మేమున్నాం - పి.ఎస్.ఎం.లక్ష్మి

we are for you

వర్ధనమ్మ,పార్వతమ్మ బస్ స్టాప్ వెనుక అరుగు మీద కూర్చుని వచ్చేపోయేవారిని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మధ్య మధ్యలో తెలిసిన వాళ్ళు పలకరిస్తూంటే మాట్లాడుతున్నా, వాళ్ళిద్దరి దృష్టి మాత్రం అక్కడ తిరుగుతున్న మనుషులమీదే వున్నది.ఆ కాలనీలో చాలామందికి అనుమానం. రోజూ వాళ్ళక్కడ కూర్చుని ఏం చేస్తుంటారు అని. కాలక్షేపం కాక అక్కడ కూర్చుంటున్నారులే అని కొందరు తేలిగ్గా తీసుకున్నారు. ఎంత కాలక్షేపం కాకపోయినా రోజూ అలా బస్టాండులో బీటు వెయ్యటమేమిటని నోరు నొక్కుకున్నవాళ్ళూ ఉన్నారు. ఎవరేమనుకున్నా వాళ్ళు పట్టించుకోలేదు సరికదా అడిగిన వాళ్ళక్కూడా సమాధానం ఇవ్వలేదు. వాళ్ళపని మాత్రం వాళ్ళు చేస్తున్నారు.పదిరోజులనుంచీ వాళ్ళు ఆ అమ్మాయినీ, అబ్బాయినీ గమనిస్తున్నారు. అమ్మాయికి 16ఏళ్ళు ఉంటాయి. సౌందర్యరాశి అనలేం కానీ, ఆ వయసులో అమ్మాయిలు అందంగా వుంటారు. పొద్దున కాలేజ్ కి ఏ సమయంలో వెళ్తుందోగానీ, రోజూ వచ్చేసరికి సాయంకాలం 4-30 అవుతుంది. దాదాపు రోజూ అదే బస్ లో వస్తుంది.

ఒక పది రోజులు క్రితం దాకా పక్కన ఇంకో అమ్మాయి కూడా వుండేదిగానీ ఇప్పుడు కనబడడం లేదు. పైగా ఆ అమ్మాయిలో మార్పు కనబడుతోంది. ఇదివరకు బస్ దిగాక స్నేహితురాలితో కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ పక్కనేం జరుగుతున్నా పట్టించుకోనట్లు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చున్నీ నిండా కప్పుకుని వంచిన తల ఎత్తకుండా ఎవరో తరుముకు వస్తున్నట్టు గబగబా వెళ్ళిపోతోంది. వెనకే ఆ అబ్బాయి... ఇరవై ఏళ్ళుంటాయి.. డిగ్నిటీ కన్నా ఫ్యాషన్ కే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చే వయసు.. ఆకారం కొంచెం అనాకారంగా అనిపిస్తూ ఆ అబ్బాయంటే అంతమంచి అభిప్రాయాన్ని కలగజెయ్యదు. వీలైనంతమటుకూ ఆ అమ్మాయిని తాకుతూ నడవడానికి ప్రయత్నిస్తూ వీళ్ళకి కనబడినంతసేపూ ఏదో మాట్లాడుతూనే ఉన్నాడూ.

వర్ధనమ్మ, పార్వతమ్మ అమాయకంగా కనిపించే అతి తెలివైన వాళ్ళు. మర్నాడూ వాళ్ళక్కడే కూర్చున్నారు. బస్ వచ్చి ఆగింది. ఆ అమ్మాయీ, అబ్బాయీ ఇద్దరూ దిగారు. అయితే ఆ అమ్మాయి కంగారుగా నడవడం మొదలుపెట్టలేదు. ఆ అబ్బాయి వంక చూసి ఏదో మాట్లాడింది. అరుగు మీద కూర్చున్న వర్ధనమ్మ, పార్వతమ్మలను చూపించి అటువైపు నడిచింది. ఆ అబ్బాయి తటపటాయించాడు. వెనక్కి తిరిగి పోబోయాడు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, తలెగరేసి ఓసారి జుట్టు సరిచేసుకుని వాళ్ళవైపు నడిచాడు.

" రా బాబూ, కూర్చో" వర్ధనమ్మ అరుగు మీద పక్కకి జరిగి చోటు చూపించింది. " పర్లేదులెండి చెప్పండి ఏంటి..ఎందుకు పిలిచారు?" నిర్లక్ష్యంగా అడిగాడు అతను.

" ఈ రాధ మా మనవరాలు. నువ్వు దీన్ని ప్రేమించావంట కదా..రోజూ చెబుతున్నావంట.. వీళ్ళమ్మకేమో దీన్నీ, దీని చెల్లెల్నీ బాగా చదివించి పెద్ద ఆఫీసర్లని చెయ్యాలని కోరిక. దానికోసమే వాళ్ళు ఉన్న డబ్బంతా పిల్లల చదువుకే ఖర్చు పెడతారు. దీనికీ చదువంటే ప్రాణం. కానీ నిన్ను చూస్తే ఇట్టా వదలకుండా వెంటపడుతున్నావాయే..." ఊపిరి తీసుకోవడానికని ఆగింది వర్ధనమ్మ. దొంగ చూపులు చూస్తూ ఆలోచనలో పడ్డాడు హీరో.

డామిట్..కథ అడ్డం తిరిగింది. ఏదో కాలక్షేపానికి అమాయకురాలిగా కనబడిన అమ్మాయి వెనక పడ్డాడు. కొంతకాలం ఆడుకుని వదిలెయ్యాలనుకున్నాడు. ఆ అమ్మాయి తన దోవలోకి రాకపోయేసరికి పేపర్లు, టీవీలలో చూస్తున్న రౌడీయిజం కూడా ప్రదర్శిస్తున్నాడు. ఆ అమ్మాయి భయపడుతుంటే తనకి చాలా సరదాగా ఉంది. భలే కాలక్షేపం. తనకేంటి? తన తండ్రికి ఆయన వ్యాపారంలోనూ, తల్లికి ఇంటి పనితోనూ తనని పట్టించుకునే తీరిక లేదు. తల్లి గారాబంతో అడిగిన డబ్బు ఇస్తుంది. అందుకే తనాడింది ఆట..పాడింది పాట. సరదాగా సాగిపోతున్న తన జీవితంలో ఈ ముసలాళ్ళ గోలేమిటి? ఏదో సరదాకి పోతే వీళ్ళిట్లా పట్టుకున్నారు. వీళ్ళ వాలకం చూస్తే పెళ్ళి కుదిర్చేటట్లున్నారు. తనకా ఉద్దేశమే లేదు. పైగా అమ్మా నాన్నకి తెలిస్తే చంపేస్తారు. ఏం చెప్పాలో తెలియక ఊ..ఊ.. అంటూ మూలిగాడు.అబ్బాయి అవస్థ చూసి చిన్నగా నవ్వుకున్న వర్ధనమ్మ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. " మీ నాన్న పేరేమిటన్నావ్? ఏం చేస్తుంటాడు? అవునూ, ఇంతకూ నువ్వేం చదివావు? ఉద్యోగం చేస్తున్నావా? అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? " వర్ధనమ్మ, పార్వతమ్మ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశ్నలు గుప్పించేస్తున్నారు. హీరోకి చికాకు పెరిగిపోతోంది. ఫ్రెండ్స్ తో చాలెంజ్ చేసాడు. ఆ అమ్మాయిని అనుభవించి వదిలేస్తానని. ఇప్పుడు వాళ్ళకేం సమాధానం చెప్పాలి? తండ్రికి ఇలాంటి విషయాలు తెలిస్తే తాట తీస్తాడు. మేనత్త కూతురే తన పెళ్ళామని ఎప్పుడో నిర్ణ్యంచేసారంతా,లేకపోతే ఆస్థులు ఆగమైపోవూ! ఏదోవయసుమీదున్నాడు,నాలుగు రోజులు ఎంజాయ్ చేద్దామనుకున్నాడు కానీ,ఇలా ముసళాళ్ళకు సమాధానాలిచ్చుకుంటూ పైసా లేని బికారిదాన్ని పెళ్ళి చేసుకోవటానికి తనేం తెలివితక్కువ వాడా!? ముందు వీళ్ళనొదిలిచ్చుకోవాలి.

రేపు మానాన్నని తీసుకొస్తా, ఆయన మాట్లాడుతాడు. దోస్తు పిలుస్తున్నాడు మల్లొస్తా. రోడ్డు మీద వాళ్ళకెవరికో చెయ్యి ఓపుతూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.అన్నీ అర్ధమయిన శాంత (పేరు కూడా మార్చేసింది వర్ధనమ్మ) చాలా రోజుల తరువాత సంతోషం తో పడీ పడీ నవ్వింది. పీడా వదిలింది మామా. వర్ధనమ్మని వాటేసుకుని ముద్దు పెట్టుకుంది. నిన్న మీరు నన్నని విషయాలు అడుగుతుంటే భయపడ్డాను,ఏం చేస్తారోనని, మంచి పని చేసారు మామ్మా... ముందు మీరేం చేయగలరనేసందేహం. అమ్మా, నాన్నకి తెలుస్తే చదువు మానిపించేస్తారని భయం. నేను చదువుకుందామనుకుంటుంటే... ఈ గోలేమిటని, చికాకు అబ్బ ఒకటి కాదు, వీడి మూలం గా నరక యాతన పడ్డాననుకోండి. నిజం గా మీలాంటి వాళ్ళు ప్రతీ కాలనీ లో వుండాలి. అప్పుడు మాలాంటి వాళ్ళం నిర్భయం గా బయటకి రాగలము. నేను మా వాళ్ళందరికీ చెప్తాను. మీ సాహసం గురించి ఇంక ఇలాంటి విషయాల్లో ఏమీ భయపడవద్దని, అవసరమైతే మీ సహాయం తీసుకోమని కూడా చెప్తాం. నిజంగా మీరు గ్రేట్ మామ్మా, మిమ్మల్ని రోజూ ఇక్కడ చూసి, కబుర్లు చెప్పుకోవడానికి ఇల్లు సరిపోలేదా అని అనుకున్నాను కానీ, ఇవాళ మీరు నా జీవితాన్ని కాపాడారు. వాడు యాసిడ్ పోస్తానంటే నిజంగా చాలా భయపడిపోయాను.. భలే బెదరగొట్టారు.. మళ్ళీ ఈవైపు రారు. అబ్బ..ఎంత సంతోషంగా వుందో..." శాంత ఉత్సాహానికి అంతే లేదు.

"మీలాంటి వాళ్ళకోసమే మేమిక్కడ కూర్చుంటామ్రా..ఇంట్లో మేము చేసే పనేం లేదు. భగవంతుడు జన్మనిచ్చినందుకు ఏదోక మంచిపని చెయ్యాలి కదా..ఈమధ్య ఈ గోలెక్కువగా వున్నాయి కదా...ఆడపిల్లలకూ వ్యక్తిత్వం, ఇష్టాయిష్టాలూ వుంటాయి. ఎవడో ప్రేమించానని వెంటపడితే వాడికి భయపడి చదువూ-సంధ్యా మానేసి, ఇష్టమున్నా, లేకపోయినా వాడిని పెళ్ళిచేసుకోవాలా? లేకపోతే కుళ్ళికుళ్ళి ఏడుస్తూ ఇంట్లో కూర్చోవడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో తప్ప గత్యంతరం లేదా..? అందుకే మీకు తెలీకుండానే మీలాంటి వాళ్ళకి కాపలాగా ఇక్కడ కూర్చుంటున్నాము. మామూలంగా కొంతమందికైనా మంచి జరిగితే మాకంతకన్నా కావాల్సిందేముంది..? " తృప్తిగా సమాధానం చెప్పారు వాళ్ళు.

'మరి వాడు రౌడీ అయి ఇంకేమన్నా గోల చేస్తే ఏం చేసేవాళ్ళు...?" మళ్ళీ భయం శాంతకి."ప్రతిదానికీ ఉపాయం ఉంటుందమ్మా..మేమిన్నేళ్ళనుంచీ ఈ కాలనీలో వుంటున్నాం కదా, మేము పిలిస్తే ఇక్కడివాళ్ళు పలుకుతారులే....పోలీస్ స్టేషన్ లో, కాలనీలో పెద్దవాళ్ళతో కూడా చెప్పి ఉంచాములే. మేమిట్లా చేస్తున్నాము, ఏమైనా అవసరమైతే సహాయం చెయ్యాల్సి వస్తుందని .మన కాలనీ వాళ్ళకోసం వాళ్ళూ అవసరమైనప్పుడు సహాయం చేస్తామన్నారు. మేము వయసులో కూడా పెద్దవాళ్ళం కనుక మీకుమల్లే అన్నిటికీ మొహమాటపడం. అవసరమైతే అరవగలం. మీదిప్పుడు తెలిసీతెలియని వయసు.. సరదాగా, సంతోషంగా వుండాల్సిన వయసు..ఇంట్లోవాళ్ళ ప్రేమతో హాయిగా చదువుకోండి. ముందు ముందు బాధ్యతలూ, బరువులూ తప్పవు..ఇప్పుడు కూడా ఈ గోలలన్నీ ఎందుకు...ఏ వయసు ముచ్చట ఆ వయసుది. చదువుకునే వయసులో హాయిగా చదువుకోండి.."వర్ధనమ్మ మాటల్ని మధ్యలోనే అందుకుంది పార్వతమ్మ.

"అయినా మీరు కూడా ధైర్యంగా వుండాలి. మీకే ఇబ్బందులొచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పండి. దాచుకుని జీవితాలు పాడు చేసుకోవద్దు. నిన్న మేం అంత గుచ్చిగుచ్చి అడిగాం కనక నువ్వు నీ సంగతి చెప్పావు లేకపోతే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు..ఇప్పుడు ఫలితం చూడు.. నువ్వు హాయిగా చదువుకోవచ్చు.. అందుకే మీ ఇబ్బందులు మీలోనే దాచుకుని మీ నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. పెద్దవాళ్ళతో చెప్పటం నేర్చుకోండి. ఇంకెప్పుడూ ఏ విషయం ఇలా దాచుకోకు.."

" అమ్మో..తల్చుకోవటానికే భయంగా ఉంది.. వద్దు మామ్మా..ఈ పది రోజులూ నరకం అనుభవించాను. ఎంత భయపడ్డానో..తిండీ..నిద్రా లేదు. ప్రతీక్షణం భయపడుతూనే ఉన్నాను. ఇప్పుడా భయం అంతా పోయింది. చాలా ధైర్యం వచ్చింది.. ఇకముందు ఏం జరిగినా అస్సలు భయపడను..ముందు మీకు చెప్పేస్తాను...అంతేకాదు..ఈసంగతి మా ఫ్రెండ్సందరికీ చెప్పేస్తాను.. వాళ్ళ కాలనీల్లో కూడా వీలైతే పెద్దవాళ్ళనిలా కాపలా వుండే ప్రయత్నం చేయ్యమంటాను.. అప్పుడీ గోలలు తప్పకుండా తగ్గుతాయి.. ముందు హాయిగా నిద్ర పోవాలి కద మామ్మా..పదిరోజుల పైనే అయింది నిద్రపోయి...రేపటి నుండి పరీక్షలు.. చదువుకోవాలి..వస్తాను..నిజంగా మీరిద్దరూ చాలా గ్రేట్ మామ్మలూ" మళ్ళీ వాళ్ళిద్దర్నీ కౌగిలించుకుని సంతోషంగా బయల్దేరింది శాంత.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు