ఎవరు వికలాంగులు? - ఇ. ఉదయ కుమార్

evaru vikalangulu

య్ నిమ్మీ...నిన్నేనే...
ముక్త కంఠంతో ఎవరో తనను పిలిచినట్లనిపించి వెనక్కు తిరిగి చూసింది నిర్మల. తన చిన్ననాటి మిత్రులు కవిత, రజని, కల్పన పార్కింగ్ ప్లేసులో హుందాయ్ కారు దగ్గర హూందాగా నిలబడి తననే పిలుస్తున్నారు.

ఎన్నాళ్ళకు... ఉహూ... ఎన్నేళ్ళకు కనిపించారు. నిర్మల ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయి. "హాయ్ ఎవెరీబడి" అంటూ చిన్న పిల్లలా పరుగు తీసింది వారి వద్దకు. వారి సౌకుమార్యాన్ని కన్నార్పకుండా చూస్తూ "మీరు నిజంగా కవిత, రజని, కల్పనలే కదా? దివి నుండి భువికి ఏతెంచిన రంభ, ఊర్వశి, మేనకలు కాదుగా!" అని ఆశ్చర్యంగా అడిగింది.

"అవునే తిలోత్తమ తప్పి పోతేనూ ఇలా వచ్చాం, హమ్మయ్య ఇదిగో ఇప్పుడు కనిపించింది. మొత్తానికి ఇంద్రుడితో చివాట్లు తప్పించావు" ఎకసక్కెంగా అంది రజని.

"నీ పెంకితనమూ, నువ్వూ... చిన్నప్పటి నుంచి నువ్వేమీ మారలేదే. అపుడే జోకులు మొదలెట్టావు" రజని చేతిని ఆప్యాయంగా నొక్కుతూ అంది నిర్మల.

"మరి మామీద జోకులేస్తే ఊరుకుంటానా?" నవ్వుతూ అంది రజని."నిమ్మీ, మమ్మల్నీ కాస్తా కనికరించి మాట్లాడవే" మిగతా వారు నిష్టూరమాడారు. "అయ్యో అదేంటే, అలా అంటారు. మనమంతా ఎంత థిక్ ఫ్రెండ్స్మో అందరికీ తెలుసు. కాలేజీ చదువులయ్యాక ఎవరికివారు విడిపోయామే గానీ లేకపోతే కవలల్లా కలిసి మెలిసి ఉండేవారం కాదూ?" రాగం తీసింది నిర్మల.

"ఇపుడెవరు కాదన్నారూ, ఇలా రోడ్డు మీద నిలబడి మాట్లాడ్డమేనా ఏదైనా హోటల్కి వెళ్ళే ప్రోగ్రాము ఏదైనా ఉందా?" అసహనంగా అంది కల్పన.

"కల్పనా నీకెప్పుడూ తిండి ద్యాసేనే. ఒకసారి క్లాసులో నువ్వు చక్కిలం పట పటలాడించేస్తుంటే ఎవర్రా నామీద పళ్ళు నూరుతున్నారు అని తెలుగు మాస్టరు నీమీద రంకెలు వేయడం నాకింకా బాగా గుర్తు" గల గలా నవ్వుతూ అంది నిర్మల."తల్లీ నీకో దండం, ఇక నీ ఫ్లాష్ బ్యాకులు ఆపి కారెక్కు. హోటల్లో తందూరి తింటూ కబుర్లు చెప్పుకుందాం" అమల ప్రతిపాదనకు అందరూ ఓకే చెప్పి కారెక్కారు.

కవిత, రజని, కల్పన డబ్బులో పుట్టి డబ్బులో పెరిగారు. జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకొనే రకం వారు. తాము గొప్పవారమనే అహం వారిలో మెండు. నిర్మల దిగువ మధ్యతరగతి కుటుంబీకురాలు. ఆచితూచి అడుగేస్తుంది. నిర్మల అమాయకత్వం వారికి నచ్చింది. ఏసీ కారు ఫైవ్ స్టారు హోటలు వైపు రివ్వున దూసుకెల్తోంది. ఇది గమనించిన నిర్మల "మనం ఎక్కడికే?" అని ఆదుర్దాగా అడిగింది. "ఫైవ్ స్టారు హోటలుకు" కారు డ్రైవు చేస్తూ అంది కల్పన.

"అమ్మో ఖరీదైన ఈ తందూరి అక్కడ ఎంతుంటుందో?" గుండె మీద చెయ్యి వేసుకొని అంటున్న నిర్మల వైపు చుస్తూ "ఎంటే నీ పర్సు ఖాళీ అవుతుందని బెంగ పడుతున్నావా?" ఉడికిస్తూ అంది కల్పన.

"అది కాదే" అంటున్న నిర్మల నోటి మీద చెయ్యి పెట్టి "తినేదీ తినిపించేదీ అంతా మేమే. నీవు కేవలం నిమిత్తమాత్రురాలివే" అభయమిచ్చింది అమల.

వారు ముగ్గురూ, తనొక్కతే. కుక్కిన పేనల్లే కూచోక తప్పలేదు నిర్మలకు. కారు హోటల్ వద్దకు వచ్చి ఆగింది. ఎదురుగా మైసూరు ప్యలెస్ లాంటి పెద్ద భవంతి. రిచ్ గా ఉంది. సూట్లూ, బూట్లూ, స్లీవ్లెస్సు జాకెట్లే అన్నీ. నిర్మల వ్యానిటీ బ్యాగులో చిల్లరతో లెక్కబెట్టినా వందకు లోపే ఉంది.

"బిల్లు మన పర్సుకు చిల్లు చెయ్యడం ఖాయం" పైకే అనేసింది నిర్మల.

"ష్, మా మర్యాద తీసేట్టున్నావే" గద్దించారు ముగ్గురూ.

మెనూలో చూసి ఏవేవో ఆర్డర్ ఇచ్చారు. వాటి పేర్లే తెలీదు నిర్మలకు. తప్పదన్నట్లు మిన్నకుండి పోయింది. సర్వర్లు బిల బిల మంటూ వచ్చారు. అన్నీ సర్ది పోయారు.

"ఇవన్నీ మనకే" ఆశ్చర్యంగా అంది నిర్మల.

"కాదే వీటిలో కొన్ని మీ కాలనీ వాళ్ళకు కూడా తీసుకెల్దువులే" వెటకారంగా అంది అమల.

"హోటలు ప్రోగ్రాము అన్నప్పటినుంచి చూస్తున్నా ఓ ఒకటే వణికి పోతున్నావే" అంది కల్పన.

"డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు పెట్టడం మాకు అలవాటేలేవే" అంది కవిత డాబు ప్రదర్శిస్తూ.

" ఆ, ఇక చెప్పవే నిమ్మీ, ఈ రోజు నీవే మా గెస్టువు. చాలా రోజులకు కనిపించావు. ఎక్కడ వున్నావు? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు?" ప్రశ్నలు సంధించారు ముగ్గురూ.

"ముందు మీగురించి చెప్పండే" అంది నిర్మల.

"ముంజేతి కంకణానికి అద్దమెందుకన్నట్లు మాగురించి అందరికీ తెలుసు. మేము ఈ సిటీలో ధనవంతులం. నువ్వేంటే చిక్కి శల్యమవుతున్నావు. చిన్నప్పుడు బొద్దుగా ఉండేదానివి. నీ మొగుడు తిండి పెడుతున్నాడా, లేదా?" ఆరా తీశారు.

"మా ఆయన చాలా మంచి వ్యక్తి. ఏదో మాకు తగ్గట్లు సంపాదించుకుంటున్నాము. నాకు ఇద్దరు పిల్లలు. ఇదీ మా చరిత్ర. ఇక మీ వంతు" అంది నిర్మల.

" మా ఆయన పేద్ద రాజకీయ నాయకుడు. ఆయన పరపతి గల వ్యక్తి. ఆయన చుట్టూ ఎప్పుడూ జనమే జనం" గొప్పలు పోయింది అమల.

"మా ఆయన ఫేమస్ డాక్టరు. పెద్ద ఆసుపత్రి మేడలు కార్లు వగైరా షరా మామూలే" చెప్పింది కవిత.

"ఇక నా భర్త రంజీ క్రికెటర్. నీకు తెలుసుగా క్రికెట్టంటే డబ్బులని. మాకు డబ్బుకి కొదువ లేదమ్మా" బడాయి పోయింది రజని.

"ఓ వాళ్ళా? పేపర్లో ఈ మధ్య వారి గురించి చదివాలే." అంది నిర్మల.

"చదవక చస్తావా, మా వాళ్ళు గొప్ప వాళ్ళు, సెలెబ్రిటీలు కదా. మరి నీ భర్త ఏమి చేస్తుంటాడే?" అడిగారంతా ఆసక్తిగా. ఈలోగా నిమ్మీకి తన భర్త నుంచి ఫోనొచ్చింది. కాసేపు పక్కకెళ్ళి మాట్లాడి వచ్చింది. తన భర్త గురించి చెబుతూ, "మా ఆయన అటెండరు లేవే. వికలాంగుల కోటాలో ఆయనకు ఉద్యోగమొచ్చింది. చిన్న ఉద్యోగమైనా చింతలు లేని కుటుంబం మాది. మా ఆయనకు నేనన్నా, పిల్లలన్నా
ప్రాణం" అంది నిర్మల.

"ఏంటో ఇంత చిన్న ఉద్యోగాన్నే అంత పెద్దగా చెబుతున్నావు. మా దగ్గరకు వస్తే అంతకంటే పెద్ద ఉద్యొగమే ఇస్తాము. అయినా దెవుడు నీకు చాలా అన్యాయం చేశాడే. వికలాంగున్ని ఇచ్చి నీ ఆనందం మీద నీళ్ళు చల్లాడు." అని వారు అనగానే

నిర్మలకు కోపమొచ్చింది. "అలాంటి మాటలు మాట్లాడకండి. ఆయనకు ఆ లోపమొక్కటే. గుణంలో ఆయన శ్రీరామ చంద్రుడు" అంది.

"నీ మొగుడిని వెనకేసుకు రాకమ్మా. వికలాంగుడే కదా. పాపం" సానుభూతి చూపించారు.

"అంత సానుభూతి అక్కర్లేదు. గుణంలో మా ఆయన మీ భర్తల కంటే ఎంతో ముందున్నాడు. మీ వాళ్ళంతా అవినీతిపరులని పత్రికలు కోడై కూస్తున్నాయి. అదీ గొప్పతనమేనా? మాకు అలాంటి గొప్పతనం అక్కర్లేదులే. త్వరలో జైలు పాలయ్యే పెద్దరికం మాకు ఏమాత్రం వద్దు. మీవి మేడిపండు జీవితాలు. చిన్నప్పటి మిత్రులని కలిస్తే ఇలా అవమానిస్తారా? మీకో దణ్ణం" అంటూ అప్పటికే అక్కడకు చేరుకున్న తన భర్త వెంట రాగా బయటకు నడచింది నిర్మల.

కత్తి వేటుకు నెత్తురు చుక్క లేకుండా పోయినట్లయ్యాయి మిత్ర త్రయం ముఖాలు. నిర్మల జంట ముందు వీరు అంగుష్టమాత్రంగా కనిపించారు.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు