనుకుంటారు ఆ దంపతులు లక్ష్మికి ఆరోజే కళ్ళ కట్లు విప్పుతారు.

శర్మగారు..రెడ్డిరాఘవులుగారితో సహా ఊరందరికీ ఆతృతగా వుంది.

లక్ష్మి కళ్ళు వచ్చేసాయి. ఆమె కళ్ళలో కళ్ళనీళ్ళ స్థానే ఆనందబాష్పాలు.

"తెగిన గాలిపటం లాంటి జీవితాన్ని ఒక గాడిన పడేశారు. కళ్ళులేని కబోదిలా ఈ ఊరు చేరాను. మీరందరూ కలసి నాకు చూపునిచ్చారు. మీ ఋణం తీర్చుకోలేనిది"అంది లక్ష్మి అనందం.. బాధ కలగాపులగంగా గొంతుని పట్టేస్తుంటే!

"తల్లీ..నువ్వు మా కష్టాలు గట్టెక్కించవచ్చిన శ్రీమహాలక్ష్మిదేవివి..నాలుగురోజుల్లో దీపావళి..నీ కళ్ళలో వెలుగులు నింపాము. ఈ దీపావళి మా ఊరికి ప్రత్యేకమైనది."అని రెడ్డిరాఘవులు గారు ఊరివాళ్ళవైపు తిరిగి "ఛూశారా! అవయవదానం మరొకరికి ఎలా జీవితాన్ని స్తుందో.. మీరందరూ కూడా చనిపోయిన మీ వాళ్ళని ఇలా బ్రతికించుకోండి.."అన్నాడు.అందరూ ఆనందంగా ఆక్షణంలో ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు.

"అయ్యగారూ!"అన్నమాట వినిపించి ఈ లోకంలోకొచ్చారు శర్మగారు.

ఊరివాళ్ళందరూ "అయ్యా! ఈ తల్లి ఇలా మీ ఇళ్ళంతా దీపాలెడుతుంటే ఎంత కళగా వుందో! మీతో పాటూ దీపావళి సంబరంగా జరుపుకోవాలని వచ్చాం."

"అలాగే..నా తల్లి మా ఇంటికే కాదు మీరందరూ ఓ మంచి నిర్ణయం తీసుకునేలా చేసి ఈ ఊరికే వెలుగు ప్రసాదించింది. అన్నట్టు భద్రంగా బాణాసంచా కాల్చుకున్న తర్వాత కాళ్ళూ చేతులు కడుక్కుని మా లక్ష్మమ్మ చేసిన మిఠాయిలు తినడం మరవకండి!"అన్నారు నవ్వుతూ!

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి