చివరివరకు... చేరని లేఖ - డా II అప్పారావు పంతంగి

chivaraku cherani premalekha

రఘురామయ్య పడక కుర్చీలో కూర్చొని దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలోని ‘ పోస్ట్ మెన్’ కవితను చదువుతున్నాడు...

“అయ్యా! ఉత్తరం...” అని పోస్ట్ మెన్ ఉత్తరం తీసి ఇవ్వబోయాడు రఘురామయ్యకు...

“నూరేళ్ళయ్య... ! మీకు... మీ గురించి రాసిన కవిత ఒకటి చదువుతున్నాను... ఎంత అద్భుతంగా రాశాడో తిలక్...

ప్రేమలేఖలు... శుభలేఖలు... ఆరోగ్య, అనారోగ్య సమాచారాలు... తీపివార్తలు, చేదువార్తలు ... ఒకటేమిటీ రెండేమిటి... అన్నిటినీ చేరవేసి ఏమీ ఆశించని నిస్వార్ధ మూర్తులని అబ్బో... ఎంత గొప్పగా రాశాడో...”

“సరే ఏమిటీ నాలుగు రోజులనుంచి ఊళ్ళోకి వచ్చినట్టు లేవు... ”

“అవునయ్యా...”

“సెలవు పెట్టావా?”

“కాదయ్యా...”

“మరి...”

“జీతాలు పెంచమని మా పోస్టల్ డిపార్ట్ మెంట్ వాళ్లందరం స్ట్రైక్ చేశామయ్యా...”

“ఫలితాలు బావున్నాయా?”

“ఫరవాలేదండీ..”

“ఇంతకీ ఎక్కడి నుంచి ఉత్తరం...”

“పెద్దమ్మాయిగారి దగ్గర్నుంచి...”

పోస్ట్ మెన్ వెళ్లిపోయాడు .... రఘురామయ్య ఉత్తరాన్ని చించాడు..... “నాన్నా! బావున్నావా ? నిన్ను చూడాలని ఉంది.... ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేసి తాపీగా వాలు కుర్చీలో కూర్చొని ఏ పాత పుస్తకాలో చదువుతూ కాలక్షేపం చేసే నీకేమవుతుం దిలే ... బాగానే ఉండి ఉంటావు”

“ఎంతమంచి వాడివి నాన్నా? ఈ లోకంలో నీకంటే గొప్ప తండ్రి ఇంకెవరూ ఉండరేమో! మా చిన్నప్పుడే అమ్మపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా మాకోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు చూడు... ఎవరు చేయగలరు నాన్నా! అంత గొప్పత్యాగం. ఆడపిల్లనని అత్తారింటిలో మాటలు పడకూడదని నాకు వంట నేర్పించావు... ముగ్గులేయడం నేర్పించావు... ఆడపిల్లగా ఇంట్లో చేయాల్సిన అన్ని పనులూ నేర్పించావు. నా నడకలు చూసి నాట్యం నేర్పించావు... గొంతు బావుందని సంగీతం నేర్పించావు... తెలివిగలదానినని కంప్యూటర్స్ నేర్పించావు... ఇవన్నీ నేర్పించి కూడా అర్ధం పర్ధం లేని సంప్రదాయాలకు, కట్టుబాట్లకు కట్టుబడి ఉండమన్నావు. అందుకే నీ కోసం అన్నీ భరించి, సహించి ఉంటు న్నాను. నువ్వు నన్ను గుండెలమీద కుంపటని ఏరోజూ అనుకోలేదు, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నావు. కానీ నువ్వు వదిలింది మాత్రం అనునిత్యం రగిలే నిప్పుల కుంపట్లోనే... ఆశ్చర్యంగా ఉందా నాన్నా?!”

“నీ అల్లుడు ఆజానుబాహుడు, అరవిందనేత్రుడు అని నీకు తెలుసు. ఆయన రూపం అలాంటిది. శ్రీ రామ చంద్రుడని అందరికీ చెబుతుంటావు కదా! సకలగుణాభిరాముడని సంబరపడిపోతావు కదా! అవి నేను చెప్తేనే నీకు తెలిసాయి. కానీ అవి నిజాలు కావు నాన్నా... ‘నీ సంతోషం కోసం నా వ్యథలను దాచి అల్లిన కథలవి, నా కథల నుంచి నీకు పంచిన సుధలవి...’ ఇప్పటికీ నేను చెప్పేదానిని కాను, కానీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నాన్నా! ఎలా పెంచావు నన్ను, ఎండ కన్ను సోకకుండా పెంచావు... వెన్నెల్లో గోరు ముద్దలు తినిపిస్తూ పెంచావు... ఒళ్ళో నిదుర పుచ్చుతూ పెంచావు... బళ్ళో బెత్తం తగలకుండా పెంచావు... బడంటే గుర్తొచ్చింది, బళ్ళో మాష్టారు ఏనాడూ నన్ను ఎండలో నిల్చోబట్టలేదు. కానీ మీ అల్లుడు రోజూ నన్ను ఎండలో... ఎందుకో తెలుసా ‘నిప్పుల్లో దూకిన సీత నిగ్గు తేలి వచ్చిదట నాన్నా?’ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఒంటి కాలి మీద ఎంతసేపు నిలబడితే నేను అంత గొప్ప పతివ్రతనట. ఆడపిల్ల ఆలనా పాలనా చూడటానికి అమ్మ లేదు కదా! అందుకే నీ పెంపకాన్ని శంకిస్తున్నాడు. నన్ను ఏమన్నా పడతాను కానీ నిన్ను, నీ పెంపకాన్ని ఏమైనా అంటే మాత్రం నేను తట్టుకోలేను అందుకే ఇప్పటి వరకూ... నిలుచుంటూనే ఉన్నాను. ఇక నాకు ఓపిక లేదు నాన్నా! నువ్వు చెప్పు ఏంచేయమంటావు. ఇంకా అలానే నిలుచోమంటావా!? ఇన్నాళ్లు ... కనిపించకుండా... కళ్ళల్లో నీళ్లని, కడుపులో కష్టాన్ని దాచుకున్నాను. నా వల్ల కావడం లేదు నాన్నా...!!! కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందంటారు. నా కష్టాలు నీ కాళ్ళ మీద పడాలనే... నీ కళ్ళు నా కష్టాల మీద పడాలనే...

“పుట్టబోయే నా బిడ్డచేత నిన్ను తాతయ్యా..! అని పిలిపించాలనుకున్నాను. కానీ నీ బిడ్డకు తండ్రి ఎవరు అని నీ అల్లుడు అడిగితే... ఊహించని ప్రశ్నవేసిన ఆయనకు ఏం చెప్పాలో అర్ధం కాక మౌనంగా ఉంటే, ఎంతమంది ఉన్నారు? ఎవరి పేరు చెప్పాలా అని ఆలోచిస్తున్నావా ? కొంపతీసి నాపేరు చెప్పవు కదా! అని ఆయన అనేసరికి నిలువునా నరకాల నిపించింది నాన్నా! కానీ అలా చేస్తే పుట్టింటి గౌరవం నట్టేట్లో కలుస్తుందని... అందరూ నిన్నే... పిల్లల్ని కంటే సరిపోదు పెంచడం తెలియాలి అంటారని ఆలోచించాను! తప్పు ఆయనదే అయినా... నువ్వే కదా..! భర్తే సర్వస్వం అని, భర్తే లోకమని చెప్పావు అందుకే నీకోసం ఆయన్ని ఏమీ చేయలేక నేనే చచ్చిపోవాలను కుంటున్నాను. ఏం చేయమంటావు నాన్నా! నువ్వే చెప్పు.”

*****

ఒక రోజు ఏం జరిగిందో తెలుసా...

“ఒసేయ్...”

“ఒసేయ్... నిన్నేనే పిలిచేది”

“యావండి... వస్తున్నాను”

“ఒక్కసారి పిలిస్తే పలకవా... వినిపించదా... చెవుడా... లేక పొగరా...”

“లేదండి వంటగదిలో ఉన్నాను”

“నేను ఇక్కడే ఉన్నాను కదా! మరి రావడానికి ఇంత ఆలస్యం...” అదోలా నవ్వాడు...

కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో కుక్కుకొని .... మౌనంగా ఉండిపోయాను

“సరెసరెలే... ఆ ఏడుపాపి వెళ్ళి ఓ కప్పు కాఫీ తీసుకురా...”

కాఫీ తెచ్చి ఇచ్చాను... కాఫీలో కాఫీ పొడి ఎక్కువైనదని మీదికి విసిరి కొట్టాడు... చెయ్యి అడ్డం పెట్టుకుంటే అంతా కాలి బొబ్బలొచ్చాయి. ముఖం మీద పడితే అందం పోతుందనా? అందం పోతే మగాళ్లు ఎవరూ నీవైపు చూడరనా? చెయ్యి అడ్డుపెట్టావు... ఇలా మాట్లాడాడు మీ సుగుణాభిరాముడు... ఆ మరునాడే నువ్వొచ్చావు అడిగితే పొరపాటున చేయి జారీ కాఫీ ఒలికిందని చెప్పాను. అంత నిర్లక్ష్యమైతే ఎలా అని నువ్వు కూడా నన్నే తిట్టావు. ఎంతో అనుభవం ఉన్న నువ్వు అంత చిన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయావా నాన్నా?! ఇంకో విషయం చెప్పనా? లక్షణంగా నువ్వు పెట్టిన ‘సులక్షణ’ అనే పేరుతో ఆయన నన్ను ఏరోజూ... పిలవ లేదు. పెళ్ళైన తరువాత నా ఇంటి పేరే కాదు నాపేరు కూడా మారిపోయింది. ఇక్కడ నాపేరు ‘ఒసేయ్’. నువ్వు వచ్చిన ప్పుడు అమ్మా! సులక్షణా... అనగానే నన్ను కాదేమో అనుకుంటాను. అందుకే పలకడానికి కాస్త సమయం పడుతుంది. అది నువ్వు చాలా సార్లు గమనించి అంత పరధ్యానమైతే ఎలా తల్లీ! అనేవాడివి గుర్తుందా !?

“నా పేరునే కాదు నా గతాన్ని కూడా నేను మరిచిపోతున్నాను నాన్న! నువ్వు తోడుగా ఉండి గుర్తు చేస్తావ నుకుంటున్నాను... ఏంచేయమంటావు చెప్పు నాన్నా!?”

*****

‘మరో రోజు ఏం జరిగిందో తెలుసా?’

తొలి ఏకాదశికి తీసుకెళ్దామని ఇంటికొచ్చినప్పుడు ఒకతన్ని చూసి ఎవరీ జంగురు బిల్లి మొహమోడని నువ్వడి గావు గుర్తుందా? ఆయనగారి స్నేహితుడని చెప్పాను ఇంతకీ అతనెవరో తెలుసా...

స్నేహితురాలని ఒకమ్మాయిని తీసుకొచ్చాడు. ఆవిడకి కావలసిన అన్ని ఏర్పాట్లు నన్నే చూసుకోమన్నాడు. అతిధిదేవోభవ అని నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆవిడకి ఏలోటూ రాకుండా చూసుకున్నాను. కానీ ఆవిడ అతిధి కాదు నాన్నా నాకు సవితని ఆ రాత్రి గడుస్తుంటే తెలిసింది. మరునాడు ఉదయానే ఆయన్ని నిలదీశాను. ఏం మాట్లాడ లేదు... ఇద్దరూ బయటికెళ్లిపోయారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు మరో మగ మనిషితో... ఎవరని నేను అడగ లేదు... కానీ ఆయనే దగ్గరకొచ్చి ఈ రాత్రి కూడా నేను తనతోనే ఉంటాను... నువ్వు ఒక్కదానివే ఉండలేకపోతే వీడితో ఉండు అని తనదారిన తను వెళ్లిపోయాడు. నన్ను వాడికి వదిలి... అప్పుడు వాడు చూసిన చూపులు... తలచుకుంటేనే అసహ్యం కలుగుతుంది. నీకు తప్ప ఎవరికి చెప్పగలను? నిన్ను తప్ప ఎవరిని అడగగలను? భర్త ఏం చెప్తే అది చేయమ న్నావు కదా! ఏం చేయమంటావు చెప్పు నాన్నా !?

*****

“వంటలు చేయడం నేర్పించిన నువ్వు వాటిలో విషం కలపడం నేర్పించలేదే... ?”

“ముగ్గులు వేయడం నేర్పించిన నువ్వు ఆముగ్గులతోనే వాడిని ముగ్గులోకి దించి అగ్గి పెట్టడం నేర్పించలేదే....?”

“నువ్వు కరాటే నేర్పించ కపోయినా... కూచిపూడి నేర్పించావు. ఆ నాట్యంతోనే వాడి నరాల్ని తెంచవచ్చని, నువ్వు నేర్పించిన సంగీతంతోనే వాడిని శ్మశానానికి చేర్చవచ్చని నువ్వు చెప్పకపోయినా, తెలుసుకున్న నాకు... నీ మాటలు... నువ్వు చెప్పిన కట్టుబాట్లు... మాత్రం అవకాశం ఇవ్వడం లేదు నాన్నా...?”

“కాలంతో పాటుగా ముందుకెళ్లాలని కంప్యూటర్స్ నేర్పించావు కానీ కాలం ఎప్పుడో, ఎక్కడో ఆగిపోయింది! అక్కడి నుంచి ముందుకు పోవడం లేదు, ఎందుకంటే ముందుకు తీసుకెళ్ళాల్సిన మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ కోసం కాలంతో పాటే ఆగిపోయారు... నువ్వు నేర్పినవన్నీ నిరర్దకాలుగానే మిగిలిపోయాయి. నా జీవితానికి అద్దకాలనే మిగిల్చాయి.” ఇన్ని నేర్పింది నువ్వే కదా... ఇప్పుడు కూడా ఏం చేయమంటావో నువ్వే చెప్పు నాన్నా !?”

“నా చుట్టూ ముళ్ళకంచెలే ఉన్నాయి ఎటు వెళ్లాలన్నా కష్టంగానే ఉంది. అత్తారిల్లు వదిలి బయటికి వచ్చేద్దా మనుకుంటున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకాలనుకుంటున్నాను... పెళ్ళికి ముందు తండ్రి, పెళ్లయ్యాక భర్త, ఆ తరువాత కొడుకులు ఆడదానికి తోడని మన వాళ్ళు శాసనాలు చేశారు కదా! వాటిని మార్చేద్దామనుకుంటున్నాను? జన్మనిచ్చావు కదా! ఈ జన్మకు తోడుగా ఉండి దారి చూపిస్తావా ?”

“పెళ్ళి కుదిరిన తరువాత మిమ్మల్ని అందరినీ వదిలి దూరంగా కొత్త మనుషుల మధ్యలోకి, కొత్త వాతావరణం లోకి వెళ్లాలంటే ఎంత భయపడ్డానో మీకు తెలుసు కదా? ఆ భయంతో నాకు జ్వరం కూడా వచ్చింది. అప్పుడు అన్ని పనులు పక్కన పెట్టి నా పక్కనే ఉన్నావు. నా కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో కదా! పెళ్ళైన తరువాత కూడా నాకు జ్వరం వచ్చింది... ‘జ్వరం లేని రోజు ఉంటేనే కదా.....!!!’ ‘ఇక్కడ నీలా నాకు తోడెవరూ లేరు... నాకోసం నిద్రలేని రాత్రులు గడపకపోయినా నేను నిద్ర పోయే వరకయినా తోడుగా ఉండేవారు లేరు. సరికదా అందరూ నిద్రపోయాకే ‘నిద్ర నాలోకి రావాలి... నేను నిద్రలోకి పోవాలి...’ ఈ రోజుతో పోల్చుకుంటే ఆ రోజు అలా ఉంది నిజంగా నా జీవిత మేనా అనిపిస్తుంది. ‘ఎన్ని మార్పులు నాన్నా? నా జీవితంలో... పెళ్ళైన నాలాంటి ఆడవాళ్ళ జీవితంలో...’ అందరి బతుకులూ ఇలానే ఉంటాయా?”

“మీ అల్లుడిని చూస్తుంటే చాలా సందర్భాలలో నాకు ఎవరు గుర్తొచ్చారో తెలుసా...? నువ్వే...”

ఇప్పుడు ఈ ఉత్తరం చదువుతుంటే నీకు బాగా గుర్తురావలసిన వాళ్ళు ఎవరు చెప్పనా...? అమ్మే...”

“అవును ఆయనలో నాకు నువ్వు కనిపిస్తున్నావంటే నాలో నీకు తప్పకుండా అమ్మ కనిపించాలి. అమ్మ అనా రోగ్యంతో చనిపోయిందనుకున్నాను, కానీ అది వాస్తవం కాదు నీ ప్రవర్తనతో అమ్మ ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చి నువ్వే తనను చంపేశావు. ఉరిపోసి చంపడం, కిరోసిన్ పోసి తగలబెట్టడం, గోడకేసి తల పగలకొట్టి కాలుజారి పడిందని చెప్పడం.... ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చి చంపేయడం.... ఆడవాళ్లని చంపడానికి మగవాళ్ళకు ఎన్ని మార్గాలో కదా నాన్నా! ఇలా అన్నానని బాధపడకండి... ఇది నిజం.. ఇదే నిజం... అని చెప్పడానికి అమ్మ చనిపోయిన రోజు మీరు వదిలిన కన్నీటి చుక్కలు... ఇప్పుడు వదులుతున్న కన్నీటి చుక్కలే అందుకు సాక్ష్యం... కూతురిగా ఒక ఆడదానిని అమితంగా ప్రేమిస్తున్న మీరు భార్యగా మీ జీవితంలోకి వచ్చిన ఆడదానిని అణువంతో, ఆవగింజంతో ఎందుకు ప్రేమించరో అర్ధం కావడం లేదు. మీరు మంచి భర్త కాలేకపోయినా మంచి తండ్రి అయ్యారు. గమనించారా నాన్నా? ప్రతిరోజూ పేపర్లో, న్యూస్ ఛానళ్ళలో మగవారి చేతిలో బలైపోయిన ఆడవాళ్లే కానీ ఆడవాళ్ళ చేతిలో బలైపోయిన మగాళ్ల గురించి చదివారా?”

“ఇంతకీ మీకు చెప్పొచ్చే విషయమేమిటంటే... నాకు బ్రతకాలనుంది... అది నీతో, ఇక్కడ నేను ఉండలేను. పదునెక్కిన మగాడి గొడ్డలికి తన మెడను ఇచ్చేసిన విజయవాడ శారదా కాలేజ్ శ్రీలక్ష్మి... యాసిడ్ దాడికి బలైన వరంగల్ స్వప్నిక, ప్రతీక... మగ మృగాల చేతిలో మసిగా మారిన ఆయేషా... ఢిల్లీ నుంచి గల్లీ వరకు కంటతడి పెట్టించిన నిర్భయ... ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారు. కానీ నేను ప్రతినిముషం బ్రతకడం కోసం ప్రతిక్షణం చస్తూనే ఉన్నాను... ప్రతిరోజూ... బ్రతకడం కోసం చావడం, చస్తూ బతకడం నాకొద్దు... శరీరానికైనా, మనసుకైనా గాయమైతే నొప్పిగానే ఉంటుంది... తట్టుకోవచ్చు... కానీ, గాయం మానకముందే మళ్ళీ గాయమైతే... మళ్ళీ మళ్ళీ గాయమైతే... ఎలా ఉంటుందో ఊహించండి... నా పరిస్థితి అదే... ఇప్పుడు నేను మరణపు అంచుల మీద నుంచి ఈ లేఖ రాస్తున్నాను. మీ రాకడ ఆలస్యం కావచ్చేమో కానీ... నా పోకడ మాత్రం ఆలస్యం కాదు. మీరు వచ్చే లోపే నేను వెళ్లిపోతే నా దహన సంస్కారాలు కూడా మీ చేతుల మీదుగానే, నేను పుట్టి పెరిగిన ఊరిలోనే జరగాలి. ఇది నేను మీకు రాసే చివరి లేఖ... ఈ లేఖ అందిన వెంటనే దయచేసి నన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్లగలరు... మీరు ఆలస్యం చేసినా... లేక నచ్చచెప్పడానికి ప్రయత్నించినా నా ప్రయాణం మాత్రం ఆగదు... లక్షణంగా పెంచిన నీ.... సులక్షణ నీకు దక్కాలన్నా.....

*****

ఉత్తరం చదువుతుండగానే ఫోన్ మోగింది...

రఘురామయ్య గుండెల్లో అలజడి మొదలయ్యింది... పోస్టల్ స్ట్రైక్ వల్ల నాలుగు రోజులు ఆలస్యంగా చేరిన ఉత్తరం నగ్న సత్యాల్ని తనకు చేరవేశాయి... ఇప్పుడు ఈ ఫోన్... అనుమానంగానే.... భయం భయంగా ఫోన్ తీశాడు...

ఎవరూ మాట్లాడటం లేదు...

“హలో... హలో...” ఎక్కడో దూరంగా... చాలా చిన్నగా .... ఒక ఏడుపు వినిపిస్తోంది ...

“మామయ్య గారు నేను...”

“విషయం రఘురామయ్యకు అర్ధమయ్యింది. ‘ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు’ కాసేపు రఘురామయ్య పోస్టల్ వాళ్ళను తిట్టుకున్నాడు... జీతాలకోసం పోస్టల్ వాళ్ళు చేసిన స్ట్రైక్, నా కూతురి జీవితాన్ని మార్చేసింది... నా కూతురు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఇలా.... అనుకుంటూ కూతురు శవాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు.... చిన్న కూతురు సంసారం గురించి ఆలోచిస్తూ....”

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు