ఇంద్రజాలం - - చెన్నూరి సుదర్శన్.

indrajalam

బడి గంట గణ గణ మ్రోగింది..

అది ఇంటర్వెల్..

పుట్టలోనుండి చీమలు ఉన్నఫళంగా బయటికి వచ్చినట్లు పిల్లలంతా బిల బిలమంటూ ఉరుకులు పరుగులతో పరుగెత్త సాగారు. స్వల్ప విరామం పూర్తి కాగానే అక్షధ యధావిధిగా ఐదవ తరగతికి వెళ్ళింది. తనకు గణిత శాస్త్రం అంటే మక్కువ. పిల్లలకు ఓర్పుగా.. నేర్పుగా చెప్పడంలో దిట్ట.

గదిలోనికి అడుగు పెట్టగానే పిల్లలంతా లేచి నిలబడి వినయంగా విష్ చేసారు. కూర్చోమ్మంటూ టీచరు నుండి ఆదేశం అందగానే తమ తమ స్థానాలలో తిర్గి కూర్చున్నారు.

రమేష్ ఒక్కడే అలాగే నిలబడి ఉండి పోయాడు. తన రెండు కళ్ళ వెంట ధారాళంగా కన్నీరు..

అక్షధ రమేష్ దగ్గరికి వెళ్ళింది. లాలనగా దగ్గరికి తీసుకుంది.. బుజ్జగిస్తూ విషయం ఆరా తీయసాగింది. రమేష్ చెప్పాలా.. వద్దా.. అని తటపటాయించ సాగాడు. అయినా చెప్పక తప్పదు.. ఇది మామూలు విషయం కాదు. అని జ్ఞప్తికి రాగానే బిగ్గరగా ఏడ్చేశాడు. పిల్లలంతా బిక్కు బిక్కు మంటూ చూడ సాగారు. ఏమయ్యిందో ఎవ్వరికీ తెలియదు.. అక్షధకు తెలుసు రమేష్ ఏం చెప్పబోతాడో..! కాని అది అతడి నోట వినాలని.. సహనం వహించింది. రమేష్ ఏడుస్తూనే నెమ్మదిగా అసలు విషయం చెప్పాడు. పిల్లలంతా నిర్ఘాంత పోయారు.

రమేష్‍ను తన టేబుల్ వద్దకు నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళింది.

“ ఇప్పుడు ఒక చిన్న కథ చెబుతాను” అనగానే తరగతి గది అంతా నిశ్శబ్దం ఆవహించింది. పిల్లల చెవులు నిక్క పొడ్చుకున్నాయి.

“జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టిన రోజున మనం ‘చిల్డ్రెన్స్ డే’ జరుపుకుంటాం.. మీకందరికీ తెలిసిందే.. ”

“యస్ టీచర్..” అంటూ పిల్లలంతా ముక్త కంఠంగా కోరస్ పలికారు.

“సైలెన్స్..’’ అంటూ సంజ్ఞ చేసి తిర్గి చెప్పనారంభించింది.

“ఒక సారి నెహ్రూ గారు సభలో ఉపన్యసిస్తూ ఉండగా సభ సహాయకుడు ఒక చిన్న చీటీ తెచ్చి ఇచ్చాడు. దాన్ని చూసి చదువుకొని తిర్గి జేబులో పెట్టుకొన్నాడు. తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు. సభ అనంతరం చీటీలో ఉన్న విషయం.. నెహ్రూ తల్లి గారు పరమపదించారు. అయినా అంత గుండె నిబ్బరంగా సభకు ఆటంకం కల్గించనందుకు నెహ్రూ గారి మనో స్థైర్యానికి అందరూ ఆశ్చర్య పోయారు..

విషయమేమిటంటే మనం విధుల్లో ఉన్నప్పుడు కర్తవ్య పాలన చేయాలి గాని స్వంత పనులకు ప్రాముఖ్యత ఇవ్వడం.. వాటి కోసం సెల్ ఫోన్లలో మాట్లాడటం నేరం. అందుకే మా ఉపాద్యాయులమంతా మా సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పెడ్తాం. పాఠశాల ముగియగానే తిర్గి ఆన్ చేస్తాం..” అంటూ పక్కనే నిలబడి ఉన్న రమేష్‍ను చూసింది. వాడు తల దించుకొని వింటున్నట్లు గమనించింది అక్షధ. వాడి కన్నీటి బొట్లు నేలపై రాలుతునే ఉన్నాయి..

ఇప్పుడు మీకు ఇంద్రజాలం చేసి చూపుతాను. అంతా రడీయేనా?..” అంటూ ప్రశ్నించగానే పిల్లలంతా అత్యుత్సాహంతో ఎగిరి గంతులు వేసినంత పని చేసారు. పిల్లల ముఖాలు వేయి ట్యూబ్ లైట్లు వెలిగాయి.

పిల్లలందరి బ్యాగులన్నింటిని తెప్పించి టేబుల్‍పై పెట్టించింది. రమేష్ కూడా వెళ్ళి తన బ్యాగు తెచ్చి పెట్టాడు. బ్యాగులన్నింటిని టేబుల్ క్లాత్ తో కప్పింది.. పిల్లలంతా గుండెలు బిగ బట్టి చూడసాగారు.

“రమేష్ నీ క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్పు” అంటూ అడిగింది. కాసేపు ఆలోచించి “దిలీప్” అన్నాడు.

అక్షధ చిరు నవ్వు నవ్వింది. పిల్లలకు ఏమీ అర్థం కావడం లేదు.

“నేను ఈ మధ్యనే ఒక మాయ మంత్రం నేర్చుకున్నాను. అది ఇప్పుడు ప్రదర్శించ బోతున్నాను..” పిల్లలో ఉత్కంఠ పెరిగింది.

తన హాండ్ బ్యాగులో నుండి చిన్న మంత్ర దండం తీసింది. దిలీప్‍ను పిలిచింది. దిలీప్ కంగారు పడ్తూ వచ్చాడు.

“దిలీప్.. నీకు కూడా రమేష్ అంటే చాలా ఇష్టం కదూ..!” అంది. అవునన్నట్లు తలూపాడు దిలీప్.. అతడి మనసులో భయం ఆవహించింది. “దిలీప్ ఈ మంత్రదండంతో ‘అబ్రకదబ్రా..’ అనుకుంటూ మీ బ్యాగులన్నింటి చుట్టూ మూడు సార్లు తిప్పు.. అప్పుడు రమేష్ పోగొట్టుకున్న వస్తువు నీ బ్యాగులోకి వస్తుంది. దాంతో మీరిద్దరు ప్రాణ స్నేహితులని ఋజువవుతుంది.. రమేష్ ఏడుపూ ఆగి పోతుంది” అంటూ మంత్ర దండాన్ని దిలీప్‍కిచ్చింది.

దిలీప్ మదిలో అగులు బుగులు కాసాగింది. గుండె చిక్కబట్టుకొని మంత్రం చదువుతూ మూడు సార్లు తిప్పాడు.. హెచ్ ఎం. చెప్పినట్లు బ్యాగులపై కప్పి ఉన్న టేబుల్ క్లాత్ తొలగించాడు. దిలీప్ తన బ్యాగులో చెయ్యి పెట్టి రమేష్ పోగొట్టుకున్న వస్తువు బయటికి తీశాడు.. అది సెల్ ఫోన్.. పిల్లలంతా ఆశ్చర్యపోయారు. రమేష్ ముఖంలో ఆనందం వెల్లి విరిసింది. కళ్ళు బండిచక్రాలయ్యాయి.. కాని అందులో హెచ్.ఎం. ఏమంటుందో అనే భయం లేకపోలేదు.. దిలీప్ హృదయం తేలిక పడ్డట్లు గమనించింది అక్షధ.

“నన్ను క్షమించండి టీచర్.. ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు చేయను..” అంటూ లెంపలు వేసుకోసాగాడు రమేష్.

“ఈ వయసులో మీకు సెల్ ఫోన్ అనవసరం. దాన్ని పాఠశాలకు తేవడం నేరం.. ఈ సంఘటన మన పాఠ శాలలో మొదటి సారిగా జరిగింది. ఇకముందు ఇలాంటి సంఘటనలు జరుకకుండా అన్ని తరగతులకు నోటీస్ పంపిస్తాను. ఈ ఫోన్ ఆఫీసులో ఉంటుంది. ఇంటికి వెళ్ళే ముందు తీసుకో రమేష్.. మొదటి సారి కనుక క్షమిస్తున్నాను..” అంటూ పిల్లలను తమ తమ బ్యాగులను అంద జేసింది. రమేష్, దిలీప్ మౌనంగా వెళ్ళి తమ స్థానాలలో కూర్చున్నారు. అక్షధ పాఠం చెప్పడంలో నిమగ్నమైంది.

బడి ఆనాటి ఆఖరి గంట మోగింది..

స్టాఫ్ అంతా వెళ్ళి పోయాక అక్షధ హెచ్.ఎం. బయలు దేరింది. తన వెనకాలే పిల్లిలా ఏమో చెబుదామని వస్తున్న దిలీప్‍ను గమనించగానే అప్రయత్నంగా అక్షధ పెదవులు విచ్చుకున్నాయి. తనకు తెలుసు దిలీప్ ఏమి చెప్పబోతున్నాడో..

‘దిలీప్ ఇక జన్మలో తప్పు చేయడు.. ఏదో పిల్లకాయ చేష్టలు.. పైగా సెల్ ఫోన్ ఆకర్షణ.. పొరబాటు చేశాడు.. పశ్చాత్తాప పడ్తున్నాడు.’ స్వల్ప విరామ సమయంలో రమేష్ బ్యాగులో నుండి సెల్ ఫోన్ దిలీప్ తీసి తన బ్యాగులో పెట్టుకోవడం తాను చూసింది. పిల్లలముందు అతడిని దోషిగా నిలబెట్టి దండిస్తే.. అవమాన భారంతో అతడిలో అందరి మీద కసి పెరుగుతుందే తప్ప మార్పు రాదు.. పైగా రమేష్, దిలీప్‍ల స్నేహం చెడి పోతుంది..

సమయస్ఫూర్తిగా ఇంద్రజాలం చేయడం మూలాన రమేష్, దిలీప్‍ల స్నేహ బంధం మరింత గట్టి పడ్తుందని నమ్మింది.. తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దిలీప్ పశ్చాత్తాపంతో కన్నీళ్ళ ప్రక్షాళితుడవుతూ వస్తూ ఉండటమే దానికి తార్కాణం..

అక్షధ మనసు కాస్తా తృప్తి పడింది.

విద్యార్థుల కదలికలు ఉపాద్యాయులకు నిత్యం ఒక నూతన పాఠం.*

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు