సుదీపుడి ఆశయం - నారంశెట్టి ఉమామహేశ్వరరావు

sudeepudi ashayam

శ్రీపురంలో ఉండే సుదీపుడుకి ఆదర్శభావాలు ఉన్నాయి. తమవూరికి పనికొచ్చే పనులు చేస్తుండేవాడు. అతడంటే గ్రామస్తులకు అభిమానం ఉండేది. ఇంకా ఏవైనా గొప్ప పనులు చేసి తమ ఊరుకి పేరు తేవాలన్న అతడి ఉద్దేశం మిత్రులతో చెప్పేవాడు. వారికి మరింత గౌరవం పెరిగింది. తమ వూరిలోని స్త్రీలు చెరువు నుండి నీరు మోసే దారి బాగులేకపోవడం చూసాడు సుదీపుడు. ముళ్ళ మొక్కలతో నిండిన దారిలో నడవడం కష్టంగా ఉందని పోల్చుకుని స్నేహితులతో కలిసి దారిని శుభ్రం చేయించాడు.వాళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు అక్కడకి నందనుడు అనే మిత్రుడు వచ్చాడు.

అతడు సుదీపుడితో “మన ప్రక్క వూరులో ఈ సాయంత్రం బరువులు ఎత్తే పోటీ ఉంది. నువ్వు బలంగా ఉంటావు. బరువు ఎత్తగలవు. అక్కడకి వెళ్ళావంటే బహుమతి వస్తుంది” అన్నాడు.

చుట్టూ ఉన్న మిత్రులు సుదీపుడిని ప్రోత్సహించారు. “నువ్వు వెళ్ళావంటే తప్పకుండ గెలుస్తావు. మన వూరికి గుర్తింపు తేవాలన్న నీ కోరిక తీరుతుంది” అన్నారు.

వాళ్ళ మాటలతో సుదీపుడిలో నమ్మకం పెరిగింది. తమ వూరికి పేరు వస్తుందoటే మంచిదే కదా అనుకుని “తప్పకుండా వెళదాము. నాకూ నా బలమేమిటో తెలుస్తుంది. మీరు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది” అని చెప్పాడు.

అందరూ కలిసి సాయంత్రం పొరుగూరు వెళ్ళారు. వూరి మధ్య ఉన్న రచ్చబండ దగ్గర పోటీలు జరుగుతున్నాయి. పోటీలో పాల్గోడానికి చాలా ఊర్ల నుండి యాభై మంది వరకూ యువకులు వచ్చారు. రచ్చబండ మీద న్యాయనిర్ణేతలు, బహుమతి ప్రదాతలు కూర్చున్నారు.

రచ్చబండ ఎదురుగా ఉన్న స్థలంలో ఇసుక పోసిన ప్రదేశంలో నునుపుగా, గుండ్రంగా చెక్కిన బండరాళ్ళు చిన్నవి మొదలు పెద్దవి వరకూ పదికి పైగా ఉన్నాయి. రాయికి మధ్య భాగంలో చేతులతో ఎత్తి పట్టుకునే విధంగా పిడి చెక్కి ఉంది. పాతిక కిలోల బరువు మొదలు వంద కిలోల వరకూ ఉన్నాయి.

పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీ నియమ నిబంధనలు మరొకసారి చెప్పాడు గ్రామపెద్ద. “ముగ్గురుకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇస్తాo. రాయిని పైకెత్తి కనీసం రెండు నిముషాలు గాలిలో ఉంచాలి” అని చెప్పాడు.

అక్కడకి వచ్చిన యువకుల్లో సుదీపుడి కంటే బలమైనవాళ్ళు ఉన్నారు. బలహీనులూ వచ్చారు. కొందరు యాభై కిలోల రాయి పైకి ఎత్తగలిగారు. మరికొందరు ఎనభై కిలోల రాయి వరకూ పైకి లేపగలిగారు. వాళ్ళ బలానికి సుదీపుసు ఆశ్చర్యపోయాడు.

సుదీపుడి వంతు వచ్చినప్పుడు తన కంటే బలహీనులు ఎత్తిన బరువులు గుర్తు తెచ్చుకున్నాడు. వాళ్ళు యాభై నుండి అరవై కిలోల బరువుని సునాయాసంగా పైకి లేపినప్పుడు తాను ప్రయత్నిస్తే యాభై కిలోల బరువున్న రాయి ఎత్తగలనని అనుకున్నాడు. మనసులో దేవుడిని తలచుకుని యాభై కిలోల బండరాయిని ప్రయత్నిoచాడు. దానిని కొంచెం కూడా కదపలేక పోయాడు. పైగా రాయిని ఎత్తే ప్రయత్నంలో ముందుకి తూలి పడ్డాడు. అతని తల బండకి తగిలి దెబ్బ తగిలిoది.

అక్కడున్న వాళ్ళు అది చూసి హేళనగా నవ్వి “చూడ్డానికి బలంగా ఉన్నాడు. కదపలేక బోర్లా పడ్డాడు. లోపల అంతా డొల్లే’ అని ఎగతాళి చేసారు.

సుదీపుడికి అవమానం అనిపించి ఒక్కక్షణం ఆగకుండా వూరికి వెళ్ళిపోయాడు. దారిలో తమ వూరి వైద్యుడు రామాచారిని కలిసి వైద్యం చెయ్యమన్నాడు.

రామాచారి వయసులో పెద్దవాడే కాకుండా అనుభవజ్ఞుడు. గ్రామస్తులకి మంచి మందులిచ్చి వైద్యం చేసేవాడు. సుదీపుడిపై సదభిప్రాయం ఉందతనికి. గాయం విషయం సుదీపుడిని అడిగాడు రామాచారి.

తాను పొరుగూరిలో జరిగిన పోటీలో పాల్గొన్న విషయం చెప్పి “నా కంటే బలహీనులు సునాయాసంగా ఎత్తిన బరువుని కూడా ఎత్తలేక పోయాను.ఆ ప్రయత్నంలో దెబ్బ తగిలింది. ఇలా జరగడం తొలిసారి కాదు. క్రితంలో ఒకసారి పొరుగూర్లో జరిగిన ఈత పోటీల్లో కూడా ఓడిపోయాను. నాకు నిజమైన శక్తి లేదేమో అని అనుమానం. ఇలా అయితే మన వూరికి పేరు, గుర్తింపు తీసుకురావాలన్న నా ఆశయం నెరవేరదు” అని చెప్పాడు సుదీపుడు.

ముందుగా సుదీపుడి గాయానికి మందు రాసిన రామాచారి తరువాత ఇలా చెప్పాడు. “అక్కడి పోటీల విషయం తెలిసి అప్పటికప్పుడే పాల్గొన్నావు నువ్వు. మిగతావాళ్ళు అలా కాకుండా ముందు నుండి పోటీ కోసం తయారయ్యారు. వాళ్ళు రోజూ బరువులెత్తడం సాధన చేసి ఉంటారు. అందుకే నీకంటే బలహీనులు కూడా ఎక్కువ బరువు ఎత్తగలిగారు. ప్రతిరోజూ సాధన చేస్తే ఏ పని అయినా సులభంగా చెయ్యగలుగుతారు. అలవాటు లేని పని ఒక్కసారి చేస్తే ఇలాగే జరుగుతుంది. ఈత పోటీల్లో కూడా ఇలాగే ఓడిపోయి ఉంటావు. ఎడారిలో మంచినీళ్ళ నాశించడం ఎంత పొరపాటో సాధన లేకుండా విజయాన్నాశించడం కూడా అంతే. ఇకముందు పోటీల్లో పాల్గొనే ముందు తగిన సాధన చేసి వెళ్ళు. విజయం లభిస్తుంది’.

సుదీపుడికి తన తప్పు తెలిసి వచ్చింది. తరువాత జరిగే పోటీలలో పాల్గొనే ముందు తగిన సాధన చేసి వెళ్లి విజయాలు పొంది వూరు పేరు నిలబెట్టాడు.

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి