ఆ....క...లి....! - డా. జడా సుబ్బారావు

akali

బస్సు షెల్టర్ లో ఒక మూలన ముడుచుకుని పడుకున్న లచ్చి సూర్యకిరణాలు మీద పడడంతో కళ్ళు తెరిచింది. దట్టంగా పట్టిన మబ్బుల చాటునుంచి కొంచెం కొంచెం గా ఎండ వస్తోంది. రాత్రంతా వర్షంలో తడవడం వల్లో ఏమో ఒళ్ళు వేడిగా వుండి నీరసంగా వుంది. ఊరేమిటో, తల్లిదండ్రులెవరో తెలియదు. ఆదరించేవారు లేక అడుక్కుంటూ కాలం గడుపుతోంది. ఎవరు పెట్టారో మరి తనకి లచ్చి అనే పేరు . ఊహ తెలిసిన దగ్గర్నుంచీ అడుక్కోవడమే తన వృత్తి. పేరులో లక్ష్మి, తీరులో దరిద్రం. తన పేరుకీ జీవితానికీ పొంతన లేదు. అమాయకంగా నవ్వుకుంది.

ఒక్కోసారి ఎక్కువ తిరక్కుండానే తినడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. ఒక్కోసారి రోజంతా తిరిగినా కనీసం టీ తాగడానికి కూడా వచ్చిన డబ్బులు సరిపోవు. అప్పుడు తెలుస్తుంది ఆకలి బాధ. బట్టల్ని పిండినట్లుగా పేగులన్నింటినీ ఎవరో గట్టిగా మెలితిప్పుతున్నట్ట్లు, ఆ బాధ కంటే ప్రాణాలుపోవడమే మంచిదనిపించేది. ఇంకా కొంచెం సేపు పడుకుంటే బాగుండనిపించింది. లేవాలని అనిపించట్లేదు. కానీ తప్పదు. కూటికి గడవని వాళ్ళకి ఎక్కువసేపు పడుకునే హక్కు లేదు. మూలుక్కుంటూనే లేచింది. అయిదనిపించినట్లుగా ముఖం కడుక్కుంది. రెండు రోజుల క్రితం తినగా మిగిలిన అన్నం మీద కాగితాన్ని కప్పి వుంచింది. ఆకలిగా అనిపించి కాగితం తీసి చూసింది. పాచిపోయిన వాసన గుప్పుమని తగిలింది. ఆకలిని తట్టుకుంది కానీ ఆ వాసనకు కడుపులో దేవినట్టయింది.

అన్నం అవతల పడేసి గిన్నె శుబ్రంగా కడిగి అక్కడ నుండి లేచింది. యాయే లచ్చి ఎళ్తన్నావా? రాతిరంతా జరం, ఒల్లు బాగా కాలిపోయింది. తగ్గిందా ఇప్పుడు..." అని అడిగాడు బయటి నుంచి వస్తున్న ముసలతను. వెళ్ళేదల్లా ఆగి ఆయన వైపు చూసి నవ్వి "ఒల్లు ఏడిగానే వుంది, నీరసంగా కూడా వుంది. అయినా తప్పదుగా తాతా..." అంది. కూసుంటే తగ్గే నీరసం కాదు తాతా ఇది..." అంది. సరే నీ ఇట్టం ...అన్నట్లు చెయ్యూపాడు తాత.

నాలుగు రోడ్ల కూడలి వచ్చిపోయే వాహనాల రొదతో గజిబిజిగా వుంది. సిగ్నల్ పడింది. ఒక్కొర్నీ దాటుకుంటూ ముందుకు వచ్చి "బాబూ... ధర్మం సేయండి బాబూ..." అంటూ అడగసాగింది లచ్చి. చామన చాయగా వున్నా ముఖం కళగా వుంది. ముఖం కళగా వున్నా ఆకలి వల్ల నీరసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది, ఆగి వున్న ఒక స్కూటరతని దగ్గరికెళ్ళి బాబూ... ఆకలిగా వుంది ధర్మం సేయండి బాబూ.. అన్నం తిని రెండు రోజులయింది బాబూ... అంటూ దీనం గా అడగసాగింది. కనీసం ముఖం కూడా చూడకుండానే పో అన్నట్లు చెయ్యెత్తాడు. కొంతమంది లేదన్నట్ట్లు ముఖం చిట్లించి సమాధానం చెప్తున్నారు.

కాళ్ళు తడబడుతున్నాయి నీరసంతో, నడవలేక నడవలేక నడుస్తూ అందర్నీ అడుగుతూ ముందుకెళ్తోంది లచ్చి. ఆగి వున్న కారతన్ని అడిగితే రూపాయి తీసి గిన్నెలో వేశాడు. డమరుకాన్ని మోగించినట్ట్లుగా చప్పుడు చేస్తూ అటూ ఇటూ దొర్లింది రూపాయి. "దయగల మారాజు ... సల్లంగుండాలి..." అంటూ నోటికొచ్చినదీవెనలిస్తూ ముందుకెళ్తోంది.

ఆ రోడ్డు నుండి పక్కరోడ్డుకెళ్ళింది. కాళ్ళల్లో సత్తువలేక నడవడానికి సహకరించట్లేదు. దానికి తోడు ఇందాకటివరకు అంతో ఇంతో చురుక్కుమనిపించిన ఎండ పోయి ఆకాశం రంగు మార్చుకుంది. వాన రాకడ ప్రాణం పోకడ తెలియదన్నట్ట్లుగా ఏ నిముషం ఐనా వాన వచ్చేట్లుగా వుంది. లచ్చిలో తొందర ఎక్కువయింది. ఇంతసేపు కాళ్ళరిగేలా తిరిగినా ఒక్క రూపాయికి మించి రాలేదు. ఈ రోజు కూడా పస్తు తప్పేట్లు లేదు. దానికి తోడు వాన పడక ముందే వెళ్ళాలన్న ఆరాటం లచ్చిని మరింత తొందర పెట్టసాగింది.

"ధర్మం సేయండి బాబూ.. పున్నెముంటుంది... అన్నం తిని రెండు రోజులయింది బాబూ..." అంటూ అందర్నీ అడుగుతూనే వుంది. ఎప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుందా, ఎప్పుడెప్పుడు ఆ ట్రాఫిక్ లోంచి బయటపడి ఇంటికి వెళ్దామా అన్న ఆలోచనలో వున్న జనం లచ్చిని పట్టించుకునే స్థితిలో లేరు. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. కడుపులో ఎత్తులేక పేగులు అల్లాడుతున్నాయి. తను అడుక్కోవడం మొదలుపెట్టినప్పటీ నుంచి ఇప్పటివరకూ చాలాసార్లు రెడ్ లైట్ పడింది. గ్రీన్ లైట్ పడింది. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు. అంత దీనం గా అడుక్కుంటున్నా ఒక్కరూ కూడా తన వంకా చూడట్లేదు, రూపాయి ధర్మమూ చేయట్లేదు.

చల్లగా మొదలయిన గాలి కాసేపటికి ఉధృతం గా మారింది. చిన్న చిన్న తుంపరలు పడసాగాయి. ఆఖరి ప్రయత్నం గా ఆగివున్న స్కూటర్ దగ్గరికెళ్ళి "ధర్మం సేయండి బాబూ..." శానా ఆకలి గా వుంది బాబూ....! రెండు రోజులనుంచి

అన్నం తినలేదు బాబూ... ఒక్క రూపాయి దర్మం సేయండి బాబూ... " కడుపులోని పేగులన్నిటినీ బయటికిలాగి లేని ఓపిక తెచ్చుకుంటూ అడిగింది లచ్చి.

లచ్చి వంక ఎగాదిగా చూశాడు స్కూటరతను. నోటిలో వున్న జర్దా కిళ్ళీని తుపుక్కున ఉమ్మేసి "ఏం పాపా... అంత ఆ........ఖ.....లి....గా వుందా? ఆకలి అన్న పదాన్ని సాగదీస్తూ ఎర్రగా గారలు పళ్ళు బయటపెట్టి వెకిలిగా అడిగాడు. నల్లగా వున్నా లచ్చిలోని వింత ఆకర్షణ అతన్ని నిలువెల్లా కుదిపేస్తోంది.

అవును బాబూ... అన్నం తిని రెండు రోజులయింది. శానా ఆకలిగా వుంది బాబూ... పున్నెముంటుంది మీకు. ధర్మం సేయంది బాబూ..." ప్రాణమంతా ఒక్కటిగా చేర్చి దీనం గా అడిగింది లచ్చి. "అలా పక్కకొస్తే కావలసినంత ధర్మం చేస్తా... వస్తావా? " పక్క అనే పదాన్ని ఒత్తి పలుకుతూ కళ్ళను వింతగా మూస్తూ తెరుస్తూ మైకంగా అడిగాడు.

ఒక్కసారిగా లచ్చి కళ్ళు ఎర్రబారాయి. పట్టరాని కోపం తో ఒళ్ళు నిలువెల్లా కంపించిపోసాగింది. తుపుక్కున ఉమ్మేసి అతని వంక కోపం గా చూస్తూ ఇట్టా అడిగినందుకు నీలాంటోడి సెంప పగలగొట్టడానికి కూడా నా కాళ్ళకు సెప్పులు లేకుండా సేశాడు ఆ భగవంతుడు. ఏం బాబూ... నీ మగతనానికి ఇంట్లో ఆడోళ్ళు సరిపోట ల్లేదా.. అడుక్కునే వాళ్ళు కూడా కావాలా? నా తలరాత బాగోక పొట్టసేత్తో పట్టుకుని రోడ్డున పడ్డాను. కానీ మానం అమ్ముకోడానికి రాలేదు బాబూ... పక్కన నుంచుంటేనే మా వాసన భరించలేక ముక్కు మూసుకుంటారు. మరి మాతో కాపరం ఎట్టా సేత్తారు. బాబూ... మీకంటే ఈది క్కిక్కలు నయం. సీ...నీ.... బతుకు సెడ... అడుక్కునేదైనా సరే ఆడదైతే సాలు.... అర్రులు సాసుకుంటూ ఎనకాలబడుతారు. ఎదవ బతుకని ఎదవ బతుకు..." తిట్టుకుంటూ అక్కడినుండి కదిలింది లచ్చి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు