మార్పు - - పి బి రాజు

marpu

"పొరబాటు జరిగిపోయింది సార్! మీరే ఎలాగైనా గండం గట్టెక్కించాలి" వణకిపోతూ ఏకాంబరం హెడ్మాస్టర్ శంకరం గదిలోకి వచ్చాడు.

"ఏమైంది ఏకాంబరం?" హెడ్మాస్టర్ ఆందోళనతో అడిగాడు.

"స్టూడెంట్ కౌన్సెలర్ కొడుకని తెలియక ..."

"తెలియక ...?" హెడ్మాస్టర్ కంఠంలో అదుర్దా.

"వాడు రెండు రోజులుగా హోం వర్క్ చేయడం లేదు. గట్టిగా మందలిస్తూ ఒక దెబ్బేశాను. అందుకే కౌన్సెలర్ గొడవకొచ్చాడు. పెద్దపెద్దగా అరుస్తున్నాడు" గొంతులో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది.

"పిల్లవాడికి పెద్ద దెబ్బలేం తగల్లేదుగా?"

"అరచేతులు కొంత ఎర్రబారాయి."

"చూడు ఏకాంబరం! పిల్లల్ని బెదిరించి భయపెట్టాలే గానీ ..."

" మెల్లగానే కొట్టాను గానీ బెత్తం కొంచెం..."

"కంగారు పడకు. లోపల ఆఫీస్ రూంలో కూర్చో! ఏం చేయాలో ఆలోచిద్దాం. "

ఏకాంబరం లోపలికెళ్ళాడు. హెడ్మాస్టర్ ఆలోచనలో పడ్డాడు.

ఏకాంబరం లెక్కల మాస్టార్. కొత్తగా ఈ మధ్యనే జాయిన్ అయ్యాడు. ఎనిమిది, తొమ్మిది, పది క్లాసులకు లెక్కలకి వెళ్తాడు. కొంచెం ముక్కుసూటి మనిషి. కష్టపడే తత్వం. డ్యూటి ఒరిఎంటెడ్.

ఇంతలో ఆ కౌన్సెలర్ ఐదారు మందితో గదిలోకి దూసుకొచ్చాడు.

"ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఇలా గొడ్డును బాధినట్లు బాదుతుంటే ... మీకు పిల్లా జెల్లా లేరా? “ సూటిగా గద్దించాడు హెడ్ మాస్టర్ని.

"చూడండి కౌన్సెలర్ గారూ! ముందు మీరు కూర్చోండి. ఆవేశ పడకండి." సర్ది చెప్పబోయాడు హెడ్మాస్టర్.

"కూర్చోవడానికి రాలేదండి...అటో ఇటో తేల్చుకోవడానికి వచ్చాను."

"అదికాదండీ! “

“ఏది కాదండి... నేను కౌన్సెలర్ని. నా కొడుకునే ఇలా బాదితే ఇక మిగతా పిల్లల పరిస్థితేంటి? ..." మనిషి ఊగిపోతున్నాడు.

"అసలేం జరిగిందంటే ..... ఈ మధ్య అబ్బాయి హోం వర్క్ చేయకుండా వస్తున్నాడట ...కొంచెం భయపెట్దామని చిన దెబ్బ వేశాడట."

"చిన్న దెబ్బా ! చూడండీ !ఒరేయ్ ఇలా రారా చెయ్ చూపించు హెడ్ మాస్టార్కి" అబ్బాయిని ముందుకు తోశాడు.

అబ్బాయి చెయ్ చూశాను. కొంచెం ఎర్రగా వాత పడింది.

"క్షమించండి! మా లెక్కల మాస్టార్ కుర్రోడు. ఇక మీద అలా జరక్కుండా చూస్తాను. అతని తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను" ప్రాధేయ పడ్డాడు హెడ్మాస్టర్.

"కుర్రోడైతే ఇలా చంపమని చెప్తారా? వాడెక్కడున్నాడో చెప్పండి. వాడి అంతు చూడకుండా వదలం. " ఆవేశంతో ఊగిపోతున్నారు అతనితో వచ్చిన అనుచరులు.

“మీడియా వాళ్ళను, మనోళ్ళను పిలవండ్రా...ఈవేళ అటో ఇటో తేలిపోవాలి.”

"దయచేసి దీన్ని ఇష్యూ చేయకండి. పెద్ద మనసుతో క్షమించండి. నేను ఆయన్ని మందలిస్తాను."

"నో. వాణ్ణి నాకప్పచెప్పండి. అంతుచూస్తాను. రేయ్! వాడెక్కడున్నా ఈడ్చుకురండి. " హుకుం జారీ చేశాడు కౌన్సెలర్.

జనం గుమిగూడిపోయారు. అందరి అభిప్రాయాలు చాలా ఫ్రీ గా దొర్లిపోతున్నాయి..

"ఇంతలా పిల్లల్ని కొట్టేవారు ఉపాధ్యాయులా .. రాక్షసులా? "

"వాళ్ళకు పిల్లల్లేరా? ఉంటే ఇలా కొడ్తారా?"

"పసిపిల్లల్ని కొట్టడానికి చేతులెలా వస్తాయి?"

వారు రెచ్చిపోతున్నారు.

ఇంతలో టీ వీ రిపోర్టర్స్ రంగంలో దిగారు.

జనంలో దూరిపోయి - "మీ స్పందనేమిటి? " అంటూ జనాభిప్రాయం సేకరించడం మొదలెట్టారు.

అగ్నికి ఆజ్యం పోసినట్లు జనం రెచ్చిపోతున్నారు.

టీ వీ ఛానెల్స్ పంట పండింది. బ్రేకింగ్ న్యూస్ ల హోరు మొదలయింది.

"విద్యార్థి పై ఓ గురువు దాష్టీకం.”

“ హోం వర్క్ చేయలేదని చిన్నారిని చితకబాదిన కిరాతకుడు ."

టీ వీ ల్లో చర్చలు, వాదోపవాదనలు మొదలయ్యాయి. ఎపుడెప్పుడు ఇలా చిన్నార్ల పైన ఎన్నెన్ని దాడులు జరిగాయో వివరంగా గణాంకాలతో వండి వారుస్తున్నారు. ఏమేమి చర్యలు తీసుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు.

ఇంతలో ఒకడు ఆఫీస్ రూం నుంచి ఏకాంబరాన్ని చొక్కా పట్టి లాక్కు వచ్చాడు.

"ఇదిగో అన్నా! వీడు అక్కడ దాక్కున్నాడు."

'వదలకండి! వాణ్ణి వేసేండ్రా?" ఏకాంబరం పైన లంఘించుకున్నాడు కౌన్సెలర్.

కాలర్ పట్టుకొని "ఎంత ధైర్యం రా నీకు? నా కొడుకు పైన్నే చేయి చేసుకుంటావా?" హుంకరించాడు.

" కామేశం గారూ! ఆవేశ పడకండి. ముందు అతని కాలర్ వదలండి. స్కూల్ పరువు పోతుంది. అది మీకూ మంచిది కాదు. ప్లీజ్! " బతిమలాడ సాగాడు హెడ్మాస్టర్ .

స్కూల్ అసిస్టెంట్స్ కూడా నచ్చ చెప్పబోయారు.

"ఇంకా ఏం చూస్తున్నారు. నాలుగు తగిలించక..." ఎవడో అనుచరుడు చెయ్యి ఎత్తబోయాడు.

ఇంతవరకూ ఎంతో ఓర్పుగా ఉన్న హెడ్మాస్టర్ కి ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది.

" చెయ్యెత్తితే మర్యాదగా ఉండదు. ముందు అందరూ బయటికి నడవండి." ఆయనలో ఆవేశం కట్టలు త్రెంచుకొంది.

'ఏంది? నోరు పెద్దదవుతోంది. మర్యాద ... గిర్యాద అంటున్నావు?" రెచ్చిపోయాడు కౌన్సెలర్

"చూడండీ!... పొరబాటు జరిగింది. క్షమించండి. ఇక ఇలాంటివి జరుగకుండా చూస్తామని హామీ ఇస్తున్నాను. ఇంకేం కావాలి. అతన్ని కొడితే సమస్య తీరిపోతుందా? చెప్పండి."

"నో! దెబ్బకు దెబ్బ పడాల్సిందే!"

'అందరూ బయటికి పోతారా? లేక పోలీస్ ను పిలవమంటారా?" హెచ్చరించాడు హెడ్మాస్టర్ సహనం నశించి .

"పోలీస్ ను పిలస్తారట" ఆ హా...హా ...హా నవ్వారు అనుచరులు.

అటుగా పోతున్న పోలీసులకు ఎవరో ఉప్పందించినట్లుంది - అంతలోనే ప్రత్యక్షమయ్యారక్కడ.

"ఏం జరుగుతోందిక్కడ? మాస్టార్! " అంటూ యస్ ఐ లోపలి కొచ్చాడు.

“ రండి...రండి...యస్ ఐ గారూ! కూర్చోండి! చిన్న ప్రాబ్లెం ...కౌన్సెలర్ గారి అబ్బాయిని ...” హెడ్మాస్టర్ సన్నగా నసిగాడు.

కుర్చీలో కూర్చుంటూ “ కౌన్సెలరా! ఎవరూ...?” ఆరా తీశాడు యస్ ఐ.

అక్కడ పోలీస్ లు రావడం ఎదురు చూడని కౌన్సెలర్ అవాక్కయ్యాడు. ఎదురు చూడలేదేమో కంగారు పడ్డాడు. పరుగెత్తుకొచ్చి యస్ ఐ ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డాడు “నమస్తే సార్!" అంటూ.

“తమరేనా? ఏంటి... తమరి కన్ను స్కూల్ పైన కూడా పడిందా?”

దిక్కులు చూస్తూ నిలబడ్డాడు కౌన్సెలర్.

"వీళ్ళంతా ఎవరు? నీ గ్యాంగా?...కానిస్టేబుల్స్... వీరందరీ పేర్లు నోట్ చేసుకోండి! "

"నేను కాదు… నువ్వు కాదు " అంటూ మెల్ల మెల్లగా అనుచరులు జారుకున్నారు. పోలీసులను చూసిన జనం ఎవరి దారిన వారెళ్ళిపోయారు.

"మీరేం చెప్పకండి మాస్టారూ! నాకంతా తెలిసింది. ఇక వీడిని నా కొదిలేయండి. " అంటూ కామేశం వైపు తిరిగి "కామేశం! ఇంతకీ మీ అబ్బాయెక్కడ?" అడిగాడు ఇన్స్పెక్టర్.

ఈ వింత చూస్తూ నవ్వుకుంటున్న అబ్బాయిని చూపించాడు కామేశం .

"చూశావా! ఎవడి కోసం నువ్వింత రాద్ధాంతం చేస్తున్నావో ...వాడు ఇవంతా చూసి నవ్వుకుంటున్నాడు. ఆ దెబ్బను వాడెప్పుడో మర్చిపోయుంటాడు. నువ్విక్కడ వెకిలి చేష్టలతో వినోదం పంచుతున్నావు. నీకూ చిన్నప్పుడు ఇలా పడుంటే ఈవేళ ఇన్ని కేసులుండేవి కాదు. బుద్దిగా చదువుకోనుంటే బాగుపడుండేవాడివి. “

" చిన్నపుడు మీలా ఎవరూ చెప్పలేదు. అందుకే … చదూకోలేదు సార్!. " నసిగాడు కామేశం.

" ఎవరూ చెప్పలేదా? ఐతే విను.కామేశం! ఈ దెబ్బ చూశావా?" అంటూ నుదుటి మీద గాయం తాలుకు మచ్చను చూపించాడు ఇన్స్పెక్టర్

."ఏమైంది సార్!"అదుర్దాగా అడిగాడు కామేశం.

“ఇది ఇరవై ఏళ్ళ క్రితం ఇదే హెడ్మాస్టార్ -అప్పుడు ఇంగ్లీష్ మాస్టార్ గా - చేసిన గాయం. నేను బాగా చదవలేదని - ఇంగ్లీష్ లో పూర్ గా ఉన్నానని కొట్టాడు. అలా కొట్టినప్పుడు నా తల గోడకు కొట్టుకొని రక్తం చిమ్మింది. మూడు కుట్లు పడ్డాయి. నేను స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు యస్ పి గా ఉన్న మా నాన్న ఏమన్నాడో తెలుసా? "శభాష్! శంకరం! మంచి పని చేశావు." అని సార్ని భుజం తట్టి నన్ను హాస్పిటల్ కు తీసికెళ్ళాడట. నాకు భయమేసింది. ఆ భయమే నా జీవితాన్ని మలుపు తిప్పింది. అప్పట్నుంచి బాగా చదవడం ప్రారంభమయింది. అప్పట్నుంచి క్లాస్ కు ఫస్ట్ వచ్చేవాణ్ణి. ఆ దెబ్బ మానిపోయింది. కానీ దాని వల్ల కలిగిన భయం ఇప్పటికీ ఉంది. ఆ భయం వల్లే నేడు ఇంతటి స్థితికి చేరుకున్నాను. ఆ దెబ్బే లేకుంటే ఇపుడు నేనీ స్థాయిలో ఉండేవాణ్ణే కాదు.

గురువులు శతృవులు కాదు. తల్లి, తండ్రి తరువాత పిల్లల్ని దండించి దారిలో పెట్టే హక్కు వాళ్ళకే ఉంది. విద్యార్థులకు గురువులంటే భయమూ, భక్తీ, గౌరవం ఉండాలి. అవి లేకపోతే విద్యార్థి పైకి రాలేడు. నువిప్పుడు చేస్తున్న పనికి మీ వాడికే కాదు; ఇక్కడున్న విద్యార్థులం దరికీ గురువులంటే చులకన భావం ఏర్పడి వ్యవస్థ దెబ్బ తింటుంది. నువ్వెలాగూ చదువుకోలేదు. మీ పిల్లల్నైనా చదివించు. "

"అలాగే సార్! మీరు చెప్పాక ఇంక సమస్యేముంది సార్! మాస్టార్లు నన్ను క్షమించండి." అంటూ వంగి వంగి దండాలు పెట్టాడు కామేశం.

"ఓరేయ్! ఇప్పటికే చాలా చేశావు. ఇక పద. ఇకనైనా బుద్ధిగా నడుచుకో...లేదంటే తెలుసుగా నీ ఫైల్ రీ-ఓపన్ చేయాల్సుంటుంది." హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్.

" లేదు… లేదు సార్! వస్తాను... వస్తాను." అంటూ వెళ్ళిపోయాడు కామేశం.

"చాలా థాంక్స్. ఇన్స్పెక్టర్ ప్రతాప్ గారు" హెడ్మాస్టర్ అన్నాడు.

"సార్! మీ దగ్గర చదువుకొని ఇంత వాణ్ణైన వాణ్ణి. నన్ను ప్రతాప్ అని పిలవండి చాలు"

ఇంతలో ఏకాంబరం వచ్చి, " మీ మేలు జన్మలో మర్చిపోలేను సార్! ఇక మీదట ఇలా జరక్కుండా జాగ్రత్త పడుతాను సార్!" అన్నాడు. 'చూడు ఏకాంబరం! ఉద్యోగం జాయినైన కొత్తలో ఇలాటివి మామూలే. కాకపోతే మీరు గుర్తు పెట్టుకోవాల్సిందొకటుంది. కాలం మారింది. సమాజం మారింది. ఆ రోజుల్లో ఐదారు మంది పిల్లలుండేవారు. కొట్టినా; తిట్టినా పిల్లల మంచి కోసమే అని తలిదండ్రులు భావించేవారు. కానీ, ఇప్పుడు ఒకరిద్దరితోనే సరిపుచ్చేస్తున్నారు. ఇప్పటి పిల్లలు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు. తలిదండ్రుల ఆందోళన కూడా అర్థం చేసుకోండి. ఇదే పరిస్థితి మీ పిల్లలకి వస్తే … ఆలోచించండి. గురువులకు విద్యార్థులంటే ప్రేమ,అభిమానం, వాత్సల్యం ఉండాలి. గురువుకు బెత్తం అవసరమే. విద్యార్థికి భయం అవసరమే. కానీ, భయపెట్టడానికి బెత్తం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు కామేశాన్నే చూడండి. ఏ బెత్తమూ, ఆయుధమూ ఉపయోగించకుండానే మిమ్మల్నెలా భయపెట్టాడో నలుగుర్ని వెంటబెట్టుకొచ్చి? పోలీ సుల్ని చూడండి. వాళ్ళ చేతుళ్ళో తుపాకులు, లాఠీలు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించలేదు. ఐనా కంట్రోల్ చేయగలిగారు. అవునా? కొంచెం తెలివి ఉపయోగించండి. టెక్నాలజీ ని ఉపయోగించుకోండి. సైకాలజీ చదవండి. మారండి." యస్ ఐ హితబోధ లోని హేతుబద్దతను గుర్తించారందరూ.

"అలాగే సార్! బాగా చెప్పారు! నమస్తే! " అన్నాడు ఏకాంబరం.

"ఓ కే మాస్టార్! ఇక నేను బయల్దేర్తాను సెలవు." అంటూ కరచాలనం చేసి ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ ప్రతాప్.

ఆనాటి ప్రతాపేనా వీడు...ఎంతగా ఎదిగిపోయాడూ” అంటూ హెడ్మాస్టర్ విస్తుపోయి చూస్తుండగానే జీపు కదిలింది. *

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి