డియర్ రుతిక,
నేను నీతో ప్రేమలో పడ్డాననిపిస్తోంది. పదిహేను రోజుల క్రితం మనం తొలిసారి కలిసినప్పుడే ఈ అభిప్రాయం కలిగింది. తొలిచూపులో ప్రేమపైన నమ్మకం లేకపోయినా... ఇప్పుడు తప్పనిసరిగా నమ్మాలనిపిస్తోంది....నీ అన్వేష్...
ఈ-మెయిల్ పంపిన సరిగ్గా రెండు నిముషాల తర్వాత అతని ఇన్ బాక్సులోకి ఆమె పంపిన సమాధానం వచ్చి చేరింది.
మైడియర్ అన్వేష్...
సరిగ్గా నేను చెప్పాలనుకుంటున్న మాటల్నే నువ్వు చెప్పావు... అన్నట్టు రేపు వీకెండ్ కదా.. ఐమాక్ స్ లో కలుసుకుందామా? ... లవింగ్లీ రుతిక
అన్వేష్ ఆనందం పట్టలేకపోయాడు. వెంటనే సమాధానం పంపాడు.
‘‘ తప్పకుండా... సరిగ్గా ఐదునిముషాల తక్కువ ఆరింటికి అక్కడ ఉంటా’’...
‘‘ నేను కూడా...’’ రుతిక.
అన్వేష్ సిగ్మా కంపెనీలో హెచ్.ఆర్. ఎగ్జిక్యూటివ్. ఓ రోజు కాబ్ లో వెళుతుండగా... అదే వాహనంలో వెళుతున్న రుతిక కనిపించింది. పలకరించాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడి వీడ్కోలు చెప్పుకుంటున్న సమయంలో ఒకరి చిరునామాలు మరొకరు ఇచ్చుకున్నారు. ఇది జరిగిన నాలుగురోజుల తర్వాత చోటుచేసుకున్న పరిణామం ఇది.
ఆ మర్నాడు ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు.కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక మొదటి ఆట సినిమా చూశారు.
‘‘ నేను ఆ దారిలో వెళతా. మిమ్మల్ని హాస్టల్లో దింపేసి వెళ్లిపోతా’’ చెప్పాడు అన్వేష్.
‘‘ అలాగే’’ ... తలాడించింది ఆమె.
దారిలో ఓ ఖరీదయిన రెస్టారెంట్ దగ్గర ఆపాడు.
‘‘ ఇక్కడ డిన్నర్ చేసి పోదాం. మీకేం అభ్యంతరం లేదుగా..’’ అడిగాడు.
‘‘ ఇబ్బందిలేదు. అలాగే చేద్దాం’’ అంది.
అన్వేష్ ఆమెను సినిమా టిక్కెట్ తీసుకోనివ్వలేదు. రెస్టారెంట్ బిల్లు తనే ఇస్తానన్నాడు. అందుకు రుతిక ఎలాంటి అడ్డు చెప్పలేదు.‘‘ మీతో గడిపిన నాలుగున్నర గంటల సమయం నాలుగు నిముషాల్లా గడిచిపోయింది.’’
అన్వేష్ నుంచి ఆ రోజు అర్ధరాత్రి మెయిల్లో వచ్చిన సందేశాన్ని అందుకుంది రుచిత.
అది చదివాక ఆమె మనసంతా ఆహ్లాదభరితమయింది. ఏమని జవాబు పంపాలా అని కాసేపు మధనపడి చివరికి క్లుప్తంగా... ‘సంతోషం’ అని బదులిచ్చింది.
తర్వాత నెల రోజులపైగా వందల సందేశాలు వాళ్ల మెయిల్సులో అటూ ఇటూ మారాయి. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. గంటలు గంటలు కబుర్లు చెప్పుకునేవారు. తమ బంధం మరింత ధృఢమవుతోంది.. రేపో మాపో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయచ్చు అని ఆమె అనుకుంటున్న తరుణంలో ...
ఆశ్చర్యకరంగా ఓ రోజు ఆమెకు అన్వేష్ నుంచి చిత్రమైన మెయిల్ వచ్చింది.
‘‘ ఆరునెలల వ్యవధిని మన ప్రేమ వ్యవహారానికి ప్రొబేషనరీగా పరిగణిద్దాం. ఆ తర్వాత మన మధ్య అవగాహన (కంపాటబులిటీ అని రాశాడు) మేరకు దాన్నికొనసాగించవచ్చు. ఇద్దరిలో ఒకరికి అభ్యంతరం ఉన్నా దాన్ని అక్కడికక్కడే ముగించనూ వచ్చు. ఈ మధ్య కాలంలో ప్రేమికులుగా రాణించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు మనం పొందవలసి ఉంటుంది. ఆన్ ది జాబ్ ట్రెయినింగ్ అన్నమాట...’’‘‘ పూర్తిగా ఉద్యోగ పరిభాషలో ఇదంతా చెప్పుకొచ్చాడు అనుకోకుండా ఉండలేకపోయింది. చదవటం కొనసాగించింది.
‘‘.... ఈ మధ్య కాలంలో హోటళ్లకు, సినిమాలకు ఇతరత్రా సరదాలకు వెచ్చించే మొత్తంలో చెరి సగం ఖర్చు భరించవలసి ఉంటుంది. ముందు.. ముందు .. నీ వ్యవహారశైలి బావుంటే.. సింహభాగం ఖర్చు నా జేబులో నుంచే పెడతాను. నీ కెట్టి అసౌకర్యం కలిగించనని ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను..’’
ఇప్పటివరకూ అయిన ఖర్చులో నీ వాటా రూ.3, 250 స్వయంగా గానీ లేదా చెక్ రూపంలో గానీ అందచేయగలవు. బిల్లు జత చేస్తున్నాను.’’
చదవటం ఆపి, డాక్యుమెంట్ ఎటాచ్ డ్ అన్న చోట క్లిక్ చేసింది. రిసార్టు బిల్లులు, హోటల్ బిల్లులు కనిపించాయి. ఏమిటీ చాదస్తం అనుకోకుండా ఉండలేకపోయింది.
‘‘.. ఇదంతా నీకు సమ్మతమేనని భావిస్తాను. నీ అంగీకారాన్ని లేదా ఆమోదాన్ని వారం రోజుల లోపుగా తెలియచేయని పక్షంలో మన మధ్య ఒప్పందం ఆటోమేటిక్ గా రద్దవుతుందని తెలియచేయటమైనది. ఈ ప్రతిపాదన నీకు నచ్చని పక్షంలో ఈ మెయిల్ ని నీ ఎదురుసీట్లో ఉన్న వసుమతికి పంపగలవు.. ఆమె సరైన వ్యక్తి కోసం అన్వేషిస్తోందని ఈ మధ్యనే తెలిసింది.’’
అప్పటి వరకూ సహనంగా ఉన్న రుతిక..
‘‘ మొదటి చూపులో ప్రేమలో పడ్డానని చెప్పిన వాడు.. ఇప్పడు ప్రొబేషనరీ పీరియడ్ లాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడేమిటి?’’కోపంగా అనుకుంది.
మొన్న రాత్రి రిసార్టులో జరిగిన విషయం ఆమెకు గుర్తుకొచ్చింది.
అక్కడేదో యూత్ ఫెస్టివల్ జరుగుతోందని వెళ్లారు.
విందులు, వినోదాలతో సరదాగా గడిచిపోయింది సమయమంతా. మనసును ఉర్రూతలూగించే సంగీతం, గేమ్స్ షోలు, ఆటపాటలు.. మధ్యమధ్యలో రకరకాల స్వీట్లు, కూల్ డ్రింకులు, సలాడ్లు సలాడ్సు, చివర్లో చవులూరించే భోజనం..
‘బలే మజా వచ్చింది కదూ..’’ అన్వేష్ అడిగాడు భోజనం పూర్తికాగానే.
‘‘ అవును. చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాననిపిస్తోంది. ’’ రుచిత ఉత్సాహంగా చెప్పింది.
‘‘ వాట్ నెక్స్ ట్’’... అడిగాడు .
‘‘ ఏముంది. సిటీకి తిరిగెళ్లటమే... కాబ్ ని పిలుద్దాం’’
‘‘ అప్పుడేనా?’’ నిరుత్సాహంగా అన్నాడు అన్వేష్. ‘‘ ఇక్కడ లేట్ నైట్ పార్టీ చాలా ఫేమస్ తెలుసా’’..?
‘‘ అర్థరాత్రా..? అప్పటి వరకూ ఇక్కడ ఏం చేస్తాం?’’
‘‘ ఏముంది? రెండు మూడు గంటలు రిలాక్సవుదాం. ఇక్కడ రూంలు కూడా ఉన్నాయట...’’
తన చెప్పదలుచుకున్నది పూర్తికాకుండానే గదిని సిద్ధం చేశాడు అన్వేష్. మారుమాటకుండా అతనితో గదిలోకి నడిచింది.ఆ తర్వాత మొదలయ్యింది అసలు వ్యవహారం. అన్వేష్ కావాలనే తనను అక్కడికి తీసికెళ్లాడని ఆమెకు అర్థమయింది.‘‘ నేను పక్క గదిలోకి వెళ్లి రిలాక్సవుతా ’’ చెప్పింది రుచిత.‘‘ అదేం కుదరదు. ఇద్దరం ఈ గదిలోనే’’... అంటూ ఆమెను బలంగా గుండెలకు హత్తుకున్నాడు. అతని ఉద్దేశం ఆమెకు అర్ధమయింది.
‘‘ ఇక్కడొద్దు ... ప్లీజ్.. వేరే డ్రెస్ కూడా తెచ్చుకోలేదు.’’
అన్వేష్ అదోలా నవ్వాడు. ‘‘ సాధారణంగా పెళ్లికి ముందు ఇలాంటివి వద్దు అంటారు ఆడపిల్లలు. నువ్వేంటి విచిత్రంగా...’’‘‘ నా గురించి నువ్వెలా అనుకున్నా ఫరవాలేదు. ప్రస్తుతానికి వద్దు’’.
‘‘ అదేం కుదుర్దు.... ఇంత దూరం కష్టం పడి వచ్చింది...’’
‘‘ వద్దన్నాను గా...’’ రుచిత.
‘‘ తప్పదు .. నీకు నచ్చినా నచ్చకపోయినా..’’ అంటూ.. ఆమె ఒంటిపైనున్న చున్నీని లాగి అవతల పారేసాడు.‘‘ నా ఇష్టం లేకుండా పిచ్చి వేషాలు వేస్తే కుదరదు.. ’’
అతని మొహంపైన పిడికిలి బిగించి ఒక్కటిచ్చింది రుచిత
అన్నేష్ ఇది ఊహించలేదు. అంత దూరాన వెళ్లి పడ్డాడు. అవమానభారంతో అతని మనసు కుతకుతలాడింది. కిందపడి ఉన్న అతన్ని ఆమెనే లేపి చెయ్యి అందించింది.
ఆ తర్వాత నవ్వుతూ చెప్పింది. ‘‘నేను కరాటే నేర్చుకున్నాను. ఇలాంటి సమయాల్లో ఉపయోగపడుతుందని..’’‘‘ నువ్వంటే నాకిష్టం అన్వేష్.
‘‘అదేదో దొంగతనం చేసినట్టు ... హడావిడిగా... చాటుమాటుగా దేనికి?
.. మరెప్పుడయినా.. నువ్వు కోరినట్టే.. ఒకేనా?’’
అతని చెక్కిళ్లపైన గాఢమైన ముద్దిచ్చింది.
ఆమె అంత తేలిగ్గా తనని క్షమిస్తుందని అతను ఊహించలేదు.
తన ప్రణాళిక విఫలమయినందుకు మనసు విలవిలలాడినా...
పైకి మాత్రం నవ్వుతూ ఉండిపోయాడు.
ఆ రోజు రాత్రంతా ఆమెతోనే గడిపాడు.
ఆ తర్వాత వారం మామూలుగానే ఇద్దరం సినిమాకు, రెస్టారెంట్ కి వెళ్లారు.
‘‘ అన్వేష్ తనను ప్రేమించటం లేదు. శారీరకంగా తనను కోరకుంటున్నాడంతే.. తను దక్కలేదన్న కోపంతో ఇప్పుడు వదిలించుకోవాలనుకుంటున్నాడు.’’
రుచిత మనసంతా కల్లోలంగా మారింది.
‘‘తనకు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టాననుకుంటున్నాడు. ఆ విషయాన్ని సూటిగా చెప్పలేక ఇలా నాటకం ఆడుతున్నాడన్నమాట...అతన్ని వాడుకోవాలని తను ఏ నాడూ అనుకోలేదు.
కలిసి సరదాగా గడపాలి. బోలెడు కబుర్లు చెప్పుకోవాలని మాత్రం అనుకునేది.
అందుకే బయటకెళ్లినప్పుడు చాలా సార్లు తను డెబిట్ కార్డు తీసేది.
నీ ఖర్చంతా నాదే. నా సమక్షంలో నువ్వు డబ్బు ప్రస్తావన చేయద్దు అంటూ అతనే నిరాకరించేవాడు.’’
ఆ రాత్రి చాలాసేపు ఆలోచనలతో సతమతమయింది.
ఓడిపోతున్న భావన ఆమెకు నిద్రపట్టనివ్వలేదు.
చివరికి ఆమె మెదడులో మెరుపు మెరిసింది. మంచం మీద నుంచ లేచివెళ్లి లాప్ టాప్ ఆన్ చేసింది.
మెసేజ్ కంపోజ్ చేయటం మొదలుపెట్టింది.
‘‘ మిస్టర్ అన్వేష్...
నీవు పంపిన సందేశం నాకెంతో ఆహ్లాదాన్ని కలిగించింది.
నాకు పరిచయం ఉన్న సుశీల్, సుశాంత్, విక్రమ్ లలో ఎవరికీ లేని ప్రత్యేకత నీకుంది.
నీ ప్రతిపాదనలూ నాకు నచ్చాయి.
ఆ మాటకొస్తే.. ఇంత కాలిక్యులేటెడ్ గా ఇంకెవరకూ ఉండరేమో అనిపిస్తోంది. ఐ అడ్మైర్ యు.
పోతే నువ్వు పేర్కొంటున్న రెండు సందర్భాలూ నాకు రెండు వేర్వేరు అనుభవాలను మిగిల్చాయి.
ఓ నిముషం ఆగి మళ్లీ కంపోజ్ చేయటం కొనసాగించింది.. ‘‘ మొన్న డిన్నర్ చేసొచ్చాక .. ఇంటికి రాగానే ఒకటే వాంతులు...అప్పటికప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పరిగెత్తాను. కొంచెం ఆలస్యమయితే ప్రాణానికే ప్రమాదం అయి ఉండేదని చెప్పారు.ఫుడ్ కంటామినేషన్ అట.
అంత చిన్నవిషయం ప్రాణాంతకమా? నాకు అర్ధం కాలేదు. మరుసటి రోజు పాతికవేల బిల్లు తీసి చేతిలో పెట్టారు.
నువ్వు చెప్పిన ప్రకారం.. అందులో సగం బిల్లు నా ఎక్కౌంట్లో నువ్వే వేయాలి.ఏమంటావ్...’’రుచిత చేతివేళ్లు .. ఆమె ఆలోచనలలాగానే కీప్యాడ్ పైన వేగంగా పరుగులు తీస్తున్నాయ్.
‘‘... ఐమాక్సులో నన్ను నువ్వు సినిమా చూడనిస్తేనా?
ఆ రెండున్నర గంటలు నన్ను ముద్దులతో ఊపిరిసలపకుండా చేశావ్... ఆనందంవల్లో, ఉద్వేగం వల్లో తెలియదు.. అంత ఏసీ గదిలోనూ నాకు చెమటలు పట్టేశాయి.
ఈ సారి తీరిగ్గా మళ్లీ అదే సినిమా చూడాలి.
ఇంటి దగ్గర కొచ్చిన నుంచి అవే ఆలోచనలు మళ్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఎప్పుడెప్పుడు కలుద్దామా అని నా మనసు ఆరాటపడుతోంది.
అయితే.. ప్చ్.. మరో వారం రోజుల దాకా మనం కలిసే అవకాశం లేదు.
మా కొలీగ్ సుశాంత్ తో కలసి బెంగుళూరు వెళుతున్నా.
సుశాంత్ భలే చలాకీగా ఉంటాడు. నేనంటే చచ్చేంత ఇష్టం.
అప్పుడప్పుడు బహుమతులిచ్చి నన్ను సర్ఫ్రైజ్ చేస్తూంటాడు.
ఈ మెసేజ్ పంపుతున్న లాప్ టాప్ కూడా అతనిచ్చిందే.
నేను బెంగుళూరు నుంచి రాగానే కలుద్దాం. అప్పుడు అతను నాకిచ్చిన బహుమతులన్నీ చూపెడతా. అన్నట్టు నాది హెవీ షెడ్యూల్. నేను తిరిగొచ్చేవరకూ నో మెయిల్స్, నో మెసేజెస్, నో ఫోన్ కాల్స్ ప్లీజ్. ’’
రుచిత పెదాలపైన చిరుమందహాసం
‘‘ ఈ దెబ్బతో అన్వేష్ గాడికి చుక్కలు కనిపిస్తాయి. సుశాంత్ అనేవాడెవడా అని ఆలోచిస్తాడు. తనకీ, వాడికీ ఖచ్చితంగా సంబంధం ఉందని బలంగా నమ్ముతాడు. ఇక ఈ జన్మలో తన జోలికి రాడు’’ అనుకుంది. అన్వేష్ మొహంలో మెసేజ్ చదువుతుంటే కలిగే భావాలను ఊహించుకుంటున్న కొద్దీ ఆమెలో ఏదో తెలియని తృప్తి. కసితీర్చుకున్నానన్న భావన.
మరోసారి తృప్తిగా చదువుకుని మెసేజి పంపేసింది.
‘మెసేజ్ డెలివర్డ్ ’ అన్న అక్షరాలు కనిపించగానే సిస్టమ్ ని షట్ డౌన్ చేసేసి మంచం మీద వాలింది.
ఇంతకు ముందులా ఆలోచనలు ఆమెను ఇబ్బంది పెట్టలేదు. మనసు ప్రశాంతస్థితికి చేరింది.
‘‘ఇప్పుడు తను కొత్తగా సుశాంత్ ని వెతుక్కోవాలి.
అసలు అలాంటి వ్యక్తి ఉన్నాడో లేడో..
ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంది రుచిత.