సాయంత్రం ఆరు దాటుతోంది. హాల్లో సోఫాలో విచారంగా ముఖం పెట్టి కూర్చున్నారు రాజశేఖర్, ఆయన భార్య శ్రీలక్ష్మి. ఇంతలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వారి కూతురు శిరీష బయట స్కూటీ స్టాండ్ వేసి ఇంట్లోకి రివ్వున వచ్చింది.
వస్తూనే...
హాయ్ డాడీ...హాయ్ మాం....ఏంటి అలా డల్ గా వున్నారు..? పదండి. సరదాగా అలా బయటకు వెళ్ళి ఏదైనా హోటల్లో భోజనం చేసి వద్దాం. అంటూ హడావుడి చేస్తున్న కూతురి వైపు ఏ భావమూ లేకుండా నిర్లిప్తంగా చూశారిద్దరూ.
" ఏంటి...నా మీద కోపం పోలేదా ఇంకా.. ఇలా ఎన్ని రోజులు మౌన యుద్ధం చేస్తారు ? సరే మీ ఇష్టం.." అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది శిరీష.
రాజశేఖర్ - శ్రీలక్ష్మిల కోపానికి కారణం శిరీష పెళ్ళి.
శిరీష చదువు అయ్యి, ఉద్యోగంలో చేరిన మూడు సంవత్సరాల నుండీ పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు రాజశేఖర్ గారు. కానీ ఏ ఒక్కటీ నచ్చట్లేదు శిరీషకి.
ఒక రకంగా తప్పంతా వారిదే. వారు కూడా అదే నిశ్చయానికి వచ్చారు. ఒక్కతే కూతురని బాగా గారాబంగా పెంచారు. దానికి తోడు అసాధారణమైన సౌందర్యం , అమోఘమైన తెలివితేటలు ఆమె సొంతం.చిన్నప్పట్నుంచీ తననొక మహారాణిలా చూస్తూ అపురూపంగా పెంచడంతో శిరీష తన గురించి సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకునేలా చేశారు.
తన అందానికీ, చదువుకీ ఎంతో గొప్పవాడు రాజకుమారుడి లాంటి వాడు వస్తాడని కలల్లో విహరిస్తూ వాస్తవాన్ని మరిచింది. అందుకే తండ్రి తీసుకొచ్చే మంచి సంబంధాలలో ఏ ఒక్కటీ ఆమెకు నచ్చటం లేదు. ఎన్ని మంచి సంబంధాలూ తెచ్చినా ఏదో ఒక లోపం చూపించి కాన్సిల్ చేస్తుంది.
పొడవుగా తెల్లగా ఉన్న వాడు వస్తే, సరైన ఉద్యోగం లేదు అంటుంది. గవర్నమెంట్ జాబ్ సంబంధం తెస్తే రంగు తక్కువ..పొడవు లేడు అంటుంది.
పోనీ అందమూ, ఐశ్వర్యమూ ఉద్యోగమూ వున్నవాడ్ని తీసుకు వస్తే బాధ్యతలెక్కువగా వున్నాయి, నావల్ల కాదు అంటుంది. అలా లెక్కలేనన్ని సంబంధాలు చూసీ..చూసీ విసిగి వేసారి పోయారు ఇద్దరూ.
పెళ్ళిళ్ళ బ్రోకరు చేతులెత్తేశాడు. మీ అమ్మాయికి నచ్చిన సంబంధం తేవడం నావల్ల కాదంటూ.
ప్రతీసారీ పెళ్ళిచూపుల కార్యక్రమం జరగడమూ..అందరూ నానా హడావుడీ పడడమూ ఆ తర్వాత శిరీష సింపుల్ గా నో చెప్పెయ్యడమూ మామూలైపోయింది.
నిన్ననే వచ్చిన అమెరికా సంబంధం కూడా నచ్చలేదని చెప్పింది. అబ్బాయి బాగున్నాడు. మంచి ఉద్యోగం...సాంప్రదాయమైన కుటుంబం...అన్నీ తెలుసుకుని ఇది తప్పకుండా శిరీషకు నచ్చుతుందన్న నమ్మకంతో వున్న రాజశేఖర్ దంపతులు, ఆ సంబంధం కూడా అబ్బాయి ' నవ్వు ' నచ్చలేదని వంక పెట్టి రిజెక్ట్ చేయడంతో కూతురిపై అలిగి మౌనవ్రతం పాటించారు.
పోనీ తను ఎవరినైనా ఇష్టపడితే అలా కూతురి పెళ్ళి చేద్దాం అనుకుంటే అదీ లేదు. అస్సలు తనలాంటి అద్భుతమైన అందగత్తె ఇష్టపడాలంటే తనకు నచ్చే క్వాలిటీ కాదు కదా. .కనీసం తనను కన్నెత్తి చూసే అర్హత కూడా ఆ చుట్టుపక్కల ఎవ్వరికీ లేదనేది ఆమె స్థిర అభిప్రాయం.ఎలాగైనా తమ ఒక్కగానొక్క కూతురి పెళ్ళి గ్రాండ్ గా జరిపించి తమ బాధ్యత తీర్చుకోవాలనేది వారి తాపత్రయం.
************* *************** **************
ఇదిలా వుండగా ...
మరో సంబంధం వచ్చింది .అబ్బాయి పేరు వంశీ. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. పెళ్ళిచూపులకు అబ్బాయి ఒక్కడే వచ్చాడు మధ్యవర్తితో. మళ్ళీ యధావిధిగా పెళ్ళిచూపుల తతంగం మొదలైంది. అబ్బాయి చాలా అందంగా వున్నాడు.
ప్రతీసారీ పెళ్ళిచూపుల్లో శిరీషను చూడగానే అబ్బాయి కళ్ళల్లో మెరుపు, ఆనందం హుషారు కనిపించటం సహజమే.
కానీ..
వంశీ కళ్ళల్లో శిరీషను చూస్తూనే ఆనందం కలగకపోగా, ముఖంలో విసుగు, నిర్లక్ష్య భావం కనిపించాయి.
ఒక పది నిముషాలు శిరీషతో పర్సనల్ గా మాట్లాడాలనీ ఆడిగిన మీదట పెద్దలు తప్పుకున్నారు అక్కడనుండి.
పది నిముషాల తర్వాత....
ముఖం సీరియస్ గా పెట్టి అందరి ముందే మధ్యవర్తితో కోపంగా అన్నాడు వంశీ. " ఏమిటండీ ఇదీ..? మీమీద నమ్మకంతో, మా కుటుంబం గురించి అంతా తెల్సినవారు కదా అని మంచి మ్యాచ్ చూడమంటే ఇలాంటి అనాకారి, చెత్త సంబంధం చూపించారు? " అని..
" ఏంటి బాబూ మీరనేది? నాకు అర్థం కాలేదు..." అన్నాడు మధ్యవర్తి.
" అసలు నేను ఫోటో చూడాలంటేనే మినిమం ఒక మోస్తరు అందంగా వుండాలి. అలాంటిది, ఫోటోలో కంటే ఇంకా అందంగా వుంటుందని మీరు నమ్మకంగా చెప్పబట్టి ఇంత దాకా వచ్చాను...కానీ... నాకు భార్యగా కాదు కదా, కనీసం నా ప్రక్కన నిలబడడానికి కూడా అర్హత లేని అమ్మాయిని చూపించారు. సరే..ఎటూ వచ్చాను కదా అని తన గురించి తెల్సుకోవచ్చని పది నిముషాలు మాట్లాడాను. అందం నేను ఆశించినంతగా లేకున్నా, కనీసం ఎదుటివారితో మర్యాదగా మాట్లాడే మేనర్సు కూడా లేదని అర్థం అయ్యింది పది నిముషాల్లోనే. అదీకాక తన చూపులు మగవాడ్ని కట్టిపడేసేలాగా కాకుండా కాల్చుకు తినేసేలా వున్నాయి. దానికితోడు, ఈవిడగారికి వంట చెయ్యడం కూడా రాదట. ముగ్గులెయ్యడం రాదట..పూజలు కూడా చెయ్యదట...నేను ఆంధ్రాలో అయితే అందమైన, సాంప్రదాయక పద్ధతులలో వుండే అమ్మాయిలు వుంటారనుకుని భ్రమ పడ్డాను. కానీ, నాకు నచ్చిన ఏ ఒక్క క్వాలిటీ ఈ అమ్మాయిలో లేదని తేలిపోయింది. చ..చ...నా టైమంతా వేస్ట్ చేసారు... " అని విసవిసా బైటకెళ్ళిపోయాడు.
నోటమాట రానట్టు అవాక్కైపోయింది శిరీష. కన్నీళ్ళు అప్రయత్నంగా వచ్చేస్తున్నాయి ఆమె చెంపలమీదుగా...
" నన్ను...నన్ను రిజెక్ట్ చేస్తాడా .." ఆ విషయం జీర్ణించుకోలేక వారం రోజులు సిక్ అయ్యింది. లీవ్ పెట్టి ఇంట్లోనే వుండిపోయింది.రకరకాల ఆలోచనలతో గడిపింది. చివరకు తన తప్పు తెలుసుకుంది. తనను చూడడానికి వచ్చిన ఎంతోమందిని తను అలాగే అవమానించినప్పుడు వారు ఎంత హర్ట్ అయ్యి వుంటారో అనేది తనకు అనుభవమయ్యింది.
ప్రపంచంలో ఏ ఒక్కరూ మిస్టర్ పర్ ఫెక్ట్...అలాగే మిస్ పర్ ఫెక్ట్ లూ ఉండరని గ్రహించింది.
కొన్ని విషయాలలో అయినా సర్దుకు పోక పోతే ప్రపంచంలో ఏ ఒక్కరికీ పెళ్ళి అవదన్న విషయం ఆలస్యంగానైనా తెల్సుకుంది.
తండ్రితో చెప్పింది శిరీష. " డాడీ.. ఇక మీరు తెచ్చిన ఏ సంబంధమైనా నాకు ఓకే...ముందుగా మీరే అన్నీ విచారించి మంచిది, నేను సుఖపడతాను అని మీకనిపిస్తే పెళ్ళిచూపులేమీ వద్దు. సంబంధం ఖాయం చేసెయ్యండి..." అని..
అంతా గమనిస్తూ మౌనంగా వున్నారు రాజశేఖర్ దంపతులు. శిరీష చెప్పిన మాటలతో పన్నీరు కురిసినట్లయింది వాళ్ళ గుండెల్లో.ఆ తర్వాత నెలరోజుల్లో రాజశేఖర్ గారి డిపార్ట్ మెంట్లోనే క్రొత్తగా జాయిన్ అయిన ఇంజనీరు వికాస్ తో పెళ్ళి జరిగిపోయింది శిరీషకి..
******************
ఇంతకీ అసలు జరిగిందేంటంటే...
రాజశేఖర్ గారి ఆఫీసులో క్రొత్తగా జాయిన్ అయిన వికాస్ తక్కువకాలంలోనే ఆయనకు బాగా దగ్గరయ్యాడు. ఆఫీసు విషయాలలో సీనియర్ అయిన రాజశేఖర్ గారి సలహాలు, సూచనలు పాటిస్తూ ఆయనకు బాగా ఆప్తుడయ్యాడు.
కానీ, గత కొన్ని నెలల నుంచీ మౌనంగా విచారంగా వుంటున్న రాజశేఖర్ గారిని కారణమడిగిన వికాస్ తో కూతురు విషయం ప్రస్తావించి బాధపడ్డారు.
సహజంగా తెలివైనవాడు, సమయస్ఫూర్తి కలవాడు అయిన వికాస్. శిరీష ఫోటో చూసి ఆమె అందానికీ, అర్హతలకూ ముగ్దుడయ్యాడు .... " మీకు అభ్యంతరం లేకపోతే, శిరీషకు చిన్న షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చి, నేను పెళ్ళి చేసుకుంటాను...అని అడిగిన మీదట... అందగాడూ.. ప్రభుత్వోద్యోగీ , మంచి మనసున్నవాడూ అల్లుడిగా వస్తే కూతురు దగ్గర్లోనే ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చి, వికాస్ కి గ్రీన్ సిగ్నల్ యిచ్చేశారు, రాజశేఖర్ గారు.
ఆ తరువాత, తన ట్రీట్ మెంట్ లో భాగంగా తన ప్రాణస్నేహితుడూ, కాలేజ్ డేస్ లో డ్రామాలూ-స్కిట్ లూ అంటే ఆసక్తి చూపే వంశీతో 'ఫేక్ పెళ్ళిచూపులు ' ఏర్పాటు చేయించి పెళ్ళికొడుకు పాత్ర ఇచ్చాడు వికాస్.
ఏది ఏమైనా కూతురు మొండి పట్టుదల వదిలి ఒక ఇంటిదవడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు శిరీష తల్లిదండ్రులు. శిరీష కూడా పెళ్ళయ్యాక వికాస్ లాంటి మంచి భర్త దొరికినందుకు పొంగిపోయింది.
" పెళ్ళికి ముందు అబ్బాయైనా..అమ్మాయైనా తమ జీవిత భాగస్వామి ఇలా వుండాలి అన్న అభీష్టాలను, కోర్కెలను ఎంతవరకు సమంజసమో-సాధ్యమో, తాము ఆశించే అర్హతలకు తాము సరిజోడీ అవునో కాదో నిజాయితీగా బేరీజు వేసుకోవాలి. పెళ్ళయిన తర్వాత ఒకరి అభిప్రాయాలను ఒకరు తెల్సుకుని గౌరవించి ఎదుటివారికి నచ్చేలా తమ ప్రవర్తనను సాధ్యమైనంత వరకూ మార్చుకుంటూ జీవనం సాగించడమే ' వివాహ బంధం ' లోని పరమార్థం.