దూరం నుండి చూస్తుంటే అతనో ఎలుగుబంటిలా అనిపిస్తున్నాడు. ఆ చెట్లల్లో అతనో చెట్టులా కనిపిస్తున్నాడు. మురికిబారిన బట్టలతో పెరిగిన జుట్టూ-గడ్డంతో చిన్నప్పుడు విన్న కథల్లో ఒంటికన్ను రాక్షసునిలా అనిపిస్తున్నాడు. ఆ అడవిదారిలో ఏమి తింటున్నాడు? ఎక్కడ పడుకుంటున్నాడు? ఎలా బ్రతుకుతున్నాడు? చలికి వానకు చలించడా? ఆకలి ఉండదా? అతన్ని చూస్తున్న అందరిలో కలిగే ప్రశ్నలివే. గంటలతరబడి అతను బిగుసుకు పోయినట్టు ఆ చెట్లకింద కూర్చుని ఉంటాడు. ఉండుండీ అడవిలోకి మాయమైపోతుంటాడు. మళ్ళీ ఆ చెట్లకింద చేరి అటూఇటూ తిరుగుతూంటాడు. ఒకింత భయం మరొకింత గగుర్పాటు కలుగుతున్నా ప్రతినిత్యం ఆ దారిలో అతనున్నాడో- లేడాని ఓసారి పరికించి చూసి ఉంటే హమ్మయ్య ఉన్నాడు అనుకోవడం, కనపడకపోతే అయ్యోపాపం ఎక్కడికెళ్ళాడో ఏమో..ఏమైనా అయిపోలేదు కదా అని అనుమానపడడం ఆ దారంట వెళ్ళేవాళ్ళకి మామూలైపోయింది.
తన గురించి జనం ఏమనుకుంటున్నారో అతనికి పట్టదు. తన ప్రక్కనుండి ఎవరు వెళ్తున్నారో ఏమంటున్నారో ఎందుకు నవ్వుకుంటున్నారో ఎందుకు జాలి పడుతున్నారో ఎందుకు బాధపడుతున్నారో అతనికి అక్కరలేదు. ఒక్కోసారి సన్నగా ఏదో గొనుక్కుంటుంటాడు..ఒక్కోసారి గుండెలు పగిలేలా రోదిస్తాడు. ఒక్కోసారి గొంతు చించుకుని రంకెలు వేస్తాడు. దూరం నుండి ఎవరన్నా ఓ రొట్టెముక్కో, పండో-ఫలమో విసురుతుంటారు. అతను తింటాడో లేదో కూడా తెలియదు. ఎలా తింటాడు? ఓ పక్కంతా చెంప కాలిపోయి పళ్ళూ - చిగుళ్ళూ భయంకరంగా కనిపిస్తూంటాయి. ఏదైనా తినబోతూంటే ఓ పక్కనుండి జారిపోతుంటుంది. ఏదైనా మాట్లాడబోతే పదాలు తొస్సిపోయినట్టు వింతగా ధ్వనిస్తాయి. అసలు ఆకలి చచ్చిపోయినట్టు.. తిండిమీద ధ్యాసే లేనట్టు ఉంటాడు. ఇక కనుగుడ్డు బయటకు పొడుచుకు వచ్చి మెడంతా వళ్ళంతా కాలిపోయిన మచ్చలతో భీతిగొల్పుతుంటాడు .ఎవరు అతని దగ్గరకు వెళ్ళడానికి సాహసించరు. ఓ మౌనిలా మౌనంగా..ఓ యోగిలా నిర్వేదంగా అలా గంటలకొద్దీ ఏకాంతంగా కూర్చుని ఉంటాడు.
*********** ******************** *******************
" కేస్లా....ఒరే కేస్లా! " ఏదో ఆత్మీయమైన పిలుపు. అతని మౌనాన్ని భగ్నం చేస్తూ ఓ పిలుపు. అతన్ని మనిషిగా గుర్తిస్తూ.. ఓ పలకరింపు. కేస్లాకు దు;ఖం ముంచుకొస్తున్నది. ఎందరెందరో అదే దారినుండి నడిచి వెళ్తూ భయం భయంగా తొలగిపోతూంటారే....! ఎవరు తనను ఇంత ఆర్తిగా పిలుస్తున్నది?
మళ్ళీ అదే పిలుపు..." కేస్లా..ఒరే కేస్లా! ఆగరా..ఆగు..." అది ఓ స్త్రీ స్వరం.. ఎవరో బాగా తెలిసిన వాళ్ళే పిలిచినట్లు... ఎవరో తనని .మ్మంటున్నట్లు అనిపిస్తున్నది. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో.. ఊహూ వద్దు... ఇంకా ఈ మనుష్యులతో బంధాలు వద్దు వద్దు.. ఆ పిలుపు అందనంత దూరం పరుగుపెట్టడం మొదలుపెట్టడం మొదలుపెట్టాడు. పరుగు..పరుగు.... ఆ పిలుపు అతన్ని వెంటాడుతూనే ఉంది." కేస్లా ఆగు అలా ఉరకకు...నా మాట విను.. ఒక్కసారి ఆగు ..." అది పిలుపులా లేదు.. ఏదో పాటలా ఉంది. అవును అది చిన్ననాడు అందరూ ఆమె చుట్టు చేరి అడిగడిగి పాడించుకున్న పాటల స్వరం. తమ కర్తవ్యాలను గుర్తు చేస్తూ మందలించిన భాస్వర స్వరం. తమను అప్రమత్తం చేస్తూ తమ పనులకు సమాయుత్త పరిచిన కంచు స్వరం. తమను కొత్తలోకం చూపుతూ కార్యోన్ముఖులను చేసిన బంగరు స్వరం.
మరపుపొరలు విడిపోతున్నాయి. ఆ పిలుపును తన ఆత్మబంధువు స్వరానికి జత చేస్తున్నాయి. అవును..మాల్యా...అది మాల్యక్క గొంతు. కేస్లా మరింత వేగంగా, ఆమె తనను చేరుకోలేనంత దూరం పరుగెత్తి పరుగెత్తి వగరుస్తూ ఓ దగ్గర మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. "వద్దక్కా...! నువ్వు నా దగ్గరకు రావద్దు. నాకు మళ్ళీ ఈ మనుష్యులతో సంబంధాలు వద్దు. నన్ను చంపేసిన ఆ తండాలు వద్దు. నన్ను బతుకనివ్వని ఈ ఊర్లూ వద్దు. అసలు నాకు బతకాలని లేదు. మళ్ళీ నన్ను పిలవకు. మళ్ళీ నీ దరి చేరనివ్వకు. జీవితమంటే ఆశలు రేపకు..." మోకాళ్ళలో ముఖాన్ని దాచుకుని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు కేస్లా.
ఆ దు;ఖం వరద నీరై పొంగగా పొగిలిపొగిలి ఏడుస్తున్నాడు. ఇన్నాళ్ళు మూగ వేదన కరిగిపోయేలా పసి పిల్లాడిలా స్వేచ్చగా బిగ్గరగా ఏడుస్తున్నాడు. తడబడుతున్న అడుగులతో తూలుతూ పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి ఎప్పటికో తేరుకుని నీటి చెలమను చేరుకున్నాడు. ఎప్పటిలా తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఎప్పటిలా ...ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాడు...ఎప్పటిలా..మరల మరలా కుమిలిపోతూ ముఖం కడుక్కున్నాడు. దోసిళ్ళతో నీరు తాగి..ఓ రాతిమీద కూర్చున్నాడు. నీటిలో అతని ప్రతిబింబం అలలతో బాటుగా భయంకరంగా కదులుతున్నది.
******************
అప్పుడే బస్సు దిగిన కేస్లానాయక్ తన వారిని చేరుకోబోతున్న ఆనందంతో వడివడిగా తండా వైపుకు రాసాగాడు. తండాలోని తన ప్రియమిత్రులతో ఆడే పులిమేకౌ, చెడుగుడులు, కుస్తీలూ..కోలాటాలూ...కోడిపందాలూ, వ్యవసాయ పనుల్లో పాడుకొనే పాటలు, విసురుకునే చలోక్తులూ, వాగుల్లో ఈదుకుంటూ ఒకరిపై ఒకరు నీళ్ళు చిమ్ముకుంటూ ఒకరిని ఒకరు ముంచుకుంటూ ఆడే ఆటలు, వేగంగా నడవడంలో కొండలెక్కడంలో పెట్టుకునే పందాలు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పని ఒక్కరిదైతే వారితో నడకలు, ఉరుకులు పరుగులు అల్లరి కేరింతలు అందరివి. తండాలోని మిత్రబృందమంతా కలిసి తమ కబుర్లతో నడకలతో అడవికి సందడి తెచ్చేవారు. చిరపరిచితమైన ఆ వని పరిసరాలను కన్నుల నింపుకుంటూ ఉల్లాసంగా నడక సాగించాడు.
అల్లంత దూరం నుండే కేస్లా రాకని గమనించిన పరివారమంతా ఎదురొచ్చి ఆప్యాయంగా పలుకరించసాగారు. తండా నుండి ఒకడు ఇంజనీర్ చదువుతున్నాడంటే వాళ్ళకెంత సంబరమో..తండ్రి సూక్యా కొడుకును మురిపెంగా కళ్ళనిండా చూసుకున్నాడు. తల్లి నాజ్కి కొడుకును అల్లుకుపోయి వళ్ళంతా తడుముతూ పెద్దగా రోదించింది. బంధువులంతా గొంతు కలిపారు. చాన్నాళ్ళకు తమ వారిని కలుసుకోగానే రోదనతో ఆనందం వ్యక్తం చేయడం అక్కడ సాధారణమే. కానీ తన బంధువుల రోదనలో ఏదో తేడా తెలుస్తున్నది. ఆ రోదనలో తీవ్ర వేదన కనబడుతున్నది. తనను అల్లంత దూరాన చూడగానే పరుగులు పెట్టుకొచ్చే మిత్ర బృందం చాలామంది కనబడనేలేదు. అతని అనుమానం నిజం చేస్తూ...
" నీ దోస్తులను ఠాణాలబెట్టిన్రు కొడుకో..ఆళ్ళు ఏమి జెయ్యకుండనే తీస్కపోయిండ్రు కొడుకో..! ఆడ నా కొడుకును మస్తు కొడుతాండ్రంట కొడుకో..." అంటూ పార్వతి..లచ్చిమి ఏడవసాగారు. కేస్లా కుంగిపోయాడు.
" ఏమిటిది? ,అళ్ళీ తీసుకెళ్ళారా? ఇట్లా ఎప్పుడుపడితే అపుడు తమవాళ్ళను తీసుకెళ్ళడం, ' వాళ్ళ ' ఆచూకీ చెప్పమని తన్నడం ఇలా ఎన్నిసార్లో...! తన మిత్రులను ఎంత దారుణంగా కొడుతున్నారో అని తలచుకోగానే పట్టరాని దు;ఖం కలిగింది వాళ్ళను ఎలా ఓదార్చాలో తెలియక సతమతమయ్యాడు. పరుగున తాత వాలి దగ్గరకు వెళ్ళి వాలాడు. " ఇప్పుడెట్లా తాతా...? కలవరంగా అన్నాడు." ఎట్ల ఏమున్నదిరా ఎవ్వళ్ళనో ఒకళ్ళను పట్టుకోవాలెగదా మరి. కడుపు తిప్పలుకు జవాన్లు వాళ్ళ బాధలు వాళ్ళు బడుతున్నరు. అయిన గాని అసల్కి మనోళ్ళకు మాత్రం ఏందెలుసని చెప్తరు బిడ్డా! తూరుపుదిక్కున సుక్క భడుస్తదని తెలుసుగానీ ఎవ్వళ్ళకన్న దానిపట్ట వశమా..! మెరుపుతీరు అస్తరు.. వెలుగుతీరు సాయంజేస్తరు. నీడతీరు దొర్కకుంటబోతరు. ఏడుంటరంటే ఏం జెప్పేము? ఆళ్ళనుబట్టుకోను ఎవ్వళ్ళతోని గాదని వీళ్ళకు గూడా ఏర్పాటే. పట్టుకునంట్టుట్టు శకలు జెయ్యాలేగదా," నవ్వాడు వాలి. విస్మయంగా చూసాడు వాళ్ళంటే ఎంత ప్రేమ, నమ్మకం...
" అదంతేమో గానీ తాతా...! నడుమ మనోళ్ళు బలైపోతున్నరు. ఫారెస్టోల్లకు, పోలీసోల్లకు, మనం ఇట్లా వుపయోగపడుతున్నం కదా!" అనుకుంటూ తూరుపు కొండలవైపు అడుగులు వేయసాగాడు. ఆ తూరుపు కొండలను చూస్తుంటే చాలు కేస్లాలో ఏదో ఉత్తేజం కలుగుతుంది. ఎవరో అక్కడ సంచరిస్తున్నట్టుంటుంది. కానీ ఎప్పుడూ ఎవరూ కంటపడరు. ఏదో అలికిడి తెలుస్తుంటుంది . కానీ స్పష్టమవ్వదు. ఆ ఉనికికే ఏదో ప్రేరణ కలుగుతుంటుంది. అపుడపుడు అకస్మాత్తుగా తమవారు వండిపెట్టే అన్నం, కూరలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఒక్కోసారి అర్ధరాత్రులు తమ గుడిసెలో తమ పక్కనే పడుకున్నట్లనిపించే. ఆ మామా, అత్తా, కాకా, చిన్ని..ఎవరన్నది తనకు చిన్ననాటినుండీ తెలియదు. మర్నాడు ఎవరిని ఎంత తరచి అడిగినా గంభీర మౌనమే తప్ప జవాబు దొరికేది కాదు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ పంచాయితీ పెట్టి తీర్పు చెప్తారో గాని, ఆ తీర్పు వాళ్ళందరికీ శిరోధార్యం. ఎవరైనా ఏదైనా కానిపని చేయబోయారో, తమనెవరో కనిపెడుతున్నట్టు టక్కున ఆపేస్తారు. మామూలప్పుడు చలోక్తులతో, పాటలతో చెలరేగిపోయే వాళ్ళంతా వాళ్ళ ప్రస్తావన వచ్చేసరికి మౌనంగా..గంభీరంగా మారిపోతుంటారు. ఆ మౌనంలో ఓ భక్తి, ఓ భయం నియమం ఉంటాయి.అపుడపుడు కొన్నాళ్ళు తమతో ఉనంట్టే ఉండి కొన్నాళ్ళకు కనిపించకుండా పోయే వాళ్ళ మాటలు వాళ్ళు పాడే పాటలు ఎంత ఉత్తేజకరంగా ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయినా కేస్లాకు ఇతర పిల్లలకు దస్రూ కాక బిడ్డ మాల్యక్క ఆ పాటలన్నీ పట్టేసి పాడి వినిపించేది. రమేశ్, లాలూ, వాళ్ళు చెప్పే మాటలన్నీ మంత్రాల్లా వప్పజెప్పేవారు. కొన్నేళ్ళకు మాల్యక్క కనబడకుండా పోయినప్పుడు, తల్లడిల్లిపోయి కేస్లా చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. కాని మాల్యక్కా వాళ్ళ అమ్మానన్న మాత్రం ఓ నిట్టుర్పు విడిచి ఊరుకున్నారెందుకో అర్థమయ్యేది కాదు. ఇపుడెందుకో ఆ తూరుపు కొండలు చూస్తుంటే దు;ఖం కలుగుతున్నది. పోలీసులు అరెస్టు చేసిన తనవాళ్ళు ఎలా వస్తారో అర్థం కావడం లేదు. దు;ఖసాగరంలో మునిగిన తనవాళ్ళను ఏ రకంగానూ ఓదార్చలేక బాధపడ్డాడు కేస్లా.
రెండురోజులు గడిచాయి. మిత్రుడు తిరిగి రాలేదు. కేస్లా మనసేదో కీడు శంకిస్తున్నది. ఇంకా ఠాణా నుండి తన నేస్తాలు తిరిగి రాలేదు. ఇపుడేకాదు. అలా పోలీసులు తమవాళ్ళను తీసుకువెళ్ళిన ప్రతిసారీ ఏనాడూ వాళ్ళు క్షేమంగా తిరిగి రాలేదు. వళ్ళంతా గాయాలతో జీవచ్చవాల్లా వచ్చేవారు. వాళ్ళు కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. మమ్ముల్నెందుకు తీసుకెళ్తున్నారు? అని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. కేస్లా అనుమానం నిజం చేస్తూ అర్ధరాత్రి ట్రాక్టర్ వచ్చింది. అందులో వళ్ళంతా గాయాలతో కిషన్ లాల్. బిక్కూనాయకే మాత్రమే వచ్చారు. కేస్లాను వాటేసుకుని గాయపడ్డ ప్రాణమిత్రులు దీరులాల్..రాం నాయక్ దీనంగా రోదించారు. హర్యా ఎందుకు రాలేదు? అని అడగగానే ఏమో..రేపెల్లుండి ఇడిసి పెడతమన్నరు....అన్నారు. అందరూ గాయపడి మూలుగుతున్న కిషన్ లాల్ ను బిక్కూనాయక్ ను చూస్తూ ఏడుస్తున్నారు. హర్యాని మరి ప్రాణాలతో చూస్తామాని కేస్లా..హర్యాలాల్ తల్లిదండ్రుల గుండెలు తల్లడిల్లిపోతున్నయి. మూడురోజులు గడిచాకా పిడుగులాంటి వార్త తండాను చేరింది. లాకప్ లో ఉన్న హర్యా ఆత్మహత్య చేసుకున్నాడని. కోక్యా తండా శోక సముద్రంలో మునిగిపోయింది. కేస్లా తీవ్రంగా చలించిపోయాడు. హర్యా ఆత్మహత్య చేసుకోలేదని, చంపబడ్డాడని చాలా మందికి తెలిసీ ఏమీ చేయలేని నిస్సహాయత... హర్యాను తలుచుకుని నిస్సహాయంగా ఏడ్సుకున్నారు.
*****************
హర్యా మరణం కొందరు నాయకులకు శవ రాజకీయాలు నడపడానికి బాగా పనికి వచ్చింది. ఇరవై నాలుగ్గంటల చానెళ్ళకు ముఖ్య వార్త అయి రోజును నింపింది. విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీలు తీసి రెండు బస్సులు తగలబెట్టడానికి పది షాపులు ధ్వంసం చేయడానికి కారణం అయ్యింది. వార్త పత్రికలకు మర్నాటికి పతాక శీర్షికలు, కాసిన్ని వార్తలు దొరికాయి. హర్యా తల్లిదండ్రుకు మాత్రం పుత్రశోకం తండాకు పుట్టెడు శోకం మిగిలింది. పదిహేను రోజుల తర్వాత ధన్ బాద్ చేరుకున్న కేస్లా హాస్టల్ లో ఉన్న స్నేహితులతో తన బాధను పంచుకున్నాడు. యునాని మెడిసన్ చదువుతున్న మిత్రులు రాఘవా ఈశ్వర్ లతోబాటు సామాజిక శాస్త్రంలో రీసెర్చ్ చేస్తున్న వినయ్ నరేంద్ర అప్పటికే రెండు మూడుసార్లు కేస్లాతో..కోక్యా తండాకు వచ్చారు.వారు మరింత ఆసక్తిగా వింటున్నారు.
కాలం ఎంతటి గాయాన్నైనా మాంపుతుందంటారు. మా తండా వారి ఆకలిని శ్రమను, బాధలను మరిపించే ఆయుధాలు వారి చెంతే ఉన్నాయి. కూడుంటే కూరుండదు..కూరుంటే కూడుండదుగానీ, చేల దారుల్లో అప్పుడే తీసిన తాటికల్లు ప్రత్యేకంగా తయారుచేసే ఇప్పకల్లు..బంగు...సాయంత్రమయ్యేసరికి పాకెట్లలో దొరికే నాటుసారా..వాళ్ళ కడుపులు నింపుతున్నాయి. కొంపలను కూలుస్తున్నాయి. వైద్యం దొరకక చేసుకునే నాటు వైద్యం వికటించి ప్రాణాలమీదకు తెచ్చుకున్న సందర్భాలెన్నో. ఈ విషయాలన్నీ కేస్లా వివరించి చెబుతుంటే మిత్రులంతా ఆశ్చర్యపోయారు. కేస్లా అలా గంటలకొద్దీ తమతండా గురించి చెబుతుండడం చెవులు రిక్కించి వాళ్ళు ఆసక్తిగా వినడం మామూలే. అందులో తీజ్ పండుగ ముచ్చట్లు కూడా ఉన్నాయి.
తీజ్ పండుగ నాడు మా ఆడపడుచుల సందడి చూడడానికి రెండుకళ్ళు చాలవు. గౌరీ పూజ చేసి వేసిన గోధుమ నారు బుట్టలను పెట్టుకుని సాయంత్రం వేళల పాటలు పాడుతూ బతుకమ్మలాడుతారు. చివరి రోజున గణ్ గౌరీ ప్రతిమలు చేసి నైవేద్యం పెట్టిన పరవాణ్ణం కుండలు దాచి అమ్మాయిలను ఏడిపిస్తూంటాం. ఆరోజు మా కుర్రకారంతా ఓ చోట చేరి సందడే సందడి. అమ్మాయిలు ఇవ్వమంటూ గారాలు పోతూ అడుగుతారు.ఆరోజు నేనూ అలాగే సువాలిని ఏడిపించాను. తనకు దొరకకుండా పరుగులు పెట్టించాను. సువాలి నన్ను అందుకోవడానికని నావెనక గంతులేస్తూ వచ్చింది.
" ఇస్తే ఏమి ఇస్తావు..? అని అడిగాను. " ఏమి కావాలి...? అని అడిగింది. " నన్ను పెళ్ళాడతావా?" అని అడిగాను నేను."ఇంత చదువు చదివిన నువ్వు నన్ను ఎక్కడ పెళ్ళాడనంటావోనని భయపడ్డాను. నువ్వే నన్ను చేసుకుంటానంటే వద్దంటానా" అంటూ సంబరపడిపోయింది. ఆ ఆటలు, ఆ సంబరాలు అలా జరుగుతూనె ఉన్నాయి...ఆ రాత్రే ..నా ప్రాణమిత్రులలో ఇద్దరు తుపాకీలకు బలైపోయారు. కనురెప్పే కాటేస్తుందా...! నిజంగానే నా మిత్రులు ఇంఫార్ మర్లా...! కేవలం అనుమానమేనా? అసలు ఎవరిని నమ్మాలి..? ఏం చెయ్యాలి..? నాతో కలిసి నడకలు నడిచి ఉరుకులు పరుగులు పెట్టి, నాతోపాటు ఆడి పాడిన మిత్రులు నిర్జీవంగా పడి ఉన్నారు. మా తండా జనం భయం గుప్పిట్లో నలిగిపోతున్నారు. వీళ్ళకే కాదు, ఇటు పోలీసులకు భయపడాలి, అటు ఫారెస్ట్ వారికి భయపడాలి. రాజకీయనాయకులకు భయపడాలి. చెప్పలేని దు;ఖంతో కుంగిపోయాను.."
" నన్ను మరింత కదిలించే మరో సమస్య చేసిన కష్టం మరచిపోవడానికో, అసలు కష్టాలే మరచిపోవడానికో సాయంత్రం అయ్యేసరికి మా తండా వాసులంతా కష్టానికి సుఖానికి అలసటకు తాటికల్లునో ఇప్పసారానో ఆశ్రయించడం. ఈతిబాధలతో వాళ్ళల్లో వాళ్ళే కలహించుకోవడం. " ఒక నిముషం ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు.
" నా తండాలో జీవితమంటే నాకే విరక్తి కలుగుతున్న సమయంలో మీరు వస్తామంటున్నారు. సంతోషం..కానీ ముందే చెబుతున్నా... మా వాళ్ళు కొత్తవారిని ఎవరినీ త్వరగా నమ్మరు. గతంలో మీరు వచ్చారంటే ఏదో నాలుగు రోజులు ఉండి వెళ్ళే అతిథులుగా ఆదరించారు. ఇపుడు మీరు ఔషధ మొక్కలపై పరిశోధనలు చేస్తున్న విషయం వాళ్ళకు చెప్పినా అర్థం కాదు. వాళ్ళను తాగుడు మానిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు బెడిసికొడితే బాధపడకండి..." తన తండాకి మిత్రులంతా బయలుదేరేముందే చెప్పాడు కేస్లా. అన్నిటికీ సిద్ధమై వారు అక్కడే నెలవు ఏర్పాటు చేసుకుని ఉండి వారి కార్యకలాపాలు మొదలెట్టారు.
అనుకున్నట్టుగానే కొద్దిరోజుల్లోనే తండావారిలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వాళ్ళను పంపెయ్యమంటూ. కేస్లాకు అన్నివైపులనుండీ వత్తిళ్ళు వచ్చాయి. కేస్లా మిత్రబృందం వినిపించుకోలేదు. తాగుడు మానిపించేందుకు కౌన్సిలింగ్ లు నిర్వహిస్తూ..మందులు ఇవ్వసాగారు. దాంతో తండాలో సారా వ్యాపారం చేసే లింగానాయక్.. రాజు నాయక్ లకు వీళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాయాలు పన్నారు.
ఆ రోజు లింగానాయక్ కు పూనకం వచ్చింది. తండాను నాశనం చేయడానికి ఎక్కడెక్కడివాళ్ళనో కేస్లా చేరదీస్తున్నాడని వాళ్ళంతా మంత్రాలు నేర్చుకుని చేతబళ్ళు చేస్తున్నారని..కేస్లాను అతని మిత్రులను ఊరినుండి తరిమి కొట్టాలని అమ్మతల్లి చెప్పింది. తండావారంతా అమ్మతల్లికి కల్లుతాపి శాంతింపజేసారు. కేస్లా తీవ్రంగా ఎదురుతిరిగాడు. తన మిత్రులకు ఏ మంత్రాలు రావని, ఇపుడిపుడే దారిన పడుతున్న మనవారిని బాగుపడనిద్దామని నచ్చజెప్పాడు. ఊరువారు మెత్తబడ్డారు. అంతే... ఆకస్మాత్తుగా పచ్చని చెట్టు ఎండిపోయింది. రాత్రికి రాత్రే కొన్ని పశువులు చనిపోయాయి. కొందరికి పూనకాలొచ్చాయి. ఊరంతా ఏకమై అమ్మతల్లికి మళ్ళీ కోపం వచ్చిందని. కేస్లా అతని మిత్రులు ఊరొదిలి పోవాలని మరోమారు తీర్మానించారు. మిత్రులంతా తీవ్రమైన వేదనతో వెనుదిరిగారు.
కానీ, నా ప్రాణం పోయినా తండా వదలి పోనన్నాడు కేస్లా. దీరు అతనికి అండగా నిలిచాడు.ఆ సాయంత్రం మరికొన్ని పశువులు అకస్మాత్తుగా చచ్చిపోయాయి. కొందరు వాంతులు చేసుకున్నారు. లింగాకు అతని అనుచరుడు భీముకు మళ్ళీ పూనకం వచ్చింది. .." కేస్లాను పంపెయ్యండి.. లేకపోతే తండాలో ఒక్కరూ మిగలరు.." అమ్మతల్లి అరిచింది. అందరూ చేరి కేస్లాను, దీరును తండా వదిలి వెళ్ళిపొమ్మన్నారు. మిత్రులిద్దరూ తండాను వదిలిపోయేదే లేదన్నారు. లింగా ఏమి చెప్పాడో జనం ఎందుకంత రెచ్చిపోయారో కేస్లాను పంపడానికి కాదు, ఏకంగా చంపెయ్యడానికే జనం సిద్ధమైపోయారు. ఆ అర్ధరాత్రి తండా జనం తరిమితరిమి కొడుతూ కేస్లాపై, పెట్రోల్ చల్లారు.. అడ్డు వచ్చిన దీరూనూ వదలలేదు." చంపండ్రా ఇద్దర్నీ చంపండి..." జనం వారి వెంట పరుగులు తీస్తూ అరుస్తున్నారు. కేస్లా దీరూ..|
వద్దూ..మమ్మల్ని చంపకండి..." దీనంగా అరుస్తూ ..చావుకేకలు పెడుతున్నారు..కాసేపటికి దీరూ కేకలు ఆగిపోయాయి.
**********
కేస్లా ఇప్పుడు మాల్యా ఇంట్లో..ఆమె వడిలో తలపెట్టి పొగిలిపొగిలి ఏడుస్తున్నాడు. ఏదుస్తున్నాడు."దీరులాల్ బతికి ఉంటే ఎంత బాగుండేదక్కా...కాల్చేసారు... మనవాళ్ళను మారచాలనుకున్నామేగానీ మంత్రాలు నేర్చి రాలేదు. అసలక్కడె పుట్టి పెరిగామే... అంత నిర్దాక్షిణ్యంగా ఎలా ప్రవర్తించగలుగుతారక్కా? " దీనంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డా వినకుండా వెంటపడి మరీ పెట్రోల్ చల్లి మా ఇద్దర్నీ తగులబెట్టారు. నా కళ్ళముందే వాడు చావుకేకలు పెడుతూ కాలిపోయాడు. వాడిమీద పడ్డంత పెట్రోల్ నామీద పడలేదేమో. కాలుతున్న బట్టలతో..గాయాలతో నేను అడవిలోకి పరుగులు పెట్టి పారిపోయాను. ఆ పొగలో నేను పారిపోయిన సంగతి కూడా గమనించలేదు వాళ్ళు. లేకుంటే మళ్ళీ వచ్చి పూర్తిగా తగులబెట్టేవారేమో. ఎవరో రక్షించి లారీలో చాలాదూరం తీసుకెళ్ళి దవాఖానాలో చేర్పించారు. రెండు నెలలున్నానక్కడ. చచ్చిపోయినా బాగుండేదక్కా....నరకం చూసాను...
ఆ గాయాల బాధ ఓర్వలేక ఎంత ఏడ్చేవాడినో....! ఎవరికోసం బతకాలి? నన్ను చంపెయ్యండంటూ వెర్రిగా ఏడ్చాను..." వింటున్న కేస్లా స్నేహితులు కదలిపోయారు. మాల్యా చెంపలపై నీరు జారింది." త్వరలో నన్ను పంపేస్తున్నామని దవాఖానాలో చెప్పారు. త్వరగా వెళ్ళి అమ్మను నాన్నను చూడాలని కోరిక. సువాలిని చూడాలన్న ఆత్రం. రెండు నెలల తర్వాత దవాఖానా నుండి బయటకు వచ్చిన నన్ను చూసి అందరూ దడుచుకుని తొలగిపోతున్నారు. జనమెందుకలా పారిపోతున్నారో తెలియలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎటు వెళ్ళాలో దారి తెలియదు. భాష తెలియని మనుష్యుల మధ్య ఇబ్బంది పడడం కాదు. మాట్లాడటానికి అసలు నా మాటే అర్థం కాని గందరగోళం. ఒక ప్రక్క కాలిపోయిన చెంపతో నీరు త్రాగడానికి తిండి తినడానికి విపరీతంగా అవస్థపడేవాడిని. తినడానికి తిండిలేక, ఆకలి తీరక వెర్రికేకలు వేసేవాఆదీణీ... అన్నం పెట్టి ఆదరించడానికి ఎవరున్నారు నాకిక? కొన్నాళ్ళకు ఈ పస్తులు అలవాటైనాయిగాని కానీ, ఎక్కడ, ఎలా ఉండడం? తిరిగి తిరిగి ఊరి చివరకు చేరాను. అడివిని ఆశ్రయించాను. ఎండా వాన ఏమున్నా అదే నా నివాసం. "
ఓ రోజు వాగులో ముఖం కడుక్కుంటున్న నాకు నీళ్ళల్లో ఓ వికృత రూపం కనిపించింది. అది నేనే అని అర్థమయ్యాకా ..ఎందుకు జనం నన్ను చూసి దడుచుకుంటున్నారో అర్థమయ్యింది. గుండె వాగయ్యింది.ఇందుకు కారణమైన నా సొంత జనాన్ని నిలదీయాలని వెర్రి ఆవేశంతో మా తండాకి ప్రయాణమయ్యాను. ముఖానికి గుడ్డ కప్పుకుని బస్సెక్కాను. దారిలోనే తెలిసింది. మా అమ్మా నాయనలు ఊరు వదిలి పారిపోయారని. ఎక్కడకు వెళ్ళారో ఎవరికీ తెలియదని. ఇక నన్ను పెళ్ళాడకుంటే చచ్చిపోతానని తీజ్ పండుగ రోజు నన్ను అల్లుకుని ఏడ్చిన సువాలి. మగనితో ఇంకో బస్సులో కనపడ్డది. నేను ముఖం గప్పుకున్నాను. ఇగ జన్మలో ఎన్నడు ఆమె నన్ను చూడకూడదనుకుని కోరుకున్నాను. పని ఇస్తానికి కూడా నన్ను చూసి భయపడే మనుష్యుల మధ్య ఉండలేక ఏకాకిగా బతుకలేక నిశ్శబ్ధంగా మారిపోయాను. తిండి దొరకదు. ఎండొచ్చినా వానొచ్చినా నీడ దొరకదు. రోగమొచ్చినా దు;ఖమొచ్చినా తోడు దొరకదు. విరక్తి....విరక్తి..... అడవికి..జనానికి మధ్య బ్రతుకుతూ మరణానికీ మధ్య మౌనానికీ రోదనకీ మధ్య నేను..స్నానం..పానం మరిచి మురికిగా..మాటా మంతి మరిచి నిస్సహాయంగా ..ఆకలి దప్పులు మరిచి రాయిలాగా..గడ్డం జుట్టూ పెరిగి పిచ్చివానిలాగా ..
ఇలా మారిపోయాను....
" మాల్యాతో అతిప్రయాసతో జరిగింది చెపుతున్నాడు. కదిలిపోయిన అతని మిత్ర బృందం " ఒరే కేస్లా..." అంటూ వాటేసుకుని ఏడ్చారు...వారిని చూసి..వద్దు వద్దు... నావంక చూడకండి మీరు భరించలేరు నన్ను అసహ్యించుకుంటారు నన్ను. మీరు అసహ్యించుకుంటే నేను భరించలేను. ముఖంపై గుడ్డ కప్పుకుని రోదించసాగాడు. కేస్లా...ఓరే కేస్లా..మేము నీ ప్రాణ స్నేహితులమురా..నిన్ను సజీవదహనం చేసారనుకుని కుంగిపోయాం. ఇన్నాళ్ళకు నీవు బతికే ఉన్నావన్న వార్త అందించి మాల్యక్కనూ మమ్మల్నీ రప్పించింది ఎవరో తెలుసా..నీ ప్రాణం .నీ మరదలు సువాలినేరా..." చివ్వున తలెత్తి చూసిన కేస్లాకు లోపలి గుమ్మం దగ్గర కన్నీళ్ళతో నిలిచి ఉన్న సువాలి కనిపించింది." ముందు కేస్లా..సరిగ్గా తినగలిగి స్పష్టంగా మాట్లాడగలగడానికి అవసరమైన ప్లాస్టిక్ సర్జరీ అత్యవసరం. ఆ తరవాత ఆగిపోయిన చదువును కొనసాగించేలా చెయ్యాలి. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది ఆలోచించాలి. మిత్ర బృందమంతా తమలో తాము చర్చించుకుంటున్నారు. చక్కగా క్షౌరం చేయించి, తనను ముట్టుకుని స్నానం చేయించి, అన్నం పెడుతున్న మాల్యను చూసి...
" అక్కా..! నన్ను చూస్తే అసహ్యంగా లేదా..?" అడిగాడు కేస్లా.
" లేదు కేస్లా..అసహ్యించుకోవాల్సింది నిన్ను కాదు. నీ పరిస్థితికి కారణం అయిన మనుస్యులను. వికృతంగా మారిపోయిన మనుష్యతత్వాన్ని...."
************
మిత్రులంతా కలిసి కేస్లాకు ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. మూడునెలలు డాక్టర్లు కృషితో కేస్లా కొత్తరూపుతో ఆసుపత్రి నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడతనికి మూడు దార్లు కనబడుతున్నాయి.
ఆగిపోయిన చదువు కొనసాగించడానికి మిత్రులతో ధన్ బాద్ కి....
పోరాటాలు చేస్తానికి తుపాకి పట్టుకుని మాల్యాతో...తనవారిని వెదుక్కుంటూ ..తన తండా వారి కోసం బతకడానికి కోక్యా తండాకి.
****
ఎందుకో అతని అడుగులు తండా వైపే పడుతున్నాయి.