ఎవరు? - - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

who?

రిటైర్డ్ రఘునాధం గారు హత్య చేయబడ్డారు.

సంచలనం సృష్టించిన ఆ హత్య ఎవరు చేశారో? ఎందుకు చేశారో? విచారణ చేస్తున్న ఇన్ స్పెక్టర్ కి అంతు చిక్కడం లేదు. కేసు ఛేదించడం లో ఆలస్యం అవుతున్నందుకు పైనుంచి ఒత్తిడెక్కువవుతోంది. అందుకే ఆ కేసుని డిటెక్టివ్ వేణుకి అప్పగించబడింది.డిటెక్టివ్ వేణు. మనిషి స్పుర దౄపి. అతను టేకప్ చేసిన ఏ కేసూ ఇంతవరకూ పరిష్కరించకుండా పెండింగ్ లో లేదు. అతనంటే పోలీస్ డిపార్ట్ మెంట్ కి గొప్ప నమ్మకం.

రఘునాధం గారింట్లో ఆయన భార్య.. ఇద్దరు కొడుకులు. .ఐదేళ్ళ క్రితం పనికని వచ్చి వాళ్ళింట్లోనే వుండిపోయిన శ్రీరామ్ వున్నారు. అందరూ కలిసే వుంటారు. ఇద్దరు కొడుకులకి పెళ్ళిల్లయిపోయాయి. పెద్దవాడు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండోవాడి ఉద్యోగం పోయి ఆర్నెళ్ళుగా ఉద్యోగ వేటలో వున్నాడు. ఇద్దరు కొడుకులూ..శ్రీరామ్ అనుమానితులుగా ఏం అనిపించడం లేదు. కోడళ్ళు కూడా మంచి వాళ్ళే! రఘునాధం గారు నిద్రలో వుండగా ముఖం మీద దిండుతో నొక్కి హత్య చేశారు. అది బయట వాళ్ళ పని కాదు. ఎందుకంటే వేసిన తలుపులు వేసినట్టేవున్నాయి. అలా అని ఇంట్లోవాళ్ళూ అలా చేశారనిపించడం లేదు. పోనీ బయట వాళ్ళెవరికన్న చంపడానికి సహాయంచేసి మళ్ళీ తలుపులు గడియ పెట్టేశారా? అదీ తెలియడం లేదు. మరెవరు?

వేణుని కూడా తికమక పెట్టిందీ కేసు. అతని అనుమానం ఆ ఇంటితో రక్త సంబంధం లేని శ్రీరామ్ మీదకి మళ్ళింది. అప్పటికే పోలీసులు అతడిని ఇంటరాగేట్ చేసి అతడికీ ఆ హత్యకి సంబంధం లేదని రిపోర్ట్ తయారు చేశారు. కానీ సాధారణంగా ఇలాంటి కేసుల్లో గనక ప్రొఫెషనలిజం వుండి, తొణకని బెణకని మనస్థత్వం వున్న అపరాధులుంటే పరిష్కరించడం కాస్త జటిలంగానే వుంటుంది. అందుకే ముందుగా వేణు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాడు. అతని తల్లి గుంటూరులోని ఒక ఆశ్రమంలో వుండేదని.. శ్రీరామ్ కూడా ఆ ఇంటికి వచ్చేముందు అక్కడే వుండేవాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు.

************************************************************

కళా కాంతి లేని ఆ ఆశ్రమంలోకి అడుగుపెడుతూ సేవా ధృక్పథంతో ప్రారంభించబడిన ఆ ఆశ్రమం డొనేషన్లు లేక పతనావస్థకి చేరుకుంటోందని అర్ధం చేసుకున్నాడు.

లోపలికెళ్ళి అక్కడ కూర్చుని వున్న సుమారు ముప్పయ్యేళ్ళుండే వ్యక్తికి ముందుగా తనని తను పరిచయం చేసుకుని శ్రీరామ్ తల్లికి సంబంధించిన వివరాలడిగాడు.

"సార్, అప్పటి సంగతులంటే మా నాన్నగారే చెప్పాలి. మీకేం అభ్యంతరం లేక పోతే కాస్త లోపలికొస్తే ఆయన్ని చూపిస్తాను. మంచం మీద నుండి లేవలేని పరిస్థితి ఆయనది."అన్నాడు.

వేణు అతడితో లోపలికెళ్ళాడు. అదో రకమైన కమురువాసన వస్తోంది అక్కడి పరిసరాలనుండి. కుక్కి మంచం మీద పడుకుని వున్నాడాయన.

కొద్దిదూరంలో వున్న చెక్క స్టూల్ ని మంచం దగ్గరగా లాగి వేణూని కూర్చోమని..తండ్రిని లేపి పరిచయం చేసి అతడు వెళ్ళిపోయాడు."బాబూ! శారద ప్రేమలో మోసపోయిన పిల్ల. కడుపుతో వుండగా ఈ ఆశ్రమపు తలుపు తట్టింది. తనని నా కన్న కూతురిలా చూసుకున్నాను. శ్రీరామ్ పుట్టాడు. శ్రీరామ్ కూడా తల్లిలాగానే మృదు స్వభావి. అతడు పెద్దవాడయ్యాక పట్నంలో ఏదన్నా ఉద్యోగం చూసుకోమని శారద పంపించింది. పోయిన సంవత్సరం అనారోగ్యంతో పిచ్చిది కన్నుమూసింది. తనవాళ్ళెవరో..ఎక్కడుంటారో ఎప్పుడూ చెప్పలేదు. అదిగో అది ఆమె పెట్టె" అని దూరంగా అల్మార మీద వున్న పెట్టె ని చూపించాడు.

వేణు వెళ్ళి దాన్ని తెరచి పరిశీలించాడు. లోపల రెండు చీరలు జాకెట్లు.. విబూది పొట్లాం.. శ్రీరామ్ ప్యాంటు షర్టు తప్ప ఏమీ లేవు. నిరాశగా పెట్టె మూత వేసేయబోతున్నంతలో పెట్టె అడుగున వేసిన పేపరు కనిపించింది. దాన్ని తీశాడు ఆ పేపరు మడతలోంచి బయట పడిన ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. అందులో శారదా రఘునాధం వున్నారు. వేణుకి కేసు సాల్వ్ అయిపోయినంత ఆనందం కలిగింది.

ఆ ముసలాయనకి కృతజ్ఞతలు చెప్పి బయల్దేరాడు.

‘తనకి ముందు ఎవరన్నా వచ్చి పెట్టె చూశారా?’ అని అడిగుంటే మరో విషయం తెలిసుండేది వేణూకి. ఎంతటి ప్రొఫేషనల్స్ అయినా చిన్న చిన్న పొరబాట్లు చేస్తుంటారు.

************************************************************

‘శారద రఘునాధాన్ని ప్రేమించి మోసపోయింది కాబట్టి. కొడుకుని ఆయన మీద కోపంతో విషనాగులా పెంచి..వాళ్ళింట్లో తిష్ట వేయించింది. అవకాశం రాగానే కస్సున కాటేశాడు.’ ఆ ఆలోచనతో కేసుకి పట్టిన మబ్బులు విడిపోతున్నట్టుగా అనిపించింది.

సిటీకి రాగానే పోలీస్ ఇన్స్పెక్టర్ తో చెప్పి శ్రీరామ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించాడు.

ఎన్ని రకాలుగా ప్రశ్నించినా శ్రీరామ్ నుండీ తనకు అనుకూలమైన సమాధానాలు రాబట్టలేకపోయాడు, చివరికి తన జేబులోంచి ఫోటో తీసి చూపించాడు. శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. అదెలా వేణు చేతికొచ్చిందని కాదు. ఫోటోలో తన తల్లిని రఘునాధం గారి పక్కన చూసి.

"ఇప్పుడు నిజం చెప్పు..మీ అమ్మని రఘునాధం గారు మోసం చేశారని. . తండ్రిగా ఆయన నీకేం చేయలేదని ఆయన్ని కసితో నువ్వు హత్య చేశావు కదూ" అన్నాడు.

కళ్ళ నీళ్ళతో దిగ్గున తలెత్తాడు." ఆయన దేవుడు. నిజంగా మీరు ఈ ఫోటో చూపించే వరకూ వాళ్ళిద్దరికీ సంబంధం వుందన్న విషయం నాకు తెలియదు. నన్ను మాత్రం రఘునాధం గారి అడ్రసు ఇచ్చి ‘ఆయన చాలా మంచివారు ఎలాగైనా వాళ్ళింట్లో పనికి చేరమని’ చెప్పి పంపింది మా అమ్మ. నేను వచ్చి ఆయన్ని పని అడగంగానే వెంటనే ఒప్పుకుని నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. పెట్టిన చేతినే కాటేసే కసాయిని కాదు. అయినా హత్యలు చేసే రక్తం నాలో లేదు" అని కుమిలి కుమిలి ఏడ్చాడు. ఎన్ని విధాలుగా అడిగినా అదే సమాధానం. శ్రీరామ్ మాటల్లో నిజాయితీ ధ్వనిస్తోంది.

కేసు మళ్ళీ మొదటికొచ్చింది.

‘ఆయన కొడుకుల్లో రెండోవాడు అనిరుధ్ అగ్రెసివ్. దొరికిన ప్రతి ఉద్యోగాన్నీ నోటి దురుసుతోనో.. ఎదుటివాళ్ళ మీద చెయ్యెత్తడంతోనో పోగొట్టుకున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య ఏవన్నా గొడవలున్నాయేమో? అవే ఆయన హత్యకి దారి తీశాయేమో.. కానీ తండ్రిని చంపుతాడా? ఏమో?’ వేణు ఆలోచనలు పరి పరి విధాల సాగుతున్నాయి.అనిరుధ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించుకున్నాడు.

అనిరుధ్ ప్రవర్తనని అతనికే ఒకసారి విశదీకరించి.."చెప్పు..మీ నాన్నని హత్య చేయడానికి కారణమేమిటో?" అన్నాడు. మిన్నాగు కాటెసినట్టుగా విలవిలలాడిపోయాడు. "సార్..ఎంత మాటన్నారు?..మా నాన్నంటే పంచ ప్రాణాలు. ఆయన్ని చంపడం కాదు కదా కనీసం ఒక్క సారైనా ఆయనకి ఎదురుచెప్పలేదు. ఎవరన్నా తప్పు చేస్తే సహించను..అది నా బలహీనత. నేను చెయ్యెత్తడంలో ఎక్కడన్న తప్పుంటుందేమో చూడండి." బాధగా అన్నాడు.

నిజమే! అతడికి షార్ట్ టెంపర్ అని ఉద్యోగం తీసేస్తున్నారు కాని జరిగిన ఏ సంఘటనలో అతని తప్పు కనిపించలేదు.

పెద్ద కొడుకు..ఊహూ.. అతని ప్రవర్తనా..కదలికలు..చెప్పే సమాధానాలు అనుమానాస్పదంగా ఏం లేవు. కోడళ్ళని కూడా ప్రశ్నించాడు. వాళ్ళూ కాదని రూఢీ అయింది. ఆయన భార్య? వాళ్ళిద్దరిదీ అన్యోన్య దాంపత్యం అని అందరూ చెప్పారు. ఎప్పుడూ గొడవ పడిన దాఖలా లేదు. అయినా ఆయన చనిపోయినప్పటి నుండి నిద్రాహారాలు మానేసిందావిడ. పోనీ బయట వాళ్ళా అంటే.. వేసిన తలుపులు వేసినట్టే వున్నాయి. ఇంట్లో వున్న సభ్యులు కాకపోతే ఎవరు? ఎవరు చంపారు? వేణు తలపట్టుకున్నాడు.

మొట్టమొదటి సారి వేణుకి ఛాలేంజీగా అనిపించింది.

అనుమానం లేకపోయినా, కాదని తెలిసినా..ఆయన భార్యని ప్రశ్నించాలి..తప్పదు.

"అమ్మా..మీరే మీ ఆయన్ని చంపేశారని కొన్ని క్లూస్ తెలియజేస్తున్నాయి. దయచేసి మీరు ఒప్పుకుంటే.. మా పని సులువవుతుంది. లేదంటే.." ఆవిడ వంక చూశాడు.

ఆవిడ తలదించుకుని వుంది.

"అమ్మా..మిమ్మల్నే..నేను చెప్పింది విన్నారని నాకు తెలుసు.."మాటల్లో కాస్త కాఠిన్యం కలిపాడు.

"నేనే... నేనే ఆ రాక్షసుడిని చంపాను." ఆవిడ మాటకి.. వేణూతో సహా అందరూ షాక్ అయ్యారు. వేణూ చీకట్లో రాయేశాడు తప్ప..నిజానికి అతని దగ్గర ఏ క్లూస్ లేవు.

"ఎందుకు?"

"చెబుతాను.."

************************************************************

మాది అరెంజ్డ్ మ్యారేజ్.

ఆయన గవర్నమెంట్ ఉద్యోగి.. జీవితం సాఫీగా సాగిపోతుందని ఆయనకి నన్నిచ్చి పెళ్ళి చేశారు. తను నాకేం అన్యాయం చేయలేదు.. ఏ లోటు చేయలేదు.. కానీ.. కానీ ఆయనకో బలహీనత వుంది. ఆయనో ఉమనైజర్. తన స్టాఫ్ లోని ఆడవాళ్ళని.. వాళ్ళ వాళ్ళ బలహీనతల్ని తన గుప్పిట్లో పెట్టుకుని లోబర్చుకునేవాడు. నాకు నెలలు నిండుతున్నప్పుడు సాయంగా వచ్చిన నా చెల్లెల్ని కూడా లోబర్చుకున్నాడు. విచిత్రమేమిటంటే ఇవన్నీ నాకు తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేవాడు. అందరితో మంచిగా వుంటూ.. సహాయ సహకారాలు అందిస్తుండడంతో ఆయన మంచితనాన్ని నా అదృష్టంగా భావించేదాన్ని. ఇల్లాలిగా పొంగిపోయేదాన్ని. కానీ ఒకసారి ఒక స్త్రీ ఆయన్ని కలవడానికి ఇంటికొచ్చింది. అదే మొదలు ఒక ఆడది ఆయన్ని కలవడానికి ఇంటికి రావడం. యాధృచ్ఛికంగా నాకు స్తంబం అడ్డుగా వుంది. ఆయన మొహంలో కలవరం..ఆపై కోపంతో జేవురించడం చూశాను. ఆయనలోని భిన్నమైన వ్యక్తిని చూసేసరికి హడలిపోయాను. ఎవరైనా వున్నారేమోననీ చుట్టూ చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక "మా ఇంటికి రావద్దని చెప్పానా. చంపేస్తాను.. ఏమనుకున్నావో.. నువ్వెళ్ళు.. నేనే వీలైనప్పుడు వచ్చి కలుస్తాను." అని పంపించేశాడు

దాంతో ఆయన నిజ రూపాన్ని తెలుసుకోవాలని ఆయన ఊళ్ళో లేనప్పుడు ఆయనకి సంబంధించిన బీరువా మారు తాళాలతో తీయించి స్థాణువై పోయాను. మా ఆయనో నయవంచకుడు. ఒకరా.. ఇద్దరా ఎంతోమంది ఆయన కామ దాహానికి బలైపోయారు. అన్నీ చక్కగా ఒక పుస్తకంలో రాసుకున్నాడు. ఎవరితో ఏ రకమైన సుఖమందిందీ..వివరం.." చెబుతూ ఏడ్చేసింది. అలా చాలాసేపు ఏడ్చి.. ఏడ్చీ.. మళ్ళీ ప్రారంభించింది. నేను ఒక్కో స్త్రీ దగ్గరకెళ్ళి నా భర్త చేసిన దురాగతానికి కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకుని ఆయనలోని సగభాగంగా పాప ప్రక్షాళన చేసుకున్నాను.

ఇదిలా వుండగా మా ఇంట్లో పని చేయడానికి శ్రీరామ్ కుదిరాడు. శ్రీరామ్ కుదురైన అబ్బాయి. నాకైతే మూడో కొడుకే! అతనికి నిదానంగా మా ఇంట్లోని ఆస్తులు..నగలు..నగదు వివరాలు తెలుస్తున్నాయి. ఆ విషయాల్లో అతడిని ఎంతవరకూ నమ్మచ్చు? అని అతనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళమ్మ వుండే ఆశ్రమానికి వెళ్ళాను. వాళ్ళమ్మ చనిపోయిందని తెలిసింది. అయితే అక్కడున్న ఆవిడ పెట్టె గురించి తెలుసుకుని తెరిచి చూసి ఆశ్చర్యపోయాను. ఆ పెట్టెలో ఒక మూలగా వున్న ఫోటోలో... మా ఆయనతో శారద. అంటే ఇంట్లో పనివాడిగా వుంటున్నది ఆయన కొడుకే. ఇంటికొచ్చి శ్రీరామ్ ని అడిగాను వాళ్ళమ్మ ‘మా ఆయన గురించి ఏవన్నా చెప్పిందా?’ అని. ఏమీ చెప్పలేదన్నాడు. కానీ ‘ఆయన మంచివాడు..ఎలాగైనా ఆయనింట్లోనే పనికి కుదరమని’ చెప్పిందట. బహుశా తన అనారోగ్యం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడి, కొడుకుని తండ్రి ఇంటిలోనే కనీసం పనివాడిగానన్నా వుండేలా చేసింది. నిజంగా ఆమె దేవత. నా భర్త కిరాతకుడు.

అంతేకాదు నా చెల్లెలు పెళ్ళి చేసుకోనని ఇంట్లో మొరాయించింది, తన జీవితం నాశనమయిపోతోందని చివరికి మా నాన్న బలవంతంగా ఒక సంబంధాన్ని ఖాయం చేశాడు. అంతే అది ఉరేసుకుని చనిపోయింది. తర్వాత దానికి బాగా దగ్గరి స్నేహితురాలు నాతో విషయాలన్నీ వివరంగా చెప్పింది. నాతో నా భర్త విషయం చెబితే ఎక్కడ నా కాపురం కూలిపోతుందో అని తన జీవితాన్ని ముగించుకుంది అభం శుభం తెలియని పిచ్చిపిల్ల. ఆయనంటే అసహ్యం ఎక్కువ కాసాగింది. అది ఎంతంటే ఆయన ఉనికిని భరించలేనంత. ఈ మధ్య ఆయన వికృత చేష్ట పరాకాష్టకి చేరింది. రిటైరయ్యాడు కాబట్టి.. ఏదైనా వ్యాపకం వుండాలని.. కన్సల్టెన్సీ పెడదామనుకున్నాడు. కాని అందులో పనిచేయడానికి పాతికేళ్ళ లోపు వయసున్న స్త్రీలే కావాలని పేపర్లో అడ్వర్టైజ్ మెంట్ ఇచ్చాడు. ఆయన వినాశకాలం విపరీతమవుతోంది. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. స్త్రీల మీద మగాళ్ళ అకృత్యాలు ఎక్కువైపోయాయి. పసికందు అని లేదు..కన్న కూతురని లేదు..వావీ వరసల్లేవు..వయసు తేడా లేదు. ఆడపిల్ల కనిపించిందంటే ఆబోతులైపోవడమే. పేపర్లలో కనిపిస్తున్న దారుణాలకి నేనెటువంటి పరిష్కారం చూపలేను. కాని నా ఇంట్లో తుదముట్టించగలననిపించింది. అందుకే తెల్లవారుఝామున మనసు దిటవుచేసుకుని ఆయన్ని చంపేశాను.అది బయట వాళ్ళు చేసిన పని అని నమ్మించడానికి తలుపులు బార్లా తీసిపెడదామనుకున్నాను. .కానీ అప్పుడే నా పెద్ద కోడుకు వాకింగ్ కి లేచాడు. నేను గబ గబ వెళ్ళి పడుకున్నాను. వాడు రోజూ వాళ్ళ నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్లడం అలవాటు.. అలాంటిది ఆయన ఎంతకి లేవకపోయేసరికి.. ఆయన చనిపోయిన విషయం తెలిసిపోయింది. నా మనసుకి ఒక కీచకుడు. .రావణుడు చనిపోతే ఎంత శాంతిగా వుంటుందో.. అలా వుంది. నేను తప్పు చేశానని కూడా అనిపించడం లేదు. కాని సమాజంలో ఇది నేరంగా పరిగణిస్తారు

కాబట్టి.. లొంగిపోతున్నాను. నాకు ఎటువంటి బాధ్యతలూ లేవు. ఈ వయసులో ఒక మంచి పని చేసి సమాజం నుండి నిష్క్రమిస్తున్నందుకు సంతోషంగా వుంది." అంటూ లొంగిపోయింది.

మొట్టమొదటిసారి వేణు కళ్ళలో కన్నీటిపొర కనిపించింది. ఇన్నాళ్ళూ కేసుల్లో కక్షలు..స్వార్ధం.. ఆశ..ద్రోహం లాంటివి కనిపిస్తుండేవి..కాని నిష్కామంగా కామపిశాచికి కొన్ని జీవాలు బలికాకుండా కాపాడింది ఆవిడ. ‘తల్లీ..నీకు హేట్సాఫ్’ అని మనసులో అనుకున్నాడు. మొట్టమొదటిసారి కేసు ఆ రకంగా సాల్వ్ అయినందుకు బాధపడ్డాడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి