ఏప్రిల్ నెల మూడవ వారం. వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం వేళ..
మిడీ మిడీ ఎండలో ఆర్.టి.సి. బస్ దిగి ముఖానికి ఎండా తగలకుండా చీర చెంగుని తల మీదుగా ముందుకు లాక్కుని వేడిని తట్టుకోలేక అక్కడికి రెండు మూడు ఫర్లాంగుల దూరంలో ఉన్న ప్రయిమరీ స్కూలుకి గబ గబా నడవటం మొదలెట్టాను. అలా నడుస్తూ నడుస్తూనే ..
“...కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు వేసవి మొదట్లోనే సూర్యుడు ఇంతలా పెట్రేగిపోతున్నాడు ..ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటాడో...” అని ఆలోచిస్తున్నంతలో స్కూలోచ్చేసింది . అన్నీ తెలిసిన పరిసరాలే ..ఇంచుమించుగా మూడు నాలుగేళ్ళ క్రితం అనుకుంటా ఇదే స్కూల్లో తన సంస్ద తరపున పిల్లలకి స్కూలు బేగ్గులూ, పుస్తకాలు పంచటానికి తన కమిటీ వాళ్ళతో కలసి వచ్చింది తను.
సరిగ్గా నేను అక్కడికి వెళ్లేసరికి భోజనాల సమయం కావటంతో టీచర్లూ , పిల్లలూ అంతా ఆ హడావిడిలో ఉన్నారు. మధ్యాహ్నభోజన పధకమట .. పిల్లలంతా వరుసగా కూర్చుని భోజనాలు చేస్తుంటేవాళ్ళ మధ్యలో అటూ ఇటూ తిరుగుతూ అక్కడంతా పర్యవేక్షిస్తున్నారు ఒక మధ్య వయసాయన. ఆయనే హెడ్మాస్టరట . ప్యూను చెప్పాడు . నాకాయన కొత్త ..నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈయన కాదు . ఈయనొచ్చి రెండేళ్ళు పైమాటేనట. ఇవ్వాళ వస్తున్నానని నిన్న ఫోన్ చేసి చెప్పినప్పుడేచెప్పారాయన ఈ విషయం ..
ఆలోచిస్తూనే గొంతు ఆరుకుపోతున్నట్టనిపించి బాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి కాసిన్ని నీళ్ళతో గొంతు తడుపుకుని సీసా మళ్ళీ బాగ్ లో పెట్టుకుంటూ చుట్టూ చూసాను .ఒక పక్క ఇంకా తింటున్నవాళ్ళూ , అప్పటికే తినేసిన వాళ్ళల్లో కొంతమంది పరుగెడుతుంటే వాళ్ళని పట్టుకోవటానికి అడ్డదిడ్డంగా పరుగులు పెడుతున్నవాళ్ళు , అంతలోనే ఉన్నట్టుండి గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి తన మీంచి దూకమన్నట్టుగా ఒకడు వంగుంటే వాడి మీదుగా అవతలికి దూకే వాళ్ళూ, అలా దూకుతూ పక్కకి పడిపోయే వాళ్లూ ...ఒకటే నవ్వులూ , కేరింతాలు . అరమరికలు లేని ఆ బాల్యం.
చూడ్డానికి ఎంత బాగుందో....
నిజానికి వేసవి శెలవుల్లో స్కూళ్ళు మూసేసినా ఆఫీసు పని చేస్తూనే ఉంటుంది కాబట్టి తనకి కావాల్సిన వివరాలు తర్వాతైనా వచ్చి తీసుకోవచ్చు. కానీ , పిల్లలుండరుగా ..పక్షుల్లేని చెట్లలా పిల్లల్లేని స్కూలేం స్కూలు? అందుకే , వీళ్ళంతా కనిపిస్తారని, ఈ ప్రోగ్రాం ఇప్పుడు పెట్టుకుని ఎండలో బయలుదేరిమరీ వచ్చింది తను . రెప్ప వాల్చేంత సేపు కూడా వాళ్ళని మిస్ అవ్వటం ఇష్టం లేక వాళ్ళ ఆటల్నీ , అల్లర్నీ గమనిస్తూ ఉండిపోయాను చాలాసేపు .
కాసేపటికి భోజనాలు పూర్తయ్యి ఎవరి క్లాసులకి వాళ్ళు వెళ్లిపోవటంతో అక్కడి హడావిడంతా సద్దుమణిగిపోయింది .దూరాన్నించి హెడ్ మాస్టర్ ఇటే రావటం చూసి గౌరవసూచకంగా లేచి నిలబడ్డాను . ఆయన నా ముందు నుంచి తన గదిలోకి వెళుతూ వెళుతూ .. “రండి మేడమ్ ..నిన్న ఫోన్ చేసింది మీరే అనుకుంట కదా..” అంటూ ఆయన చేసిన విష్ కి ప్రతిగా విష్ చేస్తూ ఆయన వెనుకే లోనికెళ్ళి ఆయన చూపించిన కుర్చీలో కూర్చున్నాను
.ప్యూన్ని పిలిచి చల్లని నీళ్ళు తెమ్మన్నారు . అతనవి తెచ్చేలోపు “ఇంతసేపు ఎదురుచూసేలా చేసినందుకు మన్నించమని అడుగుతూనే అందుకుగల కారణాలు కూడా చెప్పారాయన ..
మధ్యాహ్నభోజన కార్యక్రమాన్ని అలా దగ్గరుండి చూసుకోవటం వల్ల భోజనాల్లో ఎంతో అనవసర వ్రధాని అరికట్టారట . అలా పొదుపు చేసిన దానితో పిల్లలకి అదనంగా ఇంకొక కూర ఎక్కువ వండించ గలుగుతున్నారట . ఇంకొక కూర ఎక్కువుండేసరికి ఇంకో ముద్ద ఎక్కువ తినగలుగుతున్నారట పిల్లలు. అంతే కాదు , మధ్య మధ్యలో అలా పర్యవేక్షిస్తూ ఉండటం వల్ల వండే వాళ్లకి కూడా తమ పని మీద తమకి శ్రద్ధ పెరగటంతో రుచి, శుచి రెండూ సాధ్యమయ్యాయట.ఇవన్నీ ఆయన నోటివెంట వింటూ ఉంటే లీలగా నాకు అర్ధమైనదేంటంటే ..పిల్లలు త్రప్తిగా భోజనం చెయ్యాలి . దాంతో వాళ్ళ కడుపులు నిండాలి . ఒక్క పూట అయినా త్రప్తిగా వాళ్ళ ఆకలి తీరాలి . ఈ పధకం ప్రవేశపెట్టటంలో ప్రభుత్వం వాళ్ళ ఉద్దేశ్యం ఏదైనా , చిత్తశుద్దితో దాన్ని అమలు చేస్తూ ఆయన ఎంత ఆనందం అనుభవిస్తున్నారో చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపే చెబుతుంది .
అవును . మనసు పెట్టి చేసిన ఏ పనైనా ఎంతో ఆనందాన్నిస్తుంది ఎవరికైనా...
నిజానికి ఈ పధకం ప్రవేశపెట్టిన దగ్గర్నుంచీ అన్నీ అవకతవకలేనని టీవీలూ , పేపర్లూ ఘోషిస్తూనే ఉన్నాయి . బియ్యమూ , పప్పులూ ఇళ్ళకి చేరవేస్తున్నారనో, బ్లాక్ మార్కెట్ కి తరలిపోతున్నాయనో , ఉడికీ ఉడకనివి పిల్లలకి పెట్టేసి ఏదో అయిపోయిందన్నట్టుగా పబ్బం గడిపేస్తున్నారని..ఇలాంటివెన్నో ..
ఒకసారైతే ఇలా మధ్యాహ్నపధకంలో పెట్టిన పులిహోర టీవీ వార్తా చానల్స్ లో చూసి వాంతులొక్కటే తరువాయి . గడ్డలు గడ్డలుగా ఉన్న అన్నానికి పసుపు ఒకచోట అంటుకుని ఒకచోట అంటుకోక అక్కడక్కడా తెల్లతెల్లగా , పసుపు అన్నానికి అంటక ముద్దలు ముద్దలుగా అన్నమైతే సుద్దలు సుద్దలుగా ..ఇక పప్పు కూర అయితే చెప్పనే అక్కర్లేదు ..ఎడ మొహం, పెడ మొహంలా పప్పుకి పప్పూ , నీళ్ళకినీళ్ళూ ..అలాంటివి తింటే రోగాలు ఎందుకురావు? ఎంత కూటికి లేని పేదవాళ్ళు అయితే మాత్రం జిహ్వకు రుచిగా లేకపోతే నోట పెట్టలేరు కదా ? ..కానీ ...
ఇక్కడ చూస్తే పరిస్దితి వేరేగా ఉంది..ఆ టీవీల్లో చూసినవన్నీ తప్పేమో అన్నట్టుగా పిల్లల కడుపు నిండితే అదే కొండంత త్రప్తి అంటున్న ఈ పెద్ద మనిషి ..లాంటివాళ్ళు సమాజం అంతటా ఉంటే ఎంత బాగుండును ...
అదే మాట వారితో అంటే ఏమ్మాట్లాడకుండా నావైపు అలాగే చూస్తూండిపోయారుకాసేపు . అలా చూస్తూనే టేబుల్ మీదున్న బెల్ కొట్టారు.“బూశమ్మని పిల్చుకురా ..” అన్నారు బెల్ కొట్టటంతోనే క్షణాల్లో వచ్చి నిల్చున్న అటెండర్ తో ..
తప్పు మాట్లాడానా? ఉన్నట్టుండి ఆయనెందుకలా మౌనంగా అయిపోయారు? నా మాటలు ఆయన్నేమీ నొప్పించలేదు కదా ..” ఆలోచిస్తే నాక్కొంచెం గిల్టీగా అనిపించింది . అయినా ఇవన్నీ నాకెందుకు? ఆ బూశమ్మ ఎవరో ? ఆమె వచ్చేలోపు నేనొచ్చిన పనేంటో ఆయనకీ చెప్పేసి , నాక్కావాల్సిన వివరాల్ని తీసేసుకుంటే త్వరగా ఇక్కడ్నించి వెళ్లిపోవచ్చని ..”సార్ ..” అంటూ ఏదో చెప్పబోతున్నంతలో స్ప్రింగ్ డోర్ తోసుకుంటూ లోనికొచ్చింది ఎవరో అమ్మాయి ..బహుశా బూశమ్మంటే ఈ పిల్లేనేమో ..పేరుని బట్టి ఎవరో పెద్దావిడ అనుకుంది తను .
వచ్చీ రావటంతోనే చేతులు రెండూ చంకల్లో బిగించేసి భుజాలు కొంచెం పైకెత్తి కదలకుండా చేతులు కట్టుకుని నిలబడి కళ్ళార్పకుండా ఏకాగ్రతతో ఆయన వైపే చూస్తూంది . ఆ చూపుల్లో ఆయనంటే ఎంతటిభక్తిభావమో ..
నేను ఆ అమ్మాయినే గమనిస్తున్నాను . ఇందాక వరండాలో నిలబడి పిల్లల ఆటల్ని గమనిస్తున్నప్పుడు తూనీగలా చురుగ్గా అటూ ఇటూ పరుగెత్తుతున్న ఆ అమ్మాయిని ఆ కొద్దిసేపట్లోనే చాలసార్లు గమనించింది తను. ఇంతలో అకస్మాత్తుగా ..
” ఈ అమ్మాయి పేరు బూశమ్మండీ ..” అన్నారు ఆయన నన్నుద్దేశించి ..
“అవునా ..!” అన్నట్టుగా తలూపాను ఆ అమ్మాయి వైపే చూస్తూ ..
“ అమ్మగారికి దండం పెట్టు ..” అంటూనే అలా చేసి చూపించారాయన .
ఆ అమ్మాయి వినయంగా ముందుకి వంగి మరీ నమస్కరించేసరికి ఒకలా అయిపోయాను నేను. అంతలోనే “సరే..నువ్వెళ్ళు క్లాసుకి ..” అన్నట్టుగా హెడ్ మాస్టర్ గారు సైగ చేసేసరికి ఏమ్మాట్లాడకుండావెళ్ళిపోయింది.
అసలెందుకు పిలిచినట్టు ఆ అమ్మాయిని ? అంతలోనే ఎందుకు పంపించినట్టు ? క్షణంలో అనేక ప్రశ్నలు .
“ఈ అమ్మాయిని చూశారా ..? ఈ పిల్ల వినలేదు , ఏదీ అనలేదు..” మూసుకున్న స్ప్రింగ్ డోర్ వైపు చూస్తూ ఆయనన్న మాటలకి “అవునా సార్ ?” అన్నాను ..అయ్యోపాపం అన్నట్టుగా ..
నా గుండెలు బరువెక్కినట్టు నాకు తెలుస్తూనే ఉంది.. భారమైన నా హృదయాన్ని మరింత భారం చేస్తూ ..
“అవునండి ..బూశమ్మకి చెవుడు , మూగ ..ఈ రెండింటితోపాటు తల్లీ లేదు . తండ్రి తాగొచ్చి కొట్టిన దెబ్బలకి ఎప్పుడో ఈ పిల్ల చిన్నప్పుడే చచ్చిపోయిందట . తండ్రి ఉన్నా లేనట్టే ..ఎక్కడో ఉంటాడు . ఎప్పుడో వస్తాడు . వచ్చిన్నాడు పిల్లని పట్టుకుని చావా చితక్కొడతాడు. వాడు కొట్టే దెబ్బలకి తట్టుకోలేక వచ్చీరాని గొంతుతో ఏడుస్తూ కీచు కీచుమని ఆ పిల్ల అరిచే అరుపులకి మా స్కూల్లో పిల్లలంతా ఆ కాసేపూ కిటికీలకంటుకుపోయేవారు . ..ఆ పిల్లనే జాలి ఆ చూస్తూ . స్కూలు గోడని అంటిపెట్టుకునే ఉండేదిలెండి వాళ్ళ పాక . మరీ స్కూలు పక్కనే కావటంతో అక్కడ జరిగేవన్నీ వద్దన్నా వినిపించేవి మా అందరికీ. ఇవన్నీ పసి పిల్లల మనసు మీద ఎలాంటి ముద్ర వేస్తాయోననే భయమే కాదు , చూస్తూ చూస్తూ ఒక పిల్ల భవిష్యత్తు నాశనమైపోతుందే అనే బాధతో ..చివరికి ఆ ఆ పిల్ల పడే బాధలు చూడలేకటీచర్స్ అంతా మాట్లాడుకుని ఎలాగైనా వాళ్ళ నాన్నని మార్చాలని చాల ప్రయత్నం చేసాం..మా వల్ల కాలేదు . చివరికి వాళ్ళ నాన్న అందుబాటులో లేకపోవటంతో దూరపు బంధువు ఎవరో ఒకాయన ఉంటే పిలిపించి ఆయనకీ విషయాన్నంతా వివరించి ఆ పిల్లని ఈ స్కూల్లో చేర్చాం ..ఈ స్కూలుకి బదిలీ అయి రాగానే నేను చేసిన మొట్టమొదటి పనిది..ఇప్పటికి బాగా నిలదొక్కుకుంది..
పాపం ..ఉగ్గుపాలప్పటి నుంచీ ఈ బడి గోడల్నీ , బళ్ళో పిల్లల్నీ చూస్తూనే ఉందేమో చదువుకోవాలని మనసులో ఉన్నా , తాగుబోతు తండ్రితో తినటానికే వెతుకులాట. ఇక బడెక్కడ ? అలా చొరవ చేసి ఎప్పుడైతే ఈ పిల్లని స్కూల్లో చేర్చామో ..అప్పట్నించీ చదువూ ..ఆటా..పాటా ...అన్నీ ఇక్కడే . పనంటే మహా ఇష్టం . తూర్పున వేగు చుక్క పోడిచిందంటే బడి తలుపులు తెరవాల్సిందే ..బడి మీద ఈగ వాలనివ్వదు . వంటల్లో..వేళకి కొట్టే గంటల్లో ఆటల్లో..పాటల్లో..చివరికి వాళ్ళ క్లాసులో మార్కుల్లో కూడా తనే ముందు.
ఇప్పుడు బూశమ్మ మా అందరి జీవితాల్లో ఒక భాగం . ముఖ్యంగా ఈ నాలుగ్గోడలనబడే బడి బతుకుతో బూశమ్మ బతుకు పెనవేసుకు పోయిందంటే నమ్మలేరు మీరు . మా స్కూల్లో సుమతి అని లేడీ టీచర్ ఒకరున్నారు . ఒక్కరే ఉంటారు .ఇద్దరం ఒకేసారి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చాం. వారి భర్త ఎక్కడో సిటీలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటారు..అప్పుడప్పుడూ వస్తూంటారు . రాత్రుల్లందు వారింట్లోనే పడుకుంటుంది . సుమతి మేడం వాళ్ళాయన దగ్గరకి వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు ..ఏ నిమిషంలోనైనా ఆవిడకి ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్ రావచ్చు . ఆవిడా , నేనూ ఉన్నంతకాలం వరకూ అయితే బూశమ్మకి వచ్చినఇబ్బందేం లేదు...”
కొంచెం సేపు మాట్లాడ్డం ఆపి మౌనంగా అయిపోయారు..
“ఆహా..ఇవ్వన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇందాక మధ్యాహ్న భోజన పధకం గురించి చెబుతూ టీవీలో ఏదో చూశానన్నారుగా ..దానికి సమాధానమే ఈ బూశమ్మ . ఇందాక ఆ పిల్ల గురించి చెబుతూ వంటింట్లోనూ తనే అన్నాను కదా....మామూలుగా ప్రతి రోజూ ఇంటర్వెల్ లో వెళ్లి వంటచేసే వాళ్లకి ఏదో సాయం చేస్తూనే ఉంటుంది . వద్దని ఎంతమంది చెప్పినా వినదు . ఆ రోజు కూడా ఎప్పట్లాగే ఇంటర్వెల్లో సాయం చేస్తూంటే ఎవరో కుర్రాడు , మండలంలో ఉన్న మొత్తం స్కూళ్ళల్లో టీచర్లు ఎవరెవరూ ఎక్కడెక్కడా ఉద్యోగం చేస్తూ స్కూళ్ళకి దగ్గరలో ఉండకుండా పట్నాల్లో కాపురం ఉంటున్నారో తెలుసుకోవటానికి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏక్ట్ ప్రకారం అప్లై చేసి , వాళ్ళు సమాధానం ఇచ్చేలోపు ఆ అధికారులు ఇచ్చే సమాచారంలో పారదర్శకత ఎంతుందో తెలుసుకోవటానికి ఎందుకైనా మంచిదని స్కూలు స్కూలుకి తిరుగుతూ తనూ ఎంక్వైరీ చేస్తూంటే ఈ పిల్ల ఆ కుర్రాడి కంట్లో పడింది . ఇంకేముంది? సెల్ ఫోన్లో ఫోటోలు తీసి వాటిని తీసుకెళ్ళి టీవీ చానల్స్ వాళ్లకి ఇచ్చాడట.
ఇంకేముంది..ఒకటే గోల గోల ..పిల్లలతో పని చేయించుతున్నామని , పైగా నోరూ వాయా లేని మూగ చెవిటి పిల్లతో గొడ్డు చాకిరీ చేయించటం నేరం, ఘోరాతిఘోరమని ఏవేవో చెప్పారు..ఒకటే చూపించారు. దాంతో ఎం ఈ వో , డి ఈ వో మా మీద దండయాత్ర ..మామూలే కదా ..మేమెంత చెప్పినా వినలేదు . నాకిష్టమై నేనే చేస్తున్నానని ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా నోరు లేని ఆ అమ్మాయి మాటలు ఎవరు అర్ధం చేసుకుంటారు? అయినా ఒకసారి టీవీల్లో ప్రసారం అయిపోయాకా ఇంకెవరూ ఏమి చెప్పీ ప్రయోజనం ? అప్పటికే జరగాల్సింది కాస్తా జరిగిపోయింది .
దీన్నించి బయట పడేసరికి తలప్రాణం తొక్కి వచ్చింది మాకు . ఇప్పుడు అధికారులకీ అర్ధమైందనుకోండి ..అది వేరే విషయం ..ఇదిగో ఇలా ఉంటాయి టీవీల్లో వచ్చే వార్తలు .అలా అని నిజం ఉండదని నేననటం లేదు .కానీ..విన్నారుగా ..
అక్కడికీ విద్యార్డులెవరూ బడికి చెందిన పనుల్లో వేలు పెట్టకుండా ఏంతో జాగ్రత్తగా చూస్తూ ఉంటాం . కానీ బూశమ్మ అలా కాదు . బడంతా తానై తిరుగుతూ అన్ని పన్లూ నావే ..అంతా నా వాళ్ళే అనుకుంటుంది ..పిల్లలకి మధ్యాహ్నం భోజనాలు పెట్టేటప్పుడు కూడా ఈ బడి తన ఇల్లయినట్టూ , ఈ పిల్లలంతా తనింటికొచ్చిన అతిధులన్నట్టుగా వడ్డిస్తుంది . ఈ ఛానల్స్ వాళ్లకి ఇవ్వన్నీ తెలియవు కదా ..చెప్పినా నమ్మరు . కాబట్టి టీవీల్లో చెప్పేదీ చూసేదీ అంతా నిజం కాకపోవచ్చని ...”
అవునన్నట్టుగా తలూపాను .
ఆయన చెప్పినది వింటున్నంతసేపూ వేరే ప్రపంచంలోనికి వెళ్లిపోయినట్లు అనిపించింది నాకు . చెవిటి మూగ అమ్మాయి భూశమ్మే కళ్ళల్లో మెదులుతూ మళ్ళీ చూడాలనిపిస్తూంది.
అవునూ..మూగ, చెవుడూ రెండూ ఒక్కల్లకే ఎందుకిస్తాడో దేవుడు ? చూసింది చెప్పలేరు , .ఎవరైనా చెప్పేది వినలేరు ..అలాంటి వాళ్ళ జీవితాల్లో స్పర్శా , సైగా తప్ప శబ్దానికి తావు లేదు.
ఆలోచిస్తున్న కొద్దీ ఏదో చెప్పలేని బాధ ....తెలియని ఇబ్బంది...
కాసేపటికి ....
“ సారీ మేడం ..మీరెవరో తెలీదు . కానీ ..కొన్ని నిమిషాలు మనకి తెలియకుండానే మన మధ్య బరువుగా దొర్లి పోయాయి ..” వాతావరణాన్ని తేలిక చేస్తూ ఆయనన్న మాటలకి అవునన్నట్టుగా తలూపుతూ నా కార్డ్ ఆయన చేతికిచ్చి“ మళ్ళీ మీ స్కూలు రీ ఓపెన్ ఎప్పుడండి ?”
“జూన్ పన్నెండునండి ..” అన్నారాయన కార్డ్ వైపే పరిశీలనగా చూస్తూ ..
“ అదేనండి ..జూన్ లో స్కూల్స్ తెరిచే సమయానికి చల్లబడిపోయి వర్షాలు మొదలవుతాయి కదండీ
..వర్షంలో పిల్లలు ఇళ్ళ దగ్గర్నించి స్కూలికి రావాలంటే తడిచిపోతారు . వాళ్ళతో పాటు వాళ్ళ పుస్తకాలూ కూడా తడిచిపోతాయి . దాంతో జలుబులూ,దగ్గులూ ఒక్కటి కాదు సమస్య . అందుకని మా స్వచ్చంద సేవా సంస్ద తరపున మీ స్కూలు విద్యార్ధులకి గొడుగులు పంచుదామని మా సంస్ద వాళ్ళం నిర్ణయించుకున్నామండి ...మీ స్కూలు స్ట్రెంగ్త్ ఎంతో చెప్తే స్కూలు తెరిచే నాటికి దానిని బట్టి సరిపడాగొడుగుల్ని ఏర్పాటు చేసుకుంటాం “ అన్నాను ఆయన వంకే చూస్తూ ..
“ చాల మంచి పని ..” అని నన్నభినందిస్తూనే ప్యూన్ని పిలిచి లెక్కల మాస్టార్ని పిలుచుకు రమ్మనటం, ఆయన రావటం, ఆయనకీ నా గురించీ , నా రాక గురించీ విషయం వివరించి మొత్తం ఆ స్కూల్లో ఎంతమంది విధ్యార్దులున్నారో పేపర్ మీద వేసి నాకివ్వమని వారికి పురమాయించారు .
పావుగంట తర్వాత లెక్కల మాష్టారిచ్చిన వివరాల కాగితం తీసుకుని , దాని వెనకే వాళ్ళ ఫోన్ నంబర్లు అడిగి వ్రాసుకుని , మేము గొడుగులు తీసుకుని వచ్చేముందు రోజు ఫోన్ చేసి చెబుతానని చెప్పి స్కూలు నుంచి బయట పడ్డాను .
వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎందుకో ఒకట్రెండు సార్లు వెనక్కెనక్కి తిరిగి చూశాను ..ఎక్కడైనా బూశమ్మకనిపిస్తుందేమోనని ..
ఏదేమైనా ఆ స్కూలికి వచ్చినప్పుడున్నంత తేలిగ్గా లేదు నా మనసు.
ఆ తర్వాత రెండు నెల్లూ మాకు గొడుగులతోనే సరిపోయింది. కొటేషన్ తీసుకోవటం, రేట్ల కాంపేరిజన్ , క్వాలిటీ ..అన్నీ బాగా పరిశీలించి నచ్చిన చోట ఆర్డరిచ్చి మొత్తం మీద వేసవి శెలవుల అనంతరం జూన్ పదమూడవ తేదీన బళ్ళు తెరిచేనాటికి సరిపడా గొడుగుల్ని సిద్దం చేసాం .
స్కూలు తెరిచిన వెంటనే ఎందుకులే అని వారం రోజులు ఆగి ఆ తర్వాత ఒకరోజు స్కూల్లో లెక్కల మాస్టారికి ఫోన్ చేసాను ...”పిల్లలకి పంచటానికి గొడుగులు తీసుకుని వస్తున్నాము ..ఏ సమయంలో వస్తేమీకు కంఫర్టబుల్ “ అని. హెడ్ మాష్టారితో మాట్లాడి మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి అయిదు నిమిషాల్లోనే ఫోన్ చేసారాయన .
“మేడం ..రేపు సాయంత్రం నాలుగ్గంటలకి పంచుదామని చెప్పమన్నారు సారు . దాన్ని బట్టి మూడూ మూడున్నర మధ్యలో మిమ్మల్ని రమ్మన్నారు “ అంటూ ..
ఆ మర్నాడు ..
వర్షాకాలం కావటంతో ఆకాశం మేఘాల దుప్పటి కప్పుకునుందేమో ..వాతావరణం చాల చల్లగా , ఆహ్లాదంగా ఉంది .
సుమారుగా మూడూ మూడున్నర ప్రాంతంలో నేనూ , మా సంస్ద ట్రెజరర్ జానకి , జాయింట్ సెక్రటరీ రమాదేవి ముగ్గురం గొడుగుల్ని రెండు ఆటోల్లో వేసుకుని పావు తక్కువ నాలిగింటికల్లా స్కూలికి చేరుకున్నాం .స్కూలు వదిలేసే టైమై౦దనో ఏమో ..పొద్దుగూకే వేళ చెట్ల మీదకి చేరి అరుస్తున్న పక్షుల కూతల్లాకలగాపులగంగా , అంతా అల్లరి అల్లరిగా , గోల గోలగా ఉంది స్కూలంతా ..అటెండర్ సాయంతో గొడుగుల పెట్తెల్ని దింపి వరండాలో పెట్టించి అతన్ని అడిగాను “ పిల్లలకి నోటీసు పంపారా ..ఈ రోజు గొడుగుల డిస్ట్రిబ్యూషన్ ఉంది బెల్లు కొట్టినా ఎవరూ వెళ్ళద్దని ..” అని.. నోటీసు పంపించామన్నట్టుగా తలూపాడు .
అంతా సవ్యంగా జరుగుతున్నందుకు మనసులోనే “హమ్మయ్య..” అనుకుంటూ జానకిని , రమాదేవిని గొడుగుల దగ్గరుండమని చెప్పి హెడ్ మాస్టర్ని కలుద్దామని ఆయన గదిలోకి వెళ్లాను .
“నమస్కారం ..రండి మేడం ..పిల్లలకి చెప్పాము మీరొస్తారని, గొడుగులు ఇస్తారని ..”
ఆయనకి ప్రతి నమస్కారం చేస్తూనే “అవున్సార్ ..అందరికీ సరిపడా అన్ని గొడుగులూ ఒకే చోట దొరకలేదు . భయపడ్డాము అందరికీ ఒకేలాంటివి ఇవ్వగలమా లేదా అని ..చివరికి ఎలాగోలా దొరికాయనుకోండి ..” అంటున్నంతలోనే లాంగ్ బెల్ మోగింది. ఒక్కసారిగా ఒకటే అరుపులూ , కేరింతాలు
“పదండి ..” అన్నారాయన బయటికి దారితీస్తూ ..అనుసరించాను .
గొడుగుల పెట్టెల దగ్గరే నిలబడి ఉన్నారు జానకీ, రమాదేవి . హెడ్ మాస్టార్ని పరిచయం చేసాను వాళ్లిద్దరికీ. నమస్కారం చేసారాయనకు ..ప్రతి నమస్కారం చేస్తూనే గేటు వైపు చూసి గట్టిగా అరిచారాయన ..
“పిల్లలు వెళ్లిపోతున్నారు ..ఆపండి ..అరె ..ఆపు ..వెంకటేష్ నువ్వెళ్ళు ..పాపం మేడం వాళ్ళూ ఇంత శ్రమపడి వస్తే ..”అంటూ గబ గబా గేటు వైపు పరుగు తీసారాయన ..
ఆశ్చర్యంగా ..ఆయనకంటే , ప్యూను వెంకటేష్ కంటే ముందు రేసు గుర్రంలా పరుగెత్తుకెళ్ళి వెళ్ళే వాళ్లకి అడ్డం పడింది బూశమ్మ, వెళ్లిపోవద్దని , గొడుగులిస్తారని తన సైగల్తో వాళ్లకి వివరిస్తూ. అయినా ఆగటం లేదు ఎవరూ. మెల్ల మెల్లగా జారుకుంటున్నారంతా. వెళ్ళిపోయే వాళ్ళని భుజాలు పట్టుకుని మరీ వెనక్కి లాగుతుంది . అయినా బలవంతాన వదిలించుకుని మరీ వెల్లిపోతున్నారంతా ..గౌన్లూ , నిఖ్ఖర్లూ పట్టుకుని మరీ గుంజుతుంది ..ఎవరూ ఆగలేదు . పైగా అలా లాగుతున్న బూశమ్మనే నాలుగు గిల్లులు గిల్లి , వీపు మీద దబుకూ దబుకూ మంటా నాలుగు గుద్దులేసి మరీ వెల్లిపోయారంతా .
అక్కడికీ గొడుగుల అందాలని చూసైనా వస్తారేమోనని రమాదేవీ , జానకీ నేనూ గొడుగుల్ని
విప్పి మరీ చూపించాం “ ఇవన్నీ మీ కోసమే ..వెళ్ళిపోకండి ..రండర్రా ..” అంటూ ..అయినా ప్రయోజనం లేకపోయింది .ఒక్కడు ..ఒక్కడంటే ఒక్కడు కూడా మిగలకుండా వె ల్లిపోయారంతా ..మా అందరికీ ఒకటే ఆశ్చర్యం ..
నా ఈ సోషల్ సర్వీసులో ఇలా ఉచితంగా ఏదైనా ఇస్తామంటే , నాకు ముందంటే నాకు ముందని ఎగబడే వాళ్ళనే చూసాను కానీ ఇలా వద్దని వెళ్ళిపోయే వాళ్ళని చూడటం ఇదే మొదటిసారి.
నేనింకా ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే .. ఆ గిల్లిన గిల్లుళ్ళకి , వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఏడ్చుకుంటూ వచ్చింది బూశమ్మ ఎర్రగా కమిలిపోయిన చోట చేత్తో రాసుకుంటూ ..బూశమ్మని ఊరుకోబెట్టి , హెడ్ మాష్టర్ సలహా మీద వాళ్ళంతా అలా ఎందుకు వెళ్లిపోయారని అడిగారు అక్కడే ఉన్న తెలుగు టీచర్ సుమతి మేడం ఆ అమ్మాయి వైపే అయోమయంగా చూస్తూ ..
ఆ అమ్మాయి భావాలు ఆవిడకే బాగా అర్ధం అవుతాయట.
ఆవిడ అడగటమే తరువాయి ..
ఆకాశం వైపు చూపిస్తూ..గొడుగు వేసుకున్నట్టుగా తన సైగలతో ఏదో , ఏదేదో చెబుతూంది
బూశమ్మ.నాకెంతకి అర్ధం కాలేదు ..ఆ పిల్ల అంతా చెప్పటం పూర్తయ్యాకా ..
“ ఎందుకు వెళ్ళిపోయారు మేడం గొడుగులు తీసుకోకుండా ?” ఉండబట్టలేక అడిగాను ఆ పిల్ల మాటల్తో స్దాణువై నిలుచుండిపోయిన తెలుగు టీచర్ని ..
“ హారి ..పిడుగుల్లారా ..ఎంతగా ముదిరిపోయారర్రా మీరు ?” అన్నట్టుగా చెప్పలేక చెప్పలేక చెప్పినట్టు గా చెప్పింది..
“ గొడుగులు తీసుకుంటే ..వాన కురుస్తున్నా బళ్లోకి రావాలంట ..బడి మానేయ్యటానికుండదట . వానొచ్చి బడి మానేసానని చెప్తే ..గొడుగుందిగా అంటారట. ఒకవేళ వానొచ్చినా బళ్లోకి రావాలనుంటే గొడుగుంటే తడుస్తూ రావటానికి కుదరదట .. తడవటమే వాల్లకిష్టమట ..” వింటూనే నవ్వొచ్చింది నాకు .
నిజమే ..
”వానా వానా వల్లప్పా..వాకిలి తిరుగూ చెల్లప్పా ..తిరుగూ తిరుగూ తిమ్మప్పా ..తిరగాలేనే నరసప్పా ..తిరగాలేనే నరసప్పా ...” అని హాయిగా ఒళ్ళు మరచి స్వేచ్చగా వానలో తడుస్తూ తిరగటం వాళ్ళ బాల్యపు జన్మ హక్కు . .కదా.. తల తడిచిపోతున్నా ..జుట్టులోంచి నీళ్ళు దారగా కారుతూ గొంతులోకి పోతున్నా , తల పైకెత్తి కురుస్తున్న వాననిచ్చిన ఆకాశాన్ని క్రతజ్ఞతగా చూడటం ఎవరికిష్టం ఉండదు? అలా చూస్తూ చూస్తూ ముఖం మీద పడ్డ సన్నని, తియ్యని, చల్లని వాన చినుకుల్ని నాలుకతోచప్పరించటం కంటే ఏమి కావాలింక?ఇంటి చూరు మీంచి దారగా కారుతున్న వాన నీళ్ళని చేత్తో పట్టుకోవటం , ఒకవైపు వానలో తడుస్తూనే దూరంగా చేయి చాపి , అలా చాపిన చేతిలో పడ్డ ప్రతి చుక్కా తననెదుక్కుంటూ వచ్చిన స్వాతి చినుకులా అబ్బుర పడటం ..అలవాటుగా చూసే ఐసు ముక్కలే అయినా ఆకాశం నుంచి ఊడిపడ్డ వడగళ్ళు అరక్షణంలో కరిగి నీరై పోతాయని తెలిసినా ..ఆ కొద్దిసేపూ వాటినలా చూడటం ఎంత అపురూపం ..ఆనందం .. ఓరి పిడుగుల్లారా ..బట్టలు పాడవుతాయని తెలిసినా , అక్కడక్కడా గుంటల్లో నిలబడ్డ నీళ్లల్లో తపుక్కున కాలేసి ఎగజిమ్మే నీళ్ళని చూస్తూ ఎంజాయ్ చేసే మా బాల్యం మాకే కావాలని ఎంత బాగా చెప్పారర్రా....మీరే గెలిచారర్రా...మీ బాల్యం గెలిచింది ..”
ఆలోచిస్తున్నంతలో ...ఒక సందేహం ..
“ అవునూ ..ఈ బూశమ్మ ఎందుకు వాళ్ళని ఆపాలని ప్రయత్నించింది ? అనవసరంగా ఊరికే వస్తున్న గొడుగునెందుకు పోగొట్టుకుంటారనా ? లేక తనకెంతో ఇష్టమైన హెడ్ మాష్టర్ గారు ఉండమన్నారు కదా..ఉండకుండా వెళ్లిపోతున్నారెందుకనా? వాళ్ళంతా వెళ్ళిపోకుండా ఉండి ఉంటే తనకొచ్చిన లాభమేంటి ? వాళ్ళు గిల్లుతున్నా , పిడి గుద్దులు గుద్దుతున్నా భరిస్తూనే వాళ్ళని వెళ్ళిపోకుండా ఆపాల్సినంత అవసరం బూశమ్మకి ఏముంది ? అసలే చెప్పటానికి నోరు లేని మూగజీవి . స్కూల్లో ఇంతమంది ఉండగావెళ్ళే వాళ్ళని ఆపాలనే తాపత్రయం తనకే ఎందుకు?
ఈ మాటే సుమతి మేడంతో చెప్పి అడగమన్నాను ..ఆవిడకేగా ఆ పిల్ల సైగలు బాగా అర్దమయ్యేది .“ వాళ్ళందరూ గొడుగులు తీసుకోకుండా వెళ్ళిపోతే ..తనకొక్కదానికీ గొడుగు ఇస్తారో ..ఇవ్వరోనని భయమట . తనకి గొడుగు లేకపోతే వానలో తడుస్తూ స్కూలుకి రావాలట . అలా తడవటం వల్ల జలుబూ , జ్వరం ఏదైనా వస్తే మందులు వెయ్యటానికి వాళ్ళందరికీఉన్నట్టు తనకి అమ్మలేదట. గొడుగుంటే బడికి రాగలుగుతుందట. బడికొస్తే కడుపు నిండుతుందట . కడుపు నిండితే ఆకలి తీరుతుందట ..”
అమ్మే కాదు ..అమ్మతో పాటే వానలో తడిచే తన బాల్యమూ తనకి లేదని చెప్పకనే చెబుతున్న బూశమ్మ ని చూసి అనుకుంటా పైన విడిది చేసిన మబ్బులు మా బదులు మీరు వర్షించండని మా కళ్ళని ఆదేశించినట్టున్నాయ్..అక్కడున్న అందరి కళ్ళల్లో నుంచీ ఒకటే వర్షం ..తడిదేరిన గుండెని ఊపిరితో అదిమిపట్టి ఒక్కడుగు ముందుకు వేసాను .
“ నాకు గొడుగు ఇస్తారో ? ఇవ్వరో ? “ అన్నట్టు సందేహంతో ఆశగా నా వైపూ , గొడుగుల వైపూ మార్చి ,మార్చి చూస్తూంది బూశమ్మ.బూశమ్మ దగ్గరకంటా వెళ్లి తన తల మీద చెయ్యేసి ఆప్యాయంగా నిమిరాను ..అలా నిమురుతూ నిమురుతూనే తన కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ..
“ నీకు...నీకు ..ఈ గొడుగెందుకమ్మా ..నేనే నీ గొడుగవుతా ..సరేనా ..!” అన్నాను తనకి వినిపించేంత గట్టిగా మరింత దృడంగా
నా నిర్ణయాన్ని సమర్దిస్తున్నట్టుగా నా వెనకే నా భుజం మీద చెయ్యేసి జానకీ , రమాదేవి.
ఇప్పుడిక తప్పదనుకున్నాయో ఏమో ..చల్లని మబ్బులు తామే కురవటం మొదలెట్టాయి ..
****************************************************************
రంజని -నందివాడ భీమారావు కథల పోటీలో ఈ కధకు నాలుగవ బహుమతి వచ్చింది. అయితే ఈ కథ గోతెలుగు పత్రికలో ప్రచురింపబడటం నాకు చాలా ఆనందంగా ఉంది. గోతెలుగులో ఇదే నా మొదటి ప్రచురణ. బహుమతి వచ్చిన నా కథను ప్రచురించుటకు అంగీకరిస్తూ రచయితలకు మీరిస్తున్న ఈ ప్రోత్సాహానికి అందరి తరపునా మరోసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను .. నమస్కారములతో
-రచయిత్రి