ధర్మ పాలన - చెన్నూరి సుదర్శన్

dharmapalana

పూర్వం ధవళ దేశాన్ని ధర్మతేజ అనే మహారాజు పరిపాలించే వాడు. అతడి పాలనలో న్యాయం, ధర్మం నాలుగు పాదాలా నడిచేది. ఫలితంగా వర్షాలు సమృద్ధిగా కురిసేవి. కరువు కాటకాలు అంటే ఏమిటో తెలియని ప్రజలు సుఖశాంతులతో జీవించ సాగారు.

ధవళ రాజ్యమంటే పొరుగు రాజ్యాలు ఈర్ష్యపడేవి.. ఆ రాజ్యాన్ని కుతంత్రంగా కబళించాలని ఎన్నో ఎత్తుగడలు వేయప్రయత్నించి వెనుకంజ వేసేవారు.

ధర్మతేజ అసమాన ధైర్యసాహాసాలు.. అతడి పోరాట పటిమతో స్పూర్తి నిండిన సైన్యం గుర్తుకు రాగానే వారి గుండెలు అవిసి పోయేవి. ఏ రాజులూ ధవళ దేశం వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించే వారు కాదు. సరికదా.. ధర్మతేజ మహారాజుతో మైత్రికే మొగ్గు చూపే వారు.. వారికి అర్థం కాని విషయం ఒక్కటే. అంత సమర్థవంతమైన ధర్మ పాలన ఎలా సాధ్యమవుతోంది?.. ఏదో అదృశ్య శక్తి అతడి వెనకాల ఉండి నడిపిస్తోందని అనుమాన పడేవారు. ఆ రహస్య మేమిటో తెలుసుకోవాలని ఎవరికి వారే ఒకరికి తెలియకుండా మరొకరు గూఢాచారులను నియమించుకొన్న విషయం అత్యంత రహస్యం..

ధర్మతేజ మహారాజు పట్టపురాణి పేరు కళావతి. మహారాణి అంటే రాజుకు ప్రాణం. వారిది అన్యోన్య దాంపత్యం. దానికి ప్రతీకగా ఉదయించిన యువరాజు పేరు రామతేజ.

రామతేజ విద్య, యుద్ధ తదితర రాచరికపు నైపుణ్యాలలో రాటుదేలుతూ దిన దినాభివృద్ధి చెంద సాగాడు. యువరాజుకు తన ధర్మపాలన లోని సూక్ష్మాలను వివరించ సాగాడు ధర్మతేజ. ప్రజల యోగ క్షేమాలు తెలుసుకోడానికి మహారాజు రామతేజను తన వెంట తీసుకొని మారు వేషాలతో వెళ్ళేవాడు.

“కుమారా..! నువ్వెం తో నాకు ప్రజలు కూడా అంతే..!! రాజు ధర్మం న్యాయం నీతి తప్పితే రాజ్యం అధోగతి పాలవుతుంది” అని ఉద్భోదించే వాడు.

‘రామతేజ పాలనలో ధవళదేశం రామరాజ్యంగా మారిపోతుంది..’ అని ప్రజలు మురిసి పోయే తరుణంలో..

యువరాజు రామతేజపై విష ప్రయోగం జరిగింది. అచేతనుడై మంచానికి అతుక్కు పోయాడు. క్రమేణా శుష్కించ సాగాడు యువరాజు. రాజవైద్యుల ప్రయత్నాలన్నీ విఫలం కాసాగాయి

మహారాజు ధర్మతేజ దంపతుల బాధ వర్ణణాతీతం. మహారాణి కళావతి అన్నపానీయాలు మాని ఏకధాటిగా కన్నీరు పెట్ట సాగింది. ధర్మతేజ మనసు శూన్యమైంది.

రాజధర్మం మరిచి పోయి పుత్ర వాత్సల్యంతో ప్రజాపాలన నిర్లక్ష్యం చేయటం సబబు కాదని గుండె ధైర్యం వహించాడు.

మరో ప్రక్క యువరాజుపై జరిగిన హత్యాప్రయత్న రహస్యాన్ని చేదించాలనే ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వున్నాడు..

ఆ క్రమంలో వేట నెపంతో మారు వేషంలో ఉదయాన్నే ఒంటరిగా కీకారణ్యం ప్రయాణమయ్యాడు ధర్మతేజ. అన్యమనస్కంగా అడవిలో తిరుగుతుండగా ఒక చెట్టు క్రింద ఒక మహాముని తపస్సు చేస్తూ వుండటం తటస్థపడింది. అక్కడి ప్రశాంతమైన వాతావరణానికి ముగ్ధుడయ్యాడు మహారాజు.

సొగసైన చెట్లు సాలభంజికల్లా కొలను చుట్టూ ఆవరించి ఉన్నాయి. అవి నీలి మబ్బులను చుంబిస్తున్నట్లు ప్రతిబింబాలను తనలో ప్రదర్శిస్తూ.. మైమరపిస్తున్న కొలను.. దాని సమీపంలో చెంగు చెంగున ఎగిరే జింకల సామీప్యంలో నాట్యం చేస్తున్న మయూరాలు.. కోయిలల వినసొంపైన మధుర గానంలో మిళితమైన చిలుకల పలుకులు.. నిలువెల్లా పులకించి పోయాడు ధర్మతేజ మహా రాజు. మహాముని మౌనముద్రకు భంగం కల్గించ రాదని తలచి తన అశ్వాన్ని అల్లంత దూరంలోనే విడిచి వచ్చాడు.

ముని కరుణాకటాక్షాలకోసం ఎదురు చూస్తూ రెండు చేతులతో ప్రణమిల్లుతూ అతడి పాదాల చెంత కూర్చున్నాడు.

దాదాపు సూర్యాస్థమయం కావస్తోంది. అయినా రాజులో సంకల్పం సడల లేదు. ఇదంతా మహాముని తన జ్ఞాననేత్రంతో గమనిస్తూనే వున్నాడు. ధర్మతేజ మహారాజు భక్తి శ్రద్ధలకు సంతసించి ముని కనులు తెరిచాడు. రాజు వెంటనే మహామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

మహాముని మహారాజులోని ఆవేదనను అర్థం చేసుకున్నాడు. మనోకాంక్షను గుర్తించాడు.

“మహారాజా.. నీ ధర్మ పాలన గురించి నాకు తెలియంది కాదు. నీకు ఇదొక కఠినమైన పరీక్షాసమయం. నీ కుమారుని స్వస్థతకు ఒక్కటే మార్గం.. ” అంటూ మహారాజుకు ఒక దర్పణం ఇచ్చాడు.

“నీ అభీష్టం మేరకు దీని సహాయంతో యువరాజుపై జరిగిన విషప్రయోగ రహస్యం తెలుసుకొని వివేకవంతుడిగా నడుచుకో.. నీ ధర్మమే నీ కుమారుని కాపాడుతుంది” అంటూ దర్పణ వినియోగ సూత్రాన్ని వివరించాడు.

మహారాజు మరొకమారు మునికి ప్రణమిల్లి దర్పణాన్ని కళ్ళకద్దుకుంటూ తీసుకొన్నాడు. ముని దగ్గర సెలవు తీసుకొని తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

XXXXXXXXX XXXXXXXXXXXXXXX

అది మహారాజు రాజదర్బారు.

ధర్నతేజ మహారాజు సింహాసనంలో ఆసీనుడై ఉన్నాడు. ఆనాటి సభకు తన అనుచరులే గాకుండా పురప్రముఖులందరూ ఆహ్వానించ పడ్డారు. మరో ప్రక్క సామాన్య ప్రజలూ వున్నారు.

నిండు సభ.. నిరాడంబరంగా వుంది.

అంతా గుండెలు ఒడిసి పట్టుకొని నిరీక్షించ సాగారు. ‘మహారాజు గారు ఈ అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో..!’ అని ఒకరికొకరు గుస గుసలాడసాగారు.

ధర్మతేజ మహారాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగానే సభ నిశ్శబ్దమైంది...

“నేను ఈ రోజు యువరాజుపై జరిగిన విషప్రయోగ రహస్యాన్ని వివరించ బోతున్నాను” అనగానే సభలో కలకలం మొదలయ్యింది. ‘ఏమిటా రహస్యం.. నిందితులు దొరికారా?.. ఎవరా నిందితులు?..’ అని సభలో ఉత్కంఠ..

మహారాజు ఆధారాలతో సహా విషప్రయోగ వైనాన్ని వివరించాడు..

‘‘ఎవరక్కడ” అంటూ చప్పట్లు చరిచాడు..

నిందితున్ని ప్రవేశపెట్టుమని భటులను ఆజ్ఞాపించాడు.

రాజభటులు ముఖంపై ముసుగు ధరించిన ఒక వ్యక్తిని సభలో ప్రవేశ పెట్టారు.

“నిందితుడి ముఖం చూసే ముందు ఇతడికి సహకరించిన వ్యక్తి తనకు తానుగా ముందుకు రావాల్సిందిగా మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు ధర్మతేజ దర్పంగా..

సభలోని తలలన్నీ అటూ ఇటూ ఊగుతూ ఆతృతగా చూడసాగాయి.

రాజదర్భారు పై అంతఃస్తులో శోభాయమైన జలతారు మేలి ముసుగు వెనకాల ప్రత్యేక స్థానంలో కూర్చున్న మహారాణి కళావతి లేచి రావడం.. సభ నివ్వెరపోయింది.

“సెహభాష్ రాణీ గారూ!.. రండి” అంటూ వ్యంగ్యంగా కళావతిని ఆహ్వానిస్తూ.. రాజసంగా కదిలాడు.

వీరోచితమైన భంగిమలో చూపుడువేలుతో సంజ్ఞ చేస్తూ..

నిందితుడి ముఖంపై వున్న ముసుగు తొలగించుమన్నాడు మహారాజు.

అతడి ముఖం చూసి సభ మరింత నివ్వెరపోయింది..

నిందితుడు స్వయాన మహారాణి కళావతి గారి తమ్ముడు సర్పకేతువు.

కళావతి, సర్పకేతువులు కలిసి పన్నిన కుట్రను వివరించసాగాడు ధర్మతేజ.

““నా బావమర్ధి సర్పకేతువు తండ్రి అనగా నా మామగారు మహా క్రూరుడు.. స్త్రీలోలుడు.. అధర్మ పాలకుడు. సామాంత రాజైన నాతండ్రిగారు అతడిని సంహరించి ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. దానికి ప్రత్యుపకారంగా అతడి కూతురు కళావతిని నాకు కట్టబెట్టాడు. ఇది మీకందరికీ తెలిసిన విషయమే..” అంటూ సభను ఓ మారు క్రీగంటకలియ చూశాడు.

తిరిగి గొంతు సవరించుకొని..

“న్యాయానికి ఈ రాజ్యం సర్పకేతువుకే చెందాలని నేను మానాన్నగారితో వాదించాను. కాని నాన్న గారు ఒప్పుకోలేదు. ‘రాజ్యము వీర భోజ్యము.. వీరి వంశ పాలనతో ప్రజలు విసిగి పోయారు. రాజు అంటే ప్రజానురంజకంగా పాలించాలి. అందుకు సర్పకేతువు అర్హుడు కాడు’ అన్నాడు. ప్రజాభిప్రాయము సేకరించాడు. వారి అభీష్టము మేరకు నాకు పట్టము గట్టి ధర్మపరిపాలన కొనసాగించుమని ఆజ్ఞాపించాడు” “మహారాజు ధర్మతేజకు జై..” అంటూ సభ నినాదాలు మిన్నంటాయి.

మహారాజు వినమ్రంగా తన అభివాదము తెలియజేస్తూ..

“ఆనాటి నుండి సర్పతేజ నాపై ప్రతీకార వాంఛతో నాపై కక్షబూనాడు సర్పకేతువు. నన్ను ఏమీ చేయలేక పోయాడు. ఈమధ్యనే సర్పకేతువుకు కుమారుడు జన్మించాడు. వాడికి పట్టం కట్టాలని పథకాలు వేశాడు. పుట్టింటి మమకారంతో తన కన్న బిడ్డనే ఫణంగా పెట్టింది మహారాణి. ఇవన్నీ రాజకీయంలో మామూలే.. ” అంటూ ప్రజల హర్షాధ్వనుల మధ్య వారిరువురికీ ఉరిశిక్ష విధించాడు ధర్మగిరి మహారాజు. తీర్పు వినగానే సభలోని పొరుగు దేశపు గూఢాచారులు పాదరసంలా పారిపోయారు.

‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ ఇది ఎలా సాధ్యమైంది?.. అనుకున్నారు ప్రజలంతా..

“ధర్మపాలన మహారాజుకూ జై.. ధర్మతేజ మహారాజుకూ జై..” అనే నినాదాలు సభలో మారుమ్రోగాయి.

ప్రజల జే.. !జే.. ! లే.. యువరాజుకు ఊపిరి పోసాయి.

శిక్ష విషయంలో పర తమ భేదాలు పాటించని ధర్మగిరి ధర్మ పాలనకు పరిరక్షణగా యువరాజు క్రమేణా కోలుకోసాగాడు. ఇది మహాముని మనోగతం అని మహారాజుకు అర్థమైంది.

రామతేజ యువరాజు పూర్తిగా కోలుకోగానే అతడిని పట్టాభిషిక్తున్ని చేశాడు మహారాజు. మరింత సమర్థవంతంగా ధర్మ పాలన కొనసాగించుటకై దర్పణ రహస్యం చెప్పి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు ధర్మతేజ మహారాజు. *

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు