నలుపు - తెలుపు - డా. అప్పారావు పంతంగి

nalupu-telupu

“బ్లాక్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది.

ఏ నెరోలాక్ పెయింట్స్ కో, ఏషియన్ పెయింట్స్ కో లేక ఐటెక్స్ కాటుక కంపెనీకో తెలిస్తే టెండర్స్ లేకుండానే తన్నుకొని ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకెళ్లిపోతారు ఈ ప్రోడక్ట్ ని ....

వంద ఎకరాల చెరువులోనైనా సరే ఒక్కసారి ముంచి లేపామంటే ఇక ఆ నీళ్ళన్నీ బ్లాకైపోతాయి...

యమునా ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు రేయి కిట్టయ్యతోటి కూ... డా...వా... అన్నట్టు

ఏమి బ్లాక్ రా! బాబు... ఇంతటి నలుపుని నేను ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు...

చీకటికి చిరునామాలా ఉంది... నిశీధికి నియరెస్ట్ లా ఉంది... అంధకారానికి ఆప్తులన్నట్టుంది...

బొగ్గుల్ని రాశిగా వేసినట్టు... మినుమిల్ని కుప్పగా పోసినట్టు... నల్లద్రాక్షల్ని నిండుగా చూసినట్టు...

మొత్తం మీద ‘రేయి కిట్టయ్యతో కూడిన యమునా నది’ ఎగసినట్టు ... అబ్బో..., బ్లాక్ కి బంధువులా ఉంది.

ఒక కన్ను కాటికి చూస్తున్నట్టు... ఒక కన్ను ఏటికి చూస్తున్నట్టు... ఏమి నయన సౌందర్యమో, ఏమి నయనానందమో...

నవ్వితే చాలు కనీసం నలుగురైనా చస్తారనడంలో ఆశ్చర్యం లేదు...

ఆ నవ్వు గన్నేరు పువ్వు, ఆ నవ్వు నరకాన వేసే కెవ్వు ...

తక్కువలో తక్కువ పంటికీ పంటికీ పదికిలోమీటర్ల దూరం...

ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్ చేయడానికి డెంటిస్ట్ లు పనిచేయరు... ఏ రాంకీ కన్ స్ట్రక్షన్స్ కో కాంట్రాక్ట్ ఇవ్వాలి....

అన్నింటినీ మించి ఎండిపోయిన తామరాకుల్లా ఉన్న శరీర సౌష్టవం...

వెరసి... నా జీవితంలో నేను చూసిన అత్యంత అందవిహీనమైన ప్రాణి... జీవి... తనే...

ఇలాంటి వాళ్ళకు కూడా పెళ్లవుతుందా...!? ఎవరికి రాసి పెట్టిఉందో ... మహానుభావుడు ... ప్రపంచంలో వాడికంటే దురదృష్టవంతుడు
ఇంకెవరూ ఉండరు. అప్పుడు ఈమెకంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు...”

*****

“నిరంజన్ కి ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి... కాళ్ళు వణుకుతున్నాయి... మంచినీళ్లు నోట్లో పోసుకో వాల్సింది ఒంటి మీద పోసుకున్నాడు. షర్టoతా తడిసిపోయింది. పక్కన ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాడు... ఓ... బస్ లో నాన్ స్టాప్ గా వాగినవాడు కాలేజ్ క్యాంపస్ లో ఆవిడ ప్రిన్సిపల్ తో మాట్లాడుతుంటే ఏం జరుగుతుందా అని నోరెల్లబెట్టి చూస్తున్నాడు. బస్ లో ఆవిడను కామెంట్ చేసినందుకు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తుoదని, ఈ రోజు నీ పని అయిపోయినట్టేనని ప్రెండ్స్ ఇంకా భయపెడుతున్నారు. వాడి భయానికి తగ్గట్టు ప్రిన్సిపల్ ఆవిడను తీసుకొని నిరంజన్ క్లాస్ వైపే వస్తుంది. ఆవిడ అసలే చండశాసనురాలు... అమ్మాయిలవైపు తలెత్తి చూడాలంటే అక్కడి అబ్బాయిలకు అది జీవన్మరణ సమస్య... పొరపాటున మాట్లాడారంటే వాడి నెత్తిన వాడు యాసిడ్ పోసుకున్నట్టే... లేదంటే వాడికి వాడే యావజ్జీవ కారాగార శిక్ష వేసుకున్నట్టే... లేదంటే ఉరిశిక్ష.... అలాంటిది ఒక అమ్మాయిని కామెంట్ చేయడం... జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఆలోచన కూడా నిరంజన్ దరిదాపులకి రావడం లేదు...”

*****

“గుడ్ మార్నింగ్ మేమ్...”

“వెరీ గుడ్ మార్నింగ్”

“షి ఈజ్ నిస్సీ”

“షి ఈజ్ ఫ్రం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అపాయింటెడ్ ఫర్ మోరల్ క్లాసెస్...”

“మీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచడానికి, మీలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, మీకు ఆత్మ విమర్శను పరిచయంచేయడానికి, ఆత్మాభిమానానికి అర్ధం చెప్పడానికి ఆవిడ ఇక్కడ అపాయింట్ చేయబడ్డారు. శ్రద్దగా నేర్చుకోండి... మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఆల్ ది బెస్ట్...”

“థాంక్యూ మేమ్...”

*****

“నా పేరు నిస్సీ...”

“నాట్ నిశి”

“నిశి మీన్స్ చీకటి ... నిస్సి మీన్స్ విజయo .... సో... ఐ యామ్ నిస్సి. నేను యూనువర్సిటీ ఆఫ్ హైదారాబాద్ నుంచి సైకాలజీలో పిహెచ్.డి చేశాను”

“వాళ్ళతో మాట్లాడుతూనే ఆవిడ నిరంజన్ ని గమనించింది. తనను చూడగానే తన పరిస్థితిని అర్ధం చేసుకుంది. అందుకే తను చేసిన తప్పు తానే తప్పని తెలుసుకునేలా, తనలో ఉన్న భయాన్ని పోగొట్టేలా మాట్లాడాలను కుంది.”

నేను ముందుగా మీతో మాట్లాడాలనుకునే మొదటి అంశం ‘కామెంట్స్...’ ”

“నిరంజన్ కి ఏదో అర్ధమవుతున్నట్టుంది... కానీ ఏమీ అర్ధం కావడం లేదు.... కానీ ఒకటి మాత్రం నిజం అనుకున్నాడు. తను ఇప్పుడు తన గురించే చెప్పబోతున్నదని, తన పరువు పోవడం ఖాయమని...”

“ఏ వయసులో చేయాల్సిన పనిని ఆ వయసులోనే చేయాలని మన పెద్దలు అంటుంటారు. ఈ వయసులో మనం అంటే మీరు చేయాల్సిన పని కామెంట్ చేయడం... కామెంట్స్ చాలా బావుంటాయి. ఎంత వరకు బావుంటా యంటే అవతలి వాళ్ళు ఇబ్బంది పడనంత వరకు బావుంటాయి. అవతలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నా మనం కామెంట్ చేస్తూనే ఉంటే అదే ర్యాగింగ్ గా మారుతుంది... అదే ‘నువ్వు మనిషివి’ అనే సంగతి నువ్వు మరిచిపోయేలా చేస్తుంది. అప్పుడు మీకది తప్పని అర్ధం కాదు. కానీ మీరు కామెంట్ చేసిన వాళ్ళు మీకు ఎదురైతే, ఎదురుతిరిగితే, మీకు కావలసిన వాళ్లైతే, మీరు కలిసుండాల్సిన వాళ్లైతే అప్పుడు మిమ్మల్ని మీరు ‘ఆత్మవిమర్శ’ చేసుకుంటే అర్ధమవుతుంది. మీరు చేసింది తప్పా? ఒప్పా? అనే విషయం. సాధారణంగా నన్ను నాముందు, నావెనుక, నాకు తెలిసి, నాకు తెలియకుండా ఎంతో మంది కామెంట్ చేస్తుంటారు. నేను ఏరోజూ నాలో ఉన్న ‘ఆత్మస్థైర్యాన్ని’ కోల్పోలేదు. ఇంకా సంతోషపడ్డాను, ఎందు కంటే నన్ను కామెంట్ చేసుకుంటూ ఎంతో మంది సంతోషపడుతున్నారు, నవ్వుకుంటున్నారు. నారూపం, నారంగు నా చుట్టూ ఉన్న వాళ్ళను నవ్విస్తున్నందుకు సంతోషపడుతున్నాను. ఆ తరువాత ఎప్పుడైనా నన్ను కామెంట్ చేసిన వాళ్ళు కనిపించినా, ఎదురుపడినా నేను ఏ మాత్రమూ వాళ్ళను నిలదీయను. ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ‘గతం గుర్తు చేసుకుంటే వర్తమానం బాధిస్తుందేమో.... భవిష్యత్తును శాసిస్తుందేమో...’”

“నిరంజన్ ఇప్పుడు మామూలు స్థితికి వచ్చాడు...”

“మీకు ఇంకో విషయం తెలుసా? నేను ఎక్కడ పుట్టానో నాకు తెలియదు... కానీ ఊహ తెలిసిన దగ్గరనుంచి మథర్ థెరీసా అనాథ శరణాలయంలోనే పెరిగాను. అక్కడ ఉండే చదువుకున్నాను. ఆవిడే నాకు మథర్... ఫాదర్... అన్నీ ... నాకు ఎవరూ లేరని, ఒంటరి దానినని నేను ఏరోజూ అనుకోలేదు. నాలాంటి వాళ్లెoదరో ఈ లోకంలో ఉన్నారు వాళ్ళంతా నా వాళ్లనుకున్నాను. ఏరోజూ ‘ఆత్మవిశ్వాసాన్ని’ కోల్పోలేదు. సంకల్పం గొప్పదైతే అదే ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని నమ్మాను. కందుకూరి, గురజాడ, సోక్రటీస్, న్యూటన్, శ్రీనివాస రామానుజన్, జగదీశ్ చంద్రబోస్, ఎఱ్ఱాప్రగడ సుబ్బారావ్, అబ్రహంలింకన్, అంబేడ్కర్... ఇలా ఎంతో మంది వాళ్ళు చేరాలనుకున్న లక్ష్యాలను చేరే క్రమంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదురైనా ఎక్కడా రాజీ పడలేదు, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. వాళ్ళు అందంగా ఉంటారా? అందవిహీనంగా ఉంటారా? అని చూడలేదు సమాజం వాళ్ళలో ఉన్న ప్రతిభను మాత్రమే చూసింది. కాబట్టి చదువుకోవడానికి, ఎదగడానికి అందం అవసరమే కానీ అది శారీరక అందం కాదు మానసిక అందం, మనసు అందం అదే మనిషికి అందం... ఆ అందం మీలో ఉందా? అయితే మీరు కూడా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారేమో...”

ఈ నేపథ్యంలో మీకో విషయం చెప్పాలి.... నన్ను కామెంట్ చేస్తూ ఓ అబ్బాయి వాడిన పదాలు ఎంతబాగున్నాయంటే... అతను కొంచెం మనసు పెడితే మంచి కవిలా మారిపోతాడు...

“చీకటికి చిరునామాలా ఉంది... నిశీధికి నియరెస్ట్ లా ఉంది... అంధకారానికి ఆప్తులన్నట్టుంది...

బొగ్గుల్ని రాశిగా వేసినట్టు... మినుమిల్ని కుప్పగా పోసినట్టు... నల్లద్రాక్షల్ని నిండుగా చూసినట్టు...” చూసారా ఎంత బాగున్నాయో.... నిజానికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంత అందంగా ఉన్నా వాళ్ళ జుట్టు ఎంత నల్లగా ఉంటే వాళ్ళ అందం అంతగా ఇనుమడిస్తుంది... అంతేకాదు నల్లగా ఉన్న కళ్లే అందంగా ఉంటాయి ... పగలు కూడా చందమామ ఉంటుంది కానీ నల్లని చీకట్లోనే మనకది కనిపిస్తుంది... ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అని అబ్దుల్ కలాం అన్న ఆ అందమైన కలలు కూడా నల్లని చీకట్లోనే వస్తాయి... నల్లని నిశీధిలోని భయం... నల్లని చీకట్లోని ప్రేమ... నీ వాళ్ళను నీకు మరింత దగ్గర చేస్తుంది...‘చీకటి మనకు చిరునామా కాకపోవచ్చు కానీ చీకటికి మనమే చిరునామా...’

‘నిశీధికి మనం నియరెస్ట్ కాకపోవచ్చు కానీ నిశీధి మనకు ఎప్పుడూ నియర్ గానే ఉంటుంది...’

‘అంధకారానికి మనం ఆప్తులం కాకపోవచ్చు కానీ ఒకరికొకరు ఆప్తులమై కూడా అంధకారానికి అవకాశం ఇస్తున్నాం’

‘బొగ్గుల రాశిగా మనం ఉన్నా అదికాలితే వెలుగిస్తుందని, అది నల్ల బంగారమని... అనే విషయాన్ని మరిచిపోతున్నాం...’

‘మినుములకుప్పగా మనమున్నా, నల్లనిద్రాక్షలా మనమున్నా వాటి వల్ల పొందే ప్రయోజనాలని మాత్రం విస్మరి స్తున్నాం...’ వాటితో మనల్ని పోల్చుకుంటూ వాటి విలువని దిగజారుస్తున్నాం...

“నల్లని రంగులలోనైనా.... పైపైన కనిపించే హంగులలోనైనా... మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అలా మనకు తెలియనిది తెలుసుకునే విషయంలో చిన్నవారినైనా గౌరవించాలి, చిన్నవారిని ఆదర్శంగా తీసుకొనైనా అడుగులు ముందుకువేయాలి, ఎంత మాత్రమూ ఆలోచించాల్సిన అవసరమూ లేదు... సహాయం పొందాల్సి వస్తే మొహమాటాలు, ‘ఆత్మాభిమానo’ అంటూ కుంచించుకుపోవలసిన అవసరం అంతకన్నా లేదు. ‘మన దగ్గర లేని దానిని మన వాళ్ళ దగ్గర నుంచి పొందడానికి ఆలోచిస్తూ కూర్చుంటే కాలం కూడా నీతో పాటు ఆగిపోదనే విషయాన్ని గుర్తుచేసుకోండి...’

అంత గొప్ప పదాలను వాడి నన్ను కామెంట్ చేసిన ఆ అబ్బాయిని తిడుతూ కూర్చుంటే నేను ఇప్పుడు ఆ పదాల గురించి, తనకు తెలియకుండా తను వాడిన కవిత్వాన్ని గురించి ఇంత గొప్పగా చెప్పేదానిని కాదేమో ... కాబట్టి జీవితంలో ప్రతిదానిని పాజిటివ్ కోణం నుంచి చూడడానికి ప్రయత్నించండి... జరిగేదంతా మంచికోసమే అనుకోండి... అప్పుడే ఏదైనా సాధించగల సత్తా మీకొస్తుంది. ” థాంక్యూ... వుయ్ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్...

*****

“నిరంజన్ ఊపిరి పీల్చుకున్నాడు... హమ్మయ్యా! అందరి ముందు మేమ్... నా పరువు తీస్తుందనుకున్నాను కానీ అలా ఏంచేయలేదు. ఆవిడ ‘మేమ్’ కాదు ‘మామ్’ అవును నేను ఇంట్లో కూడా చాలా సార్లు తప్పు చేశాను. ప్రతిసారి అమ్మ నన్ను నాన్న నుంచి కాపాడుతూ ఉండేది. ఏం చేసినా వాడు చేసిన దానిలో అర్ధముంటుంది. అనవసరంగా ఎందుకు వాడిని అయినదానికి, కానిదానికి తిడుతుంటారు. అని అమ్మ నా తరపున మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో ఈ రోజు మేమ్ మాట్లాడుతున్నా అలానే అనిపించింది. నిజంగా ఈవిడ అమ్మే... అప్పుడు అనిపించింది నిరంజన్ కు తను తప్పు చేశానని... తప్పులు అందరూ చేస్తారు.... అందరూ సరిదిద్దుకుంటారు.... ఇక్కడ గొప్ప విషయమేమంటే నిరంజన్ కు ఆవిడ చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు అమ్మ కదా! అమ్మ అందంగా ఉండదని అనే వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా !?”

ఎంత అందంగా ఉందంటే

అన్ని రంగుల్నీ తనలో దాచుకున్న రంగులా...

పున్నమి వెన్నెల అంత వెలుగులా ... స్వచ్ఛమైన పాలంత తెలుపులా...

కమ్మని రాగాలును ఆలపించే ఆమనికోయిలలా...

గుండెల్లో గుచ్చినా కూడా క్షమించే దేవతలా...

ఆవిడ ఎంత అందంగా ఉందో... నాకెందుకు అంత అందం లేదని, ఆవిడ అందాన్ని ముందుగానే నేనెందుకు గుర్తించ లేదని నిరంజన్ లోలోపల అనుకుంటూ మేమ్ వైపు అడుగులేస్తున్నాడు... క్షమించమని అడగడం కోసం...

తను వేసే అడుగులు మేమ్ వైపు మాత్రమే కాదు...

“నిశీధి నుంచి వెలుగు వైపు...

పతనం నుంచి ఉన్నతం వైపు...

అంధకారం నుంచి అర్కజుని వైపు...

అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు...

చీకటి ఛాయల నుంచి కాంతి రేఖలవైపు...

కటిక హృదయం నుంచి కరుణ ఉదయం వైపు...

నలుపు నుంచి తెలుపు వైపు....

ప్రతి మనిషిలో నలుపు - తెలుపు రెండూ ఉంటాయి అవి చూసే మనిషి దృష్టిని బట్టి మారుతుంటాయి...”

నలుపు - తెలుపు రంగులు కాదు...

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు