ఎవరు గొప్ప? - మౌద్గల్యస

evaru goppa

ఒకే స్కూలులో ఒకే తరగతిలో కలసి చదువుకుంటున్న ఆ ఇద్దరి స్నేహితుల మధ్య హఠాత్తుగా తగవు ప్రారంభమైంది. చిలికిచిలికిగాలివానగా మారినట్టు అది పెరిగి పెద్దదయింది.

‘‘ నేను బాగా చదువుతా. పరీక్షల్లో అన్నింటిలో మంచి మార్కులొస్తాయి. క్లాసులో నేనే ఫస్ట్. కనుక నేనే గొప్ప...’’ అన్నాడు ఫణి. త్రిలోచన్ దానికి అభ్యంతరం చెప్పాడు.

‘‘ మార్కులు రావటం గొప్ప విషయమా ఏమిటి? పుస్తకాల్లో ఉన్నవే బట్టీపట్టి రాసెయ్యటమేగా. అదే బొమ్మలు వేయటం ఎంత కష్టం. నేను ఏది చూసినా క్షణాల్లో దాని బొమ్మ గీసెయ్యగలను. దీన్ని బట్టి నీ కంటే నేనే గొప్పవాడినని నిశ్చయంగా చెప్పగలను. ’’ ధీమాగా చెప్పాడు.‘‘దానికినేను ఒప్పుకోను.’’ అన్నాడు ఫణి.

‘‘ చదువు అన్నింటి కంటె ప్రధానమైనది. విద్య లేని వాడు దేనికీ కొరగాడు’’ అన్నాడు.

‘‘ చదువు వచ్చిన వాళ్లు చాలా మందే ఉంటారు. కళాత్మక ప్రతిభ ఉన్నవాళ్లు తక్కువ మంది ఉంటారు ’’అంటూ త్రిలోచన్ ఆ మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు.

చాలా సేపటి వరకూ ఇద్దరూ ఎవరికి వారు తామే గొప్పవాళ్లమంటూ వాదించుకున్నారు. ఒక అంగీకారానికి రాలేకపోయారు. పెద్ద వాళ్ల దగ్గరికి వెళ్లి ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాలనుకున్నారు.

ముందుగా ఫణి వాళ్లింటికి వెళ్లారు.

ఈ విషయం తెలియగానే ఫక్కున నవ్వింది ఫణివాళ్ల అమ్మ.

త్రిలోచన్ భుజం తట్టి ‘‘ నువ్వే గొప్పవాడివిరా కన్నా’’ అంది. దాంతో ఫణికి కోపం వచ్చింది. అమ్మ తనను కాదని, తన స్నేహితుడ్ని మెచ్చుకోవటాన్ని భరించలేకపోయాడు. బుంగమూతి పెట్టి ‘‘ నేను నీతో మాట్లాడను పో ’’ అన్నాడు కోపంగా.

‘‘ మా ఇంటికి వెళదాం పదరా’’ .. త్రిలోచన్ పిలవగానే నాలుగిళ్లవతల ఉన్న వాళ్లింటికి బయలుదేరారు ఇద్దరూ

విచిత్రంగా త్రిలోచన్ వాళ్ళింట్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది.

త్రిలోచన్ వాళ్లమ్మ ఫణిని మెచ్చుకుంది. ‘ నువ్వు వీడిని చూసి నేర్చుకోవాలిరా. రోజంతా పిచ్చి బొమ్మలు గీసుకుంటూ కాలక్షేపం చేస్తావు’’ అంటూ సున్నితంగా మందలించింది కూడా.

త్రిలోచన్ నీరుగారిపోయాడు. అప్పటి వరకూ ఉన్న హుషారంతా మాయమయిపోయింది.

‘‘ మన టీచర్ని అడుగుదాం. ఆవిడేం చెబితే అదే తుది నిర్ణయం.’’... అన్నాడు.

అది సబబుగా అనిపించింది ఫణికి.

తమ ఇళ్లలో విషయం ఎలాగూ తేలలేదు. కనీసం ఇలాగయినా ఒక అభిప్రాయానికి రావచ్చనిపించింది.

శర్వాణి టీచర్ కి పిల్లల మనస్తత్వం బాగా తెలుసు. ఇద్దరి తగువు విని ‘‘ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువుకోకుండా ఏమిటీ పిచ్చివాదనలు’’... అంటూ కసురుకుంది.

‘‘ అది కాదు టీచర్. మీరు తేల్చిచెప్పాల్సిందే. మా ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్లో..?’’ గట్టిగా చెప్పారు.

‘‘ మీరిద్దరు మంచి స్నేహితులు. అనవసరంగా ఇలాంటి వాదనలు చేసుకుని పట్టుదలలు పెంచుకుంటే ఒకరంటే మరొకరికి ద్వేషం పెరుగుతుంది. దాని వల్ల చివరికి ఇద్దరూ నష్టపోతారు’’ హితవుగా చెప్పింది.

‘‘ మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్లలో ఇప్పుడే తేల్చి చెప్పేస్తా. వచ్చి ఈ బల్ల మీద కూర్చోండి.’’

ఆమె పక్కనున్న బల్లమీద ఇద్దరు చేతులు కట్టుకుని కూర్చుని ఆమె చెప్పేది శ్రద్ధగా వినసాగారు.

‘‘ ఇప్పడు ఎండలో మీరిద్దరూ వచ్చారు. ఎండ చుర్రుమంటోంది కదా?’’ అడిగింది.

అవునన్నట్టుగా ఇద్దరూ తలాడించారు. ఆ విషయాన్ని ఆమె ఎందుకు ప్రస్తావించిందో వారికి అర్ధం కాలేదు.

‘‘ ఎండ చుర్రుమంటోంది అంటే... సూర్యుడు తన ఉద్యోగం చేస్తున్నట్టు లెక్క. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇలాగే ఉద్యోగం చేస్తాడు. రాత్రి కాగానే ఉద్యోగం మానుకుంటాడు. చీకటి ఆవరిస్తుంది. అప్పడు చంద్రుడుతన పని ప్రారంభిస్తాడు.’’

శర్వాణి చెప్పుకుపోతోంది. ఇద్దరూ ఆమె మాటల్ని శ్రద్ధగా వినసాగారు.

‘‘ పగలు సూర్యుడు... రాత్రి చంద్రుడు .. ఎవరి బాధ్యతల్ని వారు నిర్వర్తిస్తున్నారు. అంతే తప్ప మాలో ఎవరు గొప్ప అని తగవులాడుకోవటం లేదు’’

అంటూ ఒక నిమిషం ఆగి మళ్లీ చెప్పటం కొనసాగించింది.‘‘సూర్యుడు వెలుగులు పంచుతాడు. చంద్రుడు వెన్నెల ప్రసాదిస్తాడు. ఈ రెండూ కరవైనప్పడు మానవాళి చీకట్లో మగ్గుతుంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.. సూర్యచంద్రులు ఇద్దరూ సృష్టికి అవసరమైనవాళ్లే. ఇద్దరూ గొప్పవాళ్లే’’ ...

ఆమె చెప్పటం పూర్తికాలేదు. తమ ప్రశ్నకి సరైన సమాధానం లభించిందనిపించింది. వాళ్ల గుండెల్లో గూడుకట్టుకున్న అసూయ మాయమైంది కూడా. ఒకరికొకరు ఆత్మీయంగా అనిపించారు.

ఇద్దరూ ఒకరి భుజాలపైన మరొకరు చేతులు వేసుకుని బయటకు నడిచారు. ఈ దృశ్యాన్ని చూసి తృప్తిగా అనుకుంది శర్వాణి...‘‘ స్వార్థం అనే పురుగు వీళ్ల మెదళ్లను తొలచకుండా ఈ స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలి’’

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు