కనువిప్పు - పి బి రాజు

kanuvippu

మనసు కలచి వేసింది. ఏదోలా ఉంది.

“ఇలాంటి కొడుకులు కూడా ఉంటారా?”

చిన్నగా అంటారేం సార్? వీడు మహా దేశముదురు!" అన్నాడు మా ఫీల్డ్ ఆఫీసర్ మురళి.

"అవునా?"

"అవును సార్! బాకీ అడుగుతామని ఫోన్ సిం మార్చేశాడు. అడ్రెస్ మార్చేశాడు. పనిచేస్తున్న కంపెనీ మార్చేశాడు. ఇంతకీ వాడెక్కడుంటాడో కూడా వీళ్ళకు తెలియదు. పాపం! వీళ్ళను చూడండీ ఎంత హీనంగా ఉన్నారో - వాడికోసం ఎదురుచూస్తూ" హీరో హోండా ను ఒక గుడిసె ముందు ఆపుతూ చెప్పుకుపోతున్నాడు మురళి.

"ఇక్కడే సార్! వాళ్ళ అమ్మానాన్న ఉండేది." టూ వీలరుకు స్టాండ్ వేసి "సత్తెయ్య ...సత్తెయ్యా!" తలుపు తట్టాడు.

"ఎవరూ ..." అంటూ ఒక బక్క పల్చటి ఆకారం బయటికొచ్చింది దగ్గుతూ.

' మా కొత్త మేనేజర్ గారొచ్చారు సత్తెయ్యా" పరిచయం చేశాడు.

"దండాలు సార్! దండాలు. కూర్చోండి సార్!" అంటూ అక్కడే ఉన్న మంచాన్ని వాల్చాడు.

వంగిపోయిన నడుము, ఎక్కడో అతుక్కుపోయిన కడుపు, లోతుగా పీక్కుపోయిన కళ్ళు, ఎముకలు తేలిన బక్కటి శరీరం ...తెరలు తెరలుగా దగ్గు. డెబ్బై దాటిన వయసు.

నిలవడానికి కూడా శక్తి లేక తూలి పడబోయి అలానే మంచం దగ్గర నేలపైన కూలబడ్డాడు.

'ఏం తాతా! ఆరోగ్యం బాగాలేదా?"

మళ్ళీ దగ్గు ...ఆయాసం

"డాక్టర్ కు చూపించుకోలేకపోయావా?" మురళి పరామర్శ.

"దవాఖానాకు వెళ్ళాను బాబూ! ఏవో బిళ్ళలిచ్చారు. వేసుకొంటున్నా తగ్గడం లేదు." ఆయాసంతో రొప్పుతున్నాడు.

ఇంతలో - అతని భార్య -నూకాలు బయటినుంచి వచ్చింది.

"ఏంటయ్యా! గోళీలు వేసుకోలేదా? కొంత కూడా తగ్గలేదా? " అంటూ నుదుటి మీద చేయి వేసి లాలనగా అడిగింది.

"ఏసుకున్నాలేవే ... అయినా ఇది తగ్గే జబ్బు కాదే!"

"అట్టా అనబాకయ్యా! డాక్టర్ బాబు దగ్గరి కెళ్ళొచ్చాను. రేపొస్తే కొత్త మందులు రాసిస్తానన్నాడు. మేస్త్రిని రెండ్రోజుల కూలీ అడిగి తీసుకొచ్చా. రేపెల్దాం. కాస్తా ఓపిక పట్టు. !" అనునయంగా, అవేదనగా నూకాలు చెప్పుకుపోతోంది.

"ఇది రోజూ ఉండేదే కానీ ... బ్యాంక్ సార్లొచ్చారు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఏం చేద్దామే..?" రొప్పుతూ అన్నాడు.

"ఏం చేయమంటారు పెద్దసారూ! ఆ సచ్చినోడు మమ్మల్నిలా మోసం చేస్తాడనుకోలేదు. ఒక్కడే కొడుకు. ఒకడే కదా ...అని చదివించాం. హై ఇస్కూల్ తో ఆపేసి సేద్యం చేసుకో రా అంటే విన్లా! నేను చదూ కొంటానే అన్నాడు. సరే ఒకే కొడుకు కదా ... వాడి ముచ్చట ఎందుకు కాదనాలని...చదువుకొని బాగుపడని అనుకొని అప్పు సప్పు చేశాం. పట్నం చదువైపోగానే ఏదైనా ఉజ్జోగం చూసుకోరా అన్నా! కాదమ్మా! పెద్ద చదువులు చదవాలి పె ద్ద ఉద్యోగం చేయాలి అన్నాడు. ఆ జగన్నాధం మాస్టారొచ్చారు. బాగా చదువుతా ఉన్న పిల్లోని చేత మట్టి పిసికిస్తావా? మీ వాడికి బాగా చదువబ్బతావుంది. చదివించు. పైకొస్తాడు. కావాలంటే ప్రభుత్వం సహాయం చేస్తుంది. బ్యాంకులు లోన్ లిస్తాయి. ఆ తర్వాత పెద్ద ఉద్యోగం వస్తే వాడే అప్పులు తీర్చుకొంటాడు. మీరేం పరేషన్ పడొద్దు" అన్నాడు.

"సరే అన్నా. ఆయనే బ్యాంక్ లోన్ ఇప్పించాడు. ఏవేవో కాయితాల మీద ఏలుముద్రలేయించుకున్నారు. ఉన్న రెండెకరాల పొలం తాకట్టన్నారు. ఉన్న ఒకే ఒక పిల్లోడు వృద్దిలోకి వస్తానంటే కాదనలేకపోయా. కూడబెట్టిన డబ్బులు పోయాయి . నా నగలు పోయాయి . ఇంటి జాగా కూడా అమ్మేశాం. బయట అప్పులు పెరిగాయి. ఐదేళ్ళూ కళ్ళు మూసుకుంటే... పేద్ద ఉద్యోగం వస్తుందనీ ఈ అప్పులన్నీ ఒక లెక్కలోది కాదని... ఏడాది తిరిగే లోపే తీరిపోద్దన్నారు.

ఐదేళ్ళయింది. ఉద్యోగం వచ్చిందన్నారు. మంచి రోజులొచ్చాయన్నారు. మా అదృష్టం పండిందన్నారు. మురిసిపోయాం. ఆర్నెళ్ళపాటూ ఏదో కొంత పంపేవాడు. ఆ తర్వాత ఏమయిందో తెలియదు వాడి జాడే లేదు. వాడి దారి వాడు చూసుకొన్నాడు.

"మాకా వయసుడిగిపోయింది . ఎప్పటికప్పుడు అప్పు చేసి పంటకు పెడితే చేతికందలా ...కళ్ళ ముందే ఎండిపోయింది . మా బతుకులూ బూడిదాయా. పూలమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సొచ్చె. కూలీ నాలీ చేసుకొని కాలం తీస్తామంటే ...ఇదో ఈ ముసిలోడికి అంతు చిక్కని రోగమాయె. మేమెలా బతకాలో తెలియడం లేదు. కూటికీ గుడ్డకీ లోటు లేకుండా ఉండే. ఇప్పుడు వాటికే వనవాసమాయె. ఏం చేద్దాం?" ముక్కు చీదుకుంటూ మళ్ళీ మొదలెట్టింది.

"మొన్న చిన్న సార్ వచ్చారు. పొలాన్ని జప్తు చేస్తామన్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇప్పుడూ,అప్పుడూ అని వాయిదా లేసి అబద్దాలాడలేను. పెద్ద సారూ! దిక్కులేనోళ్ళం. దిక్కుతోచకుండా ఉంది. ఆ పొలాన్ని కూడా నా పుట్టింటోళ్ళు పసుపు కుంకుమ కింద రాసిచ్చారు. అన్నీ పోయె. కనీసం ఇదైనా నిలబెట్టుకోవాలని చూశాం. మా కష్టాలు మీకు చెప్పాం. ఇక మీరే మాకు దిక్కు.” "నా రెక్కల కష్టం మీదే ఈ ముసిలోన్ని చూసుకోవాలి. మాకా వయసుడిగిపోతావుంది. పోరాడే శక్తి లేదు. మీ అప్పు తీరుస్తామని వాయిదాలు చెప్పలేను. ఎందుకంటే తీర్చే మార్గం లేదు. పొలం అమ్మాలన్నా కొనేవాళ్ళు లేరు. మీ అప్పు తీర్చలేక పోతున్నామనే మనోవేదనతోనే ఆయన మంచమెక్కాడు.”

"పెద్దసారుగారు! ఆ పొలాన్ని జప్తు చేసి అమ్మేయండి. మీ బాకీ జమ చేసుకోండి. మా అయ్య పోతూ పోతూ "బిడ్డా! ఈ రెండెకరాలు నీ పేరు మీద రాశాను. చేసుకో" అనేసి కళ్ళు మూశాడు. ఈ రోజుతో ఆ ఋణం కూడా తీరిపోయింది. ఆ పొలాన్ని కూడా మీరే తీసేసుకోండి." వలవలా ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది నూకాలు.

బ్యాంక్ మేనేజర్ గా ఒక మొండి బాకీ వసూలుకు వెళ్ళిన నాకు పల్లెల్లోని సగటు భారతీయ మధ్య తరగతి జీవితంలోని మరో కోణాన్ని చూపించింది నూకాలు.

ఒకప్రక్క అప్పుల బెడదలు ...మరో ప్రక్క కొడుకు నిర్వాకం వాళ్ళను కృంగదీస్తోంది.

మనస్సు బరువెక్కింది. ముసల్లాళ్ళ దీన స్థితి చూసి జాలేసింది. ఇంత హీన స్థితిలో కూడా బ్యాంక్ లోన్ తీర్చలేక పోతున్నామని వాళ్ళు పడుతున్న ఆవేదన నన్ను కదిలించి వేసింది. వాళ్ళ నిజాయితీ చూసి ముచ్చటేసింది.

ఆ రెండెకరాల పొలం పై చదువు కోసం ఐదు లక్షలు; పంట అప్పు లక్ష దాకా బ్యాంక్ లోన్ ఉంది.

ఇప్పటికిప్పుడు పొలం అమ్మినా ; కొనడానికి ఎవరూ ముందుకు రారు. వచ్చినా నాలుగైదు లక్షలకు మించి పలకదు.

చిన్నప్పుడెప్పుడో చదివిన గుర్తు - సగటు భారత రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే మరణిస్తాడని - ఎంతటి నగ్న సత్యం. వీళ్ళ కోసం ఏదో చేయాలి. ముందు వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి.

ఇంటికి వస్తూ- జగన్నాధం మాస్టార్ని ఒకసారి కలిసి వచ్చాను.

ఆ రాత్రంతా ఏవేవో ఆలోచనలు - ఎడతెరిపి లేకుండా.

* * *
డియర్ బియార్ సొల్యూషన్స్ ఎం.డి. గారికి,

మొన్న స్వాతంత్య్ర దినోత్సవం నాడు హైదరాబాద్ వచ్చినపుడు ఏదో ప్రైవేట్ ఛానెల్ లో మీ కార్యక్రమం చూడడం జరిగింది. మీ ఉద్యోగులకు మీరిచ్చిన సందేశం చాలా బాగుంది. ఎంత బాగా చెప్పారు. “ మాతృ సేవ, దేశ సేవ, ఉద్యోగ సేవ ...మాతృ మూర్తిని గౌరవించిన వాడే దేశాన్ని గౌరవిస్తాడు. దేశాన్ని గౌరవించేవాడే చేస్తున్న ఉద్యోగాన్ని గౌరవిస్తాడు. ఉద్యోగాన్ని గౌరవించడం అంటే నీతి, నిజాయితీగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం. అదే నిజమైన దేశ సేవ. ఈ రోజు మీరంతా ప్రతిన పూనండి. దేశ సేవ కోసం పునరంకితమవుతామని ... ఎవరి కర్తవ్యం వారు నిష్ఠతో చేస్తామని.."

"ఏమిటీ! ఒక బ్యాంక్ మేనేజర్ నన్నిలా పొగడడమేమిటి అనుకుంటున్నారా? అక్కడకే వస్తున్నాను. ఇలాంటి మహోన్నత ఆశయాలున్న మీరు ఒక చీడ పురుగుకు ఆశ్రయ మిచ్చారని తెలియచేయడానికి విచారిస్తున్నాను. హర్నాథ్, అతని భార్య మీ కంపెనీలో సాఫ్ట్ వేర్ లు గా పనిచేస్తున్నారని విన్నాను. అతని తల్లిదండ్రులు పడుతున్న వ్యథ నన్నెంతో కలచి వేసింది. ఒక్క కొడుకే అని శక్తికి మించి అప్పులు చేసి చదివిస్తే ... ఇతను మీ కంపెనీలో చేరి, కొలీగ్ ను పెళ్ళి చేసుకొని ఎంత హాయిగా జీవిస్తున్నాడో మీకు తెలిసే ఉంటుంది. తలిదండ్రులను పూర్తిగా గాలికి వదిలేసి, తన అచూకీ కూడా వారికి తెలియకుండా ఎంత స్వార్థంతో బ్రతుకుతున్నాడో విచారించండి.

చదువు సభ్యత నేర్పాలి. సంస్కారం నేర్పాలి. ఆదర్శం నేర్పాలి. కానీ ఈ వెధవకు స్వార్థాన్ని నేర్పింది. ఎంతగా అంటే - ముసలి తల్లితండ్రులను గాలికొదిలేసేంత - కనీసం తానెక్కడున్నాడో కూడా అమ్మానాన్నలకు తెలియనంత - తన అచూకీ కూడా అందనంత ... తెలిస్తే ...పలకరిస్తే వారి భారం ; అప్పుల బాధ ఎక్కడ నెత్తిన పడుతుందో అన్నంత - కనీసం పెళ్ళి చేసుకొన్నానని చెప్పడానికి కూడా నోరు లేనంత -

కూలీ నాలీ చేసుకోలేక ; ఆరోగ్యం పాడై, శక్తి లేక కాలే కడుపుల్తో మూగ వేదనతో ముసలి తల్లితండ్రులు అలమటిస్తుంటే ; రెండు జీతాల్తో విందు వినోదాలతో పెళ్ళాం మత్తులో తూలిపోయేంతగా -

ఎదిగిపోయాడనుకున్నారే కానీ, కళ్ళకు కూడా కనిపించనంతగా ఇంత ఎత్తుకు ఎదిగి పోయాడని వారనుకోలేదు.

నేను స్వయంగా అతని తల్లితండ్రుల బాధ చూశాను. వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు వాడి కోసం చేసిన బ్యాంక్ అప్పు తీర్చడం కనీస ధర్మం. ఎందుకంటే బ్యాంక్ మనీ అంటే పబ్లిక్ మనీ. పదిమందికీ ఉపయోగపడాలి.ఆ లోన్ తో బాగుపడ్డాడు. సంపాదించుకుంటున్నాడు. ఆ అప్పును కూలీ చేసుకొనే ముసలివాళ్ళపైన తోసేయకుండా మనమేదైనా చేయలేమా అనిపించింది. అందుకే నా ఈ ప్రయత్నం. ఇందులో మీరేమైనా సహాయం చేయగలరేమో నని నా ఆశ. ఇలాంటి సేవలు కూడా దేశ సేవ లో భాగమని ధృఢంగా నమ్ముతున్నాను.అభినందనలతో-

* * *

డియర్ బ్యాంక్ మేనేజర్ గారికి,

మీ ఈమెయిల్ ఇప్పుడే చూశాను. నన్ను కదిలించింది. నేటి యువత పెడ దారి పట్ల మీ తపన, ఆవేదన అర్థం చేసుకోగలను. వారి తల్లితండ్రుల పట్ల మీరు చూపిస్తున్న కన్సెర్న్ నన్ను కట్టిపడేసింది. మీ ప్రయత్నానికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. వారిద్దరినీ వెంటనే పిల్చి తగిన కౌన్సిలింగ్ ఇమ్మని, ఇలాంటి వారికి నా కంపెనీ లో చోటు లేదని, వెంటనే తప్పును దిద్దుకోకపోతే వారిద్దరీ అక్కౌంట్స్ సెటిల్ చేసేయమని నా సెక్రెటరికి ఇప్పుడే ఆదేశాలిస్తున్నాను. అంతే కాదు వారం లోగా సెటిల్ కాకపోతే విషయాన్ని నా దృష్టికి తెమ్మన్నాను. మరో వారంలో మీ సమస్య తీరిపోతుందని ఆశిస్తున్నాను.అభినందనలతో - బియార్ సొలూషన్స్.

* * *

మూడో రోజు ఉదయం పదిన్నరకల్లా - హర్నాథ్ తన భార్యతో పాటు నా కేబిన్ లో ఉన్నారు.

"కన్న తల్లిని, పుట్టిన ఊర్ని,విద్య నేర్పిన గురువుని, మంచి మిత్రున్ని, దారి చూపిన బ్యాంకుని మరిచిపోతే పుట్టగతులుండవురా దౌర్భగ్యుడా! నీవేదో గొప్పగా చదివే వాడివని, ఉద్దరిస్తావని మీ అమ్మానాన్నలను ఒప్పించి చదివించి నందుకు వాళ్ళకు, నాకు మంచి గుణపాఠమే నేర్పావు. వాళ్ళను దిక్కుమాలిన వాల్ని చేసి, అప్పుల పాల్చేసేసి కసాయిగా ప్రవర్తించావు. సలహా ఇచ్చి ఉద్దరించినందుకు నాకు తలవంపులు తెచ్చావు...." జగన్నాధం మాస్టార్ కోపంతో ఊగిపోతున్నాడు.

"మాస్టారూ! ఆవేశపడకండి. మీరలా శాంతంగా కూర్చొండి" కుర్చీలో కూర్చోబెట్టాను.

"అదికాదు సార్! వీడు బాగా చదివే వాడు. వాళ్ళ అమ్మానాన్నలు శక్తి లేక పదితో ఆపేద్దామన్నప్పుడు నేనే "బ్రిల్లియంట్ స్తూడెంట్' అని అప్పు చేసైనా ; ఆస్తి అమ్మైనా చదివించమని, గొప్పోడౌతాడని చెప్పి తప్పు చేశాను. నా మాట నమ్మి వారు శక్తికి మించి కష్టాలు పడ్డారు. వీడేమో ఏరు దాటాక తెప్ప తగలెట్టాడు. వూరిలో నా పరువూ తీశాడు. నా నమ్మకాన్ని కూడా వమ్ము చేశాడు " అంటూ వాపోయాడు. "చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం, కానీ మనసులు మాత్రం ఇంత హార్డ్ గా ఎలా మారాయో అర్థం కావడం లేదు"

"మీరు మమ్మల్ని క్షమించండి సార్! నిజంగా నేను తప్పు చేశాను. మా సార్; మీవల్ల నాకు కనువిప్పు కలిగింది. నా స్వార్థం నేను చూసుకున్నాను. మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు మారాను. ఆ రోజు మాస్టారే లేకపోతే నేనీ స్థితిలో ఉండేవాణ్ణే కాదు. మిమ్మల్నందర్నీ బాధ పెట్టాను. ఇక మీదటలా జరగదు. మీ అప్పే కాదు మా అమ్మానాన్నలు చేసిన అప్పులన్నీ తీర్చేస్తా. తాకట్టులో ఉన్న మా అమ్మ పొలం విడిపిస్తా. మా అమ్మానాన్నలను హైదరాబాద్ తీసుకెల్తా. మా నాన్నకు మంచి వైద్యం అందిస్తా. ఇక వారు మాతో బాటే ఉంటారు. మంచి కొడుకుననిపించుకుంటా. కనువిప్పు కలిగింది సార్! ఆశీర్వదించండి సార్!" హర్నాథ్ దంపతులు ఇద్దరూ మా కాళ్ళపై పడ్డారు. వాళ్ళ కళ్ళల్లో పశ్చాతాపం కన్నీళ్ళ రూపంలో సుడులు తిరుగుతున్నాయి.

"మా శాలరీల పైన లోన్ తీసుకొచ్చాం ! మా ఆవిడ నగలన్నీ అమ్మేశాం ! ఇప్పుడు ఆరు లక్షలు తెచ్చాం ! బ్యాంక్ అప్పు తీర్చేసుకోండి సార్! మా అమ్మ పొలం కాగితాలిచ్చేయండి …ముందు ఆమె కళ్ళల్లో ఆనందం చూడాలి."

హర్నాథ్ లో వచ్చిన మార్పుకు జగన్నాధం మాష్టార్ చాలా అనందపడ్డారు. వంగి వంగి సార్ కు కృతజ్ఞతలు చెప్పుతుంటే వాడి లోని జంతువు చనిపోయి మనిషి మళ్ళీ పుట్టాడా అనిపించింది. ఎంత మార్పు? వారం క్రితానికీ ...ఇప్పటికీ! మధ్యలో ఏదో అద్భుతం జరిగుండాలి. బియార్ సొలూషన్స్ వారి కౌన్సిలింగే కారణమా? యువత స్వతహాగా మంచే కావొచ్చు. కానీ దారి తప్పినప్పుడో, మళ్ళినప్పుడో అలాంటి చేదు మాత్రలు తప్పవేమో!

పొలం కాగితాలు చూస్తూ - కొడుకును అక్కున చేర్చుకొంది నూకాలు

ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్తున్నాయి. పక్కనే నిలబడ్డ సత్తెయ్య మొహంలో ముసిముసి నవ్వులు విరబూస్తున్నాయి.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి