అది - 2099 డిసెంబర్ 31 సాయంత్రం 5.37 సమయం.
సూర్యుడు అస్తమించాడనో; ఉదయించాడనో; చంద్రుడు వచ్చేడనో చెప్పడానికి ఆధారాల్లేవు.
వాతావరణం చల్లగా ఉందనో; ప్రకృతి సుందరంగా ఉందనో అనడానికి అవేంటో ఎవరికీ తెలియవు.
అసలు అలాంటి పదాలు ఈ తరం వారికి గుర్తు లేవు.
గాలిలో తేమ...వచ్చే ఇరవై నాలుగ్గంటల్లో జల్లులతో కూడిన వర్షం పడుతుందనో; వాతావరణం పొడిగా వుంటుందనో చెప్పడానికి వాతావరణ కేంద్రాన్ని మూసేసి చాలా ఏళ్ళయింది.
ఇప్పుడు వాతావరణమంతా ఎప్పుడూ పొగమంచు నిండిన పొల్ల్యూషన్ పొరతో కప్పబడి ఉంటుంది. పెద్దగా మార్పులేవీ ఉండవు. అంతలో ఫోన్ మ్రోగింది.
ఈజిట్! ప్రకాష్!"
"యా"
"దిస్ ఈజ్ డాక్టర్ శివం ఫ్రం శివం ఇంటర్నేషనల్ హాస్పిటల్, తుళ్ళూరు"
"చెప్పండి డాక్టర్!"
"రాధాక్రిష్ణ గారు మీకేమవుతారు?"
"గ్రేట్ … గ్రేట్ గ్రాండ్ ఫాదర్ సార్! ఏమైంది ?"
"మీకో గుడ్ న్యూస్"
"చెప్పండి."
"ఆయన కోమా నుంచి బయట పడ్డాడు"
"ఈజిట్! నాకు చాలా చాలా హాప్పీగా ఉంది."
"అవునండి! ఇది ప్రపంచంలోనే పదహారవ వింత. సుమారు యాభై సంవత్సరాల తర్వాత కోమా నుంచి బయట పడడం "
"నేనిప్పుడే బయలుదేరుతున్నాను డాక్టర్!"
"త్వరగా రండి."
ఫోన్ పెట్టేసిన ప్రకాష్ కు ఈ న్యూస్ చాలా ఎక్షైటింగా ఉంది. త్రిల్లింగ్ గా కూడా ఉంది.
సుమారు యాభై సంవత్సరాలకు ముందు తనకు తాతకు తాత అయిన రాధాక్రిష్ణకు ఆక్సిడెంటై కోమాలోకి వెళ్ళిపోయాడు. వెంటనే హాస్పిటల్లో చేర్పించాడు తాతయ్య. కానీ రోజులు గడిచినా; వారాలు గడిచినా, నెలలు నెలలు గడిచినా ప్రయోజనం లేదు. కోమాలోంచి బయటపడేంత వరకు హాస్పిటల్లోనే ఉంచాలని తాతయ్య చివరి కోరికట. అలాగే మా నాన్న పోతూ పోతూ నన్ను కూడా కోరడం జరిగింది. ఖర్చులు భారమైనా తప్పని పరిస్థితి. అయితే ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందిప్పుడు. రీసర్చ్ కోసం ఆయన్ని మెయింటైన్ చేస్తోంది. ప్రకాష్ గాలిలో తేలిపోతున్నాడు. త్వరలో తనకు తాతకు తాతను చూడబోతున్నాడు. తాతకు తాతను చూసే అదృష్టం ఎందరికి ఉంటుంది. ఊహే ఎంత హాయిగా ఉంది. తన తరం వారికి ఎవరికి లేని అదృష్టమది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది.
రెండు వాటర్ ట్యూబ్స్ నోట్లో వేసుకున్నాడు. మల్టి ఫ్రూఫ్ డ్రెస్ వేసుకున్నాడు. ఆక్షిజన్ సిలిండర్ భుజానికి తగిలించుకున్నాడు.
కొడుకు కుమార్ ఇంకా స్కూల్ నుంచి రాలేదు. వాడికి ఫోన్ లో విషయం చెప్పి ఇంటికి తాళం వేసి కారు స్టార్ట్ చేశాడు. అంతక్రితమే ఆన్ చేసిన మల్టి ఫ్రూఫ్ మిషన్ మెల్లగా పనిచేయడం ప్రారంభమయింది. ఎదురుగా రోడ్ అంతా పొల్ల్యూష న్ తో బ్లాకై ఏమీ కనిపించడం లేదు. హెడ్ లైట్ కాంతికి రోడ్ పైన పొల్ల్యూషన్ తెర విచ్చుకుంది. ఇప్పుడు రోడ్ అస్పష్టంగా కనిపిస్తోంది. కారు టేకాఫ్ కు రెడీ అయింది.
ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో దోమల దండు కారు ను చుట్టేసింది. అలెర్ట్ అయిన ప్రకాష్ వెంటనే మస్కిటో గ్యాస్ లీక్ చేశాడు. దెబ్బకు పారిపోయాయి. కొన్ని చచ్చి కింద పడ్డాయి.
ప్రకాష్ ఏదో పాట హం చేస్తూ హుషారుగా కారును ముందుకు పోనిచ్చాడు.
అతనికి గాలిలో తేలిపోతునట్లుంది. చాలా గమ్మత్తుగా ఉంది. ఈ మాడ్రన్ యుగంలో గట్టిగా అరవై ఏండ్లు బ్రతకడమే గొప్ప. అలాంటిది - తన గ్రేట్… గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇన్నేళ్ళకు కోమా నుంచి బయట పడడం థ్రిల్లింగా ఉంది. అద్భుతంగా ఉంది. అవును. ఇంతకీ ఆయన వయసు ఎంతుంటుంది? 150…200 ఏళ్ళు? దాటి ఉంటుందా? చాలా ఎక్జైటింగా ఉంది.
ఎదురుగా ఎలుకలు రోడ్ దాటుతున్నాయి. అవి ఇంచుమించు ఏనుగు సైజుల్లో ఉన్నాయి. స్లో చేసి అవి వెళ్ళిన తర్వాత కారుని పోనిచ్చాడు ప్రకాష్.అన్నీ అంతరించిపోతున్నా ఈ దోమలు, ఈగలు, ఎలుకలు ఎలా బలిసిపోతున్నాయో ఎవరికి అంతు పట్టడం లేదు. ఆలోచిస్తూనే హాస్పిటల్ చేరుకున్నాడు ప్రకాష్. అక్కడి పరిస్థితి చూసి విస్తుబోయాడు. అప్పటికే ఈ వార్త దావానలంగా ప్రపంచమంతా వ్యాపించింది. ప్రజలు, దేశవిదేశాల్నించి అప్పటికే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, మీడియా ప్రతినిధులు గుమిగూడి ఉన్నారు. అంతా గోలగోలగా ఉంది. అరుపులు, కేకలు, హర్షాతిరేఖాలతో ప్రదేశమంతా మారుమ్రోగిపోతోంది. పోలీస్ రంగప్రవేశంతో కొద్ది సద్దుమనిగినా ప్రపంచంలోని పదహారవ వింత చూడబోతున్నామన్న ఆనందం ప్రతి ఒక్కర్ని నిలవనీయడం లేదు.
ఎలాగో పోలీస్ ల సహాయంతో లోనికెల్లి డాక్టర్ శివాన్ని కలిశాడు ప్రకాష్.
టైట్ మల్టిసేఫ్టి ఫుల్ ప్రూప్డ్ ; స్పెషల్లి ప్రొటెక్టెడ్ ఐ సి యూ లోకి తీసుకెళ్ళాడు ప్రకాశాన్ని డా.శివం.
"మిస్టర్ రాధాక్రిష్ణా ! సీ యువర్ గ్రేట్… గ్రేట్ గ్రాండ్ సన్ !"
శరీరమంతా బ్యాండేజ్ లతో ముఖం మాత్రం కొద్దిగా కనపడుతోంది.
ప్రకాశానికి ఆనందంతో నోట మాటలు పెగలడం లేదు.
"హౌ ఆర్ యూ గ్రేట్ గ్రాండ్ పా?" ప్రకాష్ రాధాక్రిష్ణ మొహంలో మొహం పెట్టి మెల్లగా గొణిగాడు.
రాధాక్రిష్ణ మొహం విప్పారింది. కళ్ళు మెల్లగా తెరిచాడు. మాట్లాడడానికి ప్రయత్నించాడు గానీ పెగలడం లేదు. నీరసంగా ఉన్నట్లుంది.నర్స్ సెలైన్ బాటల్ సరి చేసింది. అయినా లాభం లేదు. మెల్లగా కళ్ళు మూతలు పడుతున్నాయి. "సారీ మిస్టర్ ప్రకాష్! ఆయన బాడీ ఈ వాతావరణానికి అడ్జస్ట్ కాలేకపోతోంది. వుయ్ హావ్ టు ట్యూన్ హిజ్ బాడి టు ద ప్రెజెంట్ అట్మాస్ఫియర్."
ప్రకాష్ ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది.
"అడ్జస్ట్ కాకపోవడం ఏమిటి డాక్టర్?" ఆందోళనగా అడిగాడు.
"అవును ప్రకాష్ గారూ! అప్పటి అట్మాస్ఫియర్ కు ఇప్పటి అట్మాస్ఫియర్ కి ఏదో తేడా ఉంది. అది స్టడీ చేయాలి."
"ఎంత కాలం పడుతుంది సార్!"
" చెప్పలేం. వుయ్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాం. వెళ్ళి రండి."
"అలాగే సార్!" అంటూ సెలవు తీసుకున్నాడు ప్రకాష్ నిరుత్సాహంగా.
ఇంతలో ఫోన్ రింగ్ అయింది.
"హల్లో!"
"హల్లో! డాక్టర్ శివం! ఐయాం డాక్టర్ ఫెడరిక్, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిటూట్ ఆఫ్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్, న్యూయార్క్. వాట్ ఈస్ ద లేటెస్ట్ డెవలప్ మెంట్ "
"హిజ్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ద ప్రెజెంట్ ఎన్విరాన్ మెంట్ డాక్టర్"
" ఓ! టేక్ ద అసిస్టన్స్ ఆఫ్ రినౌండ్ సైంటిస్ట్స్. స్కాలర్స్, ప్రొఫెసర్స్; హుఎవెర్ యు వాంట్ ఫ్రం అక్రాస్ ద గ్లోబ్. హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ అవర్ రీసర్చ్ యాం గిల్. మనీ ఈజ్ నాట్ క్రైటేరియా. ఓ కే!"
"ఓ కే సార్!"
"బీ క్విక్"
ఫోన్ కట్ అయింది.
శివం మెదడు పాదరసంలా పనిచేయడం ప్రారంభించింది. దీన్నొక సవాల్ గా తీసుకొని పనిచేస్తున్నాడు మొదట్నించి. డాక్టర్ ఫెడరిక్ దీని పైన చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే; భవిష్యత్ లో మానవ కళ్యాణానికి దోహద పడుతుంది.
మరో పదినిమిషాల్లో అతని ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. ఫోన్లోనే మంతనాలు జరిపాడు. మరో అరగంటలో రిస్క్యూ టీం తయారయింది. టీం లో ఒక సైకియాట్రిస్ట్, మెటలాజికల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్, రిప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ లకు సంబంధించిన ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు. పది మంది ఉన్న రిస్క్యూ టీం సభ్యులు మూడో రోజు ఉదయానికల్లా తుళ్ళూర్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్ట్ లో దిగారు. మరో గంటలో రిస్క్యూ టీం సభ్యులంతా వార్ రూంలో సమావేశమయ్యారు. పది గంటల మేధో మధనం తర్వాత వార్ రూం తలుపులు తెరుచుకున్నాయి.
అక్కడొక యుద్ధ వాతావరణం నెలకొంది. మనిషి మేధో శక్తికి - సృష్టి రహస్య చేధనానికి మధ్య యుద్ధం.నాలుగు రోజుల అవిరామ కృషి ఫలితంగా రాధాక్రిష్ణ మెల్లగా కళ్ళు తెరిచాడు. మెడిసన్స్ కు రెస్పాండ్ అవుతున్నాడు. ఈ వాతావరణానికి అలవాటు పడుతున్నాడు. అప్పటికీ; ఇప్పటికీ వాతావరణంలో కలిగిన భారీ మార్పుల వివరాలతో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ వాతావరణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. అవంతా జీర్ణించుకోవడానికి అతని మెదడు పూర్తిగా సహకరించడం లేదు.అయినా వాళ్ళ ప్రయత్నం మానడం లేదు. మెదడులోకి ఫోర్స్ గా ఇంజెక్ట్ చేయడానికి శాయశక్తులా ట్రైనింగ్ ఇస్తున్నారు.
మిస్టర్ రాధాక్రిష్ణా! జాగ్రత్తగా వినండి. గ్లోబలైజేషన్ ఫలితంగా మానవుడు సంపాదన మోజులో పడి పర్యావరణాన్ని విస్మరించాడు. చెట్లు కొట్టేశాడు. అడవులు నరికేశాడు. జంతువులను చంపేశాడు. ఫలితంగా వర్షాలు ఆగిపోయాయి. భూగర్భ జలాలు అంతరించాయి. పంటలు లేవు. పరిశ్రమలు విపరీతంగా పెరిగాయి. వాటి ద్వారా కాలుష్యం పెరిగింది. శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం ... ఇలా రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోయి స్వచ్చ మైన నీరు, గాలి దొరకడం దుర్లభమయిపోయింది. భూమిపై సుమారు యాభై అడుగుల వరకు కాలుష్య పొర దట్టంగా కూరుకుపోయింది. చివరికి ఈ కాలుష్య ప్రభావం వల్ల సూర్య కాంతి కూడా భూమిపై పడడం మానేసింది. అందుకే పగలు కూడా చీకటి గానే ఉంటుంది. ఫలితంగా విష పురుగులు, క్రిములు, కీటకాలు విజృంబిస్తున్నాయి. ఏమాత్రం ఏమారుపాటైనా ప్రాణాలకే ముప్పు. వాతావరణమే విషపూరితం అయిపోయింది. నదులే కాదు సముద్రాలు కూడా ఎండిపోయాయి. పంటలు పండవు. మంచి నీళ్ళు దొరకవు. మంచి గాలి దొరకదు. మీ కాలంలో గాలి, వెలుతురు, నీరు స్వచ్చంగా ఉండేది. ఫ్రీ గా దొరికేవి. ఇప్పుడు అన్నిటికీ పే చేయాలి. “ డాక్టర్ హర్ష ఆగేడు.
రాధాక్రిష్ణ కదలడం గమనించాడు. ఏదో వినరానిది విన్నట్లు కళ్ళు ఆశ్చర్యానికి గురి అయ్యాయి. ఏదో చెప్పడానికి పెదవులు కదిలాయి కానీ మాట రాలేదు. అలిసిపోయినట్లుగా మెల్లగా అతని కళ్ళు మూతలు పడ్డాయి.
ఆక్సిజన్ ట్యూబ్ సవరించి గది బయటికొచ్చారందరూ.
ఆ రాత్రంతా రాధాక్రిష్ణ ఉలికులికి పడడం నర్స్ గమనించింది. ఉదయమే డాక్టర్ కి విషయం చెప్పింది.
పది గంటలకి మళ్ళీ కౌన్సెలింగ్ మొదలయింది.
"రాధాక్రిష్ణ గారూ! హౌ డు యు ఫీల్ ? ఎనీ ప్రాబ్లం?"
రాధాక్రిష్ణ ఏదో గొణిగాడు. ఏదో చెప్పాలని లేవబోయాడు.
"నో ...నో. మీరిప్పుడు లేవకూడదు. మీరు మామూలు పనులు చేసుకోవడానికి మరికొంత టైం పడుతుంది. అంతవరకు మేము చెప్పేది జాగ్రత్తగా విని మైండ్ లో నిక్షిప్తం చేసుకోండి.ఓ కే!" డాక్టర్ శివం అనునయంగా చెప్పాడు.
"రైట్. నిన్న వాతావరణంలో మార్పుల కారణంగా భూమి పై పడ్డ పెను మార్పులను వివరించాను. ఫలితంగా మనిషి జీవితం ఎంతో ప్రభావితమయింది. స్వచ్చమైన గాలి, నీరు లేక పశుపక్ష్యాదులు నశించిపోయాయి. యావత్ ప్రాణకోటి విలవిలలాడాయి. వృక్షాలు ఎండిపోయాయి. అయినా కూడా వీటిని తట్టుకొని ఒకటి అరా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. బతికున్న ప్రాణులు కూడా పూర్తిగా విషపూరితమయ్యాయి. సైంటిస్ట్స్ పరిశోధనలు చేసి మనిషి కి కావల్సిన స్వచ్చమైన గాలి, నీరు లాబ్స్ లో తయారు చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా మనిషి కి కావల్సినంత ఉత్పత్తి చేయలేకపోతున్నారు. పంటలు, ఆహార ధాన్యాలు లేవు కనుక మనిషి బ్రతకడానికి కావాల్సిన శక్తి కోసం 'ఫుడ్ క్యాప్సూల్స్" కనిపెట్టారు. ఈ క్యాప్సూల్స్ ఆహారానికి ప్రత్యమ్నాయం కాకపోయినా బ్రతకడానికి పనికి వస్తాయి. దీని పైన ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి." ఆగాడు డాక్టర్ హర్ష.
రాధాక్రిష్ణ కళ్ళు పెద్దవయ్యాయి. పెదవులు అదరసాగాయి. పిడికిలి బిగుసుకున్నాయి. ఛాతి ఎగిసెగిసి పడుతోంది. శ్వాస ఆడడం ఇబ్బందవుతోంది. నర్స్ ఆక్సిజెన్ ట్యూబ్ మార్చింది.
కంప్యూటర్ లోని విద్యుత్ తరంగాలు ఒక్కసారి ఫ్లక్త్యు యేట్ అయ్యాయి. డాక్టర్ శివం కంప్యూటర్ని మానిటర్ చేస్తూ నర్స్ కి ఆదేశాలిస్తున్నాడు.
పది నిమిషాలకి రాధాక్రిష్ణ మత్తులోకి జారుకున్నాడు.
"దశాబ్దాలుగా ప్రకృతి ప్రమాద ఘంటికలు మ్రోగిస్తూనే ఉంది. అయినా మానవుడు పెడ చెవిన పెట్టాడు. ఒక్కొక్కటిగా జంతు జాతి, పక్షి జాతి నశిస్తూ వచ్చాయి. వివిధ రకాలైన కాలుష్యాలు కబలిస్తున్నా మనిషి నిద్ర నటించాడు. గ్లోబలైజేషన్ వెంట పరుగులు తీశాడు. ఇప్పుడు మనిషి మనుగడకే పెను ముప్పు పొంచి ఉంది. మనిషి స్వేచ్చగా జీవించలేనప్పుడు ఎవరికోసం ఈ అభివృద్ధి? ఎవరి కోసం ఈ పరుగులు? " రాధాక్రిష్ణ మనసులోని ఉక్రోషం పెదవి దాటలేదు.
కంప్యూటర్ని కాకుండా మనసును చదివే నేర్పే ఉండి ఉంటే డాక్టర్ శివానికి ఆ మాటలు వినపడి ఉండేవి.
ఆ రోజు సాయంత్రం రెస్క్యూ టీం ఎమర్జెన్సీ మీటింగ్ లో పరిస్థితిని సమీక్షిం చింది. కౌన్సిలింగ్ కి అతడి మెదడు ఎలా రియాక్టవుతుందో అబ్జర్వేషన్ లో ఉంచమని డాక్టర్ బృందానికి ఆదేశాలు వెళ్ళాయి. రాత్రంతా అబ్జర్వేషన్ లో ఉంచి రికార్డ్ చేశారు. మెదడు రియాక్ట్ అవుతోందని రిపోర్ట్స్ అందగానే రిస్క్యూ టీం , డాక్టర్స్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కౌన్సిలింగ్ కంటిన్యూ చేయడానికి నిశ్చయించారు. ఉదయం పది గంటలకి మళ్ళీ కౌన్సిలింగ్ మొదలయింది. రాధాక్రిష్ణ పరిస్థితి నిన్నటికన్నా మెరుగయింది. కళ్ళలో కాంతి వచ్చింది.
"రాధాక్రిష్ణా గారూ! ఇంతవరకూ మనం పర్యావరణంలో వచ్చిన పెను మార్పులు; ఫలితంగా అనివార్యంగా మానవ జీవితాల్లో ఏర్పడ్డ సంక్షోభం ..తన మేధో శక్తితో సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న విధానాన్ని మాట్లాడుకున్నాం. ఇలాంటి సమయంలో మానవ జాతిని కాపాడుకోవడానికి మనమంతా కృషి చేయాలి. మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. ఎందుకంటే మన ప్రాణాలకు క్షణం క్షణం ముప్పు పొంచి ఉంది. మన ప్రాణాలు చాలా విలువైనవి. వాటిని కాపాడుకోవడం మన విధి. లేకుంటే మానవ జాతే అతి త్వరలోనే అంతరించే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రకృతి వైపరీత్యం గూర్చి ప్రతి ఒక్కరికి అవగాహ న కలిగించాలి. అన్ని జాగ్రత్తలూ తీసుకుని మనతో పాటు మన భవిష్యత్ తరాలను బ్రతికించాలి. రాధాక్రిష్ణ గారూ" ఆగాడు డాక్టర్ హర్ష.
రాధాక్రిష్ణ కళ్ళు మెల్లగా తెరిచి హర్షను సూటిగా చూసి మళ్ళీ మూసుకున్నాడు.
హర్ష చెప్పడం మొదలెట్టాడు.
" ఇప్పుడున్నపరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాములుగా బ్రతడానికే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అర్థం చేసుకోండి ! జాగ్రత్తగా వినండి. మొదటిది గాలి. వెలుపల గాలంతా కలుషితమయి విషతుల్యమైపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు మల్టీప్రూఫ్ డ్రెస్ కంపల్సరీ. లేకుంటే బయట నిలబడ్డ అర నిమిషంలో కలుషిత విషవాయువుల వల్ల ప్రాణాలు పోతాయి. మరో నిమిషంలో బాడీ పూర్తిగా గాలిలో కలిసిపోతుంది. మనకేమీ మిగలదు. అంత విషపూరితం బయటి గాలి. అందుకే మనకు కావాల్సిన గాలిని చిన చిన సిలిండర్ రూపంలో ఇస్తుంది ప్రభుత్వం. అలాగే 'ఫుడ్ కాప్స్యూల్స్" కూడా నెల నెలా కూపన్ రూపంలో ప్రభుత్వమే అలాట్ చేస్తుంది. వాటర్ ట్యూబ్స్ కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అన్నీ జాగ్రత్తగా; పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే వాటి ప్రొడక్షన్ కు కూడా కొన్ని పరిమితులున్నాయి. వీటిని వాడడం వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఈ మధ్యే ఫ్రూవ్ అయింది. ఆల్టర్నేటివ్ కోసం సైంటిస్ట్స్ అహోరాత్రులు ప్రయోగాలు చేస్తున్నారు. “ ఆపేడు హర్ష.
రాధాక్రిష్ణ పిడికిలి బిగిసింది. పళ్ళు పటపటా కొరికాడు. కళ్ళు ఎర్రబడ్డాయి కోపంతో. వెంటనే ఒళ్ళు చల్లబడింది.
కంప్యూటర్ లో డేంజర్ బల్బ్ వెలిగింది. డాక్టర్ టీం కంగారుపడి రంగంలోకి దిగింది.
సుమారు అరగంట రెస్క్యూ టీం ప్రయాస పలితంగా రాధాక్రిష్ణ మళ్ళీ కళ్ళు తెరిచాడు.
అతని మనసంతా అదోలా ఉంది. ఎందుకిలా అయింది? మానవ జాతి ప్రమాదం అంచుల్లో ఎందుకుంది? దీనికి కారకులెవరు? ఎవరిని నిందించాలి? దీన్నంతా ఆపడానికేం చేయాలి? ఏదైనా చేయాలి...అదీ వెంటనే ...వెంటనే చేయాలి? ఏం చేయాలి...ఏం చేయాలి??? రాధాక్రిష్ణ మష్తిష్కమంతా ఆలోచనలు ...ఆలోచనలు. ఏదో చేయాలి...ఏదో చేయాలి???
ఏదో చెప్పాలని చూశాడు. మాటలు పెగలడం లేదు.
వ్రాసి చూపడానికి పెన్,పేపర్ కావాలని సైగ చేశాడు.
"పెన్నులు, పేపర్లు పోయి చాల కాలమయింది రాధాక్రిష్ణ గారూ! మీరేమైనా చెప్పదలుచుకుంటే ఆ కీ బోర్డ్ పైన టైప్ చేయండి" హర్ష కీ బోర్డ్ ను చూపించాడు.
నొసలు చిట్లించి అదోలా చూసి కళ్ళు మూసుకున్నాడు రాధాక్రిష్ణ.
మెల్లగా మత్తులోకి జారుకున్నాడు. నిశ్శబ్దంగా మిగిల్నందరూ బయటికొచ్చారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత రాధాక్రిష్ణకు మెలకువ వచ్చింది. మళ్ళీ అవే ఆలోచనలు ఎడతెరిపిలేకుండా.
క్విక్... బ్రింగ్ బ్యాక్ నార్మల్సీ. మనిషి మనుగడకే ముప్పు వాటిల్లినప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అయినా ఉపయోగమేమిటి ? ఇలాంటి ప్రపంచంలో నాకు బతకాలని లేదు. నా కీ బతుకొద్దు. ఇలాంటి బతుకొద్దు. “
తనకు తగిలించిన ఒక్కొక్క పరికరాన్ని లాగి పడేస్తూ విసురుగా లేచి నిలబడ్డాడు. స్టాఫ్ పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ ఉపయోగం లేకపోయింది. అతనికి అంత శక్తి ఎక్కడినుంచి వచ్చిందో ...అందర్నీ విదిలించుకొని వడివడిగా వీధిలోకి పరిగెత్తాడు. "నా కీ బతుకొద్దు...నా కీ బతుకొద్దు" అరుస్తూ నిటారుగా నిలబడ్డాడు. అందరూ నిశ్చేష్టులై చూస్తుండగానే రాధాక్రిష్ణ బాడీ అదృశ్యమై గాలిలో కలిసిపోయింది."నా కీ బతుకొద్దు...నా కీ బతుకొద్దు" అందరి చెవ్వుల్లో గింగురుమంటున్నాయి.
********************************
"నా కీ బతుకొద్దు...నాకీ బతుకొద్దు" గట్టిగా అరుస్తూ ఉలిక్కి పడి లేచాడు ప్రకాష్
భయంతో వణకిపోయాడు. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. నాలుక పిడచకట్టుకుపోయింది.
చుట్టు అంతా పరిశీలనగా చూశాడు . అంతా మాములుగానే ఉంది. మనసు కుదుట పడింది.
భయంకరమైన కల ...ఇంకా వణుకు తగ్గ లేదు.
"పర్యావరణం-పరిణామాలు" సైన్స్ మాగజైన్ లో వ్యాసం చదువుతూ అలానే నిద్ర పోయినట్లు గుర్తు. ప్రకృతి హెచ్చరికల్ని మనం పట్టించుకోకపోతే జరగబోయే వైపరీత్యం కల రూపంలో సాక్షాత్కరించినట్లయింది. ఒక్కసారిగా ఒళ్ళు జలదరించిందిశబ్దానికి భార్య ఉమ లేచి కూర్చుంది." ఏమయిందండీ! పీడ కలేమైనా వచ్చిందా?" అంటూ మంచి నీళ్ళు అందించింది."అవును పీడ కలే.." గడ గడ నీళ్ళు తాగి చెమటలు తుడుచుకున్నాడు ప్రకాష్ . "నీకే కాదు... మాకూ వద్దు అలాంటి బతుకు గ్రాండ్ ఫా! ! అవును. ఏదో వెంటనే చేయాలి. వేగంగా దూసుకొస్తున్న ఈ దుష్పరిణామానికి వెంటనే అడ్డుకట్ట వేయాలి. పర్యావరణాన్ని రక్షించాలి. లేకుంటే ముందు తరం మనల్ని క్షమించదు. " ప్రకాష్ కృతనిశ్చయానికి వచ్చాడు.
తన కలను ఒక వీడియో తీసి సోషియల్ నెట్ వర్క్ లో పెట్టాడు. పర్యావరణాన్ని కాపాడడానికి సలహాలు; సూచనలు ఆహ్వానించాడు. ప్రపంచం నలు మూలలనుంచి లైక్ మైండెడ్ మేధావులు, విద్యార్థులు, యువత, విఙానవేత్తలు ముందుకు వచ్చారు. ఒక మహోన్నత ఆశయం ఉద్యమం రూపంలో ఊపిరిపోసుకుంది. రండి. మనమూ చేతులు కలుపుదాం.