తెల్లవారుఝామున నిద్రలేచి వాకింగ్ కి వెళ్ళొచ్చి, స్నానంచేసి పూజాకార్యక్రమాలు పూర్తి చేసుకుని పడక్కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నానో లేదో మా కోడలు కమ్మటి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది తాగుతూ రుచిని ఆస్వాదిస్తున్నాను.నేను రిటైరయ్యి ఆరేళ్ళు కావొస్తోంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు..ఇప్పుడూ కూడా నా దిన చర్య ఇదే. పెద్దాడు ఆఫీసుకి తయారవుతున్నాడు. కూతురు సెట్విన్లో ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రైనింగ్ తీసుకుంటోంది. పెద్దాడికి రెండేళ్ళయింది పెళ్ళై. వాడికి రత్న మాణిక్యాల్లాంటి ఇద్దరు పిల్లలు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు! చాలీ చాలని జీతం. నేనూ ప్రైవేటు కంపెనీలో పనిచేసి రిటైరయ్యాను. సంపాదించి వెనకేసిందీ లేదు పెన్షనూ లేదు. అదృష్టం కొద్దీ పుణిస్త్రీగా మూడేళ్ళ క్రితం ఈ లోకం విడిచిపెట్టింది మా ఆవిడ. మా అందరికీ మా అబ్బాయి సంపాదనే ఆధారం. అదృష్టవశాత్తు అబ్బాయీ కోడలూ మంచివాళ్ళు కాబట్టి కలో గంజో తాగి గుట్టుగా బ్రతుకుతున్నాం. జవసత్వాలుడిగి పోయి నా ఓపిక నశించింది. అందుకే మా అబ్బాయి ’ నాన్నా, నువ్వు ఉద్యోగం చేసి మమ్మల్ని పెంచి పెద్దచేసింది చాలు. ఇహ ఇంటి పట్టునుండి విశ్రాంతి తీసుకోండి.’ అన్నాడు. నా బెంగల్లా నా కూతురి పెళ్ళి గురించే. దానికి సరైన సంబంధం చూసి నా గొంతులో ప్రాణం వుండగానే పెళ్ళి చేసేయ్యాలి. పాపం మా అబ్బాయి ’నీ కెందుకు నాన్నా ఆ ఆలోచన? తను నాకు చెల్లెలే కదా! నాకూ బాధ్యత వుంది?’అంటాడు. అంతేకాకుండా సంబంధాలు కూడా చూస్తున్నాడు. కాని అమ్మాయితో పాటు డబ్బు గుమ్మరించలేని అసక్తత కుదరనివ్వడం లేదు. మనసులో ఓ మూల అదే నా బాధ. అంతే!
"నాన్నగారూ ఆఫీసుకి వెళ్ళొస్తాను" అని వాడు బయల్దేరబోతుంటే..బయట ఆటో ఆగిన చప్పుడైంది.
మా అబ్బాయి చుట్టాలెవరన్నా వచ్చారేమోనని హడావుడిగా చూడడానికి వెళ్ళాడు. నేనూ కళ్ళజోడు పెట్టుకుని వాడిననుసరించాను.
ఆటోలోంచి ఒక పెద్దాయన..మరో కుర్రాడు దిగారు. ఆటోకి డబ్బులిచ్చేసి ఆయన చేయి పట్టుకుని మావైపు ఆయన్ని నడిపించుకుంటూ తీసుకొచ్చాడు.
నన్ను చూడంగానే ఆ పెద్దాయన కళ్ళలో ఆనందం. నాకు మాత్రం ఆయన ఎవరో గుర్తురావడం లేదు.
"మీరు పరంధామయ్య..?"సంశయంగా ఆగాడు.
అవునన్నట్టుగా చిన్నగా తలూపాను.
ఆ యువకుడివైపు ‘ కరెక్ట్ అడ్రెస్ కే వచ్చాం’ అన్నట్టుగా చూసి.."నేను విశ్వాన్ని.." అంటూ ఆగాడు.
ఈ మధ్య మతిమరపు ఎక్కువైంది. కాని ఆ పేరు మెదడు పొరల్లో బాగానే నిక్షిప్తమైపోయింది కాబట్టి తొందరగానే గుర్తుకొచ్చింది.
"లోపలికి రండి" అని లోపలికి దారితీశాను.
మా అబ్బాయికి అంతా అయోమయంగా వుందని నాకు తెలుసు. కారణం ఇంతవరకు నేనెప్పుడూ విశ్వం విషయం వాడిదగ్గర ప్రస్తావించలేదు.
లోపలికెళ్ళి అందరం కూర్చున్నాక"బాబు ఆఫీసుకి బయల్దేరుతున్నాడనుకుంటా..ఒక్క అరగంట వుండమను" అన్నాడు.
నేను కళ్ళతోటే వాడిని వుండమన్నాను. వాడూ కూర్చున్నాడు.
"బాబూ..నేను నీకు తెలియక పోవచ్చు. కాని మీ నాన్నకి బాగా తెలిసిన చేదు జ్ఞాపకాన్ని. ముప్పైఏళ్ళక్రితం నేనూ మీనాన్న మరో ఇద్దరం కలసి ప్రాణ స్నేహితులుగా వుండేవాళ్ళం. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఒకరి యోగక్షేమాలు ఒకరం తెలుసుకుంటూ ఆహ్లాదంగా కాలం గడిపేవాళ్ళం. గొర్రెతోక జీతంతో ఓ సరదా అనేది లేకుండా జీవించడంపై నాకు నిరాసక్తత ఏర్పడింది. అప్పుడే నాకు ఇంకా బాగా సంపాదించాలన్న కోరిక కలిగింది. అది రోజు రోజుకి ఎదిగి నా మనసులో మర్రిమానయింది. నేను ఒక రోజు చిట్స్ వ్యాపారం ప్రారంభించాను. చిట్స్ లో జనాన్ని చేర్పించాలి కాబట్టి నా స్నేహితులైన మీ నాన్నని, మిగతా ఇద్దరిని కూడా ‘వద్దు వద్ద’ని మొత్తుకుంటున్నా వినకుండా డైరెక్టర్లుగా నియమించుకున్నాను. వాళ్లని బలవంత పెట్టి వాళ్ళద్వారా ఎంతో మంది చేరేట్టు చూశాను. అలా వాళ్ళ స్నేహితులు చుట్టాలు తెలిసినవాళ్ళు చేరారు. మొదట్లో అంతా బాగుండేది. మేమందరం నాలుగు డబ్బులు కళ్ళ చూశాం. నేను ఆడంబరాలకి అలవాటయినా, మీ నాన్నతో పాటు మిగతావాళ్ళు మాత్రం నేల విడిచి సాము చేసే వారుకాదు. ఆ జోష్ లో.."ఊపిరి తీసుకోడానికి కాస్త ఆగాడు. అప్పటికి వచ్చినవాళ్ళకి ఏమీ ఇవ్వలేదన్న విషయం నాకు గుర్తుకొచ్చి ‘వాళ్ళకి మంచి నీళ్ళు టిఫిన్ ఏర్పాటు చెయ్యమని’ లోపలికెళ్ళి మా కోడలికి పురమాయించాను.
కాఫీ టిఫిన్లు పూర్తి అయ్యాయి.
నేను " మాకోడలు మనవడు మనవరాలు నా కూతురు" అని పరిచయ కార్యక్రమం పూర్తి చేశాను.
"వీడు మా అబ్బాయి"తనతో వచ్చినతన్ని పరిచయంచేసి"....అన్నట్టు ఇందాక ఎంతవరకు చెప్పాను..ఆఁ..గుర్తొచ్చింది..అలా జోష్ లో వుండగా ఆఫీసు పని పట్ల అనాసక్తి చూపిస్తూ ఊర్లూ వాడలూ తిరుగుతూ జనాల వేట మొదలెట్టాం. ఆఫీసులో ఇంక్రిమెంట్లు రాక పోవడం..మెమోలు రావడం మొదలెట్టాయి. కాని నేను ఎండమావుల వెంట పరిగెత్తసాగాను. నన్ను నమ్మి నా వెనక నా స్నేహితులు. అలా పరిగెడుతున్న సమయంలో.. అపశృతి" గొంతు జీరపోయి మాట్లాడ లేక పోయాడు. అప్రయత్నంగా నా కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి అప్పటి పరిస్థితులు స్ఫురణకు వచ్చి.
కళ్ళు తుడుచుకుని, కాసిని మంచినీళ్ళు తాగి" పెద్ద చిట్లు పాడిన వాళ్ళు పారిపోయారు. అది బయటకి పొక్కి కట్టే వాళ్ళు కట్టక..పాడుకున్న వాళ్ళు డబ్బులు కట్టక చాలా ఇబ్బంది పడిపోయాను. తర్వాత తెలిసింది వాళ్ళు కావాలనే గ్రూప్ గా చేరి నన్ను ముంచే ప్లాను చేశారని. నేను విషయం తెలియగానే ఖాతాదారులందరూ డబ్బుకోసం నామీద దాడి చేస్తారు కాబట్టి భయంతో..అయోమయంలో..దొరికింది తీసుకుని రాత్రికి రాత్రి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలేశాను. నేను కావాలని చేసింది కాదు. పరిస్థితి అలా వచ్చింది. మోసం చెయ్యడం నా అభిమతం కాదు. కాని దొరికితే చంపేస్తారన్న భయం నాది. ఎంతోమంది తమ భవిష్యత్తుకి రంగులద్దుకోవడం కోసం..రిటైరైనవాళ్ళు తమ
జరుగుబాటుకోసం, పిల్లల పెళ్ళిల్లకోసం, చదువులకోసం దాచినదంతా దోచుకోబడింది. వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లాను."అన్నాడు కళ్ళ నీళ్ళతో.
నాకు అప్పటి పరిస్థితులు గుర్తొచ్చాయి.వీడేమో వెళ్ళిపోయాడు. మాకేమో ఏం చెయ్యాలో తెలియలేదు. అందరూ మమ్మల్ని నానా దుర్భాషలాడారు. ‘నీ వాటాగా ఎంత సంపాదించావని’ కడుపు మంటతో ప్రశ్నించారు. నేను అక్కడ సంపాదించినదానికి నా దగ్గరున్నది కూడా కలిపి కొంతమందికి తీర్చేశాను. మరికొంతమంది" ఇదంతా మా కర్మ మీరేం చేస్తారులేండి" అని వదిలేశారు. కాని నేను చేసింది ముమ్మాటికీ తప్పే! ‘సంస్థ జనాన్ని ముంచి తప్పుచేస్తే, నేను సంస్థని ప్రతి ఇంటి ముంగిట్లోకి..మనసులోకి తీసుకెళ్ళి తప్పుచేశాను. వాళ్ళ ఆశలు ఛిద్రమవడానికి నేనూ కారణమే’ అన్న ఆలోచన నన్ను నిద్రాహారలకి దూరం చేసింది. చాలా కాలం ఈ లోకంలో లేను. అప్పుడు బాబూ పాప చాలా చిన్నపిల్లలు. మా ఆవిడ నా పరిస్థితికి తల్లడిల్లిపోయింది. నేను మనుషుల్లో పడడానికి నా భార్యతోపాటు నా మంచితనం మీద నమ్మకమున్న వాళ్ళూ కారణం.
వాడు మళ్ళీ ప్రారంభించాడు. " నేను వేరే ఊరైతే వెళ్ళానుగాని నా మనసు మీమీదే బెంగపెట్టుకుంది. నన్ను నమ్ముకుని నేను ప్రోత్సహిస్తే ఆ రొంపిలోకి దిగారు. మీ జీవితాలు కల్లోల సాగరంలో నావలయ్యాయి. ‘మిమ్మల్ని అనవసరంగా క్షోభ పెట్టానన్న’ ఆలోచన నన్ను నిలవనీయలేదు. దాంతో నేను కొన్నాళ్ళు పిచ్చివాడినయిపోయాను. తర్వాత తేరుకున్నాను. మళ్లీ మామూలు జీవితం మొదలెట్టాను. ఇప్పుడెందుకొచ్చానంటే?" అని కాస్త ఆగి "నాకు బి పి సుగరు వచ్చాయి. దిక్కుమాలిన రోగగ్రస్త జీవితం గడుపుతున్నాను. అన్నం తినకపోయినా ఫర్వాలేదు కాని మందులు లేకుండా ఉండలేని పరిస్థితి. ఈ మధ్యనే కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ తో నెట్టుకొస్తున్నాను. నా దురదృష్టకర జీవితంలో నాకు జరిగిన మంచి ఏమిటంటే, నా ఇద్దరు కొడుకులకీ నేనంటే ప్రాణం. వీడు మా రెండో వాడు. నా కథ వీళ్లకి జ్ఞానోదయం కలిగించింది, ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. డబ్బొచ్చే సీట్లయినా నిప్పులా బ్రతుకుతున్నారు. "రేపు నేను చనిపోయాక..నా ఆత్మ శాంతికోసం శాంతులు చేస్తారు.
నేను పైలోకంలో సుఖంగా వుండడానికి గోదానం..భూదానం లాంటివి చేస్తారు. కాని అవి ఈ లోకంలో ఇంత పాపం చేసిన నా ఆత్మకి శాంతిచేకూరుస్తాయా? చెప్పు. అందుకే..అందుకే అప్పుడు నువ్వు కోల్పోయిన మానసిక ప్రశాంతతని ఇవ్వలేను కాని..అప్పుడు నువ్వు కోల్పోయిన డబ్బు ఇచ్చేస్తాను. ఇది నేను కష్టపడి నిజాయితీగా సంపాదించినది. నా డబ్బు ఒక్క పైసా కూడా అనవసరంగా కర్చుపెట్టలేదు . కేవలం మీకోసమే దాచాను. మీ కిద్దామనే తీసుకొచ్చాను. నా పిల్లలు కూడా నా పాపం వాళ్ళ కంటకుండా తాము సంపాదించినదీ కలిపారు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. నేను బ్రతికుండగానే నా పాపం కొంతవరకైనా కడుక్కుందామని తాపత్రయ పడుతున్నాను. దయచేసి క్షమించరా..నీ చేతులు పట్టుకుని కాకుండా కాళ్ళమీదే పడి బ్రతిమాలుతున్నాను" అని హఠాత్తుగా నా కాళ్ళమీదకి జారిపోయాడు. నేను గబుక్కున వాడిని లేవనెత్తాను. వాడి ముఖంలో అశాంతి కాస్త తొలగింది. తేటదనం చోటు చేసుకుంది. "ఆ ఇద్దరి చిరునామాలు కూడా అతికష్టం మీద సేకరించి పోయిన్నెల నా పాపం కడుక్కున్నాను. అంతేకాదు నావల్ల డబ్బు..మనశ్శాంతి పోగొట్టుకున్న కుటుంబాలవద్దకెళ్ళి చేసిన పాపం చెప్పి డబ్బిచ్చి కడుక్కున్నాను. ఇప్పుడు నాకు కాస్త మానసిక ప్రశాంతత దక్కింది. ఈ లోకంలో నేను చేసిన పాపం నేనే కొంతవరకు కడుక్కున్నాను. రేపు నేను చనిపోయాక వీళ్ళు గొప్ప గొప్ప దానాలు చెయ్యకపోయినా నా ఆత్మ శాంతిగానే వుంటుంది. నా ముందుతరాలకీ ఎటువంటి క్లేశాలు భయాలు లేకుండా చేశాననే అనుకుంటున్నాను.. ఇప్పటి తరాల ఇన్నన్ని మానసిక శారీరక సమస్యలకి కారణం వాళ్ళ పెద్దవాళ్ళు తమ స్వార్థం కోసం చేసిన పనులేమో అని నాకు అనిపిస్తూంది. ఆ ఏడుపులు శాపనార్థాలు తర తరాలకీ వ్యాపిస్తాయి. నేను అటువంటిది లేకుండా చేయగలిగానన్న తృప్తి నాకు వుంది." అంటూ ముగించాడు."అది నేనెప్పుడో మర్చిపోయిన పీడకల. నువ్వొచ్చేదాకా నాకు గుర్తులేదు. అనుక్షణం నేను గుర్తుచేసుకుంటూ మానసిక చిత్రవధననుభవిస్తూ..నా పిల్లలకి చెబుతూ వాళ్ళకీ మనశ్శాంతి లేకుండా చేయలేదు. ఇహపోతే నువ్వు నా స్నేహితుడివి. అప్పుడూ ఇప్పుడూ కూడా. నువ్వు మోసగాడివి కాదు. కాని అప్పుడు అలా వదిలి వెళ్ళిపోవడం మాత్రం చాలా బాధకలిగించింది. అదీ తాత్కాలికమే!" అన్నాను మనస్పూర్తిగా.
డబ్బు మనిషిని శాసిస్తున్న పాపిష్టి రోజులివి. వాడిచ్చిన డబ్బు రేపు నా కూతురి పెళ్ళి చేయడానికి మేము సంతోషంగా గడపడానికి చాలా అవసరం. నాలాగే మిగతావాళ్ళూ ఆలోచించి వుంటారు. డబ్బు మా అందరికి కాస్త ఉపశమనాన్నిస్తుంది. వాడు చేసింది తప్పే కావచ్చు కాని సరిదిద్దుకున్నాడు. అప్పుడు శాపనార్థాలు పెట్టిన వాళ్ళే ఇప్పుడు దీవించి వుంటారు. వీడిలా ఎంతమంది వుంటారు? ఉద్యోగరిత్యానో..తమ స్వార్థం కోసమో ఎంతో మంది అన్యాయాలు చేస్తుంటారు. పూజలు ఘనంగా చేసి హుండీల్లో భారీగా కానుకలేసినంత మాత్రాన ప్రశాంతత లభిస్తుందా? వాళ్ళు ఈ లోకంనుండి నిష్క్రమించాక ఉన్నవాళ్ళు వాళ్ళ పేరిట ఎన్ని దానాలు చేస్తేమాత్రం నిష్కృతి లభిస్తుంది? ఆ విషయంలో విశ్వం చాలా నయం. వాడు పుణ్యలోకాలకి పోవడం ఖాయం. అనుకుంటుండగా అచేతనుడయ్యాడు. వాడి ముఖం ప్రశాంతంగా వుంది. బహుశా నా ఆలోచనలు చదువుతూ ఈ లోకం వదిలాడనుకుంటా..