ట్రీట్ మెంట్ - కె.శ్రీలత

treatment

ఎడతెగని ఆలోచనలతో తలపగిలిపోయేలా వుంది వసుధకు. అటు ఆఫీస్ లో పని ఒత్తిడి , ఇటు ఇంట్లో పని, పిల్లల చదువులు... దానికి తోడు భర్త ఆలోచనలు.... వీటన్నిటి మధ్యా ఉక్కిరిబిక్కిరి అవుతుంది తను. అసలు,... నిన్న మొన్నటి దాకా ఎంత అందమైన జీవితం తనది. అందరూ ఈర్ష్య పడేలా ఎంతో సంతోషం గా... ముఖం లో చిరునవ్వు.. ప్రశాంతత తప్ప బాధ మచ్చుకైనా కనిపించకుండా వుండేది. ప్రేమగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి ఇద్దరు అబ్బాయిలు, నీకేంటే.. మీ ఆయనది గవర్నమెంట్ జాబ్... అసలు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ..... తోటి వాళ్ళూ, స్నేహితురాళ్ళూ అంటూంటే, పొంగిపోయేది తను. అలాంటిది భర్త ఇలా మారుతాడని తనను తప్ప పరస్త్రీని కలలో కూడా రానీయడని నమ్మకం పెంచుకున్న తన అభిప్రాయం మార్చేలా వేరే అమ్మాయి వలలో పడతాడని కలలో కూడా ఊహించలేదామె, ఎదురింటి ఆంటీ చెప్పేదాకా...

ఇలా ఆలోచిస్తూ వుండగా...

అమ్మాయ్ వసూ! అంటూ వచ్చింది ఎదురింటి రాజేశ్వరి ఆంటీ.

రండాంటీ! అంటూ ఆహ్వానించింది వసుధ.

ఒక గ్లాసు పంచదార.. ఆ చేత్తోనే నాలుగు ఉల్లిపాయలు వుంటే ఇవ్వమ్మా! సాయంత్రం అంకుల్ తో తెప్పించి ఇస్తాను అంది.

భలే వారే ఆంటీ! వెంటనే యిచ్చెయ్యాలా ఏమిటి? నాకు అవసరమైనప్పుడు నేనే అడుగుతాలే అంది వసుధ.

మా తల్లే... అంటూ... పరీక్షగా వసుధను చూస్తూ ఏంటమ్మా అదోలా వున్నావు కళ్ళన్నీ పీక్కుపోయాయి. ఏమైందీ... అని అడగ్గానే, వలవలా ఏడ్చేసింది వసుధ,

ఆంటీ! అంటూ ఆమెను పట్టుకుని,

అయ్యో ! ఏంటమ్మా ఏమైందీ .. చెప్పు మళ్ళీ అడిగింది వసుధను ఓదారుస్తూ

నేను ఊరునుంచి తిరిగి వచ్చాక, మొన్న మీరు చెప్పిన విషయంలో ఆరా తీసానని కోపం వచ్చి నానా మాటలు అన్నారాంటీ! ఇంట్లో రాత్రి పెద్ద గొడవ జరిగింది.

పిల్లలు లేచి వింటే బాధపడతారని నేనే సర్దుకుపోవాల్సి వచ్చింది, అంటూ వెక్కిళ్ళు మధ్య తన భాధ వెళ్ళబోసుకుంది వసుధ,... అంతేనమ్మా! ఏం చేస్తాం.. ఆడవాళ్ళుగా పుట్టిన పాపానికి మనమే సర్దుకుపోవాలి. ఏది ఏమైనా ఈ మగవాళ్ళని నమ్మకూడదు, గొడవ అవుతుంది కదా, నేను చెప్పిన విషయం వదిలెయ్యకు తల్లీ! నీకు అండగా వుంటాను, ఏదైనా అనరాని మాట మీ ఆయన అన్నా... నిన్ను కొట్టాలని ప్రయత్నించినా వెంటనే మా ఇంటికి వచ్చెయ్... తర్వాత నేను చూసుకుంటాను అని అభయమిచ్చింది రాజేశ్వరి. సరే ఆంటీ అని తలాడించిన వసుధతో, వస్తానమ్మా! వంట అవ్వలేదు... జాగ్రత్త.. అని చెప్పి వెనుదిరిగింది రాజేశ్వరి ఆంటీ వెళ్ళిన వైపే ఆరాధనగా చూస్తూ మనసులో అనుకోసాగింది వసుధ.

ఎంత మంచి మనసు ఆంటీది, ఆంటీ లాంటి పెద్దవాళ్ళు అండ ఏంతో అవసరం మహిళలకి ముఖ్యంగా, తన భర్త నిజ స్వరూపం తనకు తెలియడానికి కారణం ఆంటీనే!

భర్త నైట్ డ్యూటీకి వెళ్ళగానే వచ్చేస్తుంది తన దగ్గరకు. రాత్రి పదిన్నరదాకా తనకు బోలెడు కాలక్షేపం, ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంది ఆంటీ దగ్గర.

అంతకుముందు,

పిచ్చిదానిలా తన ఏ.టి.యం కార్డు భర్త దగ్గరే వుంచేసేది, ఏదైనా కావాలంటే భర్త కొనేవాడు. ఆ కార్డుతో నాకు పనేముందిలే అనుకునేది తను ..

కానీ...

భార్య సంపాదన ఇంట్లోకి ఖర్చుపెట్టడం తగదనీ, ఎంత మాత్రమూ ఏటిఏం కార్డు భర్త దగ్గర వుంచకూడదని , అంతే కాకుండా భర్త సంపాదనలో ప్రతీ పైసా ఎలా ఖర్చు అవుతుందో ఆరా తీయాలని తెలుసుకోవాలనీ తనకు ఉపదేశించిన పరమ గురువు రాజేశ్వరి ఆంటీ,

అంతేనా..

రాత్రి తమింట్లో జరిగిన యుద్ధానికి కారణం ఆంటీ చెప్పిన విషయమే అనుకుని జరిగింది గుర్తు చేసుకుంది వసుధ.

ప్రతీ సంవత్సరం వెళ్ళినట్టుగానే దసరా సెలవులకని పుట్టింటికి వెళ్ళి వచ్చింది. వచ్చిన రోజు రాత్రి భర్త నైట్ డ్యూటీకి వెళ్ళగానే తన దగ్గరకు వచ్చింది ఆంటీ.

చూడమ్మా వసుధా! నేను ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో తల్లిలాంటిదాన్ని... ఇకపై నువ్వు అన్ని రోజులు మీ ఆయన్ని వదిలి పుట్టింటికి వెళ్ళకు అంది..

ఏమైందాంటీ! అని అడిగిన తనతో అన్ని విషయాలు నేను నా నోటితో చెప్పలేనమ్మా, నువ్వే అర్ధం చేసుకోవాలి... నీ మంచి కోరే చెబుతున్నాను.. అని వెళ్తూ ఒక కిలో బెల్లం తీసుకుని వెళ్ళింది తనని అడిగి. అదిగో అప్పట్నుంచీ అనుమాన బీజం నాటుకుంది భర్త విషయం లో ఆ తర్వాత...

క్షుణ్ణంగా భర్తను పరిశీలించసాగింది, వసుధ

నిజమే! ఆంటీ చెప్పిన నెగెటివ్ కోణాలన్నీ తనకు అర్ధమవసాగాయి. భర్త పట్ల ఇంతకు ముందు ప్రతిరోజు సాయంత్రాలు... గుడికో .. సినిమాకో ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేవారు. అలాంటిది, బైటకు తీసుకెళ్ళడం మానేసాడు భర్త, పైగా ఫోనొస్తే .. సిగ్నల్స్ సరిగా లేవంటూ బాల్కనీలోకెళ్ళి రహస్యంగా మాట్లాడుతున్నాడు. తను పుట్టింట్లో వుంటే నాలుగైదు సార్లు ఫోన్ చేసే మనిషి ఈ సారి కేవలం రోజుకి ఒక్కసారే మాట్లాడాడు.. అంతేనా ఇంటి పనులు అన్నింటిలో సాయం చేసే భర్త వైఖరిలో మార్పు కనిపిస్తుంది... అనుకుంటూ అన్ని రకాలుగా నెగెటివ్ ఆలోచించసాగింది వసుధ.

అప్పటునుంచి స్టార్ట్ అయ్యింది ప్రశాంతం గా వున్న ఇంట్లో భయంకరమైన వార్.

భర్త మీద అనుమానంతో ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యం గా వుండే వసుధ చిక్కిశల్యమై పేషెంట్ లా మారింది. పిల్లల పట్ల తరచూ కోపం ప్రదర్శిస్తూ... ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తుంది.

భార్యలో మార్పు గమనించిన శ్రీధర్ అయోమయం లో పడ్డాడు.ఎంతో మెచ్చ్యూర్డ్ గా ఆలోచించి అన్ని విషయాలలో అనుకూలం గా స్పందించే భార్య ఇలా అనుక్షణం తనని సాధించటమూ, తన ప్రతీ చర్య పట్ల అనుమానం గా ఆరాతీయటమూ, డబ్బు విషయం లో ... యింత వరకూ మనది.. మనము అనే వసుధ ప్రతీ విషయం లోనూ ముఖ్యం గా జీతం విషయం లోనూ నీదీ... నాదీ.. అంటూ భేధ పరచి మాట్లాడమూ తట్టుకోలేకపోతున్నాడు.

పిల్లల స్కూలుకీ.. వసుధ ఆఫీసుకీ దగ్గరగా వుంటుందనీ కొత్తగా అపార్ట్ మెంట్ లోకి మారిన తరువాతే సమస్యలొస్తున్నాయని గ్రహించాడు. అసలేం జరిగి వుంటుందబ్బా.. అని ఆలోచిస్తున్న శ్రీధర్ కి మర్నాడే సమాధానం దొరికింది. వసుధ ఆఫీస్ కు వెళ్ళాక వాషింగ్ మెషిన్ లో బట్టలు తీసి ఆరవేస్తుండగా అటువైపు బట్టలు ఆరేస్తున్న రాజేశ్వరిని చూసి .. అయ్యో! ఇదేంటయ్యా! ఎంత మీ ఆవిడ ఉద్యో గం చేస్తున్నా ఆవిడ బట్టలు నువ్వే ఆరెయ్యాలా, ఏం ముందే లేచి మీ ఆవిడే ఆరేసుకోవచ్చుగా, పాపం నీకెంత కష్టం ఇలాంటి పనులు చెయ్యాలంటే అంది. వివేకమూ, లోకజ్ఞానం వున్న శ్రీధర్ .. అదేమిటండీ...! మన పనులు మనం చేసుకుంటే తప్పేముందీ. ఇద్దరు పిల్లలతో , ఇంటి పనులు చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళే ఆమెకు ఈ మాత్రమన్నా సాయం చేయకపోతే ఎలా? అని ఆమె నోటికి తాళం వేశాడు. అప్పుడే ఫ్లాష్ లా ఆలోచన వచ్చింది శ్రీధర్ర్ కి.

అంతకు ముందు కూడా ఒకటి రెండు సార్లు వసుధ గురించి నెగెటివ్ గా మాట్లాడింది ఆంటీ తన దగ్గర.

నువ్వు నైట్ డ్యూటీకి వెళ్ళగానే ఎవరితోనో గంటల కొద్దీ ఫోన్ లో మాటలాడుతుందనీ, పిల్లలని చదివించేటప్పుడు బాగా కొడుతుందనీ చెప్పింది. తనకు తెలుసు.. తన పుట్టింటి వారితోనూ... ముఖ్యం గా వసుధ చెల్లాయి రమ్య తో ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుంది. తను నైట్ డ్యూటీకెళ్ళాక ఫ్రీ గా వుంటుంది. కాబట్టి ఆ టైం లో తన వాళ్ళతో మాట్లాడి వుండవచ్చు, అని అర్ధం చేసుకున్నాడు అంతేకాకుండా,ఇద్దరు పిల్లలకూ స్కూల్లో మంచి ర్యాంకులు రావాలన్నా తాపత్రయం తో కోప్పడి వుండవచ్చు అని సరిపెట్టుకున్నాడు తప్ప ఆ విషయం గుర్తుంచుకోలేదు.

కానీ అమాయకత్వమూ.. ఎదుటి వాళ్ళ మాటల్ని నమ్మే స్వభావమూ గల వసుధ.. ఆంటీ మాటల వల్ల యిలా మారివుంటుందనీ గ్రహించాడు శ్రీధర్. సరైన సమయం కోసం నిరీక్షించసాగాడు.

ఆ మర్నాడే శ్రీధర్ ఆశించిన సమయం వచ్చింది.

సాయంత్రం బైటికెళ్ళి తిరిగొచ్చాక శ్రీధర్ తో యుద్ధానికి దిగింది వసుధ. విషయమేమిటంటే,

శ్రీధర్ కి వచ్చిన ఇరవై వేలు ఏమయ్యాయని ఆమె గొడవ.

నాకు బోనస్ వచ్చిందనీ నీకు చెప్పింది ఎదురింటి రాజేశ్వరి ఆంటీయే కదూ! అని అడిగాడు శ్రీధర్, ఎందుకంటే రాజేశ్వరి ఆంటీ భర్త కూడా శ్రీధర్ ఆఫీస్ లోనే చేస్తారు.

ఆ.. అవును.. అయితే ఏంటట? ముందు ఆ డబ్బు ఏం చేశారో తేల్చండీ? అంటూ తడబడ్డప్పుటే అర్ధమయిపోయింది శ్రీధర్ కి, ఇదంతా ఎదురింటావిడ చలవే అని.

కోపం తెచ్చుకోకుండా, ఓర్పుగా.. అనునయం గా చెప్పాడు భార్యకి.

వసుధా!

చదువుకున్నదానివీ, అన్నీ తెలిసిన దానివీ, కొంచెం నిదానంగా అలోచించు. మనం ఇక్కడకు రాకముందు ఎలా వుండేవాళ్ళం, ఇప్పుడేలా వుంటున్నాం ...

అంతేకాదు,

ఆంటీ చెప్పే మాయమాటలకు, ప్రలోభాలకు పడిపోయి నువ్వు పప్పులూ, పంచదార.. నూనె అన్నీ కూడా సమర్పించుకుంటున్నావు...మళ్ళీ అవి రావని తెలిసినా అవునా! అన్నాడు.

.. ఆ.. ఇరవై వేలు ఏమయ్యాయనేగా నీ డౌటు.. ఇదిగో నాకు బోనస్ వచ్చిన రోజే మనకు బాగా పరిచయమున్న స్వర్నాంజలి నాయుడు గారి షాపులో వచ్చే నెలలో నీ పుట్టినరోజు కానుకగా ఇవ్వాలనుకుని ఆర్డర్ చేసిన డైమెండ్ రింగ్ తాలూకు... అడ్వాన్స్ బిల్లు అంటూ రశీదు చూపించాడు.

ఆలోచనలో పడింది వసుధ.

నిజమే! వచ్చిన నాటి నుంచే ఆంటీ తీసుకెళ్ళిన ఒక్క సరుకూ తిరిగి ఇవ్వలేదు.

ఆవిడ వచ్చినప్పుడు ... ఆమె మాటలు తనకు నచ్చినట్టుగా, అనుకూలం గా వుండడంతో ఆమె ఏదడిగినా, అంతడుగినా యిచ్చేస్తుంది తను. కనీసం, ఇప్పటి వరకూ ఒక నెలవారీ సరుకులు ఇచ్చి వుంటానని తెలుసు వసుధకు.

భార్య ఆలోచనలో పడిందని తెలుసుకున్న శ్రీధర్ ఆఖరి అస్త్రం వదిలించాడు.

సరే! వసుధా... మనింట్లో గొడవకు ఆంటీనే కారణం అని నేను నీకు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తాను... అన్నాడు.

ఏమనాలో తెలీక మౌనం గా వున్న వసుధతో ప్లాన్ చెప్పాడు శ్రీధర్..

తరువాతి రోజు ప్లాన్ లో భాగం గా ఆ ఊరు లోనే వున్న శ్రీధర్ కజిన్ సిస్టర్ సుధను బైక్ మీద ఇంటికి తీసుకువచ్చాడు.. ముందుగానే అన్నీ వివరం గా చెప్పి , వసుధ ఆఫీస్ కెళ్ళిన సమయం లో ..

వాళ్ళు చెప్పులు విప్పి ఇంట్లోకి వెళ్తుండగా ... రాజేశ్వరి ఆంటీ డేగ చూపులు పసిగట్టాడు శ్రీధర్.

ఒక అరగంట టీవి ని చూసి, టీ.. త్రాగి ఇద్దరూ వెళ్ళిపోయారు.

ఆఫీస్ నుంచి వసుధ ఎప్పుడు వస్తుందా అని గుంటనక్కలా ఎదురుచూసిన ఆంటీ, వసుధ రావడం తోనే... గబగబా హాల్లోకి వచ్చి వుంటే ఇవ్వు తల్లీ... అంది.

సిద్ధం గా వున్న వసుధ ... ముందు విషయం చెప్పాడాంటీ! అంది.

అమ్మాయ్! నువ్వు ఆఫీసుకి వెళ్ళగానే మీ ఆయన ఎవతినో ఇంటికి తెచ్చుకుని తలుపులు మూసుకుని ... అమ్మో వద్దులే నా నోటితో ఆ పాపం చెప్పలేనమ్మా.. ఒకటే ఇకఇకలూ.. పకపకలూ...

..ఏది ఏమైనా నువ్వు కొంచెం జాగ్రత్త పడాలమ్మాయ్.. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకో.. నేనే సాక్ష్యం... అంది.

సరే ఆంటీ.. ఇప్పుడే ఎస్. ఐ గారికి ఫోన్ చేస్తున్నా.. విషయం మీరే చెప్పండి... అంటూ నెంబర్ డయల్ చేసి ఫోన్ చేతికిచ్చింది వసుధ. ఆమ్మో ఇదేమిటి... ఏదో మాట వరుసకు అన్నాను. నాకేం తెలీదు... బాబోయ్.. మీ గొడవలేవో మీరు చూసుకోండి, మధ్యలో నన్ను లాగొద్దు.. అంటూ సెల్ ఫోన్ విసిరేసింది కంగారుగా.

ఓకే... ఆంటీ.. ఇకనుంచీ మా గొడవలేవో మేం పడుతాం.. దయచేసి ఇకపై మా ఆయన గురించి చెప్పినదం తా ఫోన్ లో రికార్డు చేసాను. ఏదైనా సమస్య మా ఇద్దరి మధ్యా వస్తే .. ఖచ్చితం గా ఆ రికార్డు నేను ఎక్కడ అందించాలో అక్కడ అందచేస్తాను, అనగానే పాలిపోయిన ముఖంతో అక్కడినుంచి జారుకుంది రాజేశ్వరి ఆంటీ.

సమస్య పరిష్కారమవడం తో .. భర్తకు సారీ చెప్పి ... వసుధా, శ్రీధర్ సంతోషం గా వుండసాగారు, మునుపెటిలా..అక్కడ వుండబుద్ధికాక, వేరే ఇల్లు మారారు... రాజేశ్వరి ఆంటీ, వాళ్ళు తమ అవసరాల తీర్చుకోవడానికి కల్లబొల్లి మాటలు చెప్పి , కాపురాలలో చిచ్చు పెట్టే వ్యక్తుల విషయం తస్మాత్.. జాగ్రత్త!!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు