ఫిఫ్టీ..ఫిఫ్టీ - పి.వి.డి.యస్. ప్రకాష్

fifty fifty story

"నిషి కనబడుట లేదు.మారుతున్న కాలంతో సమానంగా పరిగెడుతూ సరికొత్త విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సముపార్జించుకునే మనిషి...తెలివిగా యావత్ ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకుని నిరంకుశంగా శాసించే మనిషి....శక్తిపరుడు, యుక్తిపరుడైన మనిషి కనబడుటలేదు. చేజిక్కించుకున్న మహిమల్తో విర్రవీగి నెత్తిన చేయి పెట్టుకుని, తనని తానే దహింపజేసుకున్న భస్మాసురుడిలా..తరతరాలు, యుగయుగాలుగా ఎంతో శ్రద్ధాసక్తులతో సంపాదించుకున్న సర్వశక్తుల అగ్నికీలల్లో పడి మాడి మసైపోయాడు. అసలు మనిషంటే ఎవరు? భూగోళం పై నెలకొన్న కోటానుకోట్ల జీవరాశులన్నింటిలోనూ ఎంతో మేధో సంపత్తి కలిగినవాడు. సృష్టికి ప్రతిసృష్టి చేసే సత్తా ఉన్న విశ్వామిత్రుడు, దివిజగంగను భువికి తీసుకు రాగల సామర్థ్యం కల భగీరధుడు, ఆకాశ తీరాల్లో సుస్థిర తారగా మారే నిపుణత ఉన్న ధృవుడు. అందని జాబిలిపై అడుగుజాడల ప్రగాఢ ముద్రల్ని అద్దిన నీల్ అర్మ్ స్ట్రాంగ్. అలవోకగా అంతరిక్షాన్ని ఈదేసిన సునీతా విలియమ్స్. అలా మనిషి అవధుల్లేని విజ్ఞాన ఖని. అంతులేని సృజనశీలి. ...అటువంటి మనిషే కనబడుట లేదు. ప్లీజ్...! మనిషి ఆచూకీ తెలిస్తే వెంటనే చెప్పండి.."
ఆకాశం కాన్వాస్ పై మెరిసే నక్షత్రాల అక్షరాల్తో ఓ ప్రకటన కనిపించింది. ఆశ్చర్యపోవడం సుప్రజ వంతయింది. ఇంతలో...ఎవరో గొంతు చించుకుని అరుస్తున్నారు. "ఓ మనిషీ...ఒక్కసారి కనిపించు"అని. మొదట అతి చిన్నగా వినిపించిన ఆ స్వరం అంతకంతకూ పెద్దదై రాన్రానూ భూనంభోతరాలు దద్దరిల్లే ధ్వనితో కొండ కోనల్లో ప్రతిధ్వనిస్తోంది.
ఆ అరుపులకి, ఆ పిలుపులకి ఒక్కసారిగా హడలిపోయి దిగ్గున లేచి కూర్చుంది సుప్రజ. గుండెలదిరిపోతుండగా చుట్టూ చూసింది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. కన్రెప్పల్ని దట్టంగా కమ్మేస్తున్న చిక్కటి నల్లటి వలయాలు. అంతకు ముందుదాకా ఆకాశం లో కనిపించిన ఆ అక్షరాల నక్షత్రాలు అంతలోనే అంతర్థానమయ్యాయి.
ఓ పక్క శరీరాన్ని సన్నసన్నగా కోసేస్తున్న శీతలస్పర్శ.మరోపక్క నీరసం, నిస్సత్తువ, చేతులు గాల్లో తేలుతున్నట్టు... కాళ్ళు నేల మీద నిలవనట్లు..ఊపిరి ఆగిపోతున్నట్లు ఆమేకి ఏదోలా ఉంది. చండప్రచండంగా తాకుతున్న చలితో , నిలువెల్లా భయం తో ఆమె వణికిపోతోంది. అంతెత్తున విరుచుకు పడ్తున్న రాక్షస కెరటాల్తో చీకటి సముద్రం లో దారీతెన్నూ తెలీని అస్తవ్యస్త పరిస్తితుల్లో ఆమె కొట్టుమిట్టాడుతోంది. తనని కాపాడే ఆపన్న హస్తం కోసం ఆర్తిగా ఎదురుచూస్తూ మళ్ళీ ఆమె అరిచింది. "హలో నేనెక్కడున్నాను...ఈ భూమ్మీదేనా?"
ఆమె పిలుపుకి సమాధానమా అన్నట్టు అంతలో మళ్ళీ అదే అరుపు "ఓమనిషీ...ఎక్కడున్నావ్? అది అరుపు కాదు. తప్పిపోయిన ఆత్మీయుల కోసం సాగుతున్న అంతులేని అన్వేషణ. భూగోళమంత ఆందోళన. ఆకాశమంత ఆవేదన.
"హలో...మీరెవరు? ఎక్కడున్నారు? మీకు నా మాటలు వినిపిస్తున్నాయా? అసలు నేనెక్కడున్నానో చెప్పండి ప్లీజ్. ఇక్కడి పరిసరాలు చూస్తుంటే నేనెక్కడున్నానో అర్థం కావడం లేదు. ఇక్కడ నాకేం కనిపించడం లేదు. అయోమయంగా, భయం భయంగా ఉంది. ఒకవేళ నా గొంతు మీకు వినిపిస్తే వెంటనే వచ్చి ఆదుకోండి "దీనంగా అర్థిస్తోంది సుప్రజ.
"నేను తప్పిపోయాను ప్లీజ్..నన్ను కాపాడండి "గుక్కపెట్టి ఏడుస్తోంది సుప్రజ.
"సుప్రజా...సుప్రజా...!ఓసారి కళ్ళు తెరువ్..."పిలుస్తూ ఎవరో గట్టిగా చరిచారు. తన శరీరాన్ని బలంగా తాకిన చేయిని వెంటనే పట్టుకుని "ప్లీజ్...నన్ను విడిచి పోకండి"అంటోంది సుప్రజ నిద్రమత్తులోంచి బయటకు రాకుండానే.
"ఒసేయ్,! నువ్వింట్లో...నీరూం లో.. నీ బెడ్ పైనే ఉన్నావ్. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఆ సంగతి నీకే అర్థమవుతుంది."అన్న మాటలతో ఉలిక్కిపడి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది సుప్రజ. అవును నిజం... తను తన గదిలో, బెడ్ మీదే ఉంది.ఆనందంతో సుప్రజ గెంతులేసింది.
"అర్ధరాత్రివేళ ఈ అంకమ్మ శివాలేంటే ?ఎదురుగా నిల్చున్న తల్లి నర్మద అడుగుతోంది.
"అమ్మో...ఎంత భయంకరమైన కలొచ్చిందో? నేను మనిషినట...ఎక్కడో తప్పిపోయానట. నా గురించి ఎవరో వెతుకుతూ అరుస్తున్నారు...."ఓ మనిషీ కనిపించమంటూ అడుగుతున్నారు. మమ్మీ నువ్వే చెప్పు...చిన్నప్పుడు నేనెపుడైనా తప్పిపోయానా ?"
"ఆ డౌట్ నీకెందుకొచ్చిందీ?" అడిగింది నర్మద తను తెచ్చిన మంచినీళ గ్లాసు సుప్రజ చేతికిస్తూ. ఆ గ్లాసందుకుని తొందర తొందరగా రెండు గుటకలేసి కాస్త తెరిపిన పడిన తర్వాత అంది సుప్రజ -"ఎప్పుడో జరిగిన సంఘటనలే ఇపుడు మళ్ళీ జరుగుతున్నట్టు కలలొస్తుంటాయి కదా, అందుకనీ అడిగా చెప్పు...చిన్నప్పుడు ఏ తిరుపతిలోనో, మరే తిరునాళ్ళలోనో తప్పిపోయిన జ్ఞాపకం నీకుందా?
"అదేదో జరిగినా బాగుణ్ణు. ఇప్పుడీ తిప్పలు తప్పేవి. " అంది నర్మద.
"అంటే?"
అంటే, అపుడెపుడో తప్పిపోయి తిరిగి దొరక్కుండా ఉంటే ...ఇప్పుడిలా అర్ధరాత్రి జాతర మాకుండేది కాదుకదా.! నువ్వు హఠాత్తుగా గావుకేక పెట్టడం..ఏ పాము కుట్టిందోననే ఆందోళనతో మాంచి నిద్రలోంచి మేం లేచి రావడం...ఇంత ప్రహసనం ఉండేదా?"అంది నర్మద చిరాకుపడుతూ.
గలగలా నవ్వేసింది సుప్రజ.
"ఏంటా నవ్వులు?"
భయపెట్టినా..మంచి థ్రిల్ కలిగించిన కలని తల్చుకుంటుంటే భలే తమషాగా ఉంది. సిటీలో జీవవైవిధ్య సదస్సు జరుగుతోంది కదా! ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా కాలేజీలో "జీవ వైవిధ్యం-మనిషి పాత్ర" అనే అంశం పై వ్యాసరచన పోటీ అనౌన్స్ చేసారు. అందులో పార్టిసిపేట్ చేద్దామని సిన్సియర్ గా ఎఫర్ట్ చేసి లైబ్రరీలో కూచుని ఎక్కడలేని పుస్తకాలు తిరగేసేసరికి ఇదిగో...ఇలా బెదరగొట్టే కల..."మళ్ళీ గలగలా నవ్వింది సుప్రజ.
"గుడ్ సుప్రజా! జీవ వైవిధ్యం మీద వ్యాసం రాయమంటే ఏకంగా థీసీసే సబ్మిట్ చేసావ్."తెలుగు లెక్చరర్ ఆనందరావు మెచ్చుకోలుగా అన్నాడు. లెక్చరర్ అలా ప్రశంసించేసరికి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది సుప్రజ.
ఇంతలో "థీసీస్ అంటే తేసేసి రాయడమే కద్సార్" లాస్ట్ బెంచ్ లోంచి ఓ సెటైర్ వినిపించింది.
"వాడే ....వేస్ట్ ఫెలో" ఆ గొంతు గుర్తు పట్టింది సుప్రజ.
"ఎవరు...ఎవరా కూత కూసింది?"అడిగాడు ఆనందరావు. సుప్రజ లేచి వాడిపేరు చెప్పేందుకు సమాయుత్తమౌతుండగా పక్కనే ఉన్నకల్పన ఆమెని వారించింది.
"దారిన పోయె గొడవనెందుకు నెత్తికెత్తుకోవడం?"సుప్రజకి మాత్రమే వినిపించేంత నెమ్మదిగా అంది కల్పన. దాంతో ఆమె ఏమీ మాట్లాడకుండా జరుగుతున్న సన్నివేశాన్ని మౌనంగా వీక్షిస్తోంది.
"ఇక్కడే...ఇప్పుడే... ఈక్షణమే నాకు తెలియాలి.డిగ్రీ ఫస్టియర్లోనే థీసీస్ నిర్వచనం తెలిసిన మహానుభావుడెవడని నేను చూడాలి."
అంటున్నాడు ఆనందరావు. ఎవరూ ఏం మాట్లాడడం లేదు. చిన్న సూది కింద పడినా వినిపించేంత పిన్ డ్రాప్ సైలెన్స్ గా క్లాస్ వుంది. ఆనందరావు తెలుగు లెక్చరరే అయినా ...స్ట్రాంగ్ పొలిటికల్ బాక్ గ్రౌండ్ ఉన్నవాడు. అందుకే, షాడో ప్రిన్సిపాల్ గా ఆయన వ్యవహరిస్తాడన్న పేరు కూడా ఉంది. ఆ కాలేజీలో ఆయన ఎంత చెప్తే అంత. అందుకే, స్టూడెంట్స్ కూడా ఏ క్లాసులో ఎంత అల్లరి చేసినా ..ఆనందరావు క్లాసులో మాత్రం కాస్త క్రమశిక్షణతోనే ఉంటారంతా.
"లాస్ట్ బెంచ్ ఒక్కరొక్కరుగా లేవండి" హుకుం జారీ చేసాడు ఆనందరావు దాంతో వెనక బెంచీ మీంచి ఒక్కరొక్కరుగా లేస్తూ - "నేను కాదంటూ తప్పుకుంటున్నారు.
"మీకంటే ఈ ఆడపిల్లలే నయం...ఇచ్చిన ఎసెన్మెంట్స్ ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తూ అప్డేట్ గా ఉంటారు. ఇలాంటి కాంపిటీషన్లలో పార్ట్సిపేట్ చేస్తూ ప్రతిభ చాటుకుంటారు...అందుకే, మీరంతా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అయ్యారు. ఈ ఆడపిల్లలు ఫస్ట్ బెంచ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయ్యారు."అన్నాడు లెక్చరర్.
"లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, అందుకే మేం చదవకుండా వాళ్ళకా చాన్స్ ఇచ్చేస్తున్నాం." ఈసారి మళ్ళీ అదే గొంతు. అయితే, ఆ స్టూడెంట్ ని గుర్తు పట్టాడు ఆనందరావు.
"ప్రశాంత్ .....లే, లేచి నీ ముఖారవిందాన్ని మా అందరికీ ఓసారి చూపించు. కనిపించకుండా బెంచీలకింద దాక్కుని గొంతు మార్చి క్లాస్ లో అల్లరి చేయడం కాదు..." కోపం తో ఊగిపోతున్నాడు లెక్చరర్.
"నా మాటవిని నువ్వు ఇపుడు కనుక లేచి నిల్చోక పోతే,...ఇక ప్రిన్సిపాల్ ముందే నిల్చోవాల్సి వస్తుంది. తర్వాత...సస్పెండై కాలేజీ గేటు బయట నిల్చోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎగ్జామ్స్ కి ఎటెండ్ కాకుండా..ఏ ఆఫీసులోనో అటెండరుగా చేరి చాలీ చాలని నెల జీతం కోసం ఎంప్లాయీస్ దగ్గర చేతులు కట్టుకుని ప్రతిరోజూ నిల్చోవాల్సి వస్రుంది...."అంటూ బెదిరించాడు లెక్చరర్.
"అన్ని నిల్చోవడాలు వద్దు సార్. నేనిక్కడే , ఇప్పుడే లేచి నిల్చుంటా.."అంటూ లేచి నిల్చున్నాడు ప్రశాంత్ 'రాముడు మంచి బాలుడ'న్న రీతిలో అమాయకమైన ఫోజిస్తూ.
"ప్రశాంత్... ఇలాంటి కాంపిటీషన్స్ లో నువ్వెపుడైనా పార్టిసిపేట్ చేసావా?"
లేదు సార్,"తల అడ్డంగా ఊపాడు ప్రశాంత్.
"ఏం, ఎందుకనీ?"
"టైం లేదు సార్"
ఓహో ...అంత తీరిక లేని పనేం చేస్తున్నారో దొరగారు"అడిగాడు ఆనందరావు.
"పొద్దస్తమానం కంటికి నచ్చిన అమ్మాయిల వెనక పడ్డమే. అంతకు మించిన పని దొరగారికేముంది?"కోపంగా పళ్ళు నూరుకుంటోంది సుప్రజ. సుప్రజ వేపే చూస్తూ అన్నాడు ప్రశాంత్. -"పొద్దున లేచిందగ్గర్నుంచీ ఒకటే పని సార్. ఇల్లు ఊడవాలి. అన్నం వండాలి. సాయంత్రం ఇంటికెళ్ళగానే బట్టలు ఉతకాలి. ఇలా ఆడపనీ, మగపనీ అనే తేడా లేకుండా ఇంట్లో అన్ని పనులూ నేనే చేసుకోవాలి సార్.అస్సలు చదువుకోడానికే సమయం చాలడం లేదు. ఇంకా ఇలాంటి కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చేసే టైం నాకెక్కడిదీ?"అనాడు దీనంగా మొహం పెట్టి ప్రశాంత్.
"అవునా, అదేం?"
"నాకు మమ్మీ లేదు సార్. చిన్నపుడే చనిపోయింది. నాన్నకి బిజినెస్ లో తీరిక ఉండదు. అందుకే, ఇంటి పనంతా నాదే" అన్నాడు.
ప్రశాంత్.
ప్రశాంత్ చెప్పిన దాంట్లో అమ్మలేదన్న విషయం ఒక్కటే నిజం. మిగతావన్నీ అబద్ధాలే. అయితే, ఆనందరావుకు అవి అబద్ధాలని చెప్పే ధైర్యం ఎవరికుంది? దాంతో ప్రశాంత్ పాచిక పారింది.
"అమ్మ లేని జీవితం నిజంగా దుర్భరం. వెరీ సారీ" అంటూ చూడు ప్రశాంత్ ఇకముందెపుడూ ఇలాంటి అల్లరి చిల్లర వేషాలు వేయకు.
బుద్ధిగా చదువుకుని వృద్ధిలోకి రా. ఇక్కడ లెక్చరర్ చెప్తున్న పాఠాలు వినకుండా సెటైర్లు, కౌంటర్లతో నీ తెలివితేటల్ని వేస్ట్ చేసుకోకు. నా క్లాసులో నీ బిహేవియర్ నచ్చకపోయినా ఫస్ట్ టైం నిన్ను క్షమిస్తున్నా"అన్నాడు ఆనందరావు.
సుప్రజవేపు చూస్తూ పొగరుగా కాలరెగరేసి మరీ కూచున్నాడు ప్రశాంత్
"ఇక విషయానికొస్తే, ఈ కాంపిటీషన్ లో సుప్రజకే ఫస్ట్ ప్రైజ్. కంగ్రాట్స్ సుప్రజా! త్వరలో కాలేజీలో జరిగే ఫంక్షన్లో ప్రిన్సిపాల్ గారి చేతులమీదుగా ఆ ప్రైజ్ నువ్వందుకుంటావ్..." అనౌన్స్ చేసాడు ఆనందరావు.
దాంతో స్టూడెంట్సంతా బల్లలపై దరువేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేఆరు. పక్కనే ఉన్న కల్పన సుప్రజతో చేతులు కలుపుతూ -"కంగ్రాట్స్. ఇవాళ ఈవెనింగ్ కాఫీక్లబ్ కెళ్దాం, బిల్ నీదే" అంది.
ఆ సాయంత్రం కాఫీక్లబ్ లో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తో ప్రైజు వచ్చిన ఆనందాన్ని షేర్ చేసుకున్న తర్వాత ఒంటరిగా ఇంటికెళ్తున్న సుప్రజని అనుసరిస్తూ విసిగిస్తున్నాడు ప్రశాంత్. ఇది ప్రతిరోజు తంతే. ఈ దేశంలో ఆడదానిగా పుట్టినందుకు ఇలాంటి పోకిరి బెడదకి అలవాటు పడాల్సిందే. లేదా....అరిచి అల్లరి పడాల్సిందే. అపుడైనా కడుపున పుట్టిన ఆడపిల్లల్ని తల్లిదండ్రులు వెనకేసుకొస్తారన్న నమ్మకం అసలు లేదు. చూసీ చూడనట్టు వ్యవహరించకుండా ఆ మగాడితో గొడవ పడ్డావేంటని..? ఇంట్లో, వీధిలో పెద్దలు నిలదీయొచ్చు. అందుకే, చాలామంది ఆడపిల్లలు బాధ బయటపడకుండా పంటిబిగువున అణుచుకుంటున్నారు. సుప్రజ కూడా మొదట్లో పట్టించుకోనట్టు వ్యవహరించినా..నానాటికీ మితిమీరుతున్న అతడి ఆగడాలను సహించలేక గతంలో ఓసారి క్లాస్ పీకింది. అయినా, అతడు వినిపించుకోలేదు. 'అసూర్యంపశ్య'లైన మహిళలు కనిపించని సంకెళ్ళను తెంచుకుంటూ ఈనాడు నాలుగ్గోడల్ని దాటుకుని విశాలమైన ప్రపంచం లోకి అడుగుపెట్టి మంచి చదువులు చదివి ఉన్నత పదవులు ఏలేందుకు సిద్ధమౌతుంటే, ఇంకా అడుగడుగునా పంజా విసురుతున్న పురుష దురహంకారమేనా?
ఆడదంటే, భొగ్య వస్తువనే అవగాహనేనా? ఎంతసేపూ చాలామంది మగాళ్ళకి ఆడదాన్ని అనుభవించాలనే తపన, తాపత్రయమే తప్ప, ఆమెకీ ఓ మెదడుంటుంది..అది ఆలోచిస్తుంది, ఓ హృదయం ఉంటుంది..అది స్పందిస్తుందని ఎందుకనిపించదు? వివిధ అవసరాల నిమిత్తం ఇంటినుంచి బయటకొచ్చే మహిళ్ అలకు ఇలాంటి ఆకతాయిల నుంచి రక్షణ ఏదీ? ఆ బాధ్యత ఎవరిదీ? కని పెంచిన తల్లిదండ్రులదా? చుట్టూ ఉన్న సమాజానిదా? చట్టానిదా? ఆ చట్టాలని చేసే పాలకులదా? ఆ పాలకులను ఎన్నుకునే ఓటర్లదా? లేక, మేం మీ స్నేహితులమంటూ తాటికాయంత పెద్ద అక్షరాల్తో ప్రచారం చేసుకునే పోలీసులదా? ఈ మహిళల్ని ఎవరు రక్షిస్తారు?
"నీకు ప్రైజ్ వస్తే మాకూ హ్యాపీనే. నీకంత పార్షియాలిటీ పనికిరాదు. కేవలం నీ చుట్టూ తిరిగే ఇద్దరుముగ్గురికే పార్టీ ఇచ్చి, మమ్మల్ని పిలవకపోతే ఎలా? ఉదయ సాయంకాలాలూ నేను నీ చుట్టూనే తిరుగుతున్నా"అంటున్నాడు వెనకెంకే నడుస్తూ వెకిలిగా నవ్వుతూ ప్రశాంత్.
"నిజానికి పార్టీ ఇవ్వాలనుకుంటే.. ముందు నాకే ఇవ్వాలి. ఎందుకంటే, నీకు నీ ఫ్రెండ్స్ కంటే నేనే ఎక్కువ. ప్రతిరోజూ ఇంటినుంచి కాలేజీకి, కాలేజి నుంచి ఇంటికి బాడీగార్డ్ లా తీసుకెళ్ళి తీసుకొచ్చేది నేనే. ప్రతి ఉదయం మీ ఇంటి సందు చివర్న నిల్చుని నువ్వు ముస్తాబై బయటికి ఎపుడెపుడు వస్తావా?అని గంటలు గంటలు వెయిట్ చేస్తుంటా. తీరా నువ్వు వచ్చాక..నీవెంట కాలేజీకి, అట్నుంచి క్లాసుకి చేరుకుని నిన్నే తదేకంగా చూస్తూ మైమరచిపోతా. తిరిగి సాయంత్రం క్లాసు నుంచి ఇంటికి తీసుకురావడం కూడా నా బాధ్యతేగా. ఈ విషయంలో మీ నాన్నని కూడా తప్పు పట్టాల్సిందే. ఎంతసేపూ అఫీసు అఫీసంటూ పని చేసుకుంటాడే కానీ ..అరె, డిగ్రీ చదువుతున్న కూతురు కాలేజీకెలా వెళ్ళివస్తోందనే ఆలోచనేమైనా అతడికుందా...లేదే...? వసపిట్టలా వాగుతున్నాడు.
ఆడశివంగిలా ఒక్కసారి వెనక్కి తిరిగి -"ఇచ్చేది పార్టీ కాదు, పోలీసులకు ఫిర్యాదు. మిస్టర్. మైండ్ యువర్ బిజినెస్...నిన్ను పట్టించుకోకుండా ఎంత విదిలిస్తున్నా నా వెంట పడ్డానికి సిగ్గు లేదూ?ఈ సారి నా వెనక పడ్డావో, జాగ్రత్త"అరిచింది.
ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తులు కావడంతో ప్రశాంత్ తన కాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడలా వెన్ను చూపి పరిగెడుతుంటే సుప్రజకి చూడముచ్చటగా ఉందా దృశ్యం.
"జీవితం లో ఏ ఆపదైనా పరిగెడితే భయపెడుతుంది. భయపెడ్తే పరిగెడ్తుంది. అన్న విషయం సుప్రజకి మొదటిసారిగా తెలిసినట్లైంది.
దాంతో ఆ రాత్రి ఆమెకి ఆనందంతో నిద్ర కరువైంది.
ఆ మర్నాటి ఉదయం -
ఆనవాయితీకి విరుద్ధంగా సుప్రజకి ఇంటిదగ్గర ప్రశాంత్ ఎదురుపడలేదు. కాలేజీలో కనిపించలేదు. క్లాసుకి రాలేదు. కల్పనతో జరిగిన విషయం చెప్తూ "ఎదురుపడేందుకు మొహం చెల్లనట్లుంది " కామెంట్ చేసింది సుప్రజ.
"జరిగిన సంగతి ఇంట్లో పేరెంట్స్ కి, దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో పోలీసులకి ముందుగా చెప్పు" అని సలహా ఇచ్చింది కల్పన.
"అవమానభారంతో చచ్చిన పాము. వాడేం చేస్తాడు?" ధీమా ప్రదర్శించింది సుప్రజ.
"అంత చిన్న దెబ్బకే పాము చచ్చిందనుకోవడం వట్టి భ్రమ. నువ్వు తోకనే తొక్కావ్. రేపోమాపో అది పడగవిప్పి బుస్సున కాటేస్తుంది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉందు..."అంది కల్పన.
"అలాగే" అంది సుప్రజ. ఆ సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికొస్తుండగా...దారిలో ఎదురుపడ్డాడు ప్రశాంత్. రోజులా లేడు. రాత్రి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నాడేమో, ..కళ్ళెర్రగా ఉన్నాయి. జుత్తు చెదరి ఉంది.
"ఆగు సుప్రజా!" గట్టిగా అరిచాడు ప్రశాంత్.
"ఇన్నాళ్ళూ ఎపుడూ నీ వెనకే నడిచాను. ఇవాళే నీకెదురొచ్చాను.ఎందుకో తెలుసా?" అని భీకరంగా నవ్వాడు. "ఎపుడో అపుడు నువ్వు లొంగుతావనుకున్నా.నిన్నటి ఆ సంఘటనతో ఆ ఆశ తీరిపోయింది. నాకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే పంతంతోనే చిన్నప్పట్నుంచీ నే పెరిగా.నాకు దక్కని నిన్ను మరెవరికీ దక్కనివ్వను. సుఖంగా ఉండనివ్వను...."అంటూ హఠాత్తుగా వెనక దాచుకున్న చేతుల్లోంచి ఓ బాటిల్ చూపించాడు.
"అదేంటీ?" సుప్రజ గొంతులో భయం...
"యాసిడ్.. ఒక్కసారి ఈ బాటిల్ విదిలిస్తే నువ్వు కాలి బూడిదవుతావ్.." అంటూ మీదమీదకొస్తున్నాడతడు.
"హెల్ప్...హెల్ప్.."చుట్టూ చూస్తూ గట్టిగా అరిచింది సుప్రజ.
ఈ బాటిల్ చేతిలో ఉండగా ఎవరొస్తారో చూస్తా" అంటూ రెచ్చిపోతున్నాడు ప్రశాంత్. ఇంతలో అట్నుంచి వేగంగా వస్తున్న ఓ స్కూటర్ అతడ్ని ధీ కొట్టింది. అదుపు తప్పి ప్రశాంత్ కింద పడ్డాడు. స్కూటర్ మరింత వేగంగా ముందుకు దూసుకుపోయింది.దబ్బున పడిన బాటిల్ చితికి యాసిడ్ ప్రశాంత్ మొహం పై పడింది. దాంతో భరించలేని బాధతో ప్రశాంత్ హాహాకారాలు చేస్తుంటే.....గుమికూడిన నలుగురు అతడ్ని ఆటోలో వేసుకుని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో పడ్డారు. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న సన్నివేశాల్ని గమనించలేని స్థితిలోపడ్డ సుప్రజ స్థాణువే అయింది.
"మేడం మంచినీళ్ళు తాగండి" ఎవరో అరిచారు. అందుకుని గడగడా నీళ్ళు తాగేసింది సుప్రజ.
"మీరూ..." పక్కనే ఆగిన స్కూటర్ వేపు చూస్తూ అడిగింది తేరుకున్న తర్వాత.
"సాగర్...సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మీ ఎదురింట్లోనే ఉంటున్నా..అడపాదడపా మిమ్మల్నీ..అతడ్నీ గమనిస్తున్నా..ఆ క్రమం లోనే నిన్నటి సంఘటన చూసా.ఇవాళేదో జరుగుతుందని ఎక్స్ పెక్ట్ చేసా...ఊహించిందే జరిగింది. యాసిడ్ తో మీ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించి తాను తెచ్చిన యాసిడ్ కి తానే బలయ్యాడు..." చెప్పాడతడు. వారం రోజుల తర్వాత ఓ సాయంత్రం-
"మీకెలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు..."సాగర్ తో అంది సుప్రజ.
" ఆ ఇన్సిడెంట్ ని ఇంకా మీరు గుర్తుంచుకున్నారన్న మాట. అన్నట్టు మీ ప్రియమైన శత్రువెలా ఉన్నాడు?"అడిగాడు సాగర్.
"ప్రియమైన శత్రువా?" అర్థం కానట్టు చూసింది అతనివేపు సుప్రజ.
"అదేనండీ...ప్రతిరోజూ మిమ్మల్ని నీడలా వెన్నాడే మీ క్లాస్ మేట్."అతడడుగుతున్నది ప్రశాంత్ గురించేనని అప్పటికి అవగతమైందామెకి. నవ్వుతూ - "ఇంకా ఆస్పత్రి బెడ్ మీదే ఉన్నాడు. మీ దెబ్బకి ..ఆ యాసిడ్ ధాటికి మొహమంతా కాలిపోయిందట"
"అందుకే అన్నారు పెద్దలు..చెరపకురా చెడేవు అని. పెద్దల మాట చద్దన్నం మూట. ఆ సంగతి ఇప్పటివాళ్ళకి తెలిస్తే ఇన్ని అనర్థాలు జరగవు"
"అంటే...మీరు ఎప్పటి వారో..?"
ఎం.ఎన్.సి.లో పని చేస్తున్న నన్నే అనుమానిస్తారేమిటండీ? నేనూ ఈ తరం కుర్రాడినే. అయితే, మా బామ్మ పెంపకంతో.... "మిగతా మాటలు పూర్తి చేయకుండా ముసిముసిగా నవ్వాడు.
"ఇవాళ రేపు పక్కవాడికి సాయం చేసే మనుషులున్నారంటారా"? అడిగింది సుప్రజ.

"ఎందుకు లేరు? నిలువెత్తు ఉదాహరణగా మీ ఎదురుగా నేనే ఉన్నానుగా"అన్నాడు నవ్వుతూ.
"ఏమో...నమ్మలేకపోతున్నాను."
"ఎందుకంత అపనమ్మకం"
"ఈ మధ్యే మనిషి మీద ఏర్పడిన అభిప్రాయం" అంది సుప్రజ.

"ఓహో....అయితే, మీరు చెప్పాల్సింది చాలా ఉందన్న మాట. అంటే, నేను వినాల్సింది ఎంతో ఉందనేగా అర్థం" అన్నాడు సాగర్.
"వినే ఓపిక ఉందా? అయితే, పదండి పక్కనే ఉన్న కాఫీ క్లబ్ కి."
ముందు ఆమె, వెనక అతడు. అయిదు నిముషాల్లో కాఫీక్లబ్ లో ఉన్నారిద్దరూ.
కాఫీకి ఆర్డరిచ్చాక -"ఊ...ఉపోద్ఘాతం చెప్పారు.అసలు కథేంటో చెప్పండి" అన్నాడు సాగర్ నవ్వుతూ.
"సుత్తి లేకుండా సూటిగా చెప్తాను. మనిషి ఎంత నిరంకుశుడో, ఎంత స్వార్థపరుడో ఇపుడిపుడే నాకర్థమౌతోంది. తన స్వార్థం కోసం ప్రకృతిని కబళించేశాడు. కోటానుకోట్ల జీవరాశుల ఉనికిని నిర్వీర్యం చేశాడు. చేస్తున్నాడు. ఇంటి ముంగిట్లోకి వచ్చి ఇన్ని బియ్యం గింజల్ని ఏరుకునే చిన్ని పిచుకల్ని సర్వ నాశనం చేశాడు. అంతులేని ధనరాశుల కోసం కప్పల్ని ఎగుమతి చేసి ఆ జాతి లేకుండా చేసాడు. ప్రకృతివిరుద్ధంగా అనేక అక్రమాలకు పాల్పడ్డ ఈ మనిషి ..క్రమక్రమంగా చివరికి తన జాతినే అంతం చేసుకుంటున్నాడు. చూసారుగా...ఈ యాసిడ్ దాడులు...ఎక్కడో దేవుడు కరుణించబట్టీ ఇపుడు మీముందు కూచుని ఇలా మాట్లాడగలుగుతున్నా.లేకుంటే, నేనుండాల్సింది ఆస్పత్రిలోనే. కాపాడినందుకు థాంక్స్" సర్వర్ తెచ్చిచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అంది సుప్రజ.
"ఫిఫ్టీ..ఫిఫ్టీ"అన్నాడు తన కాఫీ కప్పుని పక్కకు తోసేస్తూ సాగర్ సడెన్ గా.
"ఏమన్నారు?"
"ఫిఫ్టీ..ఫిఫ్టీ...మీ కప్పులోని కాఫీని సగం సగం తాగుదామంటున్నా.." అన్నాడు.
"ఔను...ప్రకృతి ఐనా ప్రేమ ఐనా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటేనే జీవ వైవిధ్యం సార్ధకం"అనుకుందామె.
సగం సగం కాఫీ పంచుకుంటున్న ఈ తాజా సన్నివేశంలో సుప్రజ అంతరంగంలో కదుల్తున్న రంగురంగుల భావాలెన్నో...ఎన్నెన్నో? ఏమో...కొన్నాళ్ళ తర్వాత ఆమె ఆలోచన నిజమవొచ్చేమో.....ఎవరు చెప్పగలరు?

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి