సర్దుకుపోతే సంతోషం - కె.శ్రీలత

sardukupote samtosham

అలారం మోతతో అయిదు గంటలకే మెలకువ వచ్చింది వినీలకి. కానీబద్ధకంగా ఇంకాసేపు పడుకోవాలనుకుని దుప్పటి ముసుగేసిందన్న మాటే కానీ అంతలోనే స్కూల్ కి లేట్ గా వెళ్తే ..లేట్ రిజిస్టర్ లో సైన్, ఆ తర్వాత చండశాసనుడైన ప్రిన్సిపాల్ కి అపాలజీ చెప్పాల్సిరావటమూ గుర్తురాగానే దిగ్గున లేచి కూర్చుని మంచం దిగి తన రొటీన్ పనిలో పడిపోయింది. తనతోపాటే లేచిన భరత శ్రీహరి కాలకృత్యాలు తీర్చుకుని వాకింగ్ కి వెళ్ళాడు.

టిఫిన్ చెట్నీ...మధ్యాన్నం లంచ్ లోకి కూర..రసం వగైరాలు చేస్కుంటూ మధ్యమధ్యలో గుమ్మం ముందు ఊడ్చి ముగ్గు వేసి ఇల్లు శుభ్రం చేస్కుంది. గిన్నెలన్నీ వెనక ఉన్నసింక్ లో పడేసి పాలు వేడి చేసి గీజర్ ఆన్ చేసి పిల్లల్ని లేపడానికి వెళ్ళింది.

వినీల జాబ్ చేస్తున్నది ప్రైవేట్ స్కూల్ కావటాన అన్నీ స్ట్రిక్ట్ రూల్స్...ఎనిమిదిన్నరకి ఒక్క సెకను ఆలస్యం అయినా లేట్ రిజిస్టర్ లో సంతకం పెట్టాలి. అలా మూడు లేట్ సంతకాలు ఒక నెలలో అయితే ఒకరోజు శాలరీ కట్ చేస్తారు. అందుకే ఉదయం చాలా హడావుడి పడాల్సి వస్తుంది. అప్పటికీ ముందురోజు సాయంత్రమే కూరగాయలు కట్ చేస్కుని పెట్టుకోవడం వలన వంటపని త్వరగానే అవుతుంది. ఎటొచ్చీ పిల్లలను రెడీ చేసి తీస్కెళ్ళడమే తనకెంతో కష్టంగా వుంటుంది.

మార్నింగ్ వాక్ మానేసి ఆ టైం లో పిల్లని తయారు చేసే పనిలో సాయం చెయ్యమని ఎన్నోసార్లు చెప్పి చూసింది వినీల భర్త శ్రీహరికి. కానీ ఆరోగ్యంగా వుండాలంటే వాకింగ్ తప్పనిసరనీ, కావాలంటే నువ్వే జాబ్ కి రిజైన్ చేసెయ్యి అని సలహా ఇస్తాడు తప్ప తనవంతు సాయం అస్సలు చేయడు. ఒక్కొక్కసారి అనుకోని పనులు ఎక్కువయ్యి స్కూలుకి లేట్ గా వెళ్ళాల్సి వచ్చినపుడు ఉక్రోషంతో ఏడుపు వస్తుంది వినీలకు. కానీ ఉద్యోగం మానటం ఇష్టం లేక అన్నీ భరిస్తూ కష్టపడటానికి అలవాటుపడిపోయింది.

బెడ్ రూంలోకి వెళ్ళి పిల్లలిద్దర్నీ లేపింది. నాల్గవతరగతి చదువుతున్న దివ్య వినీల లేపటంతోనే లేచి కాసేపు చదువుకుంటుంది ఎవరూ చెప్పకుండానే. కానీ..ఫస్ట్ క్లాస్ చదువుతున్న నానిని లేపడమే చాలా కష్టం వినీలకు.

ప్లీజ్ మమ్మీ..కాసేపు అంటున్న నానిని వీపుమీద చరిచి టైమెంతయ్యిదని అరచి కప్పుకున్న దుప్పటి లాగేసింది.

తప్పక లేచిన నానిని కాసేపు చదువుకోమని చెప్పి ప్రక్కబట్టలు సర్దేసింది. ఏడింటికల్లా వంటంతా పూర్తి కావటమూ క్యారేజీలు సర్దటమూ అయిపోయింది. పిల్లల్ని తయారు చేసి టిఫిన్ తినిపించి తను తినటమే వుంది. పిల్లలు చిన్నవాళ్ళు కావటాన ఎనిమిదింటికల్లా బయల్దేరాల్సిరావటాన న హైరానా పడాల్సి వస్తుంది.

ఏ మాత్రమన్నా భర్త సాయం చేస్తే తనకెంతో రిలీఫ్ గా వుంటుంది. కానీ ఆ విషయం ఆలోచించడు శ్రీహరి.

పిల్లలకు స్నానాలు చేయించి స్కూల్ డ్రస్ లు వేస్తుండగా వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు శ్రీహరి.

వస్తూనే...

వినీలా రేపు నాకు ఆఫీస్ లో ఇన్స్ పెక్షన్ వుంది, చాలా ఫైల్స్ చెక్ చెయ్యాలి. టైం లేదు. నువ్వు స్కూల్లో లీజర్ పీరియడ్ లో కొన్ని ఫైల్స్ తీసుకెళ్ళి చెక్ చేయి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసాడు.

అసలే పని హడావుడిలో ఉక్కిరిబిక్కిరిగా ఉన్న వినీల వెంటనే నో చెప్పేసింది.

నాకు ఈరోజు వుండేది ఒక్కటే లీజర్. యూనిట్ టెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చెయ్యాలి. అయినా రాత్రంతా ఫ్రెండ్స్ తో తిరగకపోతే అప్పుడే చెక్ చేసుకోవచ్చుగా అంటూ సలహా ఇచ్చింది.

" సర్లే నాకు తెలీక కాదు, రాత్రి తలనొప్పిగా వుండటాన చూస్కోలేదు. నా ఏడుపేదో నేను ఏడుస్తానులే..ఆ టిఫినేదో తగలెయ్యి " అంటూ విసురుగా వెళ్ళిపోయాడు బాత్రూంలోకి.

చకచకా పిల్లల్ని తయారు చేసి టిఫిన్ తింపించి తను కూడా తిన్నాననిపించి ఎనిమిది గంటలకల్లా పిల్లలిద్దర్నీ ఎక్కించుకుని స్కూటీ స్టార్ట్ చేస్కుని వెళ్ళిపోయింది వినీల.

సరిగ్గా ఎనిమిదీ ఇరవై కల్లా వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.

" మేడం" అని పిల్చిన అటెండర్ శ్రీను వైపు చూసింది వినీల.

పాపకి ఒంట్లో బాలేదు..రెండు వందలుంటే ఇవ్వండి..ఫస్ట్ కి ఇచ్చేస్తాను...అన్నాడు. " నా దగ్గర లేవు శ్రీనూ..అని చెప్పబోయి ఆగిపోయింది.ఎందుకంటే ఎప్పుడైనా రెండు నిముషాలు ఆలస్యంగా వచ్చినా రిజిస్టర్ లో సంతకం పెట్టేందుకు శ్రీను సహాయం తప్పనిసరి. అందుకే ముఖానికి నవ్వు పులుముకుని రెండువందలు తీసి శ్రీను చేతిలో పెట్టింది.

పిల్లల్ని క్లాస్ దగ్గరకు పంపి స్టాఫ్ రూం కెళ్ళింది ప్రేయర్ స్టార్ట్ అవుతుండటంతో.

థర్డ్ పీరియడ్ లీజర్ కావడంతో క్వశ్చన్ పేపర్స్ తయారు చేద్దామనుకుంటూండగా ఇంచార్జ్ సార్ అయిన మురళి గారు వచ్చారు.

" వినీలా మేడం! వన్ రిక్వెస్ట్ నేను తయారు చేసిన సెవెంత్ క్లాస్ క్వశ్చన్ పేపర్స్ ఈరోజే సబ్మిట్ చెయ్యాలి. కొంచెం చెక్ చేసి పెట్టరా ప్లీజ్..ఎలాగూ మీకు లీజరే కదా" అన్నాడు.

అయ్యో...సారీ అండీ... నాకు కుదరదు... ఈరోజే నేను కూడా పేపర్స్ తయారు చెయ్యాలి..అందామనుకుంది కానీ అనలేదు. ఎందుకంటే ఇప్పుడు తను నో చెపితే ఇంచార్జ్ సార్ కి కోపం వచ్చిందంటే ఈసారి లీజర్ పీరియడ్ లో ఆయన వెళ్ళమన్న క్లాస్ కి చచ్చినట్టు వెళ్ళాలి...తప్పదు అందుకే..దాందేముంది సార్.......చెక్ చేసి ఇస్తాను...ఇటివ్వండి.. అంటూ తీస్కుంది వినీల.పీరియడ్ మొత్తం చెక్ చేయడానికే సరిపోయింది.

చేసేదేం లేక నిట్టొర్చి ఇంటికెళ్ళి పనంతా అయ్యకా క్వశ్చన్ పేపర్స్ తయారు చెయ్యాలి అనుకుంటూండగా ఎందుకో భర్త చేసిన రిక్వెస్టు గుర్తుకొచ్చింది. ఉద్యోగ జీవితంలో అటెండర్ దగ్గర్నుంచీ ప్రిన్సిపాల్ వరకూ ఇగోను ప్రక్కన పెట్టి అన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది.కానీ జీవితాంతం ఒకరికొకరు తోడుగా వుంటూ కలిసిమెలిసి వుండాల్సిన భర్త విషయంలో మాత్రం సర్దుకుపోలేక చిన్న చిన్న విషయాలకే మనస్పర్తలతో కాపురంలో మనశ్శాంతి లేకుండా చేస్కుంటున్నాను....అన్న విషయం స్ఫురణకు రాగానే మనసంతా ఏదోలా అయిపోయింది.

చ..పాపం తను అడగ్గానే ఒప్పుకోవాల్సింది...ఏమైనా సరే ఈరోజు భర్త పనుల్లో తను సాయం చెయ్యాలి. అని గట్టిగా నిర్ణయించుకున్నాక తేలిక పడింది వినీల మనసు.

వినీల మీద కోపంతో టిఫిన్ సగమే తిని ఆఫీసుకెళ్ళాడు శ్రీహరి.మర్నాడే ఇన్స్పెక్షన్ వుండటంతో చాలా టెన్షన్ గా వున్నాడు. అన్ని ఫైల్స్ చెక్ చేస్కుంటూ ఉండగా ప్రక్క సీట్లో మాట్లాడుకుంటున్న లేడీ కొలీగ్స్ మాటలు చెవినబడ్డాయి.

" ఎప్పుడూ ప్రెష్ గా వుంటావు... ఏ విషయానికీ టెన్షన్ పడవు...ఎలా కుదురుతుందే నీకు..అని అడిగింది...మాధవి. తన కొలీగ్ పల్లవిని.ఏం లేదే ! మా హజ్బెండ్ నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు. ప్రొద్దుట లేచిన దగ్గర్నుంచీ ఇంటి పన్లు..పిల్లల పన్లు అన్నీ షేర్ చేస్కుంటాం. అందువల్ల నేను హ్యాపీగా , ప్రశాంతంగా వుండగలుగుతున్నాను...

ఇంటి పనులన్నిటిలో ఆయన సహాయం వుండడం వల్ల ఆఫీస్ పని కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ పెండింగ్ వర్క్ లేకుండా చేసుకోగలుగుతున్నాను. అందుకే రేపు ఇన్స్ పెక్షన్ అయినా నాకే మాత్రం టెన్షన్ లేదు. అని చెప్పింది పల్లవి.

ఆ మాటలన్నీ విన్న శ్రీహరికి చెంపన చెళ్ళున కొట్టినట్లయ్యింది. ఎప్పుడూ హడావుడిగా ఇంటిపన్లు చేసుకుంటూ పిల్లల చదువు విషయంలో హైరానా పడ్తూ ముఖంలో ఎప్పుడూ అలసట, విసుగు తప్ప ప్రశాంతత కనిపించని భార్య వినీల ముఖం గుర్తుకొచ్చింది.

ఎందుకో ఆ క్షణంలో చాలా బాధనిపించింది శ్రీహరికి. ఇకపై మార్నింగ్ వాక్ సమయాన్ని కొంచేం తగ్గించుకుని భార్యకు సహాయపడాలని నిర్ణయించుకున్నాడు...

నేటి యాంత్రిక జీవన విధానంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్కుంటూ , తోటి ఉద్యోగస్తులతోనూ..తమ కంటే క్రింది స్థాయి ఉద్యోగస్తులతోనూ, పై స్థాయి అధికారులతోనూ, అన్ని విషయాలలో రాజీపడుతూ సర్దుకుపోవడం తప్పనిసరి..అది అవసరం కూడా..అలాగే...

జీవిత భాగస్వామి పట్ల కూడా సాధ్యమైనంత వరకూ సహనం వహిస్తూ ఒకరికొకరు చేతనైనంత సహాయం చేసుకుంటూ సర్దుకుపోతూ అలకలకూ, అపార్థాలకూ తావివ్వకుండా సంతోషాన్ని పంచుకుంటుంటే, " గృహమే కదా స్వర్గసీమ " అనే నానుడి ఖచ్చితంగా అందరిపట్లా నిజమౌతుంది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు