పెద్దల పుణ్యం ! - గంటి రమాదేవి

నర్మదా నదీ పరీవాక ప్రదేశంలో వింధ్య, సాత్పురా పర్వతాల మధ్య లోయ ప్రదేశంలో వుంది రాజరాజవర్మ రాజ్యం.సునాదమాల విపంచి రాగ లయతో ప్రవహించే సెల ఏళ్లు, సుదూరంలో కాలమేఘమాలికల సింహ గర్జన పోలు జలపాతాల, ముదురు ఆకుపచ్చ చీరె కట్టుకున్న వనకన్యలా చిక్కటి అడవులు .. నృత్య విన్యాసాలతో, 'క్రే0 కార ధ్వనుల మయూర సమూహాలూ, అందమూ, ఆనందమూ కలగలసిన రాజ్యం రాజరాజ వర్మది.

ఇంకొక పక్క సమాంతరంగా సాత్పురా శ్రేణులు..

పాడి పంటలకు లోటు లేదు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వుండేవారు. రాజరాజవర్మ పూర్వీకులు మహా భక్తి పరులు. శ్రీశైలంలో ఉన్న పరమశివునికీ, ఇంద్ర కీలాద్రి పైన ఉన్న కనకదుర్గకూ , ఆంధ్ర ద్రావిడ సీమలో వెలసిన దేవదేవుడు శ్రీనివాసునికి ఎన్నో మాన్యాలు ఇచ్చారు. వజ్ర వైఢూర్యాలు, స్వర్ణాభరణాలు సమర్పించుకున్నారు.

అయితే, రాజరాజవర్మకు పెద్దల దైవభక్తి అలవడక పోగా దైవద్వేషం మనసులో చోటు చేసుకుంది. సకాలంలో వానలు పడడం, భూమి బంగారు పంటలు పండడంలో దైవ సాయం ఏమీ లేదని, అదంతా ప్రకృతి సిద్డంగానూ, తన రాజ్యంలోని రైతుల కృషి వల్లనూ, జరుగుతోందని దృఢంగా నమ్మేవాడు. పూర్వం నుంచీ వస్తున్న ఆచారాలను పక్కన పెట్టాడు. గుళ్ళలో దీప ధూప నైవేద్యాలు నిషేధించాడు. 'యధా రాజా తధా ప్రజ' అన్నట్టు, ప్రజలూ దైవకార్యాల పట్ల విముఖత అలవరించుకున్నారు.

విలాసమైన జీవనానికీ, ధనం వల్ల సంక్రమించే వ్యసనాలకీ బానిసలయ్యారు. దశాబ్దాలుగా వున్న ధర్మ సత్రాలూ, బీదలకు ఉచిత భోజన సదుపాయాలూ రాజు రద్దు చేసాడు. సాధువులూ, భిక్షగాళ్ళు సోమరులనీ, వారి వల్ల ఉపయోగం లేకపోగా, హాని అని భావించి, అటువంటి వారు కనిపిస్తే వారిని కారాగారంలో పెట్టించేవాడు. కఠినంగా శిక్షించేవాడు.

ఆ దేశ ప్రజలు దాన ధర్మాలు చేయ్యాలంటే రహస్యంగా చెయ్య వలసిందే! ...

ఇలా వుండగా, ఒక రోజు ఒక వింత జరిగింది.

నిండు సభలో ఒక సాధువు ప్రవేశించాడు.

ఏ మాత్రమూ భయమూ, జంకూ లేకుండా నడిచి వస్తున్న అతన్ని చూసి,

రాజు కోపంతో ఊగి పోయాడు.. 'ఎవరు రానిచ్చారు? ..ఈ సాధువుకూ, రానిచ్చిన భటులకు మరణ దండనే!' అని మనసులో ఒక నిశ్చయానికి వచ్చాడు.

రాజుకి అతి దగ్గరగా వచ్చిన ఆ సాధువు శాంత స్వరంతో అన్నాడు. 'రాజా! నేను మీ సభలో ప్రవేశించడానికి మీ భటుల అలసత్వం ఏమీ లేదు. అందుకని వారిని శిక్షించాలనే నీ మనసులోని ఆలోచనను విరమించుకో. నన్ను శిక్షించాలన్న నీ ఆలోచన ఊహల్లోకి రానీయకు!' రాజు ఆశ్చర్య పడ్డాడు...

తన మనసులో ఆలోచనని వున్నది వున్నట్టుగా చెప్పినందుకు.

కొన్ని క్షణాల తర్వాత రాజు ముఖంలో వెటకారంతో కూడిన నవ్వు మెరిసింది. 'నా సంగతి ముందే తెలుసుకుని నీవు ఇలా మాట్లాడుతున్నావు! భటుల సంగతి వదిలెయ్యి. నీవు లోపలకి వచ్చి పెద్ద తప్పు చేశావు. నీవు ప్రాణాలతో బయటకు వెళ్ళలేవు. అది తధ్యం.'



సాధువు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ' మేము 'ఇచ్చా గతులం'.. అవసరమనుకున్న చోటుకి వెళ్ళ గలం.. మాకు మీ రాజ ప్రసాదాలు కానీ, రాతి గోడలు గాని, ఆయుధ పాణులైన భటులు గాని మా గమనాన్ని ఆపలేరు. నేను వచ్చిన పని అయిన తర్వాతే వెడతాను. ' రాజు కోపంతో రగిలిపోతూ అన్నాడు. 'నీకేం కావాలి? మా రాజ్యంలో నీలాటి సోమరి పోతులకు చోటు లేదు. ఇక్కడ అంతా కష్టించి పని చేసి వారి దినభత్యం సంపాదించుకుంటారు. ... ఇక్కడ నీకు బిక్ష దొరకదు. క్షమించమని అడుగు. నీ ప్రాణాలు భిక్షగా వేస్తాను. ' .. సాధువు చిన్నగా నవ్వి అన్నాడు. 'నాకు నీ భిక్ష అవసరం లేదు. పంచ భూతాలైన, అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం నీ రాజ్యాన్ని చల్లగా చూస్తూ వున్నది ఇంత వరకు! అది మీ తాత తండ్రుల పుణ్య ఫలం!! అది అడుగంటే స్థితి వచ్చింది. హెచ్చరిక చేద్దామని వచ్చాను.'...



ప్రకృతి సిద్దంగా, ఋతువుల కనుగుణంగా వానలూ, భూసారం ఎక్కువ వుండడం వల్ల, సమృద్ధిగా పంటలు పండుతున్నాయని నమ్మిన రాజు అన్నాడు, ఎకసక్కెంగా , 'మరి అది తరగకుండా ఉండాలంటే మేమేం చేయాలో అది కూడా మీరే సెలవు ఇవ్వండి.'..అన్నాడు.

సాధువు శాంతంగా అన్నాడు. 'మీ కోట బయట ఒక పెద్ద కోశాగారం నిర్మించు.. చాలా పెద్దది.. దాదాపు మీ కోటంత. రాజా! నువ్వనుకున్నట్టు, అందరూ కష్టపడలేరు.. పిల్లలు, స్త్రీలు, వృద్ధులూ, అవిటి వాళ్ళూ, గుడ్డి వాళ్ళూ....., వీళ్ళకు ప్రభువు సాయం కావాలి. వారి నిశబ్ద రోదన నువ్వు వినలేవు. నీకున్న మానసిక పరిస్థితిలో నీకు ఏదీ వినపడదు. నీకు వినపడేటట్టు చేస్తాను.' అని కమండలంలో నీళ్ళు రాజు మీద చల్లాడు.

రాజు చెవులు బద్దలయ్యేటట్టు రోదనలు వినపడ్డాయి. వినలేక చెవులు మూసుకున్నాడు. కర్ణ కఠోరమైన ఆ శబ్దాలు భరించలేకపోయాడు. కోపం పోయింది. ఇంతవరకు వున్న భ్రమ .. తన రాజ్యంలో అందరూ ఆనందంగా వున్నారన్న

భ్రమ తొలగిపోయింది.

అప్పుడు, రాజు అన్నాడు. 'చాలు.. ! ఇక వినలేను ఆపండి.'

రాజుకి సాధువు శక్తి అర్థమైంది. తాను ఈ సాధువుని ఏమీ చేయలేనని కూడా అర్థమైంది.

ప్రార్థానా పూర్వకంగా అడిగాడు. 'ఏం చేయాలో సెలవివ్వండి. నేను ఎందఱో కుహనా సాధుసంతులను చూశాను. భుక్తి కోసం, పని చెయ్యకుండా బతకడం కోసం వాళ్ళు చేసే నిరర్థక ప్రసంగాలు విన్నాను. ఆ అనుభవంతో మీతో పరుషంగా మాట్లాడాను. ప్రవర్తించాను.' అన్నాడు.

'క్షమించమని' అడగడానికి రాజునన్న అహంకారం అడ్డు వచ్చింది.

'రాజు ప్రజా రక్షకుడు.. అందరి అవసరాలు తీర్చాలి. ఇక ఆ పనిలో వుండు. ఇంకొక విషయం.. నువ్వే చేసే ప్రజా హిత కార్యక్రమాలకు నీకు వెంటనే ప్రతిఫలం కనబడుతుంది. నీవు చేసే ప్రతి పనికీ నీ కోశాగారంలో విలువైన కానుక పడుతుంది.' అని వెళ్లి పోయాడు. రాజు సందిగ్ధంలో పడ్డాడు. నెమ్మదిగా ఈ సాధువు శక్తులు పరీక్ష చేయాలని అనుకున్నాడు. సాధువు వెళ్లిపోతూంటే, ఆప లేదు. అది వృధా ప్రయాస అని తెలుసుకున్నాడు. తన సైన్యం, తన శక్తీ అతడి ముందు పని చెయ్యదని గ్రహించాడు. 'సరే! చూద్దాం' అని సాధువు చెప్పినట్టు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

బిక్షకులకు కోటలో అన్నదానం ఏర్పాటు చేయించాడు. కోట బయట ఒక చిన్న గది తాత్కాలికంగా కట్టించాడు. అన్నదానం అయిన తర్వాత వెళ్లి చూసాడు. కొన్ని రాగి నాణేలు కనపడ్డాయి. తర్వాత రాజు, మూసేసిన సత్రవులను, భిక్షుకా గృహాలను తెరిపించాడు. రాగి నాణేలతో గది నిండింది. పంట చెరువులు, పంట కాలువలూ ఇదివరకే వున్నాయి. వాటి ఉపయోగానికీ రైతుల నుంచి వసూలు చేసే సుంకం రద్దు చేశాడు. మరో గది కట్టించాడు. తొందరగా అదీ నిండింది. ఈ సారీ వెండి నాణేలు, బంగారు నాణేలు దర్శ మిచ్చాయి. దేవాలయాలకు మరమ్మతులు చేయించాడు. వాటి నిర్వహణకు నిధులు, భూములూ ఇచ్చాడు. క్రమంగా కోట బయట కోశాగారం నిండి పోయింది. అయితే...

రాజరాజవర్మ రాజ్యానికి చేటు కాలం ప్రాప్తించింది. భయకరమైన కరువు పట్టి పీడించింది. రాజు కట్టిన చెరువుల వల్ల, కొంత వరకూ తాగు నీటి సమస్య లేక పోయినా, పంట భూములకు నీరు లేదు. వర్షాలు లేవు. 'అన్నమో రామచంద్రా!' అని పేద ప్రజలే కాకుండా, ధన వంతులూ, రాజ ప్రముఖులూ, అలమటిస్తున్నారు.

అప్పుడు మంత్రి ఒక సలహా ఇచ్చాడు. 'రాజా! మన కోట బయట కోశాగారంలో అంతు లేని ధన రాసులున్నాయి. వాటిని వుపయోగించి బయట దేశాలనుంచి ఆహారధాన్యాలు దిగుమతి చేసుకుందాం!' అన్నాడు. ఇది వరకైతే మంత్రి సలహా ఇచ్చే సాహసం చేసే వాడు కాదు. రాజులో కోప తాపాలు పోయి నెమ్మది తనం వచ్చింది. 'సరే!' అన్నాడు రాజు.

అప్పుడు అనుకోనిది జరిగింది. రాజు ఆ అపార ధన రాసుల మీద చెయ్యి వెయ్య గానే అవి కఠిన పాషాణాలుగా మారి పోయాయి. నివ్వెర పోయిన రాజుకు చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సాధువు గుర్తు కొచ్చాడు. ' మంచి పనులూ, ధర్మ కార్యాలు చేస్తే ఇదా ఫలితం? ఏమి స్వామీ! ఈ విషాదం? ఏమీ చేయ్యనప్పుడే నా దేశం సస్య శ్యామలంగా వుండేది. నీవు చెప్పినట్టు చేస్తే ఇదా దాని పర్యవసానం?'అని పెద్దగా రోదించాడు.

'నా ప్రజలు అతి దీనంగా మెతుకు లేక బాధ పడుతూ వున్నారు? వీరికి మేలు చేయ లేని ఈ శరీరం ఎందుకు? కాలగతిలో నాకూ వృద్ధాప్యం వచ్చింది. ఎంతో కాలం నా జీవనం సాగదు.' అనుకుని మంత్రికి ఆజ్ఞ ఇచ్చాడు.

'ఆగ్రహించిన ఆ వరుణునికి నా రక్త తర్పణం ఇవ్వ దలుచుకున్నాను. బలి పీఠం ఏర్పాటు చెయ్యండి.' అని.
రాజు బలిదానం వార్త తెలిసి ప్రజలు గుమి కూడారు. ఎండిన డొక్కలతో, కృశించిన దుర్బల శరీరాలతో ఉన్న జనాన్ని చూసి రాజు కనీళ్ళు పెట్టుకున్నాడు. జనం ఈ దారుణం చూడానికి సిద్దంగా లేరు. వద్దని చెప్పే శక్తీ లేదు. శోక తప్త హృదయాలతో సిద్ధంగా వున్నారు.

రాజు కత్తి తీసుకుని తల నరుక్కోవడానికి సిద్ధం అయ్యాడు.

కత్తి ఎత్తి తలమీద వేటు వేసుకునే సమయానికి సాధువు ప్రత్యక్ష మయ్యాడు. 'ఆగు! రాజా!.. ఇది నీకు తగదు.' అన్నాడు.

హఠాత్తుగా ప్రత్యక్షమైన సాధువును చూసి రాజు దీనంగా అన్నాడు. 'మీరు చెప్పిన్నట్టు చేసినా నా ప్రజలకు ఈ కరువు పీడ తప్ప లేదు. కోశాగారంలో నిండుగా ధనం వుంది... నేను చెయ్యి వేయగానే అది పాషాణ శకలాలుగా మారిపోయాయి.' సాధువు రాజు తలమీద చెయ్యి వుంచి ఇలా అన్నాడు. 'ఒక కఠోర సత్యాన్ని నీవు మరిచావు. .. తల్లి తండ్రుల పుణ్య కార్యాలు వారి వారసులకు తప్ప ఆ కార్యాలు చేసిన వారికి చెందవు. నువ్వు చెప్పిన పాషాణాలు రాత్నాలుగా మారి భూగర్భంలో చేరుతాయి. అది నీ వారసుల ఆస్తి. భూమిలో విలువైన రత్నాలతో, భూమి పైన అపురూప ఆమ్ర (మామిడి) ఫలాలిచ్చే భూమిగా ఈ ప్రదేశం మారుతుంది. కాల క్రమంలో ఇది రత్నగర్భగా పిలవ బడుతుంది.' అని నిష్క్రమించాడు. వెళ్లబోయేముందు, సాధువు అన్నాడు ... ఈ కరువు తాత్కాలికమే..'

రాజరాజ వర్మ, ప్రజలూ సంభ్రమంతో చూస్తూ ఉండగానే, నల్లని కరి మబ్బులు పెళ పెళా రావాలతో ఆ రాజ్యాన్ని కప్పివేసాయి...క్రమంగా పరిస్థితులు చక్క బడ్డాయి. సంవత్సరాలు గడిచినా, రాజు ఏ పని చేస్తున్నా సాధువు మాటలు చెవిలో గింగురుమంటూ వున్నాయి. పెద్దల పుణ్యం పిల్లలకే ..సంతానం బాగుండాలంటే పెద్దల బుద్ధులు సరిగా వుండాలి.

పాఠ్య పుస్తకాలలో ఒక పాఠ్యాశం అయింది అప్పటి నుంచి. కాలగమనంలో రాజూ, రాజ్యమూ పోయాయి. ఆయన పెట్టిన పాఠ్యాశం ఆ ప్రదేశంలో ఇప్పటికీ వుంది.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి