నందనపురంలో ఉన్న నాంచారయ్య ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ గుట్టుగా సంసారం గడిపేవాడు. అతడి పొలం ప్రక్కనే భూస్వామి భూషయ్యకి పాతిక ఎకరాల పొలం ఉంది. అయితే భూషయ్య మంచివాడు కాదు. ఎలాగైనా నాంచారయ్య పొలాన్ని తన పొలంలో కలుపుకోవాలని దుర్మార్గపు ఆలోచన మొదలుపెట్టాడు భూషయ్య.
భూషయ్య ఆలోచన అమలులో భాగంగా కొందరు పనివాళ్ళు పొలం గట్లు తవ్వేసి నాంచారయ్య పొలంలో కొత్తగా వేసారు. అందువల్ల నాంచారయ్య పొలం విస్తీర్ణం తగ్గిపోయింది. నాoచారయ్య వెళ్లి పనివాళ్ళని అడిగాడు.దానికి వాళ్ళు వెకిలిగా నవ్వి “భూషయ్యకి ఎన్నోభూములుండగా నీ భూమి కావలసివచ్చిందా? అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. అది నీకు మంచిది కాదు” అని బెదిరించారు. నాంచారయ్యకి ఏo చెయ్యాలో తోచలేదు. మౌనం వహించాడు. మరొక ఆరునెలలు గడిచాక మళ్ళీ అదే పని చేసారు భూషయ్య మనుషులు. అప్పుడు మాత్రం నాంచారయ్య గ్రామాధికారిని కలిసి ఫిర్యాదు చేసాడు.
ఆ గ్రామాధికారి పిరికివాడు. అతడికి భూషయ్య దుర్మార్గాలు తెలిసినా భయపడి మౌనం వహిస్తాడు. అందుకే నాంచారయ్య చెప్పింది వినకుండా “భూషయ్యకి నీ భూమే కావలసి వచ్చిందా? అతడు తలచుకుంటే నీ భూమి మొత్తం కలుపుకోగలడు. కేవలం గట్లు ముందుకి జరిపి కొంచెం భూమి ఆక్రమించాల్సిన అవసరమేముంది” అని కసిరి పంపించేసాడు. దాంతో నాంచారయ్య బాధ పడుతూ వెనుతిరిగాడు.అతడికి దారిలో వరుణయ్య కనిపించాడు. అతడు నాంచారయ్యకి బాల్యమిత్రుడు. నాoచారయ్య విచారానికి కారణమడిగాడు. అప్పుడు నాంచారయ్య జరిగింది చెప్పాడు. నాంచారయ్య వైపు జాలిగా చూసిన వరుణయ్య “భూషయ్య లాంటి వాడితో చాలా ప్రమాదo. కానీ ఒక సంగతి చెబుతాను. అందువల్ల నీకు మేలు జరుగుతుందేమో” అన్నాడు.దానికి నాంచారయ్య “త్వరగా చెప్పి పుణ్యం కట్టుకో ” అన్నాడు బ్రతిమలాడుతూ.
అప్పుడు వరుణయ్య ఇలా చెప్పాడు. “ఆ మధ్య భూషయ్యను పొరుగూరులో ఉన్న కౌశికుడు ఆశ్రమంలో చూశాను. రెండు మూడు ప్రమాదాలు జరిగి త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో భూషయ్యలో పాపభీతి పెరిగిoదని విన్నాను. దైవానుగ్రహం కోసం పూజలు చేయించాడని తెలిసింది. కౌశికుడుని కలుసుకుని నీ కష్టం చెప్పుకుంటే మేలు జరుగవచ్చు” అని చెప్పాడు.
నాంచారయ్య వెంటనే కౌశికుడు ఆశ్ర్రమానికి వెళ్లి ఆయన పాదాల మీద పడి భూషయ్య చేస్తున్న అన్యాయం వివరించి కాపాడమన్నాడు.దానికి కౌశికుడు “నా ఆశ్రమంలో మంచివాళ్లకే ప్రవేశం ఉంటుంది. దుర్మార్గులెవరైనా నా శిష్యులలో ఉన్నా వారిని సన్మార్గంలోకి నడపడానికే నేను ప్రయత్నిస్తాను. నీవు చెప్పడం వల్ల భూషయ్యలో ఉన్న చెడు నడత తెలిసింది. నేను అతడిని పిలిపించి మాట్లాడతాను. తప్పకుండా పరివర్తన తీసుకు వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు” అని మాట ఇచ్చాడు.
తరువాత కౌశికుడి దర్శనానికి భూషయ్య వచ్చినప్పుడు అతడికి ఎన్నో మంచి మాటలు చెప్పాడు. “నువ్వు చేసిన పాపం పెరగడం వల్ల నీకు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే పూజలు జరిపించాను. అవి చాలవన్నట్టు కొత్తగా నాంచారయ్య పొలాన్ని ఆక్రమించావని తెలిసింది. దానివల్ల నీవు చేసుకున్న పూజల ఫలితం కోల్పోయావు. మళ్ళీ నీకు ప్రాణహాని పొంచి ఉంది.
ఇతరుల సొత్తుపై మోజు పడడం తగని పని. ఈ లోకంలో నీది అనుకున్నదేదీ నీది కాదు. నీ కష్టార్జితం తప్ప మరేదీ నీకు మేలు చెయ్యదు. నువ్వు దురాశతో, మోసంతో సంపాదించే ఆస్తి నీ పాపాన్ని పెంచుతుంది. ఎంత సంపాదించినా జానెడు పొట్ట కోసమే కదా! దానికోసం పాపాలు చెయ్యాలా? ఇతరుల ఆస్తి దోచుకోవాలా? గతజన్మలో చేసిన పుణ్యం వల్ల మనిషి జన్మ ఎత్తావు. ఈ జన్మలో మళ్ళీ పాపాలు చేసి మరుజన్మలో నీచమైన పుట్టుకకు పునాదులు తవ్వుకుoటున్నావు.
నువ్వు చేసే మంచి పనుల వల్ల, దానధర్మాల వల్ల వచ్చే కీర్తి తప్ప ఏదీ నీ వెనుక రాదు. ఉన్న దానితోనే సంతోషపడుతూ ఉన్న దాంట్లోనే ధర్మంగా బ్రతుకుతూ జీవిస్తే వచ్చే తృప్తే వేరు. ఇక ముందు అలా బ్రతుకుతానని నా ముందు ప్రమాణం చేస్తేనే ఇక ముందు నా ఆశ్రమంలో నీకు ప్రవేశం ఉంటుంది.” అన్నాడు .
దానికి భూషయ్య చాలా సేపు ఆలోచించాడు. అతడికి కౌశికుడు చెప్పింది సబబే అనిపించింది. వెంటనే కౌశికుడి కాళ్ళ మీద పడ్డాడు. “నాకు బుద్ధి వచ్చింది. నేను ఈ రోజు నుండి పాపపు పనులు మానుకుంటాను. నన్ను మీరు నమ్మాలంటే నేనేం చెయ్యాలో సూచించండి” అని అడిగాడు.
అప్పుడు కౌశికుడు “నీలో పరివర్తన వస్తే ఒక సాధువుగా, గురువుగా నా కంటే సంతోషించేవారు మరెవరూ ఉండరు. నీవు నాకోసం ఏమీ చెయ్యక్కరలేదు. నీ సంపాదనలో నుంచి ఇవ్వక్కరలేదు. నువ్వు అన్యాయంగా ఆక్రమిoచుకున్న నాంచారయ్య భూమిని అతడికి న్యాయoగా అప్పగిoచు” అన్నాడు.
దానికి భూషయ్య అలాగే అని ప్రమాణం చేసాడు. అప్పటి నుండి పాపపు పనులు మానుకుని ప్రవర్తనలో పరివర్తన తెచ్చుకున్నాడు. గ్రామస్తులకు భూషయ్య బెడద వదిలించిన నాంచారయ్యని ప్రజలందరూ మెచ్చుకున్నారు.